భాగవత పురాణంలో శ్రీ రాధా రాణి

Articles by Satyanarayana DasaComments Off on భాగవత పురాణంలో శ్రీ రాధా రాణి

ప్రశ్న : రాధా రాణి పేరు భాగవత పురాణంలో ఎందుకు ప్రస్తావించలేదు?

జవాబు: ఇది ఒక నిగూఢ రహస్యం. శ్రీమద్ భాగవతం ప్రధానముగా శ్రీకృష్ణుని గూర్చిన గ్రంథం. శ్రీ కృష్ణుని లీలను ఇంత విశాలముగా ఏ గ్రంథము కూడా వివరించదు. భాగవతములోని 335 అధ్యాయములలో దశమ స్కంధం  ఒక్కదానిలోనే  శ్రీకృష్ణుని గురించి చెప్పే అధ్యాయాలు 90 ఉన్నాయి. ఏకాదశ అధ్యాయములోని  31 అధ్యాయములు కృష్ణుని గూర్చినవి లేదా ఆయన మాట్లాడినవి. అలానే ప్రథమ స్కంధములోని 18 అధ్యాయములు కృష్ణునికి ప్రత్యక్షముగా లేక పరోక్షముగా సంబంధించినవే. అలానే  సప్తమ స్కంధములోని నారద మునీంద్రుడు మరియు యుధిష్టర మహారాజు సంవాదములో కృష్ణుని గూర్చి ప్రస్తావన ఉంటుంది, నవమ స్కంధములో యదు వంశ సామ్రాజ్యము గూర్చిన వివరణలో  కూడా కృష్ణుడు గూర్చి ప్రస్తావన ఉంటుంది . ఆ విధముగా శ్రీమద్ భాగవతములో 45 శాతం కృష్ణుడి గూర్చే ఉంటుంది. రాధ శ్రీకృష్ణుని హ్లాదిని శక్తి స్వరూపిణి. అందువల్ల ఆమె శ్రీకృష్ణుని నుండి ఎప్పుడూ విడచి ఉండదు. ఎందుకంటే శక్తి మరియు శక్తిమంతుడు వేరు చేయలేని వారు కనుక. కృష్ణుడు రాధ కన్నా వేరైన వాడు కాదు అలానే రాధ కృష్ణుని కన్నా వేరైనది కాదు, కానీ లీల కోసం వారివురు వేరవుతారు. అందుచేత కృష్ణుని ప్రస్తావన అంటే అది రాధ ప్రస్తావన కూడా. కానీ, ఆశ్చర్యముగా శ్రీ రాధా రాణి పేరు ఒక్కసారి కూడా ప్రస్తావించబడలేదు.

భాగవతం చెప్పిన వారు తన పూర్వ జన్మలో శ్రీ రాధా రాణి రాజ భవనంలోని రామ చిలుక అని, అందుచేత ఆమె అంటే ఎంతో అనురాగంతో ఉండే వాడని అనే నానుడి సాధారణంగా వింటుంటాము. భాగవత ప్రవచకుడుగా ఆయన రాధారాణి పేరు ఉచ్చరించలేదు ఎందుకంటే కేవలం ఆమె పేరు పలకటం మాత్రం చేత ఆయన ఆరు నెలలు సమాధి స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంది. పరీక్షిత్ మహారాజుకు బ్రతకడానికి కేవలం ఏడు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. శుకదేవ గోస్వామికి ఇది తెలుసు మరియు అందుకే అతను మొత్తం భాగవతం ఆ సమయంలోనే వినేలా చేసాడు. దానికి తగ్గట్లుగానే ఎక్కడా ప్రత్యక్షముగా గానీ లేక పరోక్షంగా గానీ రాధా రాణి పేరు ప్రస్తావించలేదు. దీన్ని గూర్చి చెప్పే ఒక అజ్ఞాత శ్లోకము ఉంది. 

