కీర్తన వలనే కలియుగానికి కీర్తి (2)

BhaktiSandarbhasComments Off on కీర్తన వలనే కలియుగానికి కీర్తి (2)

                  సాధారణంగా, కలియుగంలో ధర్మముకన్నా అధర్మము ప్రాచుర్యము పొందడంవల్ల నాలుగు యుగాలలోకెల్లా ఈ యుగము అధమమైనదని వింటూంటాము. సత్యయుగంలో ధర్మము నూటికి నూరుశాతం వ్యక్తమైంది. క్రమేపీ, అది కలియుగంలో పాతిక శాతానికి తగ్గిపోయింది. కానీ, ప్రకృతిలో ఎప్పుడూ ఒక సమతుల్యత ఉంటుంది. ధర్మము ఆచరించడానికి కలియుగంలో జన్మిచడం అననుకూలమైనప్పటికీ కీర్తన శక్తితో ఆధ్యాత్మిక సిద్ధి సాధించడానికి కలియుగం అనుకూలమైనది. భక్తి సందర్భములోని ఈ క్రింద అనుచ్ఛేదములో శ్రీ జీవ గోస్వామి దీనిని వివరిస్తారు.

271వ అనుచ్ఛేదము

కావున, కరభాజన ముని నిమి మహారాజుతో ఈ విధంగా చెప్పారు:   

ఏ వస్తువులోనైనా సహజంగా ఉన్న గుణమును గుర్తించగల(గుణజ్ఞాః), అన్ని వస్తువుల సారాన్ని గ్రహించగల(సారభాగినః) మరియు ఆధ్యాత్మిక జ్ఞానముగల ఆర్యులు, ఒకరు ఆకాంక్షించే అన్ని లక్ష్యాలను కేవలం కీర్తనచేయడం ద్వారా పొందగలరని కలియుగముయొక్క ముఖ్యమైన విలువను ప్రశంసిస్తూ ఉటంకిస్తారు.(భాగవత పురాణం 11.5.36)

          ఈ శ్లోకంలో, గుణజ్ఞాః, “ఏ వస్తువులోనైనా ఉన్న సహజ గుణమును గుర్తించగలవారు” అంటే “కలియుగం యొక్క గుణాన్ని విస్తృతంగా విస్తరించిన కీర్తన స్వరూపంలో చూడగలవారని అర్థం”.  అందుకే వారు సారభాగినః “అన్ని వస్తువులలో సారముమాత్రమే గ్రహించేవారు” (సార మాత్ర గ్రహణః) అని చెప్పబడ్డారు. వారికి కలియుగంలోని  దోషాలతో పట్టింపు లేదు. ఈ కారణంచేత వారు కలియుగాన్ని ప్రశంసిస్తారు.

                కలియుగం యొక్క సుగుణమును  కరభాజన ముని శ్లోకంలోని రెండవ పంక్తిలో వివరిస్తారు. యత్ర, “దేనిలో” అనే సర్వనామం కలియుగమును సూచిస్తుంది, సంకీర్తనేన ఏవ, “కేవలం కీర్తన చేయుటద్వారా” అంటే వేరే ఇతర యే సాధనల మీద ఆధారపడకుండా సంకీర్తన ద్వారా మాత్రమే అని అర్థం. సర్వ స్వార్థః, “కోరుకోదగిన అన్ని లక్ష్యాలను” అంటే సత్యయుగంలో ఆచరించదగిన ధ్యానము వలె ఇతర యుగాలలో నిర్దేశించబడిన వేల రకాల సాధనల ద్వారా సాధించగల సాధ్యములు.[కలియుగంలో ఇవన్నీ కూడా కేవలం సంకీర్తనతో సాధించబడతాయి.]

         ఇతర యుగాలలో వేలాది సంవత్సరాల ఆధ్యాత్మిక సాధనతో సాధించగల ఫలితం, కలియుగంలో కీర్తన చేయడంద్వారా అతి తక్కువ సమయంలో పొందవచ్చు. నిజానికి, ఇంతకముందు యుగాలలో గొప్ప మునులకు కూడా తెలియని, ఇంకా విలువైన శుద్ధ కృష్ణ ప్రేమను ఈ యుగములో ఫలితంగా పొందవచ్చు. కాబట్టి, వస్తువులలో ఉన్న గుణాలను గుర్తించగలవారు, అనేక దోషాలతో నిండి అన్ని యుగాలలో అధమమైనదిగా భావించే కలియుగమును పొగుడుతారు. కీర్తన అనేది దొంగలవంటి కలి దోషాలను పారద్రోలే నిష్టాగరిష్ఠుడైన మహారాజువంటిది. ఇది శుకదేవుని చేత చెప్పబడింది:

   ఓ రాజా, నిజానికి కలియుగము అన్ని దోషాలకు తావు, కానీ దానిలో ఒక్క మహా పుణ్యగుణం కూడా ఉంది. కేవలం శ్రీ కృష్ణుని కీర్తనతో ఒకరు సర్వ బంధాలనుండి విముక్తులై పరమగతిని పొందుతారు. (భాగవత పురాణం 12.3.51)

               కలియుగ వైభవాన్ని చెప్పే ఒక ప్రాచుర్య కథను నేను విన్నాను. ఒకసారి, వివిధ యుగాల గొప్పదనాన్ని విచారించుటకు గొప్ప మునులు సమావేశమయ్యారు. వారిమధ్య సమానాభిప్రాయం లేనందున వ్యాసదేవుని వద్దకు దానిగూర్చి అతని అభిప్రాయం తెలుసుకుందామని బయల్దేరారు. హిమాలయాల్లోని బదరీకాశ్రమమునకు వారు వెళ్లారు. వారు అక్కడికి చేరుకున్నప్పుడు వ్యాసమహర్షి సరస్వతి నదిలో స్నానం చేస్తున్నారు. ప్రతి మునకకి ఆయన “కలియుగం గొప్పది” అని గొణుగుతూన్నారు. ఆయన నీటినుండి బయటకు వచ్చాక మునులు ఆయన పలికిన మాటకు కారణమడిగారు. ప్రతిగా, వ్యాసమహర్షి కలియుగము ఉత్తమయుగమని, ఈ యుగంలో జీవిత ఉన్నత లక్ష్యం కీర్తన ద్వారానే సాధించవచ్చని వివరించారు. ఈ గుణము కారణంచేతనేకలిపురుషుడు అమానుషంగా ఒక ఎద్దు మూడు పాదాలు విరగగొట్టినాకూడా పరీక్షిత్తు మహారాజు అతడిని మట్టుపెట్టలేదు.

          కీర్తన అన్ని యుగములలో లభ్యంగా ఉన్నప్పటికీ, కలియుగంలో మాత్రమే అది ప్రాముఖ్యతను పొందుతుంది. దానికిగల కారణం శ్రీ జీవ గోస్వామి తరువాతి అనుచ్ఛేదములో వివరిస్తారు.

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    ఇతరులను నియంత్రించే ధోరణి వల్ల సంబంధాలు నాశనమవుతాయి.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.