కృష్ణుడు నారాయణుడి కంటే ఉన్నతమైనవాడా?

Articles by Satyanarayana DasaComments Off on కృష్ణుడు నారాయణుడి కంటే ఉన్నతమైనవాడా?

     ఇటీవల కొందరు భక్తులు శ్రీమద్ భాగవత పురాణములోని అత్యంత ప్రాచుర్యమైన శ్లోకం (1.3.28)  కృష్ణస్తు భగవాన్ స్వయమ్ గూర్చి గౌఢీయ వైష్ణవులు అర్ధం చేసుకొన్న విధానాన్ని తప్పని ఆరోపిస్తూ శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందిన పండితుడు తన బ్లాగులో వ్రాసినదానికి సమాధానమిస్తో లేక ఖండిస్తూ వ్రాయమని కోరారు. అయితే  వైష్ణవుల మధ్య శత్రుత్వాన్ని పెంచే అటువంటి సంవిధాలకు నేను ఎప్పుడూ వ్యక్తిగతముగా సుముఖత  చూపను. ఒక సంభాషణ అనేది వాదాన్ని గూర్చి అయినదట్లయితే నేను దానిలో సంతోషంగా పాలుపంచుకుంటాను కానీ అది వివాదం (జల్పము, వితండం) అయినట్లయితే  దాంట్లో నాకు ఎటువంటి ఆసక్తి లేదు. అందుచేత ఆ భక్తుల విజ్ఞప్తికి నేను వెంటనే స్పందించలేదు. కానీ నేను ఈ రెండు రకాల  వైష్ణవవుల మధ్య గల వృత్యాసాల గూర్చి నా అభిప్రాయములను తెలపాలని అని అనుకొన్నాను.  ఇక్కడ  నా ముఖ్యోద్దేశం ఏమిటంటే వైష్ణవుల మధ్య సన్నిహిత సంబంధాలను నెలకొల్పడం తప్ప బురద జల్లడం కానే కాదు.  

శ్రీ చైతన్య మహాప్రభులవారు ఈ ప్రసిద్ధమైన  శ్లోకము గూర్చి వివరిస్తూ ఎటువంటి గ్రంథము వ్రాయకున్నా ఈ శ్లోకానికి అర్థం గౌఢీయ వైష్ణవులకు ఆయననుండి వచ్చినదే. అయితే దాని గూర్చి వివరించడం అనే పని శ్రీ జీవ గోస్వాముల వారు  తమ ఖండ కావ్యమైన షడ్ సందర్భములుగా పిలవబడే ఆరు పుస్తకాలలో  ఒకటైన భాగవత సందర్భంలో  చేశారు.  ఇది గౌఢీయ సంప్రదాయానికి మరియు దర్శనములకు మూలాధారమైనది. కృష్ణ సందర్భముగా పిలిచే నాల్గవ గ్రంథములో ఈ వివాదాస్పద శ్లోకం గూర్చి ఆయన విపులముగా చర్చిస్తారు.

ఇక్కడ పాఠకుల దృష్టికి నేను మొదటి సందర్భ గ్రంథమైన “తత్త్వ సందర్భము” మంగళాచరణము లో ఉన్న శ్లోకాన్ని తీసుకు రావాలని అనుకొంటున్నాను. ఈ శ్లోకంలో ఆయన షడ్ సందర్భములు చదవటానికి కావాల్సిన అధికారం లేక అర్హత గూర్చి చెప్తారు.

యః శ్రీకృష్ణ పదాంభోజ భజనైకాభిలాషవాన్

తేనైవ దృశ్యతామ్ ఏతద్ అన్యస్మై శపథోర్పితః

గ్రంము కేవలం శ్రీకృష్ణుని చరణారవిందములను ఆశ్రయించడమే లక్ష్యంగా ఉన్నవారికి మాత్రమే. ఇతరులకు శాస్త్ర పఠనం నిషిద్ధము. (తత్త్వ సందర్భం 6)

ఇక్కడ నిషిద్ధము అనే విషయం చెప్పటానికి వాడిన పదం శపథము, ఈ పదానికి రెండు అర్ధాలు ఉన్నాయి – ఒకటి శాపము మరియు రెండు ప్రతిజ్ఞ. శ్రీ జీవ గోస్వామి స్పష్టముగా మొదటి అర్ధాన్ని వాడలేదు. ఆయన ఉద్దేశము రెండవ అర్ధము ద్వారా చెప్పబడింది. ఎలా అంటే ఆయన కృష్ణ భక్తియందు ఆసక్తి లేని వారిని  సందర్భములు తాము అధ్యయనం చేయమని ప్రతిజ్ఞ చేయమన్నట్లు.

