కీర్తనయొక్క విశ్వవ్యాపకత (4)

SandarbhasComments Off on కీర్తనయొక్క విశ్వవ్యాపకత (4)

            కీర్తనయొక్క శక్తి కాల, ప్రదేశాలపై ఆధారపడదు. ఇతర యుగాలలో కంటే కలియుగంలో కీర్తన ప్రాచుర్యం పొందినప్పటికీ దానికి శక్తి కలియుగంనుండి రాలేదు. కీర్తన ఒక ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మికమైనది ఏదీ సమయం లేదా ప్రదేశం మీద ఆధారపడదు. ఇది భక్తి సందర్భములో 273 అనుచ్ఛేదములో వివరించబడింది.

273వ అనుచ్ఛేదము

       కావున, కలియుగంలో ప్రజలకు భగవంతునిపై ఉన్న ఉత్తమ నిష్ఠ గురించి విన్నతర్వాత, ఇతర యుగములలోని ప్రజలు ఆ నిష్ఠని పొందడానికి తాము కలియుగంలో మాత్రమే జన్మించాలని ప్రార్థిస్తారు. కరభాజన ముని దీనిని ఈ విధంగా ప్రతిపాదిస్తారు:

     ఓ రాజా! సత్యయుగం మొదలైన ఇతర యుగముల జనులు కలియుగంలో జన్మించుటకు ఆకాంక్షిస్తారు, ఎందుకంటే కలియుగంలో ఎక్కువమంది జనులు నారాయణుడిపై భక్తి కలిగిఉంటారు(నారాయణ -పరాయణాః). (శ్రీ భాగవతము 11.5.38)

       ఇక్కడ “నారాయణుడిపై భక్తి కలిగి ఉండుట”(తత్ పరాయణత్వం) అంటే “ఆయనపై మిక్కిలి ప్రేమతో నిండి ఉన్న స్థితి”(తదీయ ప్రేమాతిశయవత్త్వం). ఇది ముందు చెప్పబడిన శ్లోకంలో అలాంటి ప్రేమ పరిణామమైన పరమ శాంతి(పరమామ్ శాంతిమ్) ద్వారా సూచించబడింది. నారాయణుడిపై ప్రేమ పొందిన వారు పరమ శాంతి పొందుతారని ఈ శ్లోకంలో ధృవీకరించబడింది:

ముక్తానాం అపి సిద్ధానామ్ నారాయణ పరాయణః

సుదుర్లభః ప్రశాంతాత్మా కోటిషు అపి మహా మునే

       ఓ ఋషి పుంగవా! ముక్తి మరియు సిద్ధి పొందిన కోటానుకోట్లమందిలో కూడా అంతరంగ చైతన్యం అచంచలముగా శాంతముగా ఉండి(ప్రశాంతాత్మా), భగవాన్ నారాయణుడిపై ఏకాగ్ర చిత్తముతో (నారాయణ-పరాయణః) ఉండే  వారు సుదుర్లభము.(శ్రీ భాగవతం 6.14.5)

        ఇక్కడ కీర్తన ప్రాధాన్యం కలియుగమువలన వచ్చిందని తప్పుగా అర్థం చేసుకోకూడదు, ఎందుకంటే భక్తి కాలానికి, ప్రదేశానికి పూర్తిగా అతీతమైనది.

     భగవన్నామము కాలానికి మరియు ప్రదేశానికి అతీతమైనదని విష్ణు ధర్మములోని క్షత్ర బంధు కథలో కూడా నిర్దేశించబడింది:

    ఓ వేటగాడా, భగవంతుని నామాలు పలుకుటకు కాలానికి మరియు ప్రదేశానికి సంబంధిచి ఎలాంటి నియమాలు, నిషేదాలు లేవు, మరియు అపవిత్రమైన స్థితిలో కూడా జపము చేయడానికి ఆంక్షలు లేవు.

   స్కంద పురాణంలో, పద్మ పురాణంలో వైశాఖ మాహాత్య్మములో మరియు విష్ణు ధర్మములో ఈ విధంగా చెప్పబడింది:

సర్వకాల సర్వావస్థలయందు ప్రతిఒక్కరూ చక్రిని(చక్రం చేతపూనిన భగవంతుడిని) నామ గానము చేయవలెను.

  ఇంకా స్కంద పురాణంలో:

     హరి అనే నామము ఏ విశేషమైన ప్రదేశము, కాలము, స్థితి, లేదా చిత్త శుద్ధి మీద ఆధారపడదు. అది, సర్వ స్వాతంత్రమైనది మరియు అభిలాషి కోరుకున్న ఫలితాన్ని ప్రసాదిస్తుంది.

