బ్రహ్మానందం మరియు జ్ఞానం మనలో సహజసిద్ధముగా ఉన్నాయా?

Articles by Satyanarayana DasaPhilosophyComments Off on బ్రహ్మానందం మరియు జ్ఞానం మనలో సహజసిద్ధముగా ఉన్నాయా?

నేటితరం ఆధునిక ఆధ్యాత్మికవేత్తలలో, ఒక ప్రబలమైన కానీ సరైనది కాని భావన ఉంది. అది ఏమనగా “ప్రతి వ్యక్తి ఆనందం మరియు జ్ఞానంతో నిండి ఉంటారు”.  కానీ ఇది సరికాదు. అలా వారు ఊహించటం వల్ల ప్రతి ఒక్కరూ పరిపూర్ణులు, కేవలం తమ వాస్తవ స్వభావాన్ని కనుగొనడం మాత్రమే చేయవలసిన పని అని ప్రగాడంగా నమ్ముతారు. ఆత్మ అనేది భగవంతుని అంశ, ఈ విషయం శ్రీ కృష్ణుడిచే భగవద్గీతలో “ఈ లోకంలో జీవిస్తున్న నా శాశ్వతమైన భాగం” (భ.గీ 15.7) ధృవీకరించబడినది. సముద్రంలో ఒక చుక్క నీటి బిందువు సముద్రము యొక్క గుణాలను కలిగి ఉన్నట్లే, ప్రతి జీవి భగవంతుని ఆనంద జ్ఞాన గుణాలని కలిగి ఉంటుంది. ఏదో ఒకవిధంగా ఆనందం మరియు జ్ఞానం అజ్ఞానంతో కప్పబడి ఉంటాయి, కాని ఒకసారి అజ్ఞానం తొలగించబడితే, ఆత్మ దాని స్వంత తేజస్సుతో ప్రకాశిస్తూ భగవంతుడిలా అగుపిస్తుంది.

ముణ్ఢకోపనిషత్తు(3.2.9)లో చెప్పినట్లుగా “బ్రహ్మము తెలుసుకున్న వాడు బ్రహ్మమే అగుచున్నాడు”. వాస్తవానికి, కొంతమంది ఆధ్యాత్మిక గురువులు మనమందరం దేవుడు అని, కానీ దానిని మరచిపోయాము అని బోధిస్తారు. ఒక యువరాజు తాను యువరాజునని తెలియక అరణ్యంలో దారితప్పి, బాధల్లో తిరుగుతున్నట్లు మనము కూడా ఉన్నామని వారి అభిప్రాయం. అతను యువరాజు అని తెలుసుకున్న తర్వాత, అతను తన ఇంటికి తిరిగి వెళ్లవచ్చు, దానితో అతని బాధలు తీరిపోతాయి. లేదా ఒక వ్యక్తి బంగారు హారము శరీరంపై ధరించి, అది తెలియక ప్రతిచోటా దాని కోసం వెతుకుతున్నట్లు, మనము ఉన్నాముమ. ఎవరైనా హారము తన మీద ఉంది అని చెప్పినవెంటనే ఇక వెతకడం ఆపేస్తాడు. హారము ఎల్లప్పుడూ ఉంది, కానీ వ్యక్తికి దాని గురించి తెలియదు.

అజ్ఞానముతో కప్పబడిన జ్ఞానము

ఇదే విధమైన మరో అపనమ్మకం ఏమిటంటే, మనం పరిపూర్ణంగా ఉన్నాము, కాని అజ్ఞానం వలన, మనల్ని మనం పరిమితంగా మరియు షరతులకు లోబడినట్లుగా భావిస్తాము అని. భగవద్గీత(5.15) లో శ్రీ కృష్ణుడు, “జ్ఞానం అజ్ఞానంతో కప్పబడి ఉంటుంది, అది జీవులను కలవరపెడుతుంది.” అని చెప్పెను. అజ్ఞానం తొలగిపోతే, ఆత్మ స్వయంగా దాని స్వంత  మహిమతో ప్రకాశిస్తుంది. సూర్యుడిని ఒక మేఘం కప్పినప్పుడు, చీకటి ఉంది, కానీ గాలి మేఘాన్ని  తరిమివేసినప్పుడు, సూర్యరశ్మి ప్రసరిస్తుంది. సూర్యుడు కప్పబడినప్పుడు తన ప్రకాశాన్ని కోల్పోలేదు. అదేవిధంగా, ఆత్మ యొక్క జ్ఞానం మరియు ఆనందం అజ్ఞానం ద్వారా కప్పబడి ఉంటాయి, అజ్ఞానం తొలగించబడినప్పుడు, స్వీయ(ఆత్మ) దాని స్వంత ఆనందం మరియు జ్ఞానాన్ని గ్రహిస్తుంది. ఐతే, జ్ఞానం అంతా మనలోనే ఉన్నందున గురువులు లేదా ఉపాధ్యాయుల అవసరం లేదని కొందరు వాదిస్తున్నారు.

ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన చరిత్ర, అనుభవాలు మరియు సంస్కారములు ఉంటాయి. ఒకరికి వర్తించేది, ప్రయోజనకరమైనది మరొకరికి హానికరం కావచ్చు. నిజానికి, ఒక మనిషి యొక్క ఆహారం మరొకరికి విషం కాగలదు. ఒకరు నిలబడి ఉన్న ప్రదేశం నుండి నడవాలి. లక్ష్యం ఒకటే, కానీ మార్గాలు చాలా ఉన్నాయి. మరొకరి అభ్యాసాన్ని అనుకరించడానికి ఎవరూ ప్రయత్నించకూడదు, ఎందుకంటే అది అతనికి సరిపోదు. కాని ఈ సిద్ధాంతలను సమర్ధించే కొంతమంది శాస్త్రాలను కూడా దూషిస్తారు. శాస్త్రమనేది చనిపోయిన ప్రజల నిర్జీవ పదాలు అని వారు అంటారు. వారి దృష్టిలో  శాస్త్ర గ్రంధాలు నియమాలను విధించడం ద్వారా మన స్వేచ్ఛను పరిమితం చేస్తున్నాయి.

ఇవి ఆధునిక ఆధ్యాత్మికవేత్తలలో తేలియాడే కొన్ని ప్రసిద్ధ ఆలోచనలు. ఇటువంటి సిద్ధాంతాలు సాధారణ సాంప్రదాయ మరియు వ్యవస్థీకృత ఆధ్యాత్మిక తత్వాలకు విరుద్ధం. మొదట, అవి చాలా తార్కికంగా మరియు నమ్మకంగా అనిపించవచ్చు, కానీ సరైన తర్కం మరియు చతురతతో పరిశీలించినప్పుడు, అవి కాగితపు మేడ లాగా కూలిపోతాయి. ఈ ఆలోచనలన్నింటినీ శాస్త్రయుక్తమైన  సునిశిత పరిశీలనతో ఖచ్చితముగా ఖండించవచ్చు.

చీకటి ఎప్పుడూ వెలుగుని కప్పి ఉంచలేదు

ఆత్మ, జ్ఞానం మరియు ఆనందంతో నిండి ఉంటే, ఎందుకు దీనిని ఎప్పుడూ అనుభవించదు? జ్ఞానం మరియు ఆనందం కోసం మనము ఎందుకు నిరంతరాయంగా కొట్టుమిట్టాడుతున్నాము? వాస్తవానికి, మన చర్యలన్నీ అంతిమంగా ఈ రెండు లక్ష్యాలను సాధించడానికే. చీకటి ఎప్పుడూ కాంతిని కప్పి ఉంచలేనట్లే, అజ్ఞానం జ్ఞానాన్ని ఎప్పటికీ కప్పి ఉంచదు. చీకటి అనేది కాంతి లేకపోవడం తప్ప మరొకటి కాదు. ఇది నిజ వస్తువు కాదు. ఒక వస్తువు లేక పదార్థమును కప్పిపుచ్చు సాధకం సానుకూల ఉనికి కలిగి ఉండాలి. అజ్ఞానం జ్ఞానాన్ని కప్పివేస్తుందని శ్రీ కృష్ణుడు భగవద్గీత(5.15)లో  చెప్పినప్పుడు, దాని అర్థం అజ్ఞానం విచక్షణ చేసే సూక్ష్మబుద్ధిని కప్పుచున్నదని. మరో మాటలో చెప్పాలంటే, ఒక వ్యక్తి సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కోల్పోతాడు మరియు తద్వారా విస్మయం చెందుతాడు. కృష్ణుడే స్వయంగా ఒక గురువును సంప్రదించి అతని నుండి జ్ఞానాన్ని పొందమని భగద్గీత(4.34)లో సిఫారసు చేసాడు.

జ్ఞానం ఆత్మ లోపల ఉంటే, స్వాభావిక జ్ఞానం యొక్క కవచాన్ని తొలగించడానికి కృష్ణుడు ఒక గురువును సంప్రదించమని సిఫారసు చేసేవాడు. నిజానికి, అతను ఒక గురువు వద్దకు వెళ్ళమని సిఫారసు చేయకుండా, అజ్ఞానమను కప్పు తీసే ఒక తోలు ఒలిచే పరికరం ఉపయోగించమని చెప్పేవాడు. ఆయన ప్రత్యేకంగా “ఉపాధ్యాయులు మీకు జ్ఞానాన్ని ఇస్తారు” అనే పదాలను ఉపయోగించాడు. అదే పంథాలో కొన్ని శ్లోకాల తరువాత (4.39), విశ్వాసం ఉన్న వ్యక్తి జ్ఞానం సాధించి  శాంతియుతంగా ఉంటాడని ఆయన చెప్పాడు. ఆ జ్ఞానం అప్పటికే ఉంటే, దాన్ని మరలా పొందాల్సిన అవసరం లేదు. భగవద్గీత(7.2)లో మళ్ళీ, కృష్ణుడు ఈ జ్ఞానాన్ని అర్జునుడికి ఇస్తానని తెలిపాడు.

మనస్సు లేదా తర్కముచే గ్రహించలేనిది

ఆత్మ భౌతిక జగత్తునకు పరమైనది కావుట వలన అది ఇంద్రియములకు లేదా మనస్సుకు గోచరించదు. ఇది తర్కానికి లోబడి ఉండదు. శాస్త్రాల ద్వారానే దీనిని అర్థం చేసుకోగలము.  శ్రీ కృష్ణుడు ఆత్మను అచింత్యమైనదిగా మనస్సు లేదా తర్కం ద్వారా గ్రహించలేనిదిగా వర్ణిస్తాడు(భ.గీ 2.25). భీష్ముడు (మహాభారతం, భీష్మ పర్వము 5.12)లో “ఏది అచింత్యమో అది తర్కముతో గ్రహింపబడదు. తత్వ విచార సంబంధమైన వాటిని తర్కం ద్వారా అర్థం చేసుకోలేము.” అంటాడు. సూర్యుడు ఇతరులకు మేఘాలతో కప్పబడి ఉండవచ్చు, కానీ అది తనకు తాను కప్పబడి ఉండదు. అదేవిధంగా, నేను ఆనందం మరియు జ్ఞానంతో నిండి ఉంటే, అవి అజ్ఞానంతో కప్పబడి ఉన్నప్పటికీ నేను వాటి దృష్టిని ఎలా కోల్పోతాను? అజ్ఞానం జ్ఞానాన్ని మాత్రమే కప్పుతుంది, కాని నానుంచి జ్ఞానాన్ని తీసివేయలేదు. నా చుట్టూ అజ్ఞానం ఉన్నప్పటికీ, నేను ఇంకా జ్ఞానం మరియు ఆనందంతో నిండి ఉండాలి. కానీ మన అనుభవం దీనికి భిన్నంగా ఉంటుంది.

సముద్రంలో ఒక చుక్కకు సముద్రం యొక్క అన్ని లక్షణాలు ఉండవు. సముద్రంలో తరంగాలు ఉన్నాయి, ఒక చుక్కలో లేవు. సముద్రం జలచరాలతో నిండి ఉంది, కానీ చుక్కలో అవి ఉండవు. సముద్రంలో ఒక వ్యక్తి ప్రయాణించవచ్చు కానీ ఒక చుక్క మీద చేయలేరు. నా మెడ చుట్టూ ఉన్న నా హారము గురించి నేను మరచిపోయి, దాన్ని ఎవరైనా నాకు ఎత్తి చూపిస్తే, నేను వెంటనే దానిని తెలుసుకుని, వెతకడం ఆపేస్తాను. కానీ, నేను జ్ఞానం మరియు ఆనందంతో నిండి ఉన్నానని ఎవరైనా ఎన్నిసార్లు చెప్పినా, నేను ఆనందాన్ని పొందను మరియు మునుపటివలె అజ్ఞానముతో లేక పూర్వము ఉన్న జ్ఞానముతోనే ఉంటాను. ఎందుకు? ఎందుకంటే నాలో అంతర్లీనంగా జ్ఞానం మరియు ఆనందం లేవు. ఇటువంటి ఉదాహరణలు దేనినీ నిరూపించవు లేదా ఖండిచవు. తెలిసిన సిద్ధాంతమును అర్థం చేసుకోవదానికి మాత్రమే ఉదాహరణలు మనకు సహాయపడతాయి.