ఆయన ఈ విధముగా చేయటం చదివిన తర్వాత పాఠకులు ఆయన రచనలో తప్పులు పడతారనే భయంతో కాదు. ఇది ఆయన తన రచన పాఠకులకు ఇతర భగవత్ స్వరూపాలైన రామ, నారాయణ, నరసింహ మొదలైన వాటిపై అనురక్తి  ఉంటే అది వారి విశ్వాసాన్ని భంగపరచవచ్చు అనే అనుమానంతో మాత్రమే. అది వారి విశ్వాసాన్ని భంగపరచకపోయినా, వారు విమర్శలను  లేక ఆక్షేపణలను  చేసే అవకాశం ఉన్నది అది సాధకులకు మంచిది కాదు. అలాంటిది జరగటానికి ఆస్కారం తప్పకుండా ఉంది.  అందుకే ఆయన చాలా స్పష్టముగా తన రచనలను కృష్ణుని మీద భక్తి లేని వారు చదవరాదని చెప్పడం జరిగింది.  ఇక్కడ కృష్ణ అంటే వేరే విష్ణు రూపాలు కాదు ,యశోదా తనయుడు అయిన గోపాలుడు మాత్రమే. అందుకే ఆయన ఏక అనే పదం వాడటం జరిగింది. ఆయన శపథము కృష్ణ భక్తి లేకుండా కేవలం జ్ఞానార్జనకో లేక శాస్త్ర అభ్యాసనకో చదివే వారికి కూడా వర్తిస్తుంది. ఆయన ఈ విధముగా తన గ్రంధాలను ఎవరు చదవటానికి అధికారం కలిగి ఉన్నారో చాలా స్పష్టముగా వ్యక్తీకరించారు.

ఈ విషయం కృష్ణ భజనైకాభిలాషవాన్ అయిన కృష్ణ భక్తులకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే వారు ఇతర వైష్ణవులను కృష్ణ భజనకు గల ప్రత్యేక సూత్రాలను ఒప్పుకొనేందుకు వ్యర్ధ ప్రయత్నాలు చేయకుండా ఉండాలని చెప్తుంది కనుక.  ఇది శ్రీ చైతన్య మహాప్రభువుల వారి జీవితములో కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఆయన కృష్ణ భజనములోని గుహ్యమైన  విషయాలను ఎక్కడా లౌకిక వ్యక్తులతో చర్చించలేదు. ఆయన ఈ విషయాలను గూర్చి మాట్లాడే వ్యక్తుల విషయములో చాలా స్పష్టముగా ఉండేవారు. ఆయన అలా ఉండటానికి వివిధ కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు.

బుద్ధి భేదం జనయేద్ అజ్ఞానామ్ కర్మ సంగినామ్

జోయేత్ సర్వ కర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్

ప్రజ్ఞగల వ్యక్తి కర్మలకు బద్దులైన అజ్ఞానుమనస్సులలో గందరగోళాన్ని కలిగించకూడదు. అతను వారిని వారి విధులు నిర్వర్తిస్తూ సతతము కార్య నిర్వహణలో మునిగి ఉండేటట్లు చూడవలెను”( భగవద్గీత 3.26)

శ్రీ కృష్ణుడు సకామ కర్మకారులు- భౌతిక జగత్తులోని పనుల ఫలాపేక్షల మీద అనురక్తితో ఉండే వారి గూర్చి ప్రస్తావన చేస్తూ ఈ శ్లోకము చెప్పినప్పటికీ , ఈ మూల సూత్రము వేరే పరిస్థుతులలో కూడా వర్తిస్తుంది. ఇక్కడ ప్రాధమిక విషయం ఏమిటంటే  శాస్త్ర ఆధారితముగా ఉంటూ ఒక మార్గాన్ని నమ్ముతున్నవారిని గందరగోళమో లేక ఆటంకమో కలిగించరాదని. కావున, శాస్త్రబద్ధముగా ఒక మార్గము అనుసరించేవారు ఇతర మార్గములను అనుసరించేవారిని కలతపెట్టకూడదు.  ఇక్కడ కృష్ణ భక్తిని మార్గముగా ఎంచుకోనివారంతా అజ్ఞానులని నా అర్థం కాదు. నేను ఈ శ్లోకము వేరేవారి శ్రద్ధకు ఆటంకం గానీ లేక వారి మనస్సును గందరగోళంలో పెట్టకూడదని చెప్పేందుకు ఉపకరిస్తుందని అనుకుంటున్నాను.  ఈ శ్లోకం యొక్క స్థూల పర్యవసానం(అతిదేశన్యాయం) ఇదని  నేను భావిస్తున్నాను.

