జీవుల బాధను భగవంతుడు అనుభవిస్తాడా?

Questions & AnswersComments Off on జీవుల బాధను భగవంతుడు అనుభవిస్తాడా?

ప్రశ్న : పరమాత్మ సందర్భము 93.5వ అనుచ్ఛేదములో భగవంతుడికి భౌతిక దుఃఖాల గూర్చి అనుభవం ఉండదని శ్రీ జీవ గోస్వామి క్షుణ్ణంగా వివరిస్తారు. ఈ విషయంలో భాగవతంలో క్రింద చెప్పిన వృత్తాంతముల ఆధారంగా నాకు ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి.

దుర్యోధనుడు రణరంగంలో పడిఉన్నప్పుడు కృష్ణుడికి అది చూడడం నచ్చలేదు. ఇది భాగవతం 3.3.13వ శ్లోకంలో వివరించబడింది. దీనర్థం కృష్ణుడికి  దుర్యోధనుడి భౌతిక బాధయందు సానుభూతి కలిగిందనా?

భాగవతం 3.18.6 లో హిరణ్యాక్షుడు పరుషంగా మాట్లాడినప్పుడు వరాహదేవుడి హృదయం బాధ అనుభవించిందని చెప్పబడింది. దీనర్థం వరాహదేవుని హృదయం హిరణ్యాక్షుని భౌతికమైన పరుష వాక్యాలకు బాధ పడిందనా?

భాగవతం 8వ స్కంధములో గజేంద్రమోక్ష ఘట్టములో 8.3.17వ శ్లోక వ్యాఖ్యానంలో శ్రీల ప్రభుపాదుల వారు జీవుడు భగవంతునికి ప్రార్థనలు చేయకముందే భగవంతుడు వారికి ముక్తి ప్రసాదించాలని ప్రయత్నిస్తారని చెప్తారు. దీనర్థం జీవుడు భక్తి సాధన చేయడం మొదలుపెట్టకముందే భగవంతుడు జీవుని భౌతిక దుఃఖమును సానుభూతితో అనుభవిస్తాడనా?

ప్రచేతసుల ప్రార్థనలలో భాగవతం 4.30.24వ శ్లోకం వ్యాఖ్యానంలో శ్రీల ప్రభుపాదుల వారు బద్ధులైన జీవుల భౌతిక దుఃఖాలవల్ల భగవంతుడు ప్రభావితం చెందుతాడని మరియు వారిని దుఃఖములనుండి విముక్తి చేయడానికి ప్రయత్నిస్తాడని వ్రాశారు.

శ్రీ జీవ గోస్వామి పరమాత్మ సందర్భము 93.5లో సమర్పించిన సిద్ధాంతమును పైన ఉటంకించిన శ్లోకాల దృష్ట్యా వివరించడానికి వీలౌతుందా?

సమాధానం : చాలా చక్కని పరిశీలన. మీరు ఉదహరించిన శ్లోకాలు మరియు వ్యాఖ్యానాలకు మరియు శ్రీ జీవ గోస్వామి చెప్పిన సిద్ధాంతానికి వ్యతిరేకత ముఖ్యంగా జీవుల దుఃఖమును చూసి భగవంతుడు సానుభూతి అనుభవిస్తాడని అని చెప్పే విషయం . అంతేకాక, ఆయన ఎప్పుడూ జీవులను ముక్తులను చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి, ఆయన జీవుల బాధను మరియు దుఃఖమును అనుభవము పొంది ఉండాలి; లేకపోతే ఆయన ఉదాసీనంగా ఉండాలి.

నా సమాధానం ఏంటంటే జ్ఞానము పలు మార్గాల ద్వారా సాధించబడుతుంది. ముఖ్యంగా, అది ప్రత్యక్ష అనుభవం ద్వారా, అనుమాన పద్ధతిలో లేక శబ్ద ప్రమాణం ద్వారా. మీ సందేహం మనకు జ్ఞానం కేవలం ఇంద్రియ అనుభవం(ప్రత్యక్షము) ద్వారా వస్తుందని భావించడం వల్ల వచ్చినది. అనుమాన లేదా శబ్ద పద్ధతిలో వచ్చే జ్ఞానానికి ప్రత్యక్ష అనుభవం ఉండదు.

