బృందావనం మారుతోంది

GeneralComments Off on బృందావనం మారుతోంది

ప్రతి విషయంలో మార్పు జరుగుతున్నట్లుగానే బృందావనములో కూడా మార్పు జరుగుతోంది. మార్పు ఎల్లప్పుడూ జరుగుతుంది.అది మన శరీర కణాలలో కావచ్చు, మన ఆలోచనలలో కావచ్చు లేదా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో అయినా కావచ్చు. మార్పు అనేది వ్యక్తమైన వస్తువుల స్వభావిక లక్షణం. ఈ మార్పులను గమనించే వ్యక్తి మాత్రమే తిరిగే చక్రములో కేంద్ర బిందువులాగా స్థిరంగా ఉంటాడు.

ఏదేమైనా, “బృందావనంలో మార్పులు మంచి లేదా చెడ్డవా?” అని మనకు మనం ప్రశ్నించుకోవాలి.

దీనికి ముందు, “మంచి” లేదా “చెడు” అంటే ఏమిటో స్పష్ట పరుచు కోవాలి. ఈ ప్రపంచంలో సంపూర్ణ మంచి లేదా సంపూర్ణ చెడు వంటివి ఏవీ లేవని కృష్ణుడు ఉద్ధవునికి చెప్పాడు. ప్రతి మంచి దానిలో ఏదో చెడు ఉంటుంది, అలానే ప్రతి చెడు దానిలో కూడా మంచి ఉంటుంది. ఉదాహరణకు, మనం చిన్నతనంలో పెద్దవారిగా ఉండాలని కోరుకుంటాము, కానీ పెద్దయ్యాక చిన్నతనంలోకి తిరిగి వెళ్లాలనుకుంటాము. మరొక ఉదాహరణ మరణం. మనం చనిపోవాలనుకోవడం లేదు, కానీ మరణములో కూడా కొంత మంచి ఉంది, అదియేమిటంటే మనకు మరణము తరువాత కొత్త శరీరం లభిస్తుంది, మరియు మళ్ళీ చిన్నతనములోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది . అందువలన, ప్రతి విషయములో మంచి మరియు చెడు రెండూ ఉంటాయి .

మనం చూసే విధానాన్ని బట్టి మనం ఏది మంచో, ఏది చెడో గ్రహిస్తాము. ఉత్తమమైన విధానం ఏమిటంటే మంచి మరియు చెడు రెండింటినీ తెలుసుకోవడం, ఇది ఈ రెండు స్థితులను దాటి “సంపూర్ణ మంచి” స్థితిని చేరుకోవడానికి దోహదపడుతుంది. ఈ స్థితి “మంచి” మరియు “చెడు” అనుభవాలకు అతీతమైన స్థితి (గుణ దోష దృషిర్ దోషో గుణస్థు ఉభయ వర్జితః ,శ్రీ భాగవతము 11.19.45).

బృందావనము అంశానికి తిరిగి వెళదాము . ఇక్కడ జరుగుతున్న మార్పులను మనం ఇష్టపడకపోవచ్చు, కానీ ఇందులో మంచి ఉన్నది : ఎందుకంటే ఎక్కువ మంది సందర్శకులు ఇక్కడకు వస్తున్నారు కాబట్టి ఈ మార్పులు జరుగుతున్నాయి – ఇది మంచిది!

ఈ సందర్శకులే లేకుంటే బృందావనం ఇంత మార్పు చెందేదికాదు. ఈ ఆకస్మిక మార్పు, ప్రత్యేకించి పూర్తిగా క్రొత్త జనాభా అయిన సంపన్నులైన పాశ్చాత్యుల వలన మరియు వారి అలవాట్లకు తగినట్లు సౌకర్యాలు, దుకాణాలు, అపార్టుమెంట్లు, విద్యుత్, రోడ్లు, రవాణా మొదలైనవి రావడము వల్ల జరిగింది .

ఈ ప్రజా ప్రవాహం ఇక్కడ నివసించే మనుషులకు మరియు జంతువులకు రద్దీ, కాలుష్యం మరియు అసౌకర్యానికి కారణమవుతూ చెడ్డదిగా అనిపిస్తుంది. కానీ ఈ ప్రజలు ఇక్కడకు ఎందుకు వస్తున్నారనంటే సుమారు 500 సంవత్సరాల క్రితం శ్రీ చైతన్య మహాప్రభు ఇక్కడకు వచ్చారు కాబట్టి. ఈ మార్పు ఆయనతో ప్రారంభమైంది. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు దేవాలయాలు లేవు. ఇదంతా అడవి. ఆయన తన అనుచరులైన లోకనాథ్ గోస్వామి, భూగర్భ గోస్వామి, సనాతన గోస్వామి మరియు రూప గోస్వామిని ఇక్కడకు పంపి దేవాలయాలను నిర్మించమని, కృష్ణుని యొక్క లీలా స్థలాలను వెలికి తీయమని కోరాడు. ఎవరూ రాకుండా ఉండటానికి అయితే చైతన్య మహా ప్రభు దేవాలయాలు ఎందుకు నిర్మించాలని అంటారు ? ఇది ఆయనకు వచ్చిన చెడ్డ ఆలోచనా ? లేక పోతే, ఇప్పుడు జరుగుతున్న మార్పు దాని ఫలితం కనుక, బృందావనంలో ప్రస్తుత మార్పులు పూర్తిగా చెడ్డవా ? ప్రజలు బృందావనాన్ని సందర్శించి, కృష్ణుని భక్తులు కావాలని శ్రీ చైతన్య మహాప్రభు కోరుకున్నారు, ఇప్పుడు అది పెద్ద ఎత్తున జరుగుతోంది. మనం దీనిపై ఫిర్యాదు చేయాలా?

ప్రతి భౌతిక స్థితి పునరావృతం అవుతుందని ఇక్కడ మనము గమనించాలి. బృందావనము ఇప్పటి నుండి వెయ్యి సంవత్సరాలు తర్వాత ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? ఇది చాలా రద్దీగా ఉంటే, ప్రజలు రావడం మానేస్తారు మరియు అప్పుడు ప్రవాహం మందగించడం ప్రారంభమవుతుంది. ఎక్కువ మంది ఉన్నప్పుడు, అవినీతి పెరుగుతుంది, సమస్యలు పెరుగుతాయి మరియు చివరికి ప్రజలు రావడం ఆగిపోతుంది. మార్పు మరింత మార్పును తెస్తుంది. కృష్ణుని సమయంలో, ఇది ఒక అడవి, ఇప్పుడు ఇది కేవలం భవనాలు. కాబట్టి ఈ “చెడు” మార్పు మరొక , “మంచి” మార్పుకు దారితీస్తుంది, మరియు అది మళ్ళీ అడవిగా మారుతుందా?

అలాగే, ప్రకృతిలో సంభవించే ప్రతిదీ లోతైన తత్వ నిరూపణను తెలుపుతుందని గ్రహించాలి. ఉదాహరణకు, మన శరీరం మారుతూ ఉంటుంది కానీ లోపలున్న వ్యక్తి మారడు. అదేవిధంగా, ఒక అంతర్గత బృందావనం ఉంది, అది మారదు. ఆ అంతర్గత బృందావనముపై మనం ధ్యానం, ఏకాగ్రత మరియు ఆలోచన ఉంచాలి. ఎందుకంటే ఆ మార్పులేని బృందావనం నిజమైనది. శరీరం వలె బయటి బృందావనం ఎప్పుడూ మారుతుంది. దీన్ని ఎవరూ ఆపలేరు.

అంతర్గత బృందావనం గురించి ఆలోచించటానికి మనం అది ఏమిటనే సాధారణ విషయం తెలుసుకొనే ప్రయత్నం చేయాలి .

అది ఒక ప్రదేశం. వివిధ రకాలైన అనుభవాలకు వివిధ రకాల స్థలాలు అనువైనవి. అందుకే మనకు వేర్వేరు దేశాలు ఉన్నాయి, వివిధ నైట్‌క్లబ్‌లు, దేవాలయాలు, పార్కులు, ఆట స్థలాలు మరియు మొదలైనవి ఉన్నాయి. అయితే, “బృందావనము ” అని పిలువబడే స్థలం ద్వారా ప్రత్యేకంగా చెప్పబడే అనుభవం ఏమిటి? బృందావనం ప్రేమకు స్థలం.

