ఆయుర్వేదంలో ఒక ఆసక్తికరమైన, ప్రసిద్ధి చెందిన శ్లోకముగలదు – “పత్యే సతి గదార్తస్య కిమ్ ఔషధ-నిషేవణైః / పత్యే అసతి గదార్తస్య కిమ్ ఔషధ-నిషేవణైః”. సముచితమైన ఆహారము తీసుకొనే వ్యక్తి అస్వస్థతకు గురియైనప్పుడు ఔషధము తీసుకోవడం వల్ల ఏమి ప్రయోజనం? సముచితమైన ఆహారం తీసుకోని వ్యాధిగ్రస్థ వ్యక్తి ఔషధము తీసుకున్న ఉపయోగమేమి? ఈ శ్లోకం గొప్పదనమేంటంటే రెండు వాక్యాలు చదువుటకు ఒకేలా ఉన్నా వాటి అర్థాలు పూర్తిగా వేరు.
ఈ శ్లోకంయొక్క అర్థము ఒక జబ్బుని నయంచేయడానికి ఔషధము తీసుకోవడం కన్నా అనుచితమైన ఆహారాన్ని నివారించడం ముఖ్యమని. ఇలాంటి విషయమే సర్వ భవరోగ నివారిణి అయిన కృష్ణుడి నామ జపములోనూ వర్తిస్తుంది. జపము చేయడంకన్నా నామము యందు అపరాధములు చేయకుండుట చాలా ముఖ్యము. భక్తి సందర్భము 265వ అనుచ్ఛేదములో శ్రీ జీవ గోస్వామి నామజపమునందు నివారించవలసిన పది అపరాధములను వివరిస్తారు. వాటియొక్క అనువాదం మరియు వ్యాఖ్యానము వచ్చే సంచికలలో ప్రచురించబడతాయి.
265.2వ అనుచ్ఛేదము
పది నామ అపరాధములు
పద్మ పురాణంలో సనత్ కుమారుడు వివరించినట్లు భగవంతుని నామ గానం చేసే సమయంలో పది అపరాధములను నివారించాలి:
అన్ని రకాల అపరాధములు చేసినవారుకూడా భగవాన్ హరిని శరణు పొంది విముక్తులౌతారు. కావున, శ్రీ హరికి అపరాధము తలపెట్టినవారు రెండుకాళ్ళ పశువుతో సమానం. అలాంటి వ్యక్తికూడా ఎప్పుడైనా శ్రీ హరి నామాన్ని శరణు తీసుకొంటే ఆ వ్యక్తి సర్వాపరాధాలనుండి విముక్తి పొందుతాడు. అందుకే భగవన్నామము అందరికీ ఆప్త మిత్రుడు. కానీ నామ అపరాధము చేసినచో పతనం తప్పదు.(పద్మ పురాణం బ్రహ్మ ఖండము 25.12-13)
నామ అపరాధములు ఇట్లు చెప్పబడినవి:
సతామ్ నిందా నామ్నః పరమం అపరాధమ్ వితనుతే
యతః ఖ్యాతిమ్ యాతమ్ కథం ఉ సహతే తద్విగరిహాం
1) భగవంతుని సద్భక్తులను నిందించడం తీవ్ర నామ అపరాధం. భగవన్నామము తన కీర్తిని ప్రచారంచేసే వారిపై చేసే విమర్శలను ఎలా సహించగలదు?
శివస్య శ్రీ విష్ణోర్ య ఇహ గుణ నామాది సకలమ్
ధియా భిన్నమ్ పశ్యేత్ స ఖలు హరినామాహితకరః
2) ఎవరైతే శివుని నామము, గుణాలు, మరియు ఇతర లక్షణాలను భగవాన్ విష్ణు యొక్క నామము, గుణాలు మరియు ఇతర లక్షణములు నుండి స్వతంత్రమైనవి (భిన్నము)గా భావిస్తారో వారు నామానికి అసహ్యము కలుగజేస్తారు.
గురోర్ అవజ్ఞా శృతి శాస్త్ర నిన్దనమ్ తథార్థ వాదో హరినామ్ని కల్పనం
3-6) ఒకరి ఆధ్యాత్మిక గురువును అగౌరవపరచడం; వేద శాస్త్రములను నిందించడం; శాస్త్రములో నామముపై ఉన్న ప్రశంసలను కేవలం పొగడ్తలు(అర్థవాదం)గా భావించడం; మరియు నామానికి సొంత కల్పిత అర్థాలను ఆపాదించడం అన్నీ అపరాధములే.
నామ్నో బలాద్ యస్య హి పాప-బుద్ధిర్ న విద్యతే తస్య యమైర్ హి శుద్ధిః
7) నామమువల్ల పొందిన శక్తితో బుద్ధిపూర్వకంగా పాపములు చేసే వారికి నియమాలద్వారా ప్రాయశ్చిత్తము లేదు.
ధర్మ వ్రత త్యాగ హుతాది సర్వ శుభ క్రియా సామ్యం అపి ప్రమాదః
8) శాస్త్రాలలో సిఫారసు చేయబడ్డ ఆశ్రమ ధర్మము, ప్రార్థనలు, త్యాగములు లేదా యజ్ఞములగు ఇతర పుణ్య కర్మలతో భగవన్నామమును సమానంగా చూడడం అపరాధము.