నేను ఒక బీదవాడిని అయితే, నేను యువరాజు అని ఎవరైనా పదేపదే చెప్పినప్పటికీ, నేను బీదవాడిగానే ఉంటాను. శ్రీ జీవ గోస్వామి పరమాత్మ సందర్భము 28వ అనుచ్ఛేదములో స్వభావంతో స్పృహలో ఉన్నప్పటికీ ఆత్మలో జ్ఞానం లేదని, భౌతిక కష్టాలు ఆత్మలో ఉండవని, అలాగే ఆనందం కూడా లేదని స్పష్టంగా చెప్పారు. మరో మాటలో చెప్పాలంటే, జ్ఞానం మరియు ఆనందాన్ని పొందగల సామర్థ్యం (స్వరూప యోగ్యత) ఉన్నాయి, కానీ కార్యాచరణ లేదు (ఫలోపధాయ యోగ్యత). ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక బాలుడు క్రీడాకారుడు లేదా పట్టభద్రుడు అయ్యే అవకాశం ఉంది, కానీ అతను మైదానములో సాధన చేస్తే లేదా విద్యాలయానికి వెళ్లి చదువుకుంటే తప్ప ఆ సామర్థ్యం గ్రహించబడదు.

భగవంతుని శక్తుల్లో ఒకటి మాత్రమే

ఈ రెండింటి కోసం మనకు సహజమైన ప్రేరణ ఎందుకు ఉందో దీన్ని బట్టి అర్థమౌతుంది. ఒక శిశువు పుట్టినప్పటి నుండి జిజ్ఞాసతో ఉంటాడు, మరియు ఈ జిజ్ఞాస మరణం వరకు కొనసాగుతుంది. ఆత్మ దేవునిలో భాగమే అయినప్పటికీ, అది అతని శక్తిలో ఒక భాగం మాత్రమే, అనగా, అతని మధ్యంతర శక్తి, లేదా తటస్థ శక్తి. ఇది ఇతర రెండు శక్తులని(బహిరంగ శక్తి మరియు అంతరంగ శక్తి) కలిగి లేదు. బ్రహ్మము తెలిసినవాడు బ్రహ్మము అవుతాడని చెప్పినప్పుడు, అతను బ్రహ్మములాగా అవుతాడని అర్థం. అతను బ్రహ్మములోని కొన్ని లక్షణాలను(సధర్మ్య) పొందుతాడు (భ.గీ 14.2). ఎవరూ బ్రహ్మంగా మారలేరు. ఆత్మ పరిమాణంలో అతిసూక్ష్మమైనది మరియు దానిలో అంతరంగ శక్తిని కలిగి ఉండదు, అందువల్ల ఇది బహిరంగ లేదా అంతరంగ శక్తులచే ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత స్థితిలో ఇది బహిరంగ శక్తి ప్రభావంతో ఉంది

ఈ ప్రభావం మాయ అని పిలువబడే దేవుని అగోచరమైన శక్తి ద్వారా ప్రభావితమవుతుంది. మాయా శక్తి భగవంతునకు చెందినది మరియు ఈ కారణంగా భగవంతుడు లేదా అతని భక్తుని దయ ద్వారా మాత్రమే మాయ ప్రభావంనుండి జీవుడు విముక్తుడౌతాడు. ఈ ప్రభావం నుండి విముక్తి పొందిన తరువాత కూడా, ఆత్మ భగవంతుడిగా మారదు, దేవుని అంశముగానే ఉంటుంది- కానీ అప్పుడు అది జ్ఞానం మరియు ఆనందాన్ని కలిగి ఉంటుంది.

English Translation for reference:

Are Bliss and Knowledge Inherent?

https://www.jiva.org/are-bliss-and-knowledge-inherent/ 

Notify me of new articles

Comments are closed.

 • Satyanarayana Dasa

  Satyanarayana Dasa
 • Daily Bhakti Byte

  సత్త్వము, రజస్సు మరియు తమస్సు ఒకదానికొకటి పోటీ అయినాకూడా అవి కలిసి ఉండి కలిసి పనిచేస్తాయి. సహకారభావంతో ఎలా ఉండాలో మనకు చెప్పే ఒక మంచి ఉదాహరణ.

  — Babaji Satyanarayana Dasa
 • Videos with Bababji

 • Payment

 • Subscribe

 • Article Archive

 • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.