దీని గొప్పతనాన్ని మనం గుర్తుంచుకోవాలి. బృందావనము కంటే చాలా అందమైన, అద్భుతమైన మరియు ప్రశాంతమైన చాలా ప్రదేశాలను మీరు కనుగొనవచ్చు, కానీ ఇక్కడ లభించే నిధి మొత్తం విశ్వంలో మరెక్కడా అందుబాటులో లేదు. కృష్ణుడు ఈ జగత్తులో అవతరించినప్పుడు ఇక్కడ నివసించాడు, మరియు ఇప్పుడు అతను అంతర్ధానము అయినప్పటికీ ఇంకా ఇక్కడి అంతర్ బృందావనంలో ఉన్నాడు. చాలా మంది, అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన భక్తులు కూడా ఇక్కడ నివసించారు. సరైన మనస్తత్వం ఉంటే వారి శక్తిని, ఆ భావాలను అనుభవించవచ్చు.

కొంతమంది సహజంగా ప్రేమ శక్తికి అనుకులమూగా ఉండే హృదయం మరియు మనస్తత్వం కలిగి ఉంటారు. వారు ఇక్కడకు వచ్చినప్పుడు, వారు స్వయంచాలకంగా ఆ అనుభూతికి లోనవుతారు. మనము దానికి లోనుకాకపోతే , ఆ అనుకూల్యమైన స్వభావాన్ని మనకు ప్రసాదించమని కృష్ణుని ప్రార్థించాలి.

“ప్రేమ” అంటే ఏమిటి”?

మన “ప్రేమపూర్వక సంబంధాలను” లోతుగా మరియు నిజాయితీగా విశ్లేషిస్తే, మనలో చాలా మంది అవి ప్రాథమికంగా మన కోసమే నిర్వహించబడుతున్నాయని , మన ప్రియమైన వ్యక్తి కోసము కాదు అని ఒప్పు కోవాల్సినదే. కాబట్టి, మనం “ప్రేమ” అని పిలవబడేది ఖచ్చితంగా ప్రేమ కాదు. స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏమిటో బృందావనములోని కృష్ణుని లీలలు మనకు తెలియచేస్తాయి. అతని భక్తులు ఆయనను మాత్రమే కాక ఇతర భక్తులను కూడా ప్రేమిస్తారు. తన చుట్టూ ఉన్న ప్రజలు ఒకరినొకరు ఎలా ప్రేమిస్తారో కృష్ణ లీల చూపిస్తుంది. కృష్ణుని ప్రేమించడము వలన వారంతా ఒక పెద్ద కుటుంబములా ఉంటారు.

బృందావనం అంటే కృష్ణుడు నివసించి మరియు ప్రేమతో ఎలా జీవించాలో చూపించిన ప్రదేశం. ఇది మనకు నిజమైన, అంతర్గతమైన, మార్పులేని బృందావనమును అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

నిజమైన ఆనందం ప్రేమలోనే ఉంటుంది. జీవితములో నిజమైన ఆనందం మరేదీ లేదు. స్వచ్ఛమైన, నిశ్చయమైన ప్రేమ బృందావనంలోని కృష్ణునిలోనే లభిస్తుంది. ఇది మార్పు లేని అంతర్ బృందావనం యొక్క గొప్పదనం. బాహ్య బృందావనంలో మార్పు చెందు గుణము దీనితో గమనిస్తే అప్రధానమైనది.

Notify me of new articles

Comments are closed.

 • Satyanarayana Dasa

  Satyanarayana Dasa
 • Daily Bhakti Byte

  మనం దేనికోసం ప్రార్థించాలో కనీసం తెలుసుకోవాలి. ఇది మా ఏకైక ప్రార్థన అని మనం స్పష్టంగా చెప్పాలి – ‘కృష్ణ, నిన్ను ఎప్పటికీ మరచిపోనివ్వకు. నా మనస్సు ఎప్పుడూ మీపైనే స్థిరముగా ఉండనివ్వు. ’మనం నిద్రపోతున్నా, మేల్కొని ఉన్నా, తింటున్నా, మన మనస్సు ఎప్పుడూ కృష్ణుడిపైనే ఉండాలి, అది మన మానసిక స్థితి కావాలి.

  — Babaji Satyanarayana Dasa
 • Videos with Bababji

 • Payment

 • Subscribe

 • Article Archive

 • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.