శ్రీ రాధా నామ మాత్రేమూర్ఛా షాణ్మాసికీ భవేత్

నొచ్చారితమ్ అతః స్పష్టం ప్రీక్షిద్ హిత్కృన్ మునిః

“అయితే కొందరు శుకదేవ గోస్వాముల వారి గురువు రాధా రాణి అని, స్మృతి శాస్త్రము ప్రకారం, తన గురువు నామాన్ని శిష్యుడు ఉచ్చరించరాదని చెప్తారు. అందుచేత ఆయన ఆ ఆమె నామాన్ని పరోక్షంగా ప్రస్తావించడం జరిగింది.”

రాధా రాణి పేరు ప్రస్తావించకపోవడం అనేది రస దృష్టిలో కూడా అర్ధం చేసుకోదగ్గది. శ్రీమద్ భాగవతం మొదట్లో ( 1.1.3) వ్యాసుల వారు రసజ్ఞులను వారి జీవిత కాలం ఈ భాగవత రసాన్ని త్రాగి ఆస్వాదించమని ఉటంకిస్తారు, పిబత భాగవతం రసమాలయం. ఈ రసాన్నిఆస్వాదించాలంటే కావాల్సిన అర్హత రసజ్ఞులకు ఉండాల్సిన స్థాయి భావం – సహృదయం లేక సామాజికం. స్థాయి భావం విభావం, అనుభావం, మరియు సంచారి భావములతో  కలిస్తే  రసమయగుతుంది- విభావనుభాసంచారి సంయోగాద్ రస నిష్పత్తిః. అందుచేత రసంలో ముఖ్యమైనది భావము. భావములన్నిటినిలోకి గొప్పది మహా భావం. శ్రీమతి రాధా రాణి మహా భావ స్వరూపిణి అంటే ఆమె స్వతః సిద్ధ స్థితి మహా భావము. ఆమె కృష్ణుని ప్రేమతో పరిపూర్ణమైనది.

శ్రీమద్ భాగవతం యొక్క ఉద్దేశ్యం రాధా రాణి పేరో లేక ఆమె రూపమో కాదు అది ఆమె  భావం అంటే ఆమె స్వరూపం మాత్రమే.  రాధా రాణి గూర్చి నిజముగా వివరించాలంటే ఆమె భావాన్ని వివరించాలి. అందుకే వ్యాసుల వారు ఆమె పేరును ప్రస్తావించలేదు. అంతేకాదు ఏ ఒక్క గోపిక పేరును కూడా ఆయన ప్రస్తావించలేదు. ఆయన పాఠకుడు  మొదట ఆ భావాన్ని అర్ధం చేసుకోవాలని కోరుకున్నారు. ఆయన ఈ భావం మీద నుంచి మనకున్న దృష్టిని మరల్చ దల్చలేదు. ఒక్క సారి భావం అర్ధమయినట్లయితే పాఠకుడు ఆ పేరును వెదక వచ్చు ఎందుకంటే అది పద్మ, బ్రహ్మ వైవర్త , బ్రహ్మాండ, నారద ,ఆది మొదలైన పురాణాలలో ఉన్నది కాబట్టి.

 ఆ భావాన్ని ఆధారముగా చేసుకొని మన ఆచార్యులు శ్రీ రాధను శ్రీమద్ భాగవతంలో వెదకి పట్టుకొన్నారు. ఉదాహరణకు  దశమ స్కంధం ఇరవై రెండవ అధ్యాయం లోని శ్లోకాలు 7 నుండి 18 వరకు వేణు గీతం అంటాము మరియు అవి కృష్ణుని పిల్లన గ్రోవిని ప్రశంసిస్తూ వివిధ గోపికలచే పాడబడినవి. శ్రీ విశ్వనాథ చక్రవర్తుల వారి ప్రకారం 17వ శ్లోకము రాధారాణిచే చెప్పపడింది. ఆ శ్లోకం ఇలా ఉంటుంది:

పూర్ణాః పుళిన్ద్య ఉరుగాయ పదాబ్జ రాగ శ్రీ కుంకుమేన దయితా స్తన మణ్డితేన

తద్ దర్శన స్మర  రుజస్తృణ రూషితేన లింపన్త్య ఆనన కుచేషు జహుస్తదాధిమ్

పుళింద స్త్రీలు పరిపూర్ణత చెందారు ఎందుకంటే వారు శ్రీ కృష్ణుని ప్రేయసి వక్షస్థలం పై కుంకుమ రంగు ఉండటాన్ని అది  ఆయన పాద చరణముల ఎర్రని రంగును పోలి ఉండటాన్ని మరియు ఆయన పాదములు సోకిన గడ్డి కూడా ఎర్రని రంగులోకి మారి ఉండటాన్ని చూసి ప్రేమోద్వేకంలో బాధను అనుభవించారు. అలానే వారు ఆ గడ్డిలో పొరలి తమ బాధ నుండి విముక్తి పొందారు ( శ్రీమద్ భాగవతం 10.21.17).

శ్రీవిశ్వనాథ చక్రవర్తుల వారు ఈ శ్లోకం గూర్చి చెప్తూ ఇది రాధా కృష్ణుల సన్నిహిత కలయిక గూర్చిRadharaniవివరిస్తుంది అంటారు ఎందుకంటే కేవలం రాధా రాణి పాదాలకు మాత్రమే ఒక వ్యక్తి పరోక్షముగా దగ్గరగా రావడం చేత వారిని  మాధుర్య ప్రేమకు, ప్రేమయొక్క ఏడవ స్థితియైన మాదన  భావములోనికి తీసుకు వెళ్ళ గల శక్తి ఉంది. శ్రీ రూప గోస్వాముల వారు ఉజ్వలనీలామణిలో ఈ శ్లోకాన్ని మాదన మహాభావానికి అనుభావముగా ఉదాహరణగా చూపుతారు. ఈ అనుభావ లక్షణమేమిటంటే రాధా రాణి శ్రీకృష్ణుని మాధుర్యాన్ని ఎల్లప్పుడూ అమితముగా ఇష్టపడినప్పటికీ , వేరొకరి వద్ద అటువంటి గంధ పరిమళాలు ఉంటే వారిని ప్రశంసించకుండా ఉండదు. అందువల్ల ఈ మహాభావం కేవలం ఆమె వద్దే సాధ్యం కాబట్టి ఖచ్చితముగా ఈ శ్లోకాన్ని ఆమె మాత్రమే పలికారు.

రాధా రాణి గూర్చి మరో సారి ప్రస్తావన శ్రీకృష్ణుని రాణులు ద్రౌపదిని కురుక్షేత్రంలో కలసినప్పుడు వారి మాటలలో వస్తుంది. వారు ఇలా  అన్నారు.

“ఓ పుణ్య స్త్రీ! మాకు ఈ ధరిత్రిలో సార్వభౌమాధికారంపై, స్వర్గాధిపత్యంపై లేక అచ్చటి భోగ భాగ్యములపై, అష్టసిద్ధులపై, బ్రహ్మ స్థానంపై , చివరికి ఆ శ్రీహరి ధామము పైన కూడా ఆసక్తిలేదు. మేము కోరేది  కేవలం ఆ శంఖ,చక్ర ధరుడు, శ్రీ వక్షస్థల కుంకుమ పరిమళములతో శోభిల్లేటి ఆ శ్రీకృష్ణుని పాద పద్మముల ధూళిని మా శిరస్సున ధరించడం మాత్రమే. ఆయన గోవులను కాస్తుండగా గోపికలు , గోపబాలురు, పుళింద స్త్రీలు, మరియు లతలు, పచ్చిక బయళ్లు అన్నీ ఆ పరమాత్ముని పాదస్పర్శకు తపించినట్లు మేము కూడా అదే విధముగా తపిస్తున్నాము.” (శ్రీమద్ భాగవతం 10.83.41-43)