    మరియు విష్ణు ధర్మములో:

           ఎవరి హృదయంలో గోవిందుడు ఉంటాడో వారికి కలియుగము సత్యయుగము లాంటిది మరియు ఎవరి హృదయంలో అచ్యుతుడు ఉండడో వారికి సత్యయుగము కూడా కలియుగం లాంటిదే.

         కలియుగంలో కేవలం ఇతర సాధనలు చేయలేనందున కీర్తన వంటి సులభ సాధన వలన గొప్ప లాభం పొందుతారని పొరపాటు పడకూడదు. ఎందుకంటే, నామ సాధన చాలా శక్తివంతమైనది.

విష్ణు పురాణంలో ఇలా చెప్పబడింది:

         తమ బుద్ధి అతని (అచ్యుతుడైన శ్రీ కృష్ణుడి) మీద నిలిపిన వారు నరకానికి వెళ్లరు. అతని మీద ధ్యానంలో ఉన్నవారు స్వర్గాది భోగాలను కూడా విఘ్నంగా భావిస్తారు. మనస్సు మరియు ఆత్మలను ఆయనయందు లీనం చేయడం వల్ల బ్రహ్మ దేవుని లోకముకూడా తుచ్ఛముగా అనిపిస్తుంది. స్వచ్ఛమైన మనస్సుగల వారి హృదయాలలో ఉండి ఈ అనశ్వరమైన భగవంతుడు వారికి ముక్తిని ప్రసాదిస్తాడు. అందువల్ల అచ్యుతుని నామగానం ఒకరి పాపాన్ని పూర్తిగా హరిస్తుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. (విష్ణు పురాణం 6.8.57)

          కైముత్య తర్కము ద్వారా ఈ విష్ణుపురాణ శ్లోకం, సమాధి స్థితిలో కూడా ఉండే కృష్ణ స్మరణం కన్నా కీర్తనము గొప్పదని చెప్తుంది. కావున, ఇంతకముందు ఇలా చెప్పబడింది:

         ఓ రాజా, భౌతిక వాంఛలు తీర్చుకోవాలనే వారికి[ఇచ్ఛతామ్, అంటే, కామినాం], భౌతిక ప్రపంచంపై ఉదాసీనంగా ఉండి ముక్తి కోరుకునేవారికి[నిర్విద్యమానానాం, అంటే, ముముక్షూణాం], మరియు తత్త్వమును తక్షణ సాక్షాత్కారం చేసుకోగల వారికి[యోగినాం, అంటే, జ్ఞానినామ్], ఆ నిరంతమైన భగవాన్ హరి నామజపము చేయడము నిర్ధారించబడింది.(శ్రీ భాగవతం 2.1.11)

మరియు వైష్ణవ చింతామణిలో:

            పాపమును హరించే విష్ణు స్మరణం చాలా కష్టతర సాధనతో లభిస్తుంది. కానీ, దానికంటే ఉత్తమమైన కీర్తన కేవలం పెదవుల కదలికతో సాధించబడుతుంది.

      కీర్తనయొక్క ఆధిపత్యం మరోచోట కూడా సూచించబడింది:

   ఓ భరత వంశీయుడా, అనేక వందల పూర్వ జన్మలలో వాసుదేవుని లోపములేకుండా పూజించిన వ్యక్తికి శ్రీ హరి నామాలు నాలుకపై ఎల్లప్పుడూ ఉంటాయి.

265వ అనుచ్ఛేదములో ఉటంకించబడిన నామాపరాధ భంజన స్తోత్రము ద్వారా కూడా కీర్తన శ్రేష్ఠత్వము తెలుస్తుంది . దానిలో భగవన్నామము శ్రీ హరి యందు చేసిన అపరాధముల నుండి కూడా విముక్తి చేస్తుందని చెప్పబడింది. కాబట్టి, అన్ని యుగములలో భగవంతుని నామ గానానికి ఒకే శక్తి ఉంది. కానీ, కలియుగంలో భగవంతుడు తన అనుగ్రహంతో కీర్తనను స్వయంగా సమర్థిస్తాడు. అందువల్ల శాస్త్రాలలో కీర్తన ప్రత్యేకంగా కీర్తించబడింది. అందుకని కలియుగంలో ఇతర భక్తి సాధన చేసినా కూడా వాటితోపాటు కీర్తనకూడా చేయాలి:

     కలియుగంలో పరమ తత్త్వము(భగవంతుడు) అకృష్ణ(నలుపు కాని) వర్ణముతో అవతరించి తన సహచరులతో, సేవకులతో, ఆయుధాలతో మరియు రహస్య సహచరులతో నిత్యం కృష్ణుని నామ గాన వర్ణన చేస్తాడు. బుద్ధి కుశలత కలిగినవారు సంపూర్ణ తత్త్వమును ఈ రూపంలో తమను తాము పూర్తిగా సంకీర్తనములో అర్పించుకొని ఆరాధిస్తారు.(శ్రీ భాగవతం 11.5.32)

పలురకాల కీర్తనలలో నామ కీర్తన చాలా ప్రఖ్యాతి కలిగిఉంది, అది ఇలా చెప్పబడింది:

    కలియుగంలో హరినామమే హరినామమే హరినామమే విమోచనానికి మార్గం. మరొక దారి లేదు, మరొక దారి లేదు, మరొక దారి లేదు.

