నామ అపరాధములు : మొదటి అపరాధము

SandarbhasComments Off on నామ అపరాధములు : మొదటి అపరాధము

భగవద్భక్తుడిని విమర్శించడం

         మనము మన గమ్యాన్ని చేరడానికి సరైన దారిని అనుసరించడంతోపాటు తప్పుదారి తీసుకోకుండా ఉండాలి. రెండిటి మధ్య గల భేదాన్ని మనం తెలుసుకోవాలి. ఏదైనా ఒక ప్రక్రియను అనుసరించడానికి దాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడం ఎలా అవసరమో అలానే ఏదైనా ఒక విషయాన్ని నివారించాలంటే దాని గురించి కూడా బాగా అవగాహన ఉండాలి. గౌఢీయ వైష్ణవ సమాజంలో నామ జపముకు మరియు నామ కీర్తనకు చాలా ప్రాధాన్యం ఉంది. ఇది అద్భుతమైన విషయం. ఇక్కడ అపరాధ నివారణకు అత్యంత ప్రాధాన్యమివ్వబడింది. కానీ, అపరాధములను అవగాహన చేసుకోవడం సాధారణంగా తెలియదు. శ్రీ జీవ గోస్వామి నామముయందు తలపెట్టగల అపరాధముల గురించి వివరిస్తారు. క్రింది అనుచ్ఛేదములో ఆయన మొదటి అపరాధముపై వివరణ ఇస్తారు.

265.3 వ అనుచ్ఛేదము

“భగవంతుని సద్భక్తులను నిందించడం తీవ్ర నామ అపరాధం” అను మొదటి అపరాధమునుండి భగవద్భక్తునిపై శారీరక హింసచేయడము మాటలలో చెప్పలేనంత తీవ్రమైన అపరాధమని మనకు తెలుస్తుంది. స్కంద పురాణములో శ్రీ మార్కణ్డేయ మరియు భగీరథ మహారాజు మధ్య జరిగిన సంవాదంలో భక్త దూషణ మరియు ఇతర అపరాధముల గురించి వర్ణించబడింది:

వైష్ణవ సాధువులను దూషించే మూఢులు వారి పితరులతో సహా మహారౌరవమనే నరకానికి వెళ్తారు. అలాంటి దుర్గతికి ఆరు దోషములు దారితీస్తాయి: వైష్ణవులను హతమార్చడం, వారిని నిందించడం, వారిపై అసూయ చెందడం, వారికి అభివాదం చేయకపోవడం, వారిపై ఆగ్రహం చెందడం, మరియు వారిని చూసిన పిమ్మట ఆనందం పొందకపోవడం.

శుక మహర్షి చెప్పినట్లు, వైష్ణవ విమర్శ వినడం కూడా అపరాధమే:

భగవంతునిపై లేదా ఆయన భక్తులపై విమర్శలను విన్నప్పుడు ఆ స్థలమునుండి వెళ్ళిపోని వ్యక్తి తన సర్వ పుణ్యమును కోల్పోయి నరకానికి వెళ్తాడు.(శ్రీమద్ భాగవతం 10.74.40)

ఇక్కడ భగవంతునిపై లేదా ఆయన భక్తులపై విమర్శ చేయబడిన స్థలమునుండి నిష్క్రమించాలని చెప్పడం విశేషంగా ప్రతిచర్య చేయలేని వారికి వర్తిస్తుంది. ప్రతిచర్య చేయగల సామర్థ్యం ఉంటే దూషించిన వారి నాలుక కోయాలి మరియు ఇది కూడా చేయలేకపోతే సతీ దేవి చెప్పినట్లు జీవితం త్యాగం చేయాలి:

తుచ్ఛమైన మానవులచే ధర్మాన్ని పరిరక్షించే ఒకరి ఇష్టదేవత(ఈశ) మీద విమర్శ జరిగినప్పుడు, ప్రతిచర్య చేయలేని వ్యక్తి తన చెవులు మూసుకొని ఆ స్థలాన్ని వదిలి వెళ్ళిపోవాలి. ఒకవేళ, ప్రతిచర్యచేయగల సామర్థ్యం ఉంటే, క్రూరమైన అపరాధి నాలుకను ఖండించాలి, లేదా తన జీవితాన్ని త్యాగం చేయాలి. ఇదే ధర్మమార్గము.(శ్రీమద్ భాగవతం 4.4.17)

సత్యనారాయణ దాస బాబాజి వారి వ్యాఖ్యానం

    భగవంతుని నామం భౌతిక శబ్దము కాదు, అది చేతన మరియు ఆనందము కలిగిన తత్త్వం (చైతన్య రస విగ్రహః), అది శ్రీకృష్ణుని నుండి బేధమైనది కానిది (అభిన్నత్వాన్నామనామినోః, భక్తి రసామృత సింధువు 1.2.233). జపము చేయడం నామానికి ప్రీతి కలిగించినట్లు, అపరాధములు నామానికి అసహ్యాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా పరిశీలిస్తే, అపరాధములను ప్రేమ భావానికి వ్యతిరేకమైన చర్యలుగా అర్థం చేసుకోవచ్చు.  ఉదాహరణకు, మొదటి అపరాధం భగవద్భక్తులను విమర్శించడం. మనం ఒకరిని ప్రేమిస్తే, వారికిష్టమైన వారిని విమర్శించకూడదనేది లోకజ్ఞానం. భగవంతుడు మరియు ఆయన నామము భక్తులను ప్రేమిస్తారు. ఎవరైనా ఆ భక్తులను విమర్శిస్తే నామానికి ఆ వ్యక్తిపై అసహ్యం కలుగుతుంది.

      కేవలం విమర్శకే  అలాంటి ఫలితమున్నప్పుడు, భక్తుడిని ఏ రకంగానైనా హింసించడమనేది తీవ్ర అపరాధం మరియు అందువల్ల భగవంతుడికి ఆ వ్యక్తిపై అపరిమితమైన అసహ్యం కలుగుతుంది. భాగవతంలోని తొమ్మిదవ స్కంధములో నాలుగు మరియు ఐదవ అధ్యాయాల్లో ఉన్న అంబరీష మహారాజు మరియు దుర్వాస ముని వృత్తాంతం నుండి ఇది మనం గ్రహించవచ్చు. భాగవత పురాణంలో చిత్రకేతు మహారాజ, వృత్రాసుర, ఇంద్రద్యుమ్న మహారాజ, అజామిల, మరియు దక్ష మొదలగు చాలా కథలు నామ అపరాధముయొక్క చిక్కులు వివరించడానికి వర్ణించబడ్డాయి. నిజానికి, భాగవతం మొత్తము ఆధ్యాత్మిక సాధకులకు నామ అపరాధము గురించి, భగవన్నామ జపము ప్రాముఖ్యతను, మరియు కృష్ణునిపై ఉత్తమ భక్తిని బోధించడానికి చేసిన ఒక ప్రయత్నమనుకోవచ్చు. ఎందుకంటే, కలియుగంలో నామ కీర్తన చేయడం యుగ ధర్మముగా నిర్దేశించబడింది(శ్రీ.భాగవతం 11.5.31-32), మరియు భాగవత పురాణం ప్రత్యేకంగా అజ్ఞాన అంధకారంలో ఉన్న కలియుగ ప్రజలకు దృష్టిని  ప్రసాదించడానికి అవతరించింది(శ్రీ.భాగవతం 1.3.44).

            భక్తుడిని విమర్శించడం అపరాధమైనట్లే, దానిని ప్రతిఘటించకుండా విమర్శను వినడం కూడా అపరాధమే. ఈ కారణం చేత, సతీ దేవి మూడు సాధ్యమైన ప్రతిచర్యలు సిఫారసు చేస్తుంది. మొదటిది అపరాధి నాలుక ఖండించడం చేయాలి. అదిచేయలేని పరిస్థితిలో, ప్రాణ త్యాగం చేయాలి. అది కూడా సాధ్యంకాని పక్షంలో వెంటనే చెవులు మూసుకొని ఆ ప్రదేశంనుండి నిష్క్రమించాలి. ఈ మూడింటిలో, మొదటి రెండూ ఆధునిక నైతిక దృక్పథంలో  అక్షరాలా తీసుకోకూడదు. ఇవి మనకు వైష్ణవ విమర్శ వినడం ఎంత తీవ్రమైందో దానికి తగ్గ చర్య తీసుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేయుటకోసము చెప్పబడ్డాయి. కాబట్టి, అపరాధిని మాటలతో ఖండించాలి లేదా ఆ ప్రదేశాన్ని వదలి వెళ్ళిపోవాలి. కానీ, ఏమి పట్టనట్టుగా ఉండడం లేదా విమర్శను ఆస్వాదించడం లేదా సమర్ధించడం ఎట్టి పరిస్థితులలోను చేయకూడదు.