ఈ శ్లోకాల  గూర్చి శ్రీ జీవ గోస్వాముల వారు  శ్రీ యొక్క భర్త పాదములు కుంకుమతో  నిండి Krishna and Radha looking into a mirror. అని  వ్రాసారు. ఇక్కడ శ్రీ అనే పదం రుక్మిణీ దేవి గూర్చి చెప్పినట్లైయితే అది ఆ రాణులకు లభించేదే ఎందుకంటే ఆమె కూడా వారితో పాటు ఉండే రాణి కూడా. అందువల్ల ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆ పాద ధూళి వేరే శ్రీ యొక్క కుంకుమ సుగంధముతో సంపన్నమైనది. ఆమె ఎవరనే విషయములో స్పష్టత ఇవ్వటానికి ఆ రాణులు ఆమెకు ఒక ప్రత్యేక గుర్తింపును ఇచ్చారు. ఆమె ఎవరంటే ఎవరి ధూళి  వ్రజ స్త్రీలచే కోరబండిందో ఆమె (వ్రజ స్త్రియో యద్ వాంఛన్తి). అందుచేత శ్రీకృష్ణుని రాణులు చెప్పిన శ్రీ మరెవ్వరో కాదు శ్రీ రాధా రాణియే. రుక్మిణి దేవి వ్రజము లో లేదు అలానే వ్రజ స్త్రీలకు ఆమె గూర్చి ఎటువంటి జ్ఞానం కానీ సంబంధంకానీ లేదు. ఇంకా చెప్పాలంటే నాగ పత్నులు భాగవతం 10.16.36 లో చెప్పినట్లు శ్రీ కృష్ణుని వ్రజ లీలలో పాలు పంచుకునేందుకు ఆమె తపస్సు కూడా చేసింది. మరోవిధంగా చెప్పాలంటే వ్రజవనితలు శ్రీ రుక్మిణి తో సంబంధం పెట్టుకొనేందుకు వెంపర్లాడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే శ్రీమద్ భాగవతం 10.47.60 లో చెప్పినట్లు ఆమె కన్నా వారు గొప్పవారు కనుక. 

శ్రీమతి రాధా రాణి గూర్చి ప్రస్తావన శ్రీమద్ భాగవతంలో మరొకసారి గోపికలు రాస నృత్యము తరువాత శ్రీకృష్ణుని వెదికే సమయంలో పలికే మిక్కిలి ప్రాచుర్యమైన శ్లోకాల సందర్భములో వస్తుంది. గోపికలు ఇలా అన్నారు : “ఆ పరమ శక్తివంతుడైన భగవానుడు గోవిందుడు ఖచ్చితముగా ఈమె చేత పరిపూర్ణంగా ఆరాధించబడ్డాడు. ఆయన ఆమెకు ప్రసన్నుడై, మనలను ఇలా వదలి తనతో ఏకాంత స్థలానికి వెళ్ళాడు” (శ్రీమద్ భాగవతం 10. 30.28).

ఈ శ్లోకం మొదటి పంక్తిలో  రాధారాణి శబ్ద అర్ధం వచ్చేలా అనయా ఆరాధితః  పదము చేర్చ పడింది. గోపికలు రాధారాణి గూర్చి ఈ క్రింద ఇవ్వబడిన ఇంకో రెండు శ్లోకాలలో చెప్పారు.

“ఓ  మిత్రమా, మగువ జింకా, నీ నయనాలకు ఆహ్లాదాన్ని ఒనరుస్తూ ఆ అచ్యుతుడు తన ప్రేయసితో ఇటు వేంచేసాడా? ఆయన ప్రేయసిని ఆలింగనం చేయగా ఆమె  వక్షస్థలంపైన ఉన్న కుంకుమచే  శోభితమై వెదజల్లుతున్న ఆ కుంద మాలల పరిమళాల వల్ల మేము ఈ విధముగా భావిస్తున్నాము.  

