తొమ్మిదవ మరియు పదవ నామ అపరాధములు

BhaktiSandarbhasComments Off on తొమ్మిదవ మరియు పదవ నామ అపరాధములు

బోధకుని మరియు సాధకుని అపరాధములు

 ఒక విలువైన వస్తువును అర్హతలేని వ్యక్తికి ఇవ్వడం పరోక్షంగా ఆ వస్తువును అవమానించడమే అవుతుంది. అర్హతలేని వ్యక్తి వస్తువు విలువను తెలుసుకోలేడు మరియు దానిని గౌరవించడు. శ్రీ కృష్ణుని నామము కృష్ణునికంటే భిన్నమైనది కానందున ఆయనతో సమానంగా గౌరవించదగినది. కాబట్టి దాన్ని దాని విలువ తెలియని వారికి ఇవ్వకూడదు. అలాంటి వాళ్ళు నామానికి అపరాధము తలపెడతారు. భక్తి సందర్భములో ఈ అపరాధము గూర్చి వివరించబడింది.

265.9వ అనుచ్ఛేదము

నామము మీద శ్రద్ధ లేని వారికి, భగవంతుని గూర్చి ఆసక్తి లేని వారికి మరియు వినటానికి ఏ మాత్రం ఉత్సుకత లేనివారికి నామ మహిమలను గూర్చి  ఉపదేశించుట తొమ్మిదవ అపరాధము.  ఎవరైతే అలాంటి శ్రద్ధ లేనివారికి ఉపదేశిస్తారో వారికి ఈ అపరాధము వర్తిస్తుంది.

బోధకుని(ఉపదేష్ట్ర్) అపరాధము తెలిపిన తర్వాత సాధకుని(ఉపదేశ్య) అపరాధాన్ని తర్వాత శ్లోకం వివరిస్తుంది. శరీరానికి సంబంధించి “నేను” మరియు “నా” అనే భావంలో ఏకధాటిగా నిమగ్నమై ఉన్నందున సాధకుడు నామంపై భక్తిశ్రద్ధలు కలిగిఉండడు.

పద్మ పురాణమునుండి ఇంతకముందు(153వ అనుచ్ఛేదములో) ఈ శ్లోకం ఉటంకించబడింది:

ఒక వ్యక్తి సాధారణ సంభాషణలో, స్మరణంలో లేదా చెవిలో భగవన్నామము స్ఫురించినప్పుడు సరిగా పలికినా పలుకకపోయినా మరియు ఇతర వర్ణములతో పలికినా పలుకకపోయినా ఆ వ్యక్తిని నామము ఖచ్చితంగా ఉద్ధరిస్తుందనేది సత్యం. కానీ, ఓ బ్రాహ్మణుడా! అదే నామాన్ని నాస్తికులై లోభంతో శరీరము, సంపద లేదా అనుచరులను అనుభవించేవారి మధ్య ఉంచినప్పుడు అది త్వరగా దాని ఫలితాన్ని ఇవ్వదు(బ్రహ్మ ఖండము 25.24)

ఈ శ్లోకంలో పాషండ(“ఒక నాస్తికుడు”) అనే పదము నాస్తిక భావం నైజంగా ఉండడంవల్ల(పాషణ్డమయత్వ) లోభంతో శరీరాన్ని, సంపదలను మరియు ఇతర అన్వేషణలను అనుభవించాలనుకోవడంవల్ల నామముపై దశ అపరాధములను సూచిస్తుంది.

ఆపై, పద్మ పురాణంలోని వైశాఖ మాహాత్మ్యములో ఇలాంటి వారికి వర్తించే మరొక అపరాధము సూచించబడింది:

భగవన్నామ కీర్తనను అవమానించి మరియు ఆ ప్రదేశంనుండి వెళ్లే వారు ఆ పాప కార్యం వల్ల ఘోరమైన నరకాన్ని పొందుతారు.(పద్మ పురాణం 5.96.63)

కేవలం నామమే అన్ని అపరాధములకు ప్రాయశ్చిత్తమని కూడా పద్మ పురాణంలో చెప్పబడింది:

