ఆనందము పొందాలనే ప్రేరణ ఎక్కడినుండి వస్తుంది?

GeneralComments Off on ఆనందము పొందాలనే ప్రేరణ ఎక్కడినుండి వస్తుంది?

మానవులకు మాత్రమే కాకుండా ప్రతి జీవికి ఆనందం పొందడానికి ఒక ప్రేరణ ఉంటుంది. ఇది ఏ సాధన లేకుండా పుట్టుకతో సహజంగా వస్తుంది. పండితులైనా లేక పామరులైనా, నాగరికులైనా లేక అనాగరికులైనా, ధనికులైనా లేక పేదలైనా, ఆస్తికులైనా లేక నాస్తికులైనా – ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండడానికి తపిస్తారు. ఇతర జీవరాసులైన పక్షులు, జంతువులు మరియు జలచరాలు బాధ నుండి తప్పించుకొని సౌకర్యంగా ఉండే వాతావరణాన్ని కోరుకుంటాయి. మనుషుల వలె ఆనందంకోసం వాటికి పెద్ద ఎత్తున ప్రణాళికలు ఉండవు కానీ ఖచ్చితంగా దుఃఖాన్ని తప్పించుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాయి. మొక్కలకు కూడా వాటి పెరుగుదలకు ఉన్న అడ్డంకులను తప్పించుకోగల విజ్ఞత ఉంది. దీన్నిబట్టి చుస్తే ఈ ఆనందం కోసం తపించడం ఆత్మలో సహజసిద్ధముగా ఉందని అనుకోవచ్చు. ఈ వాదాన్ని శాస్త్రము సమ్మతిస్తుందా అనేది ఇప్పుడు పరీక్షిద్దాం.

పరమాత్మ సందర్భము(19-46 అనుచ్ఛేదములు)లో శ్రీ జీవ గోస్వామి ఆత్మ స్వరూపంగూర్చి సమగ్రముగా విశ్లేషిస్తారు. మొదట 19వ అనుచ్ఛేదములో పద్మ పురాణంనుండి జీవుని స్వరూపాన్ని వివరించే ఒక శ్లోకాన్ని ఉటంకిస్తారు:

ఓమ్ లో మ్ పదం జీవుడిని సూచిస్తుంది, “శరీరమనే క్షేత్రమునకు సాక్షి” (క్షేత్రజ్ఞ), ఇది పరమాత్మపై సదా ఆధారపడి పరమాత్మకు ఉపయుక్తంగా ఉంది. జీవుడు స్వతహాగా భగవాన్ హరికి సేవకుడు కాని ఇతరులకు కాదు. అతడు చేతనకు మూలమై, జ్ఞానగుణము కలిగి ఉన్నాడు. అతడు జడ పదార్థానికి అతీతుడై చైతన్యము కలిగి ఉన్నాడు. అతనికి పుట్టుక లేదు, మార్పు చెందడు, ఒకే(మార్పులేని) రూపం కలిగి ఉన్నాడు మరియు తన స్వరూపంలో సదా అవస్థితుడై ఉన్నాడు. అతడు పరమాణువు(విభజించలేని అత్యంత స్వల్పమైన కణం), శాశ్వతమైన వాడుశరీరమంతా వ్యాపించి ఉన్నాడు మరియు స్వతహాగా చేతన మరియు ఆనంద స్వభావములు కలిగి ఉన్నాడు. అతడు నేనుఅనే సర్వనామము సూచించే వస్తువు, అనశ్వరమైనవాడు, శరీరానికి యజమాని, ఇతర జీవులకు భిన్నంగా ఉన్నాడు మరియు అంతములేని వాడు. జీవి దహించబడదు, ఛేదించబడదు, తడపబడదు లేదా ఎండపెట్టబడదు మరియు క్షీణించదు. ఇవి మరియు ఇతర లక్షణాలను అతడు కలిగి ఉన్నాడు. నిజానికి అతడు సంపూర్ణ తత్త్వములో విభజించలేని శేషము[అంటే జోడించిన భాగము]గా ఉన్నాడు.(పద్మ పురాణం, ఉత్తర ఖండము 226.34-37)

 తర్వాత, ఆయన శ్రీ సంప్రదాయం లోని జమాత్ర ముని వ్రాసిన కొన్ని శ్లోకాలను ఉటంకిస్తారు:

 ఆత్మ దేవుడు కాదు, మానవుడు కాదు, జంతువులూ కాదు, అచలములైన వస్తువులు [చెట్టు, కొండ మొదలగునవి] కాదు. అది శరీరం కాదు, ఇంద్రియములు కాదు, మనస్సు కాదు, ప్రాణము కాదు, లేదా బుద్ధి కూడా కాదు. అది చలనం లేనిది కాదు, మార్పు చెందేది కాదు, కేవలం చేతన మాత్రమే కాదు. అది తన ఉనికిపై చేతన కలిగిఉంది మరియు స్వయం ప్రకాశితమైనది; ఒకే రూపం కలిగి ఉంది మరియు తన స్వంత స్వభావంలో ఉంది.

అది చేతన గలది, శరీరమంతా వ్యాపించి ఉంది, మరియు అంతర్గతంగా చేతన మరియు ఆనంద స్వభావము గలది. అది నేనుఅనే సర్వనామము సూచించే వస్తువు, ప్రతి శరీరంలో ప్రత్యేకమైనది[ఇతర జీవులకు భిన్నమైనది], పరమాణువు(విభజించలేని అత్యంత స్వల్పమైన కణం), శాశ్వతమైనది మరియు నిష్కల్మషమైనది.

అది అంతర్గతంగా జ్ఞానము సంపాదించుట, క్రియా సంకల్పము చేయుట మరియు అనుభవించగల సామర్థ్యం వంటి లక్షణాలు కలిగి ఉంది. స్వతహాగా ఉన్న స్వభావం వల్ల అది ఏకీకృతముగా, సంపూర్ణ తత్త్వము(పరమాత్మ)లో విభజించలేని శేషము [అంటే జోడించిన భాగము]గా ఉంది.

ఈ శ్లోకాలలో దాదాపు జీవుని 21 లక్షణాలు చెప్పబడ్డాయి. శ్రీ జీవ గోస్వామి వాటిలో ఒక్కొక్క దాన్ని తదుపరి అనుచ్ఛేదములలో వివరిస్తారు. వీటిలో “ఆనందం పొందాలనే ప్రేరణ” ఎక్కడా లేదు అలానే జీవ గోస్వామి వీటిని వివరించే క్రమంలో కూడా ఎక్కడా దాని గురించి ప్రస్తావించలేదు. జీవుని అంతర్గత స్వభావము గురించి తన విశ్లేషణలో ఎక్కడా ఆ లక్షణము గురించి ఆయన ప్రస్తావించలేదు.

మరి మనము ఆనందం కోసం ఎప్పుడూ అనుభవించే తపన మరియు ప్రయత్నం ఎక్కడినుండి వస్తున్నాయి? ఇది మనము సంపాదించినది కాదు ఎందుకంటే ఇది జంతువులకు మరియు పక్షులకు కూడా ఉంది. దీనికి సమాధానం పన్నెండవ లక్షణమైన చిదానందాత్మక “అంతర్గతంగా చేతన మరియు ఆనంద స్వభావము గలది”లో ఉంది. ఆనందం కోసం తపించే మన అనుభవానికి విరుద్ధంగా ఉండడం వల్ల ఇది వినడానికి అయోమయంగా ఉండచ్చు. ఇది నిరర్ధకం కూడా ఎందుకంటే ఇది ఒక వ్యక్తి తనకు ఇష్టమైన భోజనం కడుపారా ఆరగించిన పిమ్మట ఆకలితో ఆహారంకోసం అన్వేషిస్తున్నట్లు ఉంది. జీవుడు అంతర్గతంగా ఆనందంతో ఉంటే దానికోసం బయట ఎందుకు వెతకాలి? దీన్ని 28వ అనుచ్ఛేదములో చిదానందాత్మక లక్షణమును వ్యాఖ్యానించే క్రమంలో జీవ గోస్వామి ఇలా వివరిస్తారు. తత్ర తస్య జడ ప్రతియోగిత్వేన తు జ్ఞానత్వం ఆనందత్వం చ – “ఆత్మ జడత్వం లేనిది గనుక[జడత్వముకు ప్రతియోగి గనుక] అది చేతన కలిగినది, మరియు దుఃఖానికి ప్రతియోగి గనుక అది ఆనంద స్వభావం గలది.” దీనర్థం జీవుడు అంతర్గతంగా చేతన గలవాడని మరియు దుఃఖం లేనివాడని. జడము కానిది చైతన్యమని ఎలా సమన్వయించామో దుఃఖము లేని స్థితిని ఆనందముగా సమన్వయించాము. ఇంకోమాటలో చెప్పాలంటే దుఃఖము లేకుండా ఉండడం కూడా ఒక రకమైన ఆనందమే. మర్త్యానందము(భౌతిక ఆనందములు); బ్రహ్మానందం(నిర్గుణ సంపూర్ణ తత్త్వమును అనుభవించే ఆనందము); మరియు భక్త్యానందము లేదా ప్రేమానందము(ప్రేమగల భక్తి వల్ల వచ్చే ఆనందము) ఇతర రకములైన ఆనందములు.

