కృష్ణుని శత్రుత్వముతో పొందవచ్చా? (రెండవ భాగము)

Articles by Satyanarayana DasaComments Off on కృష్ణుని శత్రుత్వముతో పొందవచ్చా? (రెండవ భాగము)

రెండు రకాల నిందనలు

                  గౌరవాగౌరవములలో సమ దృష్టితో ఉండే శ్రీ కృష్ణుని స్వభావాన్ని గూర్చి విశదీకరిస్తూ శ్రీ నారదుల వారు శ్రీ కృష్ణుడు తనను శతృత్వంతో గానీ శతృత్వం లేకుండా గానీ , భయంతో గానీ, ఆత్మీయతతో గానీ, కామముతో గానీ చేరేవారి మధ్య భేదాన్ని చూడడని తెలుపుతాడు. 

తస్మాద్ వైరానుబన్ధేన

నిర్వైరే భయేనవా

స్నేహాత్ కామేన వా యున్ జ్యాత్

కథాచిన్ నేక్షతే  పృథక్

           అందువల్ల, శ్రీకృష్ణునితో  ద్వేషంతో అయినా, భయంతో నైనా, భక్తితోనైనా, కుటుంబ బాంధవ్యంతో నైనా, ప్రేమతోనైనా  ఏదో ఒక రకమైన సంబంధాన్ని ఏర్పరుచుకోవాలి. ఒకరు కృష్ణునితో తన బంధాన్ని యెంత దృఢముగా ఏర్పరచుకోవాలంటే ఆ బంధములో కృష్ణునికి, తనకు ఏ మాత్రం బేధం లేనంతగా ఉండేంతగా” ( శ్రీమద్ భాగవతం 7.1.25)

              ఈ శ్లోకాన్ని గూర్చి వ్యాఖ్యానిస్తూ శ్రీ విశ్వనాథ చక్రవర్తుల వారు ఒక అభ్యంతరాన్ని లేవనెత్తుతారు: మనకు  భగవంతుడు అగౌరవరం లేక నింద వల్ల ఇబ్బంది  పడరని తెలుసు గానీ, కానీ భగవంతుని నిందించిన వాళ్ళ విషయం ఏమిటి? అలా నిందనలతో అపరాధం చేయటం వల్ల ఆ వ్యక్తి దాని వల్ల కలిగే చెడు కర్మను పొందరా? దానికి బదులిస్తూ, ఆయన నిందలు రెండు రకాలని విశదీకరిస్తాడు.  అనుకూలమైనది మరియు ప్రతికూలమైనది. ఇక్కడ మొదటిది మిక్కిలి ప్రేమతో ఉండటం వల్ల ఉత్పన్నమవుతుంది మరియు అది ఎవరికినీ హానిని లేదా ఇబ్బందిని కలుగ చేయనది. అది  తీవ్రమైన ప్రేమను సూచిస్తూ,  విరహముతో గానీ  లేక చూడడానికి అనుచితమైనట్లు ఉండే ప్రియుని చర్యల వల్ల వ్యక్తీకరించబడుతుంది. దీన్ని సూచించే శ్లోకములను శ్రీమతి రాధారాణి స్వయముగా  భ్రమర గీతలో( భ్రమరముల పాట) పలికినట్లు చెప్పబడింది (శ్రీ మద్ భాగవతం 10.47.17)

                     “కృష్ణుని గూర్చి మాట్లాడకుండా ఉండడం కూడా కష్టమైనది అయినప్పటికీ మనం అతనితో ఉన్న బాంధవ్యాన్ని మరచి పోయేందుకు ప్రయత్నించాలి. కేవలం అతనే కాదు  అతనిలా నల్లని రంగులో ఉండే వారెవ్వరితోనైనా సంబంధాన్ని త్యజించాలి! వారందరూ కూడా అతని లాగానే మంచివారు కారు. శ్రీ రామ చంద్రుడు ఒక కసాయి వేటగానివలే వానర రాజును అంతమొందించాడు. బలి మహారాజు నుంచి బహుమానాలు స్వీకరించి అతన్ని ఒక కాకి వలే తాళ్ళతో బంధించాడు. లక్ష్మణనుని రూపంలో సూర్పనఖ ముఖాన్ని వికారపరిచాడు.”

                   అలాంటి ప్రేమతో కూడిన పరుష వాక్యాలు శ్రీమతి రాధారాణిచే మాత్రమే చేయబడగలవు. ఈ వాఖ్యలు శ్రీకృష్ణుడు బృందావనమును విడచి మథురకు వెళ్లి తన దూతగా ఉద్ధవుని పంపినప్పుడు చేయబడ్డాయి. ఉద్ధవుని చూడగానే గోపికలకు శ్రీకృష్ణుని దివ్యలీలలు స్మరణలోకి వచ్చాయి. ఆ సమయంలో ఒక భ్రమరం శ్రీమతి రాధారాణి పదారవిందముల చుట్టూ తిరుగుతూ ఉంది. కృష్ణుని విరహ వేదనలోనున్న శ్రీమతి రాధారాణి ప్రేమోన్మాదంతో ఈ వ్యాఖ్యలను చేసింది. అటువంటి పరుష వాఖ్యల వల్ల ఎటువంటి చెడు కర్మ ప్రాప్తి జరుగనేరదు. 

                   భక్తితో సంబంధం లేకుండా ఉత్పన్నమయ్యే రెండవ రకం నిందనలను  రెండుగా విభజన చేయవచ్చు. ఒకటి భగవంతునిపై తన దృష్టి సదా నిమగ్నమై ఉండటం వల్ల వచ్చేది, రెండవది అటువంటి నిమగ్నత లేకుండా వచ్చేది. శిశుపాలుడు వీటిలో మొదటి తరహాకు చెందుతాడు. శిశుపాలుని నిందనలు చెడు కర్మలను సృష్టించినప్పడికీ, వాటికి కారణభూతమైనది అంటే శ్రీకృష్ణుని సదా మననంలో ఉంచుకొనడం అనేది ఆ చెడు కర్మలను పటాపంచలు గావించి ఆయనను భక్తి మార్గములోన కూర్చుండబెట్టింది. పైన చెప్పబడిన 7.1.25వ శ్లోకంలో శత్రుత్వం అందుచేతనే ఉదహరించబడింది.

               కానీ అటువంటి నిమగ్నత ఎటువంటి విధి పూర్వక మార్గములలో సూచించిన వాని కన్నా కష్టము అయినప్పటికీ దానిని విధి మార్గములో భాగముగా చెప్పబడింది ఎందుకంటే అది వైధిక భక్తికి సమమైన ఫలితాన్ని ఇస్తుంది కనుక. అటువంటి నిందన భగవంతునికి ఎటువంటి కలతను చేకూర్చదు, ఇంకా చెప్పాలంటే ఆ నిందను ఒనర్చిన వారి చెడు కర్మ కూడా పూర్తిగా తొలగి పోయే అవకాశం ఉంది. భగవంతుని మీద ద్వేషంతో ఉన్న వ్యక్తి మనస్సు ఆయన యందు స్థిరముగా నిమగ్నమై ఉంటుందని చెప్పడం ఈ శ్లోకం అభిప్రాయం.

ప్రేమతో కృష్ణునితో సంబంధం

            ఇక్కడ నిర్వైరేణ(శత్రుత్వం లేకుండా) అనే పదం శత్రుత్వం లేని మార్గాన్ని అనగా భక్తి మార్గాన్ని మనకు సూచిస్తుంది. వైరం అంటే శత్రుత్వం, నిర్వైరం అంటే  మిత్రత్వం. మిత్రత్వం అంటే కృష్ణుని తన వాడుగా లేక తన బిడ్డగా అన్వయించుకొనే భావన. 7.1.30 శ్లోకములో ఇది సంబంధముగా లేక బాంధవ్యంగా చెప్పబడింది. అందువల్ల నిర్వైర అంటే కృష్ణునితో ఒక ప్రత్యేక సంబంధం ఉన్న ఒక భక్తుడు అని అర్ధం. 

        ఈ కారణం చేత స్నేహాత్(చనువుతో) అనే పదాన్ని కోరికకు విశేషణంగా భావించాలి కానీ వేరే విధముగా కాదు. అందుచేత, స్నేహాత్ కామేన అనగా ప్రేమవల్ల ఉత్పన్నమైన కామమని అర్థం. ఇందులో స్నేహాత్ పంచమీ విభక్తిలో ఉంది గనుక దాన్ని మనం వేరొక క్రమముగా గణిస్తే తృతీయ విభక్తిలో ఉన్న ఇతర పదాల క్రమాన్ని మార్చినట్లవుతుంది.

              ఈ శ్లోకం 7.1.25 లో ఐదు రకాల వ్యక్తుల గూర్చి చెప్పడం జరిగింది; శత్రువు (వైర), ఎటువంటి బాంధవ్యం లేని ఒక సాధకుడు( నిర్వైర ), ఒక ప్రత్యేక బాంధవ్యం గల భక్తుడు(బంధ), భయం కల వ్యక్తి (భయ), మరియు శుద్ధ ప్రేమను కలిగి ఉన్న వ్యక్తి( స్నేహాత్ కామ).

                    ఈ వ్యక్తులంతా భగవంతుని తమ కన్నా వేరుగా (పృతక్) చూడరు. వారు తమ తమ సంబంధాన్ని బట్టి లేక భావాన్ని బట్టి చూస్తారు. ప్రేమలో ఉన్నప్పుడు ఏకత్వం ఉన్నట్లే, అనుకూలమైనది కానప్పటికీ భయం మరియు శత్రుత్వంలో కూడా ఒక ఏకత్వం ఉంటుంది. అటువంటి వారు సాయుజ్య ముక్తిని పొందటం ద్వారా ఆ ఏకత్వాన్ని పొందుతారు. 

                                ఒక మాటకు ఆయా వ్యక్తుల సంబంధాల దృష్ట్యా భిన్న అర్ధాలు ఉండవచ్చు. అందువల్ల యుంజ్యాత్ అనే క్రియా పదానికి, భగవంతుని మీద ధ్యాసను కేంద్రీకరించుట అనే అర్ధం వస్తుంది. అయితే శిశుపాలుడు వంటి స్వతహాగా శత్రువుగా(భావం చేత) ఉండే వారికి ఈ క్రియా పదం వర్తించదు. అందువల్ల దీనిని వేరే వ్యక్తులకు సంబంధించిన దానిగా మనం భావించవచ్చా? శ్రీ విశ్వనాథ చక్రవర్తుల వారు శాస్త్రాలు భగవంతునితో శత్రుత్వం పెంపొందించుకొమ్మని చెప్పవు కనుక అలా దాన్ని మనం అన్వయించలేమని అని అంటారు. శరణాగతి అనే దాని నిర్వచనలో కృష్ణునికి అనుకూల్యమైనవి చేయమని మరియు  అననుకూలమైనవి మానమని చెప్పటం జరిగింది. ఇంకా చెప్పాలంటే, శిశుపాలుడు కన్నా వేరే వ్యక్తులకు శత్రుత్వం నిర్దేశించబడినా, ఆ శత్రుత్వం వారి మనస్సులను కృష్ణునిపై  నిమగ్నం అయ్యేటట్లు చేయలేవు. అటువంటి సాధన కృష్ణుని మెప్పించజాలదు , నిజం చెప్పాలంటే అటువంటి దాన్ని కృష్ణుడు నిషేదిస్తాడు:

తాన్ అహమ్ ద్వితః క్రూరాన్

సంసారేషు నరాధమాన్

క్షిపామి అజస్రం అశుభాన్

ఆసురీష్వేవ యోనిషు

“ నేను సర్వదా ఈ  మనుషులలోని నీచాతి నీచమైన దుష్టులను, క్రూరులను, నీతి లేని వారిని రాక్షసులుగా పుట్టేటట్లు చేసి శిక్షిస్తాను.”  (భగవద్గీత 16.19)

కృష్ణుని శత్రువులు కూడా ధన్యులౌతారు

                       అయితే సహజ శత్రుత్వం వల్ల మాత్రమే చెడు కర్మను కలుగ జేస్తాయి, శాస్త్రాలలో చెప్పిన శత్రుత్వం వల్ల కాదని  అని ఒకరు వాదించవచ్చు. అలా అయితే శిశుపాలుడు కృష్ణునిపై సహజ శత్రుత్వం కలిగి ఉన్నప్పటికీ ముక్తిని ఎలా పొందగలిగాడు? అయితే శిశుపాలుడు దానికి మినహాయింపని ఇంకా వాదించవచ్చు. మరైతే శాస్త్ర ఆజ్ఞనలను అనుసరిస్తూ శత్రుత్వాన్ని సాధన చేసిన ఋషి పుంగవులు ఎవరూ మనకు ఉదాహరణగా కూడా అగుపించరు. అసలు కృష్ణునిపై దేని ప్రాతిపదికగా చేసుకొని అననుకూల భావాన్ని ఎవరైనా పెంపొందించుకోవాలి? ఒక పులి లేక పాము నుండి ప్రాణహాని ఉన్నప్పుడు వాటియందు భయము మరియు శత్రుత్వము కలిగిఉండి ఒకరు సదా ఏమరు పాటుగా నిమగ్నమై ఉన్నట్లు కేవలం ఆ భగవంతుడు స్వయంగా తన్ను సంహరిస్తాడని నమ్మే వారు మాత్రమే ఆయనంటే శత్రుత్వం, భయంతో నిండివుండగలరు. 

                   అందువల్ల ఈ శ్లోకాన్ని ఈవిధంగా అర్ధం చేసుకోవాలి: భగవంతుడు తన పైన శత్రుత్వంతో ఉన్న వారిని  కూడా అనుగ్రహిస్తాడు, అందువల్ల ఆయన గూర్చి చెడు భావాలను కలిగి ఉండడం సరైనది కాదు. ఒకరు తమ చిత్తాన్ని భగవంతునిపై శత్రుత్వం లేకుండా లగ్నం చేయాలి,  పూర్వ మీమాంసలో ఈ పద్ధతిలో పదాల అర్థాన్ని తెలుసుకోవటాన్ని పరిసంఖ్య- విధి అని అంటారు, ఇక్కడ అనుశాసనం నిషేధమును సూచిస్తుంది. ఈ అర్థాన్ని ఒప్పుకొంటే, నిర్వైరం లోని నిర్ అర్ధం నిషేధమని మనకు అవగతమవుంది.

                          అందువల్ల నిర్వైర అంటే వైరం లేక శత్రుత్వం  కాని ఏ ఇతర భావం, ఇది స్నేహితుడు, బంధువు, కుమారుడు లాంటివి ఏడైనా కావచ్చు. ఒకరు కృష్ణునిపై తమ చిత్తాన్ని ఈ విధముగా నిమగ్నం చేయాలి. వైరానుబన్ధేన అనే పదం యొక్క అర్ధం క్రియా విశేషణంగా మనము తీసుకోవాలి. ఇది  మనస్సు యొక్క నిమగ్నతను ఒక వైరి శత్రుత్వంతో నిమగ్నంచేసినంతగా చేయాలి అని సూచిస్తుంది. ఇటువంటి దృఢ చిత్తంతో ఉన్నవారు తప్పకుండా ఒక బంధాన్ని(అనుబంధము) పొందుతారు.  

