నామ బలంతో పాపము చేయడం
శాస్త్రము మీద శ్రద్ధ ఆధ్యాత్మిక జీవితానికి పునాది. భక్తిమార్గములో కృష్ణుని నామము యొక్క శక్తి మీద విశ్వాసం కలిగిఉండడం ఇందులో భాగమే. ఒకరు ఆకస్మాతుగా నామము ఉచ్చరించిన మాత్రాన సర్వ పాపాలనుండి విముక్తిపొందుతారని చెప్పే వందలకొద్దీ శ్లోకాలు శాస్త్రములో ఉన్నాయి. కానీ అవి పాపములు చేయడానికి ఒకరికి అధికారాన్ని ఇవ్వవు. శ్రీ జీవ గోస్వామి రచించిన భక్తి సందర్భములో నామ బలంతో పాపములు చేయడం అనే అపరాధముగురించి వివరింపబడింది.
265.7వ అనుచ్ఛేదము
నామ బలంతో పాపములు చేయడమనే ఏడవ అపరాధమును ఇలా అర్థము చేసుకోవచ్చు. నామబలంతో చేసిన పాపాలనుండి కూడా సాధకుడిని నామము కాపాడుతుందనేది సత్యం. కానీ, నామ బలంతో మానవ జన్మకు పరమ పుషార్థమైన సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుని పాదాలు పొందే ఉద్దేశ్యంతో సాధకుడు భక్తి మొదలుపెడతాడు. కానీ దానికి బదులు అదే నామ బలంతో హేయమైన తన పాపపు లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇది పరమ దౌరాత్య్మానికి ఒక ఉదాహరణ. అలాంటి పని వలన సాధకుడు నామమును దుర్వినియోగం చేస్తాడు. ఫలితంగా, చేసిన పాపము కన్నా కోటి రెట్లు బలమైన అపరాధాన్ని చేసినవాడౌతాడు.
తత్ఫలితముగా, అట్టి అపరాధి యమ నియమముల ద్వారా పాపప్రాయశ్చిత్తం చేసుకోడానికి వీలు లేదని పద్మ పురాణంలో ఒక శ్లోకం నిర్ధారిస్తుంది(న విద్యతే తస్య యమైర్ హి శుద్ధిః). యమైః అను పదానికి “నియమముల ద్వారా” అర్థం “నిర్దేశించబడిన అనేక సదాచార నిబంధనలు(యమములు) మరియు నీతి సూత్రాలతో(నియమములు)”. అలాంటి విస్తృత నియమాలతో ప్రాయశ్చిత్తం పొందిన తర్వాతకూడా అపరాధికి శుద్ధి కలగదు(శుద్ధి అభావం). మరొకవిధంగా, యమైః అనుపదమును “అనేకమంది యమధర్మరాజులచేతనైనా”,[పాపాత్ములకు మరణం తర్వాత శిక్ష అమలుచేసే దేవత] అని కూడా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు, యముడి స్థానాన్ని ఒకరి తర్వాత ఒకరుగా పాలించిన అనేక మంది యమధర్మరాజులచేత శిక్షించబడినప్పటికీ అపరాధి పవిత్రుడు కాడని దానర్థం. ఈ అభిప్రాయం క్రింద చెప్పిన రెండు కారణాలవల్ల ఖచ్చితంగా సరైనది.
ముందుగా, పద్మ పురాణంలో చెప్పినట్లు నామ బలముచేత పాపము చేసే వ్యక్తికి ప్రాయశ్చిత్తం కేవలం ఆ వ్యక్తి నిరంతర నామ కీర్తన చేయడంద్వారా కలుగుతుంది(యమముల వలన కాదు) : “భగవంతుని దివ్య నామములు మాత్రమే నామ అపరాధములనుండి వచ్చిన పాపములను ప్రక్షాళన చేయగలవు. ఆ నామాలను నిరంతరంగా గానం చేసినప్పుడే ఆశించిన ఫలితాన్ని అవి ఇస్తాయి.”(పద్మ పురాణం బ్రహ్మ ఖండము 25.23). తర్వాత, ఇంతకముందు ఈ అనుచ్ఛేదములో ఉటంకించబడిన పద్మ పురాణం శ్లోకం(బ్రహ్మ ఖండం 25.12-13) ప్రకారం, నామ అపరాధి భగవంతునిపై భక్తికలిగి ఉన్నప్పటికీ, అపరాధ పరిణామాలను పతనము రూపంలో అనుభవించాలి(అధః-పాత).
వృత్రాసురుని ఇంద్రుడు చంపడం అశ్వ మేధయాగరూపంలో భగవంతుని ఆరాధన వలన వచ్చిన బలంతో అయినా, అది ఋషులచేత ఆమోదించబడింది మరియు దాని ఉద్దేశ్యం ప్రపంచాన్ని అసుర హింస నుండి విముక్తి ప్రసాదించడం, ఆపై వృత్రాసురుడు అసుర భావమునుండి విముక్తుడై పవిత్రుడయ్యాడు. కాబట్టి దాన్ని అపరాధముగా పరిగణించకూడదు.
సత్యనారాయణ దాస బాబాజి వారి వ్యాఖ్యానం
నామం సర్వ శక్తివంతమైనది మరియు నామాన్ని శరణు పొందిన వారిని వారి పూర్వ కర్మల పాపములను నుండి విముక్తి చేయగలదు. ఒక సాధకుడు ఈ సూత్రము మీద విశ్వాసం కలిగి, తన పాపములనుండి నామ జపంతో విముక్తి పొందుతానని అకృత్యము చేసినచో అది అపరాధము. దీనికి కారణం, నామశక్తి మీద సాధకుడికి విశ్వాసమున్నా, అతడు తన పాపములను పారద్రోలుటకు నామాన్ని దుర్వినియోగం చేసాడు గనుక. నామమును సేవించడానికి బదులు నామాన్ని తన సేవ కోసం ఉపయోగించుకుంటాడు. అంతేకాక, అత్యంత పవిత్రమైన నామాన్ని హేయమైన పాప ప్రక్షాళన కోసం వాడతాడు. ఇది ఒక చక్రవర్తిచేత మరుగుదొడ్డి శుభ్రం చేయించడం వంటిది.
మానవజన్మలో సాధించగల ఉత్తమమైన లక్ష్యమైన భగవంతునిపై దివ్య ప్రేమను ప్రసాదించగల శక్తి నామానికి ఉంది. కానీ, ఒకరు దాన్ని అల్పమైన పాప ప్రక్షాళనకు వాడతారు. అంతేకాక, అలాంటి వ్యక్తికి నామము ఇతర పద్ధతుల ద్వారా పొందగలిగిన యే భౌతిక లాభాలనైనా ఇవ్వగలదన్న నమ్మకం ఉండదు. అలాంటి వారు కేవలం నామాన్ని పూర్తిగా శరణు పొందితే తప్ప పరిశుద్ధి చెందరు. ఒక చక్రవర్తి మీద చేయబడ్డ అపరాధాన్ని ఆ చక్రవర్తి తన కరుణతో మాత్రమే క్షమించగలిగినట్లు, ఒకరు చేసిన నామ అపరాధానికి యే ఇతర పుణ్య కార్యమూ ప్రాయశ్చిత్తంగా పనిచేయదు.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.