అశ్రద్ధధానే విముఖే అపి అశృణ్వన్తి యశ్చోపదేశః శివ-నామాపరాధః
9) శ్రద్ధ లేని వారికి, భగవంతునికి విముఖంగా ఉన్నవారికి మరియు నామము గురించి వినుటకు ఆసక్తిలేని వారికి మంగళకరమైన భగవన్నామమును గూర్చి బోధన చేయడం అపరాధము.
శృతే అపి నామ మాహాత్మ్యే
యః ప్రీతి రహితో నరః
అహం మమాది పరమో
నామ్ని సో అపి అపరాధ-కృత్
10) నామ కీర్తి గురించి విన్న తర్వాత కూడా నామముయందు ప్రేమ పొందక, శరీరానికి సంబంధించిన “నేను” మరియు “నా” అనే ఆలోచనలలో మునిగిన అధమ స్వభావంగలవారు కూడా నామ అపరాధము చేసినవారౌతారు. (పద్మ పురాణం బ్రహ్మ ఖండం 25.15-18)
అపరాధములముందు చెప్పిన వాక్యముకు “శ్రీ హరియందు అపరాధము తలపెట్టినవారు రెండుకాళ్ళ పశువుతో సమానం. అలాంటి వ్యక్తికూడా ఎప్పుడైనా శ్రీ హరి నామాన్ని శరణు తీసుకొంటే ఆ వ్యక్తి సర్వాపరాధాలనుండి విముక్తి పొందుతాడు.” సంబంధించి విష్ణు యామల తంత్రములో ఈ క్రింద చెప్పిన విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి:
ఈ లోకంలో నా నామము శ్రద్ధతో ఎవరైతే జపిస్తారో వారి కోటానుకోట్ల అపరాధములను సైతం నేను క్షమిస్తాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
వ్యాఖ్యానం
నామ కీర్తన ప్రాముఖ్యత వివరించిన తర్వాత శ్రీ జీవ గోస్వామి పద్మ పురాణంలో ఉన్న పది అపరాధములు చేయకుండా నామ జపము చేయాలని నొక్కి వక్కాణించారు. ఒక నిజమైన సాధకుడికి, పైన చెప్పిన అపరాధములు తెలుసుకొని వాటిని నివారించడం చాలా ముఖ్యం, ఎందుకంటే సూర్యుని అడ్డగించే కారుమబ్బులు వలె అవి నామ శక్తికి అవరోధము కలిగిస్తాయి.
భాగవత పురాణం 6.2.10(262వ అనుచ్ఛేదము)లో భగవంతుని నామము ఉచ్చరించినవారు భగవంతుని దృష్టిని ఆకర్షిస్తారని చెప్పబడింది. ఈ విషయంలో శ్రీధర స్వామి ఇలా వ్యాఖ్యానిస్తారు: “ఇదం ఏవ సునిష్కృతం అంటే ‘ఇది(భగవన్నామ ఉచ్చారణ) ఉత్తమమైన ప్రాయశ్చితం(శ్రేష్ఠమ్ ప్రాయశ్చితమ్)‘. దీనికిగల కారణం విష్ణువు నామాన్ని ఒక వ్యక్తి పలికినప్పుడు, ఆ వ్యక్తిపై(నామోచ్చారక పురుష) విష్ణువుయొక్క తలఁపు(మతి) మరలించబడుతుంది(తద్ విషయా), మరియు విష్ణువు ‘ఈ వ్యక్తి నా స్వంతం(మదీయ), తద్వారా ఇతనిని నేను అన్నిరకాలుగా రక్షించాలి‘ అని భావిస్తాడు.”
కానీ, ఎవరైనా నామాపరాధము చేస్తే, భగవంతునికి అసహ్యము కలుగుతుంది. భగవంతుడిపై అపరాధాము చేసినా కూడా అపరాధి తన నామము జపించిన వెంటనే దానిని క్షమిస్తాడు, కానీ నామముపైనే అపరాధము చేసినచో ఆ ఉల్లంఘనకు పరిహారం లేదా ప్రాయశ్చిత్తం లేదు. ఒక మందును నిర్దిష్ట పద్ధతిలో తీసుకోకపోతే అదే మందు చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది, అది రోగిని అంతమొందించగలదు కూడా. అలానే, నామము పరమ ప్రయోజనకరమైన ప్రేమను సాధకునికి ఇస్తుంది, కానీ అది అపరాధానికి గురైతే అది వ్యక్తియొక్క అభ్యంతరకరమైన వైఖరిని కూడా తీవ్రంగా చేస్తుంది. అందుకని, నామము మహిమ తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, దానికంటే నామముయందు చేయదగని అపరాధములను తెలుసుకోవడం ఇంకా ముఖ్యం. ఆయుర్వేదంలో ఒక ఔషధము సరిగా పనిచేయాలంటే, రోగి దానిని నిర్దిష్ట మోతాదులో తీసుకోవడంతోపాటు పథ్యము కూడా అనుసరించాలి. అలానే, భగవన్నామము ఫలప్రదము కావాలంటే దానిని జపించేప్పుడు ఈ అనుచ్ఛేదములో చెప్పిన అపరాధములను చేయకుండా ఉండాలి.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.