“ఓ వృక్షమములారా, ఆ బలరాముని సోదరుడు ఒక చేతిలో కమలాన్ని ధరించి, మరొక చేతిని తన ప్రేయసి భుజములపై వేసి, తన ప్రేయసితో ప్రేమ దోబుచులాటలు ఆడుతూ , ఆ తుమ్మెదల సమూహం ఆయన తులసీ మాల సౌరభములచే ఆకర్షణ గావించబడిన వేళ మీరు చేస్తున్న ప్రణానములకు ప్రేమ కటాక్షములతో బదులిచ్చేడా?” ( శ్రీమద్ భాగవతం 10. 30. 11-12). 

శ్రీకృష్ణుడు రాధతో రాసలీల వేళ అదృశ్యమైనప్పడు రాధ చాలా ప్రత్యేకముగా భావించింది మరియు తనను ఆయన భుజస్కంధాలపై ఎత్తుకోవాలని కోరింది. కృష్ణుడు దానికి సమ్మతించి క్రిందకు ఒంగాడు. ఎప్పుడైతే ఆమె ఆయన భుజాలపై ఎక్కడానికి ప్రయత్నించ సాగిందో ఆయన ఒక్కసారిగా అంతర్ధానం అయిపోయాడు. ఆయనను ఒక్కసారిగా చూడలేక ఆమె విరహ వేదన చెందింది. “ఓ నా ప్రభూ, నా ప్రియా, ఓ ఆజానుబాహుడా, నీవెక్కడ, నీవెక్కడ. నేను నీ విధేయ దాసిని. ఇక్కడ దయచేసి దర్శన మివ్వవా.”(శ్రీమద్ భాగవతం 10.30.40).

రాధా రాణి గూర్చి మరియొక ప్రస్తావన ఆమె తో శ్రీకృష్ణుడు తిరిగి రాసలీల వేళ యందు కలసినప్పుడు ఆమె మనస్సులోని భావాన్ని చెప్పే ఈ క్రింద చెప్పబడిన శ్లోకం రూపములో వస్తుంది.

“ఒక గోపిక, ప్రేమ వల్ల వచ్చిన కోపముతో అనేక ఓరచూపుల బాణాలతో తన కనుబొమ్మలను కుంచించి మరియు క్రింది పెదవి కొరుకుతూ కృష్ణుని సంహరించే విధముగా చూసింది”. ( శ్రీమద్ భాగవతం 10.32.6)

10.32.4 నుండి 10.32.8 శ్లోకములలో శ్రీ జీవ గోస్వాముల వారు ప్రధానమైన అష్ట గోపికలను వారి వారి భావాల ఆధారముగా గుర్తిస్తారు. ఇక్కడ మనం బాగా గుర్తించాల్సినది వేరు వేరు గోపికల భావము గూర్చిన వివరణ; ఎక్కడా వారి పేరు ప్రస్తావించబడలేదు.

భ్రమర గీతం శ్లోకాలు 10.47.12 నుండి 10.47.21 వరకు, శ్రీమతి రాధారాణి విరహ వేదనలో ఉండగా పాడినవి.

ఈ విధముగా, శ్రీమద్ భాగవతములో శ్రీమతి రాధారాణి పేరు ప్రస్తావించక పోయినప్పటికీ ఆమె తన భావం చేత ప్రస్తావించబడింది. అంతే కాదు ఆమె పలికిన పలుకులు భ్రమర గీతముగా మరియు కృష్ణుడు ఆమెను ఒంటరిగా వొదిలి వెళ్ళినపుడు పలుకులు రాస పంచాధ్యాయములుగా భాగవతంలో ఉన్నాయి.

Notify me of new articles

Comments are closed.

 • Satyanarayana Dasa

  Satyanarayana Dasa
 • Daily Bhakti Byte

  ప్రతిఒక్కరూ తమ ఆనందమును ఒక ప్యాకేజీగా బయటకు ప్రదర్శిస్తున్నారు, కానీ లోపల అసంతృప్తితో ఉన్నారు. మనము ఇతరుల బాహ్య ఆనందాల ప్యాకేజీలను చూసి అసూయ చెందుతున్నాము.

  — Babaji Satyanarayana Dasa
 • Videos with Bababji

 • Payment

 • Subscribe

 • Article Archive

 • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.