శ్రీకృష్ణుడు భగవద్గీతలో మరొక సూత్రాన్ని చెప్తారు:

యే యథా మామ్ ప్రపద్యన్తే తాంస్తథైవ భజామి అహం 

నేను నా  శరణాగతులందరిని వారి శరణాగతి స్వభావాన్ని బట్టి ప్రత్యక్షముగా అనుగ్రహిస్తాను” ( భగవద్గీత 4.11)

ఈ వాక్యాన్ని అనేక విధాలుగా అర్ధం చేసుకోవచ్చు. ఒకరు శ్రీకృష్ణుని నారాయణుని అవతారంగా చూస్తే ఆయన ఆ విధముగానే అగుపిస్తారు. అలాంటి వ్యక్తికి తన విశ్వాసంపై శాస్త్రీయ మద్దతుకూడా లభిస్తుంది. అలానే శ్రీకృష్ణుని అన్ని అవతారములలకు మూలముగా ఒకరు చూసినట్లయితే , కృష్ణుడు వారికి అదేవిధముగా అగుపిస్తాడు మరియు వారి విశ్వాసానికి శాస్త్రీయ మద్దతు కూడా లభిస్తుంది.  ఇది నిజముగా హిందుత్వం యొక్క అద్భుతము ఎందుకంటే ఒక విగ్రహాన్ని ఆరాధించేవారికి వారి ఆరాధనకు తగిన విధముగా శాస్త్రయుక్తమైన మద్దతు లభిస్తుంది. అందుకే హిందుత్వములో అంత భిన్నత్వం ఉంది.

దీన్ని ఇంకా సులభతరంగా చెప్పాలంటే, కాంతి అనేది ఒక పరిశోధకుడికి వారి వారి దృష్టి కోణాన్ని బట్టి  కాంతిపుంజముగా లేక అణువుగా కనిపిస్తుంది మరైతే తానే “సూర్య, చంద్రుల లోని కాంతి నేనే “- ప్రభాస్మి శశి సూర్యయోః (భగవద్గీత 7.8)  అనే పరమ సత్యమైన భగవంతుడు ఎందుకలా ఉండరాదు?

శ్రద్ధ అనేది ఏ దైవంమీదనైనా భక్తి పొందడానికి మనకు కావాల్సిన అర్హత. కృష్ణుడు ఒక భక్తునికి తన ఆరాధ్య విగ్రహంపై గల  నమ్మకాన్ని ఎల్లప్పుడూ అచంచలమైనదిగా ఉంచుతానని అంటాడు.

యో యో యామ్ యామ్ తనుమ్ భక్తః శ్రద్ధయార్చితుం ఇచ్ఛతి

తస్య తస్యాచలాం శ్రద్ధామ్ తామ్ ఏవ విదధామి అహం

“ఒక భక్తుడు శ్రద్ధతో ఆరాదించడానికి ఎంచుకొనే ఏ రూపాన్ననైనా, వారికి ఆ రూపం పైన శ్రద్ధ కలిగే టట్లు నేను చేస్తాను” ( భగవద్గీత 7. 21)

ఇది ముఖ్య సూత్రం. కృష్ణుడు ఈ శ్లోకంలో రక రకాల దేవతల పైన ఉండే శ్రద్ధ గురించి చెప్తున్నప్పటికీ, అతిదేశ పూర్వకంగా చూస్తే ఆ సూత్రం అన్ని రకాల విష్ణు రూపాలకు కూడా వర్తిస్తుంది. అందుచేత నారాయణుడే పరమపురుషుడనే వైష్ణవులతో నేను ఎటువంటి విభేదాన్ని చూడను. వైష్ణవులమైన మనం ఒకరితో ఒకరం పోట్లాడ కూడదనేది నా అభిప్రాయం.