మీ మొదటి ప్రశ్న దుర్యోధనుడి బాధను కృష్ణుడు తాదాత్మ్యం చెందాడా అని. తాదాత్మ్యం అంటే ఇతరుల గతములో లేదా వర్తమానకాలంలో భావనలను, ఆలోచనలను మరియు అనుభవాలను నిష్పాక్షికంగా స్పష్టమైన పద్ధతిలో చెప్పకుండానే అర్థము చేసుకోవడం, తెలిసిఉండడం లేదా వాటిపట్ల సున్నితభావం కలిగిఉండడం. దీనిబట్టి చూస్తే, కృష్ణుడు దుర్యోధనుడిని పట్ల సానుభూతి చూపించినప్పుడు ఆయన తన మనస్సులో కొంత బాధపడి ఉంటాడని ఒకరు నిర్ధారణకు రావచ్చు. ఒకవేళ అలా అర్థం చేసుకున్నా కూడా అది కృష్ణుడు భౌతిక బాధను అనుభవించాడని నిరూపించదు. ఆయన తన మనస్సులో బాధను అనుభవించారు కానీ అది భౌతిక విషయం కాదు. అది అతీంద్రియ బాధ ఎందుకంటే ఆయన మనస్సు, ఇంద్రియములు మరియు శరీరం అన్నీ సర్వోత్కృష్టమైనవి. శ్రీ జీవ గోస్వామి భగవంతుడు భౌతిక దుఃఖములు అనుభవించడు అన్నప్పుడు ఆయనకు భావాలు లేక భావోద్వేగాలు లేవనికాదు. ఆయనకు శ్రేష్ఠమైన మనస్సు మరియు ఇంద్రియాలు ఉన్నాయి మరియు భావాలు శ్రేష్ఠమైనవి.

అంతేగాక, తాదాత్య్మము మూడు రకాలు : అభిజ్ఞ, భావోద్వేగము మరియు కరుణ. అభిజ్ఞ అంటే ఇతరులు యే అనుభవం పొందుతున్నారో మరియు ఏమి ఆలోచిస్తున్నారో కేవలం తెలుసుకోవడం. దీన్ని కొన్నిసార్లు ఇతరుల దృక్కోణం తెలుసుకోవడం అని అంటారు. భావోద్వేగం అంటే ఇతరుల భావోద్వేగాలు తనకు సోకినట్లు భౌతికంగా అనుభవం పొందడం. కరుణ అంటే ఈ తాదాత్మ్యంలో ఒక వ్యక్తియొక్క అవస్థ అర్థం చేసుకొని అనుభవం చెందడంతోపాటు స్వతసిద్ధముగా వారికి సహాయం చేయడానికి ముందుకు రావడం. చివరి రెండు తాదాత్మ్యాలలో మాత్రమే సానుభూతిపరుడు బాధ చెందే వారి భావాలను అనుభవం చెందుతాడు. అభిజ్ఞ తాదాత్య్మములో ఇతర వ్యక్తి బాధ అనుభవిస్తున్నట్లు తెలుస్తుంది కానీ ఆ బాధను సానుభూతిపరుడు అనుభవించడు. కాబట్టి భగవంతుడు దుర్యోధనుని దుఃఖాన్ని అభిజ్ఞా తాదాత్య్మము ద్వారా సానుభూతి చూపాడు కానీ ఆ బాధను తాను అనుభవించలేదు.