మనం అనుభవించే ఆనందం చాలా వరకు దుఃఖము లేదా అసౌకర్యాన్ని తొలగించడంతో వస్తుంది. మనకు అసౌకర్యము ఉన్నప్పుడు అది తొలగిపోతే ఆనందం కలుగుతుంది. దాదాపు మన దైనందిక జీవనంలో అనుభవించే ఆనందములకు ముందు అసౌకర్యము ఉంటుంది. భోజనాన్ని ఆస్వాదిస్తాము ఎందుకంటే ఆకలి బాధ అనుభవించడం వలన. వేడి తాపము వల్ల బాధపడుతున్నప్పుడు శీతల ప్రదేశము సుఖానుభూతినిస్తుంది. మనకు ఉండే ప్రతి కోరిక మనల్ని మన స్వరూపంనుండి దూరంగా తీసుకెళ్తుంది అందుకని అది మనకు కలత కలిగిస్తుంది. కోరిక తీరినప్పుడు మనం ఆనందం పొందుతాము-ఇది కోరుకున్న వస్తువు ఇచ్చినది కాదు, కోరికవల్ల వచ్చిన కలత నశించడం వల్ల. కోరుకున్న వస్తువు నుండి ఆనందము వచ్చినట్లైతే మనము ఎప్పుడూ దానినుండి ఆనందం పొందుతూనే ఉండాలి. కానీ అలా జరగదు. మన అందరి అనుభవంలో తీవ్రంగా కోరుకున్న ఒక వస్తువు, పదవి, లేదా పని మొదట ఇచ్చినంత ఆనందం తర్వాత ఇవ్వవు. వాటి ద్వారా వచ్చే ఆనందం కాలక్రమంగా తగ్గుతూ వస్తుంది, కొంత సమయం తర్వాత అవి అసలు ఆనందాన్నే ఇవ్వవుకూడా. పైగా, అవి దుఃఖము లేదా అసౌకర్యానికి కారణమౌతాయి. మనము కోరుకొనే వస్తువు లేదా పదవి కలిగిఉన్న ఇతరులను మీరు గమనిస్తే వారు ఆనందంగా ఉన్నట్లు మీరు గమనించి ఉండరు. ఎందుకంటే వారికి వారికిష్టమైన వస్తువులు లేదా పదవులు ఉంటాయి. అందుకనే శ్రీ కృష్ణుడు ఇంద్రియ భోగము ఇచ్చే వస్తువులు దుఃఖ జనితములని అంటారు(భగవద్గీత 5.22).