కనుక, శ్రీ భాగవతం 11.5.36 మొదలు తరువాతి మూడు శ్లోకాలలో వ్యక్తపరచిన సిద్ధాంతం, 271-273 అనుచ్ఛేదములలో సూచించినట్లు, ఖచ్చితంగా తగినది.

వ్యాఖ్యానం

       కీర్తన గొప్పదనం కలియుగానికి మాత్రమే పరిమితం కాదు, అది సనాతమైనది, ప్రతి ప్రదేశం మరియు కాలానికి అది వర్తిస్తుంది. ఈ యుగంలో మనుషులు ఆధ్యాత్మిక సాధనలకు అనర్హులనీ, వారికి కీర్తనే ఇక శరణ్యమైనదని కూడా కీర్తన ప్రశంసించబడలేదు. భగవన్నామ శక్తి ఏ కాలము, ప్రదేశము మీద ఆధారపడదు. అది సంపూర్ణమైనది. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కీర్తనలో పాల్గొనవచ్చు.

      స్మరణంకన్నా కీర్తన గొప్పదని శ్రీ జీవ గోస్వామి వ్రాసారు. ఎందుకంటే, స్మరణం చిత్త శుద్ధి లేకపోతే అసాధ్యం. ఒకరు భగవంతుని గుర్తుచేసుకోవడానికి చాలా సాధనతో మనస్సును అదుపులో ఉంచుకోవాలి. కానీ, కీర్తన ఎక్కువ శ్రమలేకుండా అపవిత్రమైన వారు కూడా చేయగలరు. అందుకే భక్తిలో పూలు సేకరించడం, పూమాల చేయడం, నైవేద్యం చేయడం, పరిశుభ్రం చేయడం వంటి ఇతర పనులలో కీర్తన చేయమని సిఫారసు చేయబడింది. అన్నిరకాల కీర్తనలలో భగవన్నామ కీర్తన ప్రత్యేకంగా చెప్పబడింది, అందులోకూడా హరే కృష్ణ మహా మంత్రము ఉత్తమము. ఒకరు ఈ భక్తి అంగమును మునుపు చెప్పిన అపరాధములను చేయకుండా సాధనచేస్తే తాము కోరుకున్న ఫలితం శీఘ్రముగా పొందుతారు.

        కరభాజన ముని ప్రకారం, సుమేధస్సు గలవారు భగవంతుని సంకీర్తన యజ్ఞం ద్వారా పూజిస్తారు. అటువంటి మేధస్సు లేనివారు ఇతర సాధనలలో  పాల్గొంటారని ఇది సూచిస్తుంది. “కానీ, కలియుగంలో స్వయంగా భగవంతుడే తన కరుణతో కీర్తనను ప్రోత్సహిస్తాడు..” అని శ్రీ జీవ గోస్వామి వ్రాసారు. ఇక్కడ చెప్పబడిన భగవంతుడు మరెవరోకాదు శ్రీ చైతన్య మహాప్రభు. కీర్తనను ప్రస్తుత కాలంలో ప్రచారం చేసాడు గనుక ఆయన సంకీర్తన పితామహుడిగా పిలువబడతాడు. ఆయన ఆవిర్భావానికి ముందు శ్రీమద్ భాగవతపురాణం వంటి పురాణాలలో ఉన్నప్పటికీ కీర్తన ప్రసిద్ధి గాంచలేదు. భాగవత పురాణం అంతిమ శ్లోకం “కృష్ణుని నామ కీర్తన ఒకరి సర్వ పాపాలను హరిస్తుంది”(12.13.23) అని చెప్తుంది. సర్వపాపాలకు మూలం భగవంతునిపట్ల విముఖతతో ఉండడం(భగవత్ విముఖ్యతా). నామ సంకీర్తనము అలాంటి విముఖతను నిర్మూలించి భగవతనునిపై ప్రేమను ప్రసాదిస్తుంది.

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    ప్రేమ మరియు భక్తితో జీవించాలనుకుంటున్నామా లేదా అసూయ మరియు ద్వేషపూరిత జీవితాన్ని గడపాలనుకుంటున్నామా అని ఎంచుకునే అవకాశం మనకు ఉంది. కాని ఈ ఎంపిక మరియు చర్యలు మన హృదయంలో ఉన్న భావముల అనుగుణంగానే జరుగుతాయి.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.