నామ అపరాధము చేసిన వారి పాప ప్రక్షాళన దివ్య నామములు మాత్రమే చేయగలవు. నిరంతర నామ కీర్తన చేసినప్పుడే అవి ఆశించిన ఫలితాన్ని ఇస్తాయి.(పద్మ పురాణం బ్రహ్మ ఖండం 25.23)

కానీ, ఒక భక్తుడి యందు ఒకరు అపరాధము చేస్తే ఆ భక్తుడిని సంతుష్టిపరచేందుకు నిరంతరంగా భగవంతుని నామాలను గానం చేయాలి, ఇది మనకు అంబరీష మహారాజు మరియు దుర్వాస మహాముని కథనుండి విదితమౌతుంది. దుర్వాసుని అపరాధాన్ని కేవలం అంబరీష మహారాజుమాత్రమే క్షమించగలిగాడు(స్వయంగా భగవంతుడు కూడా క్షమించలేదు). నామ కౌముదిలో కూడా ఇలా చెప్పబడింది: “ఒక మహా భక్తునిపై చేసిన అపరాధము దాని  ఫలితమును అనుభవిస్తేగాని లేదా ఆ భక్తుని కరుణతోగాని పరిహారం చేయబడుతుంది.” కాబట్టి ఇతర ఉపాయం లేనందున ఈ అనుచ్ఛేదము మొదట ఇలా తగినట్లు చెప్పబడింది:

ఓ రాజా, భౌతిక వాంఛలను పూరించుకోవాలనుకునే వారికి[ఇచ్ఛతాం అంటే కామినామ్], ప్రాపంచిక ఉనికికి ఉదాసీనంగా ఉండి ముక్తిని కోరుకునే వారికి[నిర్విద్యమానానాం అంటే ముముక్షూణాం] మరియు బ్రహ్మ తత్త్వ సాక్షాత్కారము పొందిన వారికి[యోగినాం అంటే జ్ఞానినామ్], నిరంతర భగవన్నామ జపమునొక్కి ఒక్కాణించబడింది.  మొదటి రెండు వర్గాల వారికి సాధనముగా మరియు చివరి వర్గానికి సాధ్యముగా   ఇది నిర్ధారించబడింది.(భాగవత పురాణం 2.1.11)

బృహత్ నారదీయ పురాణంలో శ్రీ నారద మునుల వారు ఇలాంటి భావనను వ్యక్త పరచారు:

శ్రీ కృష్ణుని నామ మహిమను గొప్ప ఋషులు మరియు మనువులు కూడా తెలుసుకోలేరు. కాబట్టి, అల్ప బుద్ధిగల నేను ఆయనను ఎలా పూజించగలను.

 సత్యనారాయణ దాస బాబాజి వారి వ్యాఖ్యానం

భక్తికి అనుకూలంగా లేనివారికి, నామము గురించి వినుటకు ఆసక్తి లేనివారికి మరియు నామముపై శ్రద్ధ లేని వారికి ఒకరు నామ ఉపదేశం చేయరాదు. అలాంటి వ్యక్తికి నామ ఉపదేశాన్ని ఇవ్వాలనుకోవడం తొమ్మిదవ నామ అపరాధము. ఒక వ్యక్తికి ఆసక్తి లేనప్పుడు బలవంతంగా నామాన్ని గురించి విన్నప్పుడు ఆ వ్యక్తి నామాన్ని అనాదరించి అపరాధము చేస్తాడు. ఆ ఆసక్తి లేని వ్యక్తి అపరాధము చేయడానికి బోధకుడు ఉపదేశించడం కారణం కనుక బోధకుడు కూడా ఈ అపరాధములో పాలుపంచుకొంటాడు. ఒక వ్యక్తి చేసే అపరాధములో బోధకుడు కీలక పాత్ర పోషిస్తే అతనుకూడా అపరాధి అవుతాడనేది దీని సారాంశం.