మన స్వరూపంలో దుఃఖము లేదా ఆనందం పొందాలనే ప్రేరణ లేదు. ఆనందం పొందాలనే ప్రేరణ ఆత్మకు బాహ్యమైన మనసులో ఒక ఆలోచన, చింతన, లేదా భావన. ఇది మనము మనసుతో అనుసంధానమై ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తమౌతుంది. ప్రతి రాత్రి ఇది మనం అనుభవిస్తాము. స్వప్నం లేని గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకు ఏ ఆలోచనలు, చింతనలు, లేదా భావనలు ఉండవు. మనకు ఏదైనా తీవ్రమైన వ్యాధి లేదా నొప్పి ఉన్నాకూడా మనము ఏ బాధ అనుభవించము. ఎందుకంటే స్వప్నం లేని గాఢ నిద్రలో మనసునుండి మనం విడిపోతాము. దుఃఖము నుండి పొందిన ఈ విముక్తి ఆనందముగా భావిస్తాము. అందుకని నిద్ర లేచాక “నేను హాయిగా గాఢనిద్ర పోయాను, నాకు ఏమీ తెలియలేదు.” అని అనుకుంటాము. ఎవరూ “నేను గాఢ నిద్ర పోయాను మరియు దుఃఖము అనుభవించాను, నాకు  ఏమీ తెలియలేదు.” అని అనరు. ఆనందం పొందాలనే ప్రేరణ జీవుడి స్వరూపంలో ఉంటే గాఢ నిద్రలో కూడా దాన్ని అనుభవించాలి. నిద్ర లేచాక “నేను గాఢ నిద్ర పోయాను మరియు ఆనందం కోసం ప్రాకులాడాను” అని చెప్పాలి, కానీ ఇలాంటి అనుభవం ఎవరికీ లేదు.

సారాంశం ఏమిటంటే మనకు అంతర్గతంగా ఆనందం కోసం ప్రేరణ ఉందనే అభిప్రాయాన్ని శాస్త్రము లేదా మన అనుభవము సమర్ధించదు. ఆనందం పొందాలనే ప్రేరణ కేవలం మనము భౌతిక శరీరము-మనస్సులతో  తాదాత్య్మము చెందడం వల్ల వస్తుంది ఎందుకంటే ఆ స్థితిలో మనం మన స్వరూపంలో ఉండము గనక.

నిజమేంటంటే మనకు మన స్వరూపంలో ఉండాలనే ప్రేరణ ఉంది. మన స్వరూపం దుఃఖము లేనిది, కాబట్టి మనము దుఃఖము తొలగించడానికి ప్రయత్నిస్తాము. బద్ధులైన స్థితిలో మనము మన శరీరము,మనస్సులతో తాదాత్య్మము చెంది దాన్ని మన స్వరూపంగా భావిస్తాము. కానీ ఇది ఒక భ్రమ. మన శరీరం మరియు మనస్సు ఎప్పుడూ అస్థిరంగా ఉంటాయి. మన వ్యవస్థ సమతుల్యం సాధించడానికి ప్రయత్నిస్తుంది. అంతేకాక మానసిక మరియు భౌతిక ఇబ్బందులనుండి విముక్తి పొంది సమతుల్యత కోసం మనం పనిచేస్తాము. మనలో ఏదో లోపం ఉందని భావిస్తాము మరియు ఆ లోపమైన దాన్ని పొందితే ఆనందంగా ఉంటామని భావిస్తాము. ఇది మనందరికీ ఉన్న సాధారణ ప్రేరణ. ఆనందముగా ఉన్నప్పుడు మనము మన స్వరూపానికి దగ్గరగా ఉంటాము. బాధ పడడం అంటే మన స్వరూపం నుండి దూరంగా వెళ్లినట్లు. ఆత్మ సాక్షాత్కారం పొందిన వారు ఆనందం పొందడానికి ప్రేరణ అనుభవించరు ఎందుకంటే వారు శరీరం,మనస్సులతో తాదాత్య్మము చెందరు. వారు దుఃఖము లేని స్థితిని అనుభవిస్తారు. శ్రీ కృష్ణుడు దీనిని యోగము(భగవద్గీత 6.23) అని నిర్వచిస్తారు- తమ్ విద్యాద్ దుఃఖ సంయోగ వియోగం యోగసంఙితమ్ – “దుఃఖముతో స్పర్శ లేని స్థితిని యోగముగా తెలుసుకొనుము”.