                        ఈ వైరానుబన్ధేనను సూచికంగా తీసుకొని ఉదాసీన భావాన్ని పరిగణనలోనికి తీసుకోబడలేదు. స్నేహాత్కామేన అంటే అనుబంధం వల్ల కలిగే దాంపత్య కోరికలు అని అర్ధం. దీన్ని మనం భయేన అనే పదంతో కలిపి చదవాలి. ఈ భయం ఇది వ్రజ పడచులలో తమ అన్నోన్యమైన ప్రేమ మార్గంలో నీతి లేక ధర్మమనే వాటిని విడనాడాలేమో అనే భావన ఉండేది . ఇక్కడ “వ” అనే పదం భయేన అనే దానితో  కలసి ఉండటం దాంపత్య భావనలు ఎటువంటి భయం లేకుండా ఉండటాన్ని సూచిస్తుంది. ఇది రుక్మిణి దేవి లాగా కృష్ణుని భర్తగా పొందేందుకు ఎటువంటి త్యాగానికైనా సిద్దపడే  మార్గాన్ని  అనుసరిస్తూ ఉండటాన్ని సూచిస్తుంది. శాస్త్రాలలో కృష్ణుని ఒక ప్రేమికుడిగా అలానే ఒక భర్తగా వర్ణిస్తూ చెప్పే కధనాలు ఉన్నాయి. ఇందులో మొదటిది బ్రిహద్ వామన పురాణంలో “కృష్ణుని ప్రేమికుడిగా భావించి ఉండే భావన ఇతర భావనల కన్నా తీవ్రమైనది” అని చెప్పబడింది. రెండవది కూర్మ పురాణంలో “మహా మనుజులైన అగ్ని పుత్రులు వనితలుగా జన్మించి సర్వ చరాచర సృష్టికి మూల కారణమైన ఆ భగవంతుని భర్తగా పొందారు” అని చెప్ప బడింది.

కృష్ణుని యందు భావ పూర్వక నిమగ్నతతో  ఉండాల్సిన ఆవశ్యకత

          ఈ శ్లోకం  చెప్పే అసలు విషయం కృష్ణునిపై మనస్సు ధ్యానం చేసేందుకు నివారణోపాయం తెలపటం కాదు, అది మనకు ఉత్తమ భక్తి  కృష్ణుని యందు స్వతహాగా మనస్సు నిమగ్నం చేయటంలోనే ఉందని చెప్పటం. అలాకాని పక్షంలో కేవలం శబ్దార్థప్రకారముగా తీసుకొని శత్రుత్వం, వైరం మీద ఆసక్తి చూపినట్లయితే అది శాస్త్రాలలో చెప్పిన మౌలిక విషయమైన ప్రేమను పెంపొందించుకునే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంటుంది. ఇదే విషయాన్ని శ్రీ నారదుల వారు ఈ క్రింది శ్లోకంలో మళ్ళా ద్రువీకరిస్తారు.

“ఒక మనిషి శత్రుత్వంతో పొందే నిమగ్నత సాధన భక్తితో (వైధీ భక్తి) తో కూడా పొందలేడు. ఇది నా అభిప్రాయం.” ( శ్రీమద్ భాగవతం 7.1.26).

