నామ అపరాధములు : నాలుగు నుండి ఆరు వరకు

SandarbhasComments Off on నామ అపరాధములు : నాలుగు నుండి ఆరు వరకు

మూడవ అపరాధము(ఒకరి గురువుని అనాదరించడము) గురించి శ్రీ జీవ గోస్వామి వివరించలేదు ఎందుకంటే ఇది మొదటి అపరాధము(భగవంతుని సద్భక్తులను నిందించడము)లో ఒక ప్రత్యేక సంగతి గనుక.

ఆధ్యాత్మిక జీవితం శాస్త్రజ్ఞానం మీద ఆధారపడివుంటుంది. ఇది శ్రద్ధతో మొదలౌతుంది. మనకు శాస్త్రముమీద శ్రద్ధ ఉన్నట్లయితే దానికి అనుగుణంగా మనం ప్రవర్తిస్తాము. శాస్త్రవిరుద్ధమైన అన్ని విషయాలను మనం వదిలేయాలి. తరువాతి మూడు అపరాధములు శాస్త్రముకు సంబంధించినవి. వాటిపై శ్రీ జీవ గోస్వామి ఇచ్చిన వివరణ క్రింద సమర్పించబడింది.

265.6వ అనుచ్ఛేదము

4) నాలుగవ అపరాధము శృతి-శాస్త్ర-నిందనం, “వైదిక శాస్త్రములను నిందించడము” వైదిక వాఙ్మయమునకు విరుద్ధముగా దత్తాత్రేయ మరియు ఋషభదేవులను ఆరాధించే పాషండులను సూచిస్తుంది.

5) ఐదవ అపరాధము అర్థ వాదః, అంటే భగవన్నామ నామ కీర్తిని కేవలం అర్థవాదము(స్తుతి మాత్రము)గా భావించడం.

6) ఆరవ అపరాధము, హరి నామ్ని కల్పనం, “ఒకరి సొంత ఊహాజనిత అర్థమును నామానికి ఆపాదించడం”, అంటే నామ కీర్తిని తృణీకరించుటకు దాన్ని

 శాస్త్ర సిద్ధాంతమును వ్యతిరేకించే విధంగా అర్థం చేసుకోవడం. అప్రామాణికమైన లేదా శాస్త్ర విరుద్ధ అర్థాలను కనుగొనేటువంటి కల్పనం చేసే లోపము కూర్మ పురాణంలోని వ్యాస గీతలో తెలియజేయబడింది:

పూజించే దేవుడి మీద ఉన్న వైరముకన్నా ఒకరి గురువుపై ఉన్న వైరము కోటానుకోట్ల రెట్లు నీచమైనది. శాస్త్ర సిద్ధాంతమును వ్యతిరేకించడం(జ్ఞాన అపవాద) నాస్తిక్యము మరియు అలా చేయడం గురువుపై వైరము ఉంచుకొనుటకన్నా కోటి రెట్లు నీచమైనది.

విష్ణు భగవానుని సహచరులనుండి నామ మహిమ తెలుసుకొన్న తర్వాత కూడా అజామిలుడు ఇలా మాట్లాడడం గమనించదగ్గ విషయం. “నాలాంటి పాపాత్ముడు ఖచ్చితంగా నరకలోకాలకు వెళ్తాడు”(శ్రీ భాగవత పురాణం 6.2.29). [ఈ వాక్యం నామము యొక్క శక్తి తనని రక్షించలేదని సందేహాన్ని తెలుపడంలేదు.] నిజానికి, తన తప్పిదమును గురించి చెప్పడానికి మాత్రమే అజామిలుడు ఇలా మాట్లాడాడు. కొన్ని శ్లోకముల తర్వాత నామ కీర్తన యొక్క మహిమపై తనకున్న అవగాహనను నొక్కి వక్కాణించి ఇలా చెప్తాడు:

నేను దౌర్భాగ్యుడనైనప్పటికీ[ఈ జీవితంలో అనేక పాపాలు చేసినప్పటికీ(యద్యపి అహం అస్మిన్ జన్మని దుర్భగః పాపీయాన్)], నాకు పరమ భక్తుల దర్శన భాగ్యం కలిగింది గనుక గత జన్మలో ఏదో మంగళకర కార్యం చేసినట్లు భావిస్తున్నాను. వారిని చూడడంతో నా హృదయం ఆనందముతో నిండిపోయింది. లేకపోతే, ఒక వ్యభిచారి భర్తను మరియు భ్రష్టుడనై ఉన్న నేను మృత్యువడిలో దీనావస్థలో నా నాలుకతో భగవాన్ విష్ణు నామమును ఉచ్చరించడం సాధ్యం అయ్యేది కాదు.(శ్రీ భాగవత పురాణం 6.2.32-33)

 సత్యనారాయణ దాస బాబాజీ వారి వ్యాఖ్యానం

మూడవ అపరాధము ఒకరి గురువును అగౌరవపరచడం. ఇది సాధువులను నిందించడం(మొదటి అపరాధము)లో ఒక ఉదాహరణగా అర్థం చేసుకోవచ్చు. ఈ కారణంచేత శ్రీ జీవ గోస్వామి దీనిపై వివరణ ఇవ్వలేదు. కానీ, సాధువులలోకెల్లా ఒకరి గురువుని అగౌరవపరచడం లేదా నిందించడం దుస్సహమైన అపరాధమని గుర్తించాలి. గురువు ఒకరి ఆధ్యాత్మిక జీవితానికి పునాది. ఈ విషయంలో శ్రీ కృష్ణుడు ఉద్ధవునికి ఇలా ఉపదేశిస్తాడు: “ఒకరి గురువుని(ఆచార్యుని) స్వయంగా నేనే అని తెలుసుకోవాలి. ఎప్పుడూ గురువుని సాధారణ వ్యక్తిగా భావించి అలక్ష్యము చేయకూడదు లేదా గురువుయందు ఈర్ష్యతో ఉండకూడదు ఎందుకంటే గురువు సర్వదేవతల స్వరూపం”(శ్రీ భాగవతం 11.17.27).