ఒకరు ఒక విగ్రహాన్ని ఆరాధించేటప్పుడు ఆ రూపమే సర్వశ్రేష్టమని తప్పక భావించాలి. అది శ్రద్ధ వల్ల వచ్చే ఫలశృతి. ప్రతి సంతానం తమ తమ తల్లితండ్రులే యోగ్యులని భావిస్తుంది. కానీ  వారు మిగతా పిల్లలలందరితో దాని గూర్చి వాదించడం చేయరు. అలానే ఒక యోగ్యుడైన భర్త లేక భార్య తమ తమ భాగస్వాములను ఉత్తములని భావిస్తారు, కానీ వారి స్నేహితులకు అది నిరూపించాలనో లేక వారి స్నేహితుల భాగస్వాములు తమ భాగస్వాముల కంటే తక్కువ అని చేసి చూపించాలని అనుకోరు.  ఒక నిష్టా గరిష్ఠుడైన శిష్యుడు తమ  గురువు ఉత్తముడు అని భావిస్తాడు.  కానీ తన గురువు కంటే మిగతా వారందరూ తక్కువ అని చేసి చూపించాల్సిన అవసరం లేదు. అలానే ఒకరు రామ భక్తుడైతేవారికి రాముడే పరమ గరిష్ఠుడు. మనకు చైతన్య చరితామృతంలోని చైతన్య మహాప్రభువు అనుంగుడు మురారి గుప్త రామ భక్తుడు మరియు ప్రద్యుమ్న “నృసింహ బ్రహ్మచారి” నృసింహ దేవుని భక్తుడు అయిన కథ తెలుసు. వారిద్దరూ రామ, నృసింహలపైన తమ తమ విశ్వాసాన్ని వదల లేదు. శ్రీ రూప మరియు సనాతన గోస్వాముల వారు తమ తమ్ముడైన అనుపముని రామ భక్తి వదలి కృష్ణ భక్తిని స్వీకరించమని చెప్పేందుకు ప్రయత్నించారు. ఎందుకంటే ఆ విధముగా అయితే ఆ ముగ్గురు సోదరులు కృష్ణ భక్తిలో పారవశ్యంతో మునిగి తేల వచ్చు కానీ అనుపముడు మారలేదు రూప మరియు సనాతన గోస్వాములు దీని గురించి కలత చెందలేదు; వారు అనుపమునకు గల గొప్ప విశ్వాసాన్ని మెచ్చుకొన్నారు.

వైష్ణవులు కాని వారితో ఉన్న భేదాభిప్రాయాలు చాలు. మన శక్తి, యుక్తులంతా వాటిపైన ఉంచితే చాలు. మనం కృష్ణుని పరమ గరిష్టుడిగా లేక నారాయణనుని పరమ గరిష్టుడిగా భావించినా, మనం వైష్ణవులమనే పిలవబడతాము.  కృష్ణుని పూజించేవారు కార్ష్ణీయులని లేక నారాయణుని పూజించేవారు నారాయణులని పిలవబడరు.

నేను అందుచేత గౌఢీయ వైష్ణవులు అందరికీ మిగతా వైష్ణవులు అందరినీ గౌరవించమని మరియు వారిని తక్కువగా చూడవద్దని  విన్నపము చేస్తున్నాను. మనము వేరే వైష్ణవులను కలసినప్పుడు మనం వారికి ప్రణమిల్లి గౌరవము చూపిస్తూ ఈ శ్లోకాన్ని పఠిస్తాము:

వాంఛాకల్ప తరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ

పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః

ఇక్కడ వైష్ణవులు అంటే కేవలం గౌఢీయ వైష్ణవులు మాత్రమే కాదు.

ఇంకాచెప్పాలంటే, శ్రీ జీవ గోస్వాముల వారు సూత్ర ప్రకారం చూస్తే కృష్ణుని మరియు నారాయణుని మధ్య ఎటువంటి భేదం లేదని వ్రాసారు.

సిద్ధాంతస్త్వ అభేదిపి శ్రీకృష్ణ స్వరుపయోః

రసేనోత్కర్షయతే కృష్ణరూపమ్ ఏషా రస స్థితిః

కేవలం సిద్ధాంత (తత్త్వము) పరముగా చూసినట్లయితే లక్ష్మీ నాథుడయిన శ్రీ ఈశునికి (నారాయణునికి ) మరియు కృష్ణునికి మధ్య వ్యత్యాసం లేదు (అభేదం). కానీ రసశాస్త్రం ప్రకారం చూస్తే కృష్ణ రూపం ఉత్కృష్టమైనది. అది రస స్వభావం. ( భక్తి రసామృత సింధువు 1. 2. 59). 