దీనికి ఒక చక్కని ఉదాహరణ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో పనిచేసే ఒక వైద్యుడు. ఆ వైద్యుడు ఘోరమైన ప్రమాదాలకు గురైన చాలా తీవ్రమైన రోగులకు చికిత్స చేస్తాడు. ఆ రోగులు చాలా బాధ అనుభవిస్తున్నారని తనకి తెలుసు, మరియు వారిని ఓదార్చేందుకు తన సర్వశక్తినీ ఉపయోగిస్తాడు కానీ వారిలాగా ఆ బాధను అనుభవించడు. వైద్యుడు భావోద్వేగాలకు లేదా కరుణకు గురైతే తన పని సరిగా చేయలేడు. తన ఉద్యోగం ఒక్క రోజుకూడా సరిగా చేయలేడు.

గమనించవలసిన రెండవ విషయం ఏమిటంటే భగవంతుడు తన భక్తుల బాధను అనుభవిస్తాడు ఎందుకంటే అయన వారికి భక్తి ద్వారా వారితో ముడిపడి ఉన్నాడు. కానీ అది భౌతిక బాధ కాదు. అది ఆయన అంతరంగ శక్తి పరిణామం. కాబట్టి వరాహదేవుడు హిరణ్యాక్షుని పరుష మాటలకు బాధ పడ్డాడని చెప్పే 3.18.6వ శ్లోకముపై శ్రీ విశ్వనాథ చక్రవర్తి వారు వరాహదేవుడు తన భక్తుడైన బ్రహ్మ హిరణ్యాక్షుని మాటలు విని బాధపడినందున వరాహదేవుడు కలత చెందినట్లు వ్యాఖ్యానిస్తారు. వరాహదేవుడు బ్రహ్మపై కరుణా భావం కలిగిఉన్నాడు. హరిర్ దురుక్తి తొమరైర్ ఏవ నిమిత్త భూతైస్ తుడ్యమానః  యథా శృతార్థ గ్రాహిణాం బ్రహ్మాదినాం వ్యథామ్ దృష్ట్వా అనుకంపయా పీడ్యమానః ఇత్యర్థః

8.3.17 మరియు 4.30.24 శ్లోకాలపై శ్రీల ప్రభుపాదుల వారి  వ్యాఖ్యానం గురించి చూస్తే, అక్కడ ఆయన జీవుడు అంటే సాధారణ జీవుడు కాకుండా భక్తుడైన జీవుడుగా భావించి ఉండవచ్చు. భాగవతంలో గజేంద్ర మోక్ష ఘట్టములోని 8.3.17వ శ్లోకానికి సంబంధించి ఇది అక్షరాలా సత్యం ఎందుకంటే గజేంద్రుడు ఒక భక్తుడు, తన పూర్వ జన్మలో ఇంద్రద్యుమ్న మహారాజు మరియు తన ప్రార్థనలను ద్వారా కూడా ఆయన భక్తుడని మనం చెప్పవచ్చు. అలాగే 4.30.24 శ్లోకం కూడా ప్రచేతసుల ప్రార్థనలలోనిది. కాబట్టి ప్రభుపాదులవారు భక్తుడైన జీవుడిని సూచించినట్లు నేను భావిస్తున్నాను. లేకపోతే, సర్వ శక్తిమంతుడైన భగవంతుడు బాధపడుతున్న ప్రతి ఒక్క బద్ధ జీవిని ఎందుకు ఉద్ధరించడనే ఒక సామాన్య ప్రశ్న తలెత్తవచ్చు. భగవద్గీత 12.7లో కృష్ణుడు తన భక్తులను సంసార బంధమునుండి విముక్తి గావిస్తానని స్పష్టంగా చెప్తాడు. కాబట్టి, నాకు వ్యతిరేకత కనిపించలేదు.

 

Notify me of new articles

Comments are closed.

 • Satyanarayana Dasa

  Satyanarayana Dasa
 • Daily Bhakti Byte

  గురు శిష్యుల అనుబంధము చాలా అద్వితీయమైనది. ఈ సంబధంలో అత్యంత గౌరవం మరియు సాన్నిహిత్యం ఉంటాయి. సాధారణంగా గౌరవం మరియు సాన్నిహిత్యం కలిసి ఉండవు.

  — Babaji Satyanarayana Dasa
 • Videos with Bababji

 • Payment

 • Subscribe

 • Article Archive

 • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.