                    శ్రీ నారదుల వంటి మహా భక్తుడు ఇక్కడ మనకు భగవంతునితో శత్రుత్వంతో ఉండమని సూచించటం లేదు ఆయన మనకు కృష్ణునితో  భావ పూర్వక నిమగ్నతతో ఉండాల్సిన  ఆవశ్యకతను బోధిస్తున్నారు. ఇది మనం ఒక విద్యార్థి  విషయంలో చూడవచ్చు. ఒక సాధారణ వ్యక్తికి ప్రేమ భక్తి తెలియదు కానీ శత్రుత్వం అనేది తప్పకుండా తెలిసి ఉంటుంది. ఇక్కడ శత్రుత్వం అంటే భయం, ద్వేషం, అసూయ లాంటి చెడు భావనలు. ఇవి ఒక వ్యక్తి మనస్సుని సహజంగానే ఆ ఆ భావరూపాల్లో నిమగ్నం అయ్యేలా చేస్తాయి. ఒక చీకటి గదిలో తనతో పాటు పాము కూడా ఉందని తెలిసి మంచం పై పడుకొని ఉన్న వ్యక్తి గూర్చి ఒక్క సారి ఆలోచించండి. ఆ వ్యక్తి మనస్సు అంతా భయంతో పూర్తిగా నిండి ఉంటుంది.  

            అందుకే  మనస్సు ఎలా శుద్ధ భక్తిలో నిమగ్నంగా ఉండాలి అనే ఈ విషయాన్ని మనకు బోధించడానికి నారదులవారు  శత్రుత్వంతో ఉండటం వల్ల జరిగే సహజ సిద్ధ మనో నిమగ్నతను ఉదాహరిస్తారు. దీనికి మరో ఉదాహరణ ఒక యువతిపై నిమగ్నమైన ఒక యువకుని మనస్సు. నారదుల వారు యుధిష్టర మహారాజుకు శిశుపాలుడు చేసిన నిందనలు, ప్రకల్పనల  పాపాల వల్ల అతడి నాలుకకు కుష్ఠు వ్యాధి రావాలి, కానీ శిశుపాలునకు  కృష్ణుని యందు గల గొప్ప ఏకాగ్రతను భక్తి యోగంలో కన్నా ఎక్కువగా ఉన్నదని పొగుడుతారు.

                       అందుకే రాగానుగ భక్తి మార్గంలో,  కృష్ణుని పై శత్రుత్వంతో ఉన్న భావన కూడా ప్రశంసనీయం ఎందుకంటే అది భగవంతునిపై మన ఏకాగ్రతను పెంపొందిస్తుంది- ఇక సహజ సిద్ధముగానే కృష్ణుడంటే వాత్సల్య భావన కలిగి ఉండే భక్తాగ్రేసులైన వసుదేవుడు, దేవకి వంటి వారి గూర్చి మనం చెప్పనవసరంలేదు. ప్రతి క్షణానికి పెరిగే నిమగ్నత కలిగిన నంద మరియు యశోదల గూర్చి ఏమని అనగలము.

                                                                           మరైతే కృష్ణుని శత్రుత్వంతో పొందవచ్చా? ఒక సాధారణ వ్యక్తి శిశుపాలుని వలే ద్వేషంతో కానీ లేక నిందనతో కానీ కృష్ణుని పై ఏకాగ్రత కలిగి ఉండలేడు. అందువల్ల అటువంటి ముక్తిని పొందడు సరికదా నిమ్న ప్రాణకోటిలోకి జారుకొంటాడు. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం నిమగ్నత, దాన్ని పొందే మార్గం కాదు. అటువంటి నిమగ్నత ఉండటం వల్లే  రాగానుగ భక్తి , వైధీ భక్తి కన్నా ప్రశంసనీయంగా చెప్పబడింది. అందుచేత వ్రజ జనుల భావాన్ని అనుసరించి చేసే భక్తి , వైధీ భక్తి కన్నా ఉత్తమమైనది.

 

Notify me of new articles

Comments are closed.

 • Satyanarayana Dasa

  Satyanarayana Dasa
 • Daily Bhakti Byte

  ఒక ఆధ్యాత్మికవేత్త ఆశావాది లేదా నిరాశావాది కాదు. అతను వాస్తవవాది.

  — Babaji Satyanarayana Dasa
 • Videos with Bababji

 • Payment

 • Subscribe

 • Article Archive

 • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.