ఈ శ్లోకం నుండి తత్త్వము ప్రకారం చూస్తే , కృష్ణ మరియు నారాయణుల మధ్య వృత్యాసం లేదని తెలుస్తుంది. ఇద్దరూ విష్ణు తత్వానికి చెందిన వారే. కానీ రసశాస్త్రం ప్రధానముగా చూస్తే కృష్ణ ఆవిర్భావానికి ఒక ప్రత్యేకత ఉంది.  దీని గూర్చి ఏ వైష్ణవుడికి ఏ విధమైన సంకోచం ఉందని నేను భావించడంలేదు. కృష్ణ లీలలు పద్యాలుగానూ, నృత్యాలుగాను, కీర్తనలుగానూ, చిత్రకళలుగానూ  ప్రకటితమై అన్ని వైష్ణవ సంప్రదాయాలలో శోభిల్లుతున్నాయి. హిందుత్వ  కళలు, నృత్యము, గానము కృష్ణ లీలతో మునిగి తేలుతున్నాయి.  భారత ఖండమoతా  రామ-కృష్ణుల లీలలు వ్యాపించి ఉన్నాయి. 

ఎవరికీ ఏ రసాస్వాదన అంటే ఇష్టమో వారు ఆ రసానుభూతిలో ఉండటం ఉత్తమము, అలానే వారు తగిన విధమైన భగవంతుని రూపమే ఉత్కృష్టమని అనుకొనడం మంచిది. అందుచేత శ్రీకృష్ణుని సర్వోత్కృష్ట స్థానాన్ని ఇతర విష్ణు రూపాల భక్తులకు నిర్ధారణ చేయడానికి ప్రయత్నించడం వ్యర్థం మరియు అది చివరకు అపరాధముగా ముగుస్తుంది.  అపరాధమంటే ఒకరి ఇష్టదేవునికి అప్రియమైనది గావించడమే. మనం ఆ విధముగా చేయాలనుకుంటామా? నేను ఎట్టి పరిస్థితిలోను అలా చేయాలని అనుకోను.  కావున మనం అన్ని రకాల వైష్ణవులను మనస్ఫూర్తిగా గౌరవించాలి.  మన ఆచార్యులు ఇతర వైష్ణవ ఆచార్యుల గూర్చి ఎంతో గొప్పగా పేర్కొనడం జరిగింది.  పరీక్షిత్ మహారాజు వైష్ణవులు చాలా అరుదు అని అంటారు.

ముక్తానాం అపి సిద్ధానాం నారాయణ పరాయణః

సుదుర్లభః ప్రశాన్తాత్మా కోటిష్వపి మహామునే

ఋషి పుంగవా , మోక్షాన్ని పొందిన లక్షలాది వారిలో మరియు ఆత్మ సాక్షాత్కారము కలిగిన వారిలోనూ , సంపూర్ణ శాంతి మరియు నారాయణుని మీద పూర్తి  ద్యాస గల భక్తులను కనుగొనటం చాలా అరుదు. (శ్రీమద్ భాగవతం 6.14 5)

ఇక్కడ గమనించాల్సిన విషయం,పరీక్షిత్ మహారాజు కృష్ణుని భక్తుడు మరియు బంధువు అయినప్పటికీ నారాయణ అనే పదం వాడటం.

బోధ చేయాలనే  అనురక్తి తీవ్ర స్థాయిలో ఉన్న కొంతమంది గౌఢీయ వైష్ణవులకు నా అభిప్రాయం సరిగా అగుపించక పోవచ్చు. అటువంటి  వారి పాదాలకు నమస్కరించి నేను క్షమాపణ కోరుతున్నాను. నేను ఇక్కడ వ్యక్తపరచినదంతా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Notify me of new articles

Comments are closed.

 • Satyanarayana Dasa

  Satyanarayana Dasa
 • Daily Bhakti Byte

  గురు శిష్యుల అనుబంధము చాలా అద్వితీయమైనది. ఈ సంబధంలో అత్యంత గౌరవం మరియు సాన్నిహిత్యం ఉంటాయి. సాధారణంగా గౌరవం మరియు సాన్నిహిత్యం కలిసి ఉండవు.

  — Babaji Satyanarayana Dasa
 • Videos with Bababji

 • Payment

 • Subscribe

 • Article Archive

 • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.