        కౌరవుల సభలో ద్రౌపదీ దేవి అవమానించబడ్డప్పుడు భీష్మ పితామహులవంటి పెద్ద మనుషులు అడ్డు చెప్పలేదు. తద్వారా, ఆ అపరాధాన్ని ప్రతిఘటించని వారు, లేదా సభను విడచి వెళ్లని వారు అందరూ అపరాధములో పాలుపంచుకున్నారు. అలాగే, దక్షుడు శివుడ్ని విమర్శించినప్పుడు, దక్షునికి మద్దతు తెలిపిన వారుకూడా అపరాధము యొక్క పర్యావసానానికి గురి అయ్యారు. వారిలో భగ మరియు పూషా ప్రత్యేక శిక్ష అనుభవించారు. భగ కళ్ళు కోల్పోయాడు మరియు పూషా పళ్ళు పోగొట్టుకున్నాడు.

           ఈ నేపథ్యంలో, పరీక్షిత్తు మహారాజు ప్రపంచ విజయం కోసం చేసిన పర్యటనలో ఒక మ్లేచ్ఛ ముసుగులో కలిపురుషుడు ఒక ఎద్దును కొట్టడం చూసినప్పుడు, ఆ ఎద్దు ఒక దివ్య జీవుడని ఆయన గ్రహించాడు. ఆ ఎద్దును తన కష్టము గురించి ప్రశ్నించగా అది కలి పురుషుడిపై నింద మోపలేదు. ఒక జీవుని బాధకు సిద్ధాంతకర్తలలో ఆత్మ, విధి, కర్మ, స్వభావం మొదలగు అనేక విరుద్ధమైన అభిప్రాయాలు కారణమని చెప్తుంది. వీటిలో తన బాధకు కారణం ఎదో ఖచ్చితంగా చెప్పడం తనకు అసాధ్యమని చెప్తుంది. ఈ అద్భుతమైన సమాధానము విన్న పరీక్షిత్తు మహారాజు మనము పరులపై నిందమోపకుండా ఉండేలా బోధించే ఈ వాక్యాన్ని పలుకుతారు.

           ఓ ధర్మము యొక్క సారమును గ్రహించినవాడా(ధర్మజ్ఞా)!, నువ్వు చెప్పినది ధర్మానికి అనుగుణంగా ఉంది(నిన్ను కష్టపెడుతున్నది ఎవరో తెలిసినాకూడా అతన్ని నిందించక ఎవరో తెలియదన్నట్లు మాట్లాడుతున్నావు). కాబట్టి, నీవు ఎద్దు రూపంలో ఉన్న ధర్మ దేవతవు( అపరాధిని వేలెత్తి చూపడంలో తప్పేంటి? ధర్మ శాస్త్రాలు ఇలా చెప్పాయి). అపరాధి అనుభవించాల్సిన శిక్షను నింద మోపిన వ్యక్తి కూడా అనుభవిస్తాడు.(శ్రీ.భాగవతం 1.17.22)

     అదే మార్గంలో, శ్రీ కృష్ణుడు కూడా ఉద్ధవునితో ఇతరుల స్వభావాన్ని మరియు పనులను పొగడకుండా  అలానే నిందించకుండా ఉండాలని హితవు పలుకుతాడు.(శ్రీ.భాగవతం 11.28.1-2)

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    గురు శిష్యుల అనుబంధము చాలా అద్వితీయమైనది. ఈ సంబధంలో అత్యంత గౌరవం మరియు సాన్నిహిత్యం ఉంటాయి. సాధారణంగా గౌరవం మరియు సాన్నిహిత్యం కలిసి ఉండవు.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.