శాస్త్ర నిందన చేయడం నాలుగవ అపరాధం. శాస్త్రములు మన గురించి మరియు భగవంతుని గురించి ప్రామాణికమైన జ్ఞానాన్ని మనకు ఇస్తాయి. ఆ  జ్ఞానాన్ని  అనుభవము పొందడానికి ఆచరణాత్మక విషయాలను తెలియజేస్తాయి. అవి భగవంతుని శబ్ద అభివ్యక్తి, శబ్ద బ్రహ్మము(శ్రీ భాగవత పురాణం 6.16.51). శాస్త్ర ప్రావీణ్యము సాధించడం ద్వారా పరమతత్త్వమును పొందవచ్చు. పితృ, దేవ మరియు మనుష్యులకు వేదము ఒక అద్భుతమైన నేత్రమువలె జీవితాన్ని సాఫల్యం చేసుకోడానికి కావాల్సిన సాధన మరియు సాధ్యములను తెలుసుకొనే అవకాశం ఇస్తుందని ఉద్ధవుడు పేర్కొంటాడు(శ్రీ భాగవత పురాణం 11.20.4). కూర్మ పురాణంలో శ్లోకంప్రకారం, శాస్త్ర నిందన గురువు నిందన కన్నా ఘోరమైనది. ఎందుకంటే, గురువుకు తన ప్రామాణ్యము శాస్త్ర ప్రామాణ్యము నుండే వస్తుంది మరియు ప్రామాణిక గురువుయొక్క లక్షణాలు శాస్త్రముద్వారానే తెలుస్తాయి.

నామకీర్తి వర్ణనలయందు శ్రద్ధ లేకుండా ఉండడం మరియు వాటిని అర్థవాదముగా భావించడం ఐదవ అపరాధము. వేదాలలో కొన్ని వాక్యాలు కేవలం అనాసక్తులైన వారిని ధార్మిక మార్గమువైపు ప్రోత్సహించడంకోసం చెప్పబడ్డాయి. అవి ప్రజలు శాస్త్ర మార్గమును అనుసరించుటకు భౌతిక ఫలితాలను వాగ్దానం చేస్తాయి, రోచనార్థా ఫల-శృతిః (శ్రీ భాగవత పురాణం 11.3.46). ఆ వాక్యాల నిజమైన ఉద్దేశ్యము ప్రాథమిక అర్థము కాదు. వాటిని అర్థవాదం అంటారు. కానీ, అలా ఫలితాలతో ప్రలోభపెట్టడం వంటి అర్థవాదం, నామ కీర్తన ఫలితాలను వివరించడానికి వర్తించదు. భగవన్నామము అత్యంత శక్తివంతమైనది, అది ముక్తి మరియు ఆపై ఏ ఫలితాన్నైనా ఇవ్వగలదు. ఈ విషయంలో, చైతన్య చరితామృతము(అంత్య లీల 3వ అధ్యాయం)లో వివరించబడిన గోపాల చాపాల కథ మనము ఉదాహరణగా తీసుకోవచ్చు.

భగవన్నామ మహిమలకు ఊహాజనిత అర్థమును ఇవ్వడం మరియు వాటిని తక్కువచేయడం వంటివి ఆరవ అపరాధము. నామముయందు శ్రద్ధ లేకపోవడాన్ని ఇది సూచిస్తుంది. ఒక్కసారి నామము ఉచ్చరిస్తే సర్వ పాపాల నుండి విముక్తులౌతారని చెప్పే వాక్యాలు అనేకం ఉన్నాయి. అజామిలుని కథ దీనికి ఒక ఉదాహరణ. ఎవరైతే నామ ఉచ్చారణ చేస్తారో వారు యమధర్మరాజు శిక్షలకు అనర్హుడు(శ్రీ భాగవతం 6.3.26). అందువల్ల ఒక భక్తుడు తన అక్రమ కర్మల ఫలితంగా నరకానికి వెళతానని అనుకోవడం అనేది నామ విశ్వాస ఘాతుకమే అవుతుంది. అజామిలుడు తాను ఖచ్చితంగా ఘోరమైన నరకానికి వెళ్తానని చెప్పిన వాక్యం వినయంతో చెప్పాడు కానీ నామము యొక్క శక్తి మీద శ్రద్ధ లేకకాదని శ్రీ జీవ గోస్వామి వివిరిస్తారు. కాబట్టి, అది అపరాధముగా పరిగణించబడదు.

(సశేషం) 

Notify me of new articles

Comments are closed.

 • Satyanarayana Dasa

  Satyanarayana Dasa
 • Daily Bhakti Byte

  ప్రేమ హిందూ, ముస్లిం లేదా క్రైస్తవము కాదు. ఇది కేవలం ప్రేమే. అదేవిధంగా ధర్మం హిందూ, ముస్లిం లేదా క్రైస్తవము కాదు, ఇది సనాతన ధర్మం మాత్రమే.

  — Babaji Satyanarayana Dasa
 • Videos with Bababji

 • Payment

 • Subscribe

 • Article Archive

 • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.