పదవ అపరాధము నామము మీద ఉపదేశము పొందిన వ్యక్తికి వర్తిస్తుంది. నామ మహిమలు అనేకసార్లు విన్నతర్వాత కూడా దానిని శరణుజొచ్చకుండా భౌతిక విషయాలలో చిక్కుకొనిఉంటే ఆ వ్యక్తి నామమును అగౌరవపరిచినట్లు రుజువు చేసినట్లే. ఆఖరి దశలో రోగంతో బాధపడుతూ ఆ రోగానికి చికిత్స  తెలిసినా దానిపై ఎటువంటి ఆసక్తి చూపని ఒక రోగితో అలాంటి వ్యక్తిని పోల్చవచ్చు. అలానే, ఆ రోగి తనకు దయతో చికిత్స ఇవ్వాలనుకున్న వ్యక్తిని తిరస్కరించినప్పుడు, ఆ తిరస్కారం వాల్ల నిస్స్వార్థంగా సహాయం చేయాలనుకున్నవారు బాధపడరా?

నామమనేది అన్ని ఉదాత్తమైన గుణాలతో మరియు అనూహ్యమైన శక్తులతో నిండియున్న ఒక చైతన్య వస్తువుని గ్రహించడం ముఖ్య ఉద్దేశ్యం. అది జడమైన శబ్దం కాదు. తత్ఫలితంగా ఒక గౌరవప్రదమైన వ్యక్తితో వ్యవహరించేటప్పుడు ఎలా జాగ్రత్తగా ఉంటామో అలానే నామముపట్ల కూడా అదే జాగ్రత్తతో ఉండాలి. ఈ పది అపరాధముల బారిన పడకుండా ఉండడంతోపాటు ఒకరు తమ ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు, కీర్తనచేసే వారికి ఆటంకము చేకూర్చడం లేదా వారిని ద్వేషించడం వంటివి చేయకూడదు. మరోవైపు, ఒక సాధకుడు పొరుగువారికి ఇబ్బందిగా ఉంటే బిగ్గరగా కీర్తన చేయకూడదు ఎందుకంటే దానివల్ల పొరుగువారు అపరాధము చేయవచ్చు. పైన వివరించినట్లు ఇది కూడా అపరాధ ప్రవర్తన క్రింద వస్తుంది.

ఎవరైనా ఒక భక్తుని కించపరిస్తే, వారు ఆ భక్తుని శాంతపరచడానికి ప్రయత్నించాలి. కేవలం నామ జపము చేసి కించపరిచిన భక్తుని శాంతింపజేయకుండా ఉండకూడదు. దుర్వాస ముని మహా భక్తుడైన అంబరీషుని హతమార్చడానికి ఒక భూతాన్ని సృష్టించి అపరాధము చేసాడు. విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రము అంబరీషుని రక్షించడానికి వచ్చినప్పుడు దుర్వాసుడు తన ప్రాణంకాపాడుకోవడానికి పలాయనం చిత్తగించాడు. శివునితో సహా అనేక దేవతలవద్దకు చక్రమునుండి రక్షణ పొందడానికి వెళ్ళాడు కానీ అందరూ తాము ఈ విషయంలో శక్తిహీనులమని వ్యక్తం చేసారు. ఆఖరికి ఆయన విష్ణుమూర్తి వద్దకు వెళ్ళినప్పుడు, దుర్వాసుని అంబరీషుని వద్ద శరణు తీసుకోమని విష్ణుమూర్తి సలహా ఇస్తాడు. అంబరీషుడు తప్ప మరెవరూ తనకు సహాయం చేయలేరని చెప్తారు. కాబట్టి, ఒక భక్తునియందు అపరాధము చేసినప్పుడు ఆ భక్తుని శాంతపరచడము చేయాలి లేదా అపరాధ పర్యవసానాన్ని అనుభవించాలి. మూడవ ఉపాయం లేదు. కానీ, ఒకవేళ ఒకరికి తమ అపరాధమునకు కారణం తెలియని పక్షంలో మరే ఇతర అపరాధములు చేయకుండా నిరంతరంగా నామ జపము చేయాలి.

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    మీ మార్గాన్ని ఇతరులకు తెలియజేయడానికి ఉత్తమ మార్గం శాంతియుతంగా, ప్రశాంతంగా మరియు ఇతరులను అంగీకరించే మీ వ్యక్తిగత ప్రవర్తన. ఇది వారిలో ఉత్సుకతను రేకెత్తిస్తుంది.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.