కాబట్టి, మనము కాని దానితో తాదాత్మ్యము చెందడాన్ని వదిలేసి స్వరూపంలో స్థిరపడడాన్ని ముక్తి అంటారు. ముక్తిర్ హిత్వాన్యథా రూపమ్ స్వరూపేణ వ్యవస్థితిః (శ్రీ భాగవత పురాణమ్ 2.10.6). ముక్తి అనే పదానికి అర్థం దుఃఖమునుండి స్వేచ్ఛ పొందడం. దానర్థం ఆనందము కాదు. దుఃఖము నుండి స్వేచ్ఛ పొందడం ఒక రకమైన ఆనందం. మన స్వరూపము నుండి దూరంగా వెళ్ళినప్పుడు మనము బాధపడతాము. అందుకే పతంజలి మహర్షి యోగమును చిత్త వృత్తుల యొక్క నిరోధముగా నిర్వచిస్తారు- యోగస్ చిత్త వృత్తి నిరోధః(యోగ సూత్రము 1.2). ఇది స్వరూపములో ఉండేట్లు చేస్తుంది – తదా ద్రష్టుః స్వరూపే అవస్థానం(యోగ సూత్రము 1.3). ఈ విధంగా శ్రీ కృష్ణునిచేత మరియు పతంజలి మహర్షిచేత నిర్వచించబడిన ముక్తి మరియు యోగము ఒక్కటే అని మనకు తెలుస్తుంది.

మన ఆత్మ దుఃఖము లేకుండా ఉన్నందున దాన్ని ప్రేమించదగిన వస్తువు(ప్రీతి ఆస్పద)గా పిలుస్తాము. ఇది పొందినవారు ఎప్పుడూ కలత చెందరు. ఇది సర్వోత్కృష్టమైనదిగా భావించబడుతుంది(భగవద్గీత 6.22). ఈ భౌతిక ప్రపంచంలోకూడా మనం మనది అనుకున్న వాటన్నిటినీ ప్రేమిస్తాము. మన శరీరము మరియు దాని సంబంధిత వస్తువులను మన ఆత్మకు సంబంధిచినవిగా భావించినప్పుడు అవి ప్రేమించదగినవిగా అగుపిస్తాయి. ఎప్పుడైతే వస్తువులను లేదా వ్యక్తులను మనకు చెందినవిగా భావించడం ఆపేస్తామో వాటియందు ఉదాసీనంగా వ్యవహరిస్తాము. భౌతిక వస్తువులనుండి ఆనందము వాటిని మనవిగా గుర్తించినంత వరకు మాత్రమే పొందగలము. ఇంకోమాటలో చెప్పాలంటే మనల్ని మనం ఏదో ఒక దానితో తాదాత్మ్యం చెంది, దాని నుండి ఆనందాన్ని పొందుతాము. మనం ఇతర వస్తువులలో, సంబంధాలలో మరియు పదవులలో మన ఆత్మనే రమిస్తాము. వాటితో సంబంధమువలన మనము స్వరూపంలో ఉన్నామని తప్పుగా అనుకుంటాము. ముక్తిఅని భావించే ఈ స్థితి ఒక భ్రమ, దీనికి కారణం ఒకరి ఆత్మ స్వరూపంపై ఉన్న అజ్ఞానమే. నిజమైన ఆనందము కేవలం భగవద్భక్తినుండి వస్తుంది ఎందుకంటే శుకదేవ మహర్షి చెప్పినట్లు భగవంతుడు మన ఆత్మకు ఆత్మ, “కృష్ణుడు ప్రతిఒక్కరి ఆత్మయొక్క ఆత్మ అని తెలుసుకో” (శ్రీ భాగవత పురాణం 10.14.55).

సత్యనారాయణ దాస

 

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    మనస్సుని గమనించండి. మీరు గమనించగలిలే ఏ వస్తువైనా మీరు కాదని తెలుసుకోండి. మీరు వీటన్నిటికీ అవతల ఉన్నారు.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.