భారతీయ తత్వ దర్శనములు

GeneralComments Off on భారతీయ తత్వ దర్శనములు

భారతీయ నాగరికత ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది. వేలాది సంవత్సరాలుగా విదేశీ ఆక్రమణదారులు మరియు పాలకుల దాడికి గురైన తరువాత కూడా అది మనుగడ సాగించడానికి కారణం దాని మూలాలు తత్వశాస్త్రంలో ఉండటమే. భరత అనే పదమునకు జ్ఞానోదయం (భ) మీద ఆసక్తి (రత) చూపే ప్రజల ప్రదేశమని అర్థం. భారతీయ తత్వశాస్త్రం సాధారణంగా రెండు ప్రధాన మార్గాలుగా విభజించబడింది, ఆస్తిక (సాంప్రదాయక లేదా ఆస్తిక) మరియు నాస్తిక (సాంప్రదాయ విరుద్ధ లేదా నాస్తిక). బౌద్ధ, జైన మరియు చార్వాక తత్వాలు అనాచారమైనవి ఎందుకంటే అవి వేదాల ప్రమాణాన్ని అంగీకరించవు. వేదాలను అనుసరించే వారు అవి భగవంతుని నుండి వెలువడినవని అంగీకరిస్తారు. అందువల్ల, భారతీయ సంప్రదాయంలో, వేదాలపై ఆధారపడని ఏ ఆలోచనా విధానం అయినా, దేవుడిపైనా, దేవతలపైనా నమ్మకం ఉన్నప్పటికీ, నాస్తికమైనదిగానే పరిగణించబడుతుంది.

ఆస్తిక దర్శనములను సనాతన ధర్మం అని అంటారు, వీటిని ఆధునిక కాలంలో సంక్షిప్తంగా హిందూ మతం అని పిలుస్తారు. హిందూ మతం తత్వశాస్త్రం మరియు వేదాంతశాస్త్రం యొక్క ఆరు వ్యవస్థలను కలిగి ఉంటుంది. ఇవి న్యాయము, వైశేషికము, యోగము, సాంఖ్యము, పూర్వ మీమాంసము మరియు వేదాంతము. ప్రతి ఒక్క దర్శనము దాని సారమైన బోధనను కేంద్రకంగా సూత్రాలు లేదా సూత్రసారము ద్వారా సంక్షిప్తంగా ఇస్తుంది. ఈ దర్శనములలో మొదటి నాలుగు వేదాల అధికారాన్ని అంగీకరిస్తాయి, కాని వాటి తాత్విక సూత్రాలను వేదవాజ్ఞ్మయము నుండి తీసుకోవు. అవి ఋషుల వ్యక్తిగత బోధనలపై ఆధారపడి ఉంటాయి.

చివరి రెండు దర్శనములు, అనగా పూర్వ మీమాంస మరియు వేదాంత, వాటి వేదాంత వ్యవస్థలను ప్రత్యేకంగా వేద ప్రకటనలపై ఆధారపడి ఉంటాయి. ఋగ్ , యజుర్, సామ మరియు అధర్వ అనే నాలుగు వేదాలు సంహితము, బ్రాహ్మణము, అరణ్యకము మరియు ఉపనిషత్తు అనే నాలుగు భాగాలుగా విభజించపడ్డాయి. మొదటి రెండు భాగాలు ప్రధానంగా ఆచారబద్ధమైనవి. అరణ్యకములలో ప్రసంగం కర్మకాండ నుండి ఈశ్వరతత్వమునకు మారి, ఉపనిషత్తులలో అది ప్రధానాంశముగా బోధింపబడుతుంది. పూర్వ మీమాంసము సిద్ధాంతము వేదాల యొక్క మునుపటి (పూర్వ) భాగాలైన(సంహితము, బ్రాహ్మణము)లపై ఆధారపడి ఉంటుంది. వేదాంత (“వేదాల చివరి భాగం”) తరువాతి భాగాల అధ్యయనం, అనగా ఉపనిషత్తులు, అందువల్ల దీనిని ఉత్తర మీమాంసము అని కూడా పిలుస్తారు.

ఈ ఆరు ఆలోచనా విధానాల సంక్షిప్త అవలోకనం క్రింద ఇవ్వబడింది:

సాంఖ్యము
కపిల ముని ఈ వ్యవస్థను స్థాపించారు. సాంఖ్యము ప్రకృతి మరియు పురుష అనే రెండు ప్రాథమిక తత్వాలను అంగీకరిస్తుంది. ఆత్మ అని కూడా పిలువబడే పురుష, స్వభావంలో మార్పులేనిది, శాశ్వతమైనది మరియు చేతనమైనది. ప్రకృతి జడమైనది మరియు పురుషుడితో కలిసి ఉన్నప్పుడు మార్పులకు లోనవుతుంది. ఇది సూక్ష్మ నుండి స్థూలంగా పరిణామం చెందుతుంది మరియు కనిపించే ప్రపంచాన్ని తెలుపుతుంది. ప్రకృతి యొక్క మొదటి మార్పును మహత్ లేదా విశ్వ జ్ఞానము అని అంటారు. ఇది మరింతగా రూపాంతరం చెంది అహంకారంగా కూడా ఉత్పన్నమవుతుంది. అహంకారం నుండి మనస్సు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు తన్మాత్రాలు లేదా సూక్ష్మ మూలకాలు ఉత్పన్నమవుతాయి. వీటినుండి ఆకాశం లేదా అంతరిక్షం, వాయు లేదా వాయువులు, తేజస్ లేదా వేడి మరియు కాంతి, జలం లేదా ద్రవాలు, మరియు పృథ్వి లేదా ఘన వస్తువులుగా అభివృద్ధి చెందుతాయి. ఈ వ్యవస్థలోని ముఖ్య ఆలోచన ఏమిటంటే, ఒక జీవి ఇరవై నాలుగు మూలకాల నుండి భిన్నమైనదని అర్థం చేసుకోవడం ద్వారా అజ్ఞానం నుండి విముక్తి పొందవచ్చు.

యోగము
యోగ శాస్త్రము సాంఖ్యము యొక్క ఇరవై ఐదు సూత్రాలను అంగీకరిస్తూ, ఈశ్వర లేదా దేవుడ్నిఇరవై ఆరవ సూత్రముగా ప్రతిపాదిస్తుంది. ప్రకృతి నుండి భిన్నమైన పురుషుడిని గ్రహించడానికి యోగ ఆచరణాత్మక దశలను సూచిస్తుంది. ఈ వ్యవస్థను హిరణ్యగర్భ స్థాపించారు, తరువాత పతంజలి అనే ఋషి చేత క్రమబద్ధీకరించబడింది మరియు ప్రబలంగా ప్రచారం చేయబడింది. ఆయన యోగమును అన్ని మానసిక మార్పులనుండి విరమణగా నిర్వచించాడు. ఈ స్థితిని పొందడానికి ఆయన ఎనిమిది దశలను ఆచరణ యోగ్యముగా చూపారు అందువల్ల ఈ వ్యవస్థను అష్టాంగ యోగముగా (ఎనిమిది అవయవాలు) కూడా పిలుస్తారు. ఈ ఎనిమిది దశలు ఏమనగా యమము, నియమము, ఆసనం, ప్రాణాయామము, ప్రతిహారము, ధారణము, ధ్యానము మరియు సమాధి.

న్యాయము
దీనిని భారతీయ తర్కశాస్త్రము అని కూడా అంటారు. ఇది ఐదు దశల నిగమన తర్కముగా ప్రసిద్ధి చెందింది. ఇది మోక్ష సాధన పొందాలంటే పదహారు పదార్థాలు లేదా వర్గాల గురించి తెలుసుకోవటం అవసరమని పేర్కొంది. ఈ పదహారు పదార్థాలు ఏమనగా 1) ప్రమాణము ,2) ప్రమేయము, 3)సంశయము, 4) ప్రయోజనము, 5) దృష్టాంతము, 6)సిద్ధాంతము, 7)అవయవము,8) తర్కము, 9) నిర్ణయం, 10)వాదము, 11)జల్పము, 12)వితండము, 13)హేత్వభాసము, 14) చలము, 15) జతి, మరియు 16) నిగ్రహ-స్థానము. ఈ వర్గాలలో ఎక్కువ భాగం తర్కం మరియు చర్చకు సంబంధించినవి. గౌతమ ముని చేత న్యాయ ప్రతిపాదించబడింది.

వైశేషికము
ఈ వ్యవస్థను కణాద ఋషి అభివృద్ధి చేశాడు. స్వీయ-సాక్షాత్కారానికి ఏడు పదార్థాల గురించి తెలుసుకోవడం ఆవశ్యకమని ఆయన బోధించారు. ప్రపంచం అణువులతో (పరమాణువులతో) తయారైందని కణాద అభిప్రాయపడ్డారు. ఆ ఏడు పదార్థాలు, ద్రవ్యం (పదార్ధం), గుణము (స్వభావము), కర్మ (కదలిక), సామాన్య (సాధారణత), విశేష (ప్రత్యేకత), సమవయ (స్వాభావికత) మరియు అభావ (ఉనికి లేనివి).

పూర్వ మీమాంసము
ఈ వ్యవస్థను వేద వ్యాస శిష్యుడైన జైమిని ఋషి ప్రచారం చేశారు. ఇది వేదాల సారాంశం ధర్మం అని చెబుతుంది. ధర్మం అంటే వేదాలలో కనిపించే ఆజ్ఞలు అవి ప్రధానంగా యజ్ఞాల రూపంలో ఉంటాయి. ధర్మం అమలు చేయడం ద్వారా ఒకరు యోగ్యతను సంపాదిస్తారు, ఇవి మరణం తరువాత ఒకరిని స్వర్గానికి తీసుకువెళతాయి. తరువాత వారు ఎలాంటి కష్టాలను ఎదుర్కోకుండా స్వర్గంలో సంతోషంగా జీవిస్తారు. ఒకరి ధర్మం లేదా నిర్దేశించిన విధులను పాటించకపోతే, వారు పాపానికి లోనవుతారు మరియు వాటి పర్యవసానంగా నరకంలో బాధపడతారు.

ఉత్తర మీమాంసము లేదా వేదాంతము
వేదాలను సంకలనం చేసిన వేద వ్యాసుల వారు వేదాంతాన్ని బోధించారు. ఇది పూర్వ మీమాంసము యొక్క తీర్మానాన్ని ఖండించి, వేదాల యొక్క ముఖ్యమైన బోధన బ్రహ్మ జ్ఞానాన్ని, సంపూర్ణ సత్యాన్ని గ్రహించడమే తప్ప, నిషేధాల రూపంలో ధర్మ ఆచరణ కాదు అని స్పష్టీకరించింది. దీనికి రెండు శాఖలు ఉన్నాయి-వ్యక్తిగత మరియు వ్యక్తిగతము కానివి. వ్యక్తిగత శాఖ దేవుని యందు భక్తి, పరిపూర్ణతకు సాధనం అని పేర్కొంటోంది. రెండవ శాఖలో, ఒకరు తనకు తాను సర్వవ్యాప్త, వ్యక్తిత్వం లేని సంపూర్ణ సత్యంగా గుర్తించటం ముఖ్యమని పేర్కొంటుంది. భారతీయ తత్వ దర్శనములన్నింటిలో వేదాంతం అత్యంత ప్రాచుర్యం పొందింది.

ఈ ఆరు వ్యవస్థలు సాధారణంగా సాంఖ్య మరియు యోగ, న్యాయ మరియు వైశేషిక, మరియు పూర్వ మీమాంస మరియు వేదాంత అనే మూడుగా తరచుగా జతచేయబడతాయి. ఏది ఏమయినప్పటికీ, వేదాంతం మొత్తం ఆరు వ్యవస్థల యొక్క శిఖరాగ్రంగా విస్తృతంగా అంగీకరించబడింది. ఎందుకంటే ఇది సంపూర్ణ సత్యంతో ప్రత్యేకంగా వ్యవహరిస్తుంది మరియు వాస్తవికతను చాలా స్థిరంగా వివరిస్తుంది. ఇప్పుడు ఆధునిక యుగంలో యోగ శాస్త్రము బాగా ప్రాచుర్యం పొందినప్పటికీ నేటి కాలానికి కూడా అత్యంత ఆవశ్యమైన తత్వ దర్శనము వేదాంతము మాత్రమే . వేదాంతంలో వివిధ ఆలోచనా విధానాలు ఉన్నాయి, అవన్నీ రెండు విభాగాలుగా వర్గీకరించబడతాయి: వ్యక్తిగతము కానివి మరియు వ్యక్తిగతమైనవి.

వ్యక్తిత్వం & వ్యక్తివాదం

అద్వైతవాదము అని పిలువబడే వ్యక్తిత్వం లేని తత్వ దర్శనము ప్రకారం, సంపూర్ణ సత్యం లేదా బ్రహ్మము నిరాకారమైనది మరియు ఏ లక్షణాలూ లేనిది. ఇది శాశ్వతమైనది మరియు చేతనమైనది. బ్రహ్మమొక్కటే వాస్తవము. ఈ ప్రపంచం ఒక భ్రమ మరియు బ్రహ్మమును గ్రహించలేని అజ్ఞానము వలన వ్యక్తమవుతుంది. జీవులు బ్రహ్మమునకు భిన్నమైన వారు కారు.

దీనికి విరుద్ధంగా, వ్యక్తిగత తత్వ దర్శనము సంపూర్ణ సత్యం ఒక వ్యక్తి అని, దీనిని భగవానుడు లేదా పురుషోత్తమడు అని పిలుస్తారు అని చెప్తోంది. అతను ఆధ్యాత్మిక రూపం మరియు అనేక వైవిధ్య లక్షణాలను కలిగి ఉన్నాడు అని పేర్కొంటోంది. పైన వివరించిన అవ్యక్తిత్వ బ్రహ్మము భగవంతుని దివ్య శరీరమునుండి వెలుగొందే అద్భుతమైన కాంతి. భగవంతునిచే సృష్టింపబడిన ఈ ప్రపంచం వాస్తవమైనది, కానీ సృష్టి మరియు ప్రళయ చక్రములలో మార్పు చెందుతుంది. వ్యక్తిగత జీవులు (జీవులు) భగవానుని యొక్క శక్తిలో భాగం మరియు అతని నుండి ఎప్పుడూ భిన్నంగా ఉండలేరు అని స్పష్టీకరిస్తుంది.

ఆధునిక కాలములో తత్వ దర్శనముల ప్రయోజకత్వము

ప్రతి మానవుడు, వారి వారి నేపధ్యము, జాతి, మతముతో సంబంధము లేకుండా మూడు రకాల దుఃఖాలతో బాధ పడుతున్నాడు. అవి 1) వారి సొంత శరీరం మరియు మనస్సు నుండి వచ్చేవి, 2) ఇతర జీవుల వల్ల వచ్చేవి (ఉగ్రవాదులు, దోమలు, భయంకరమైన జంతువులు మొదలైనవి) 3) ప్రకృతి ద్వారా ఏర్పడేవి (భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు మొదలైనవి). అన్ని బాధలకు మూల కారణం ఆత్మ యందు అజ్ఞానం. మన చుట్టూ ఉన్న విషయాల గురించి మనకు చాలా తెలుసు, కాని మన గురించి మాత్రం మనకు ఏమీ తెలియదు.

ప్రతి తాత్విక వ్యవస్థ వెనుక ఉన్న ప్రాథమిక ప్రేరణ వ్యక్తి బాధ నుండి విముక్తి పొందడం. ఈ వ్యవస్థల అధ్యయనం ద్వారా జీవితం మరియు ప్రపంచం గురించి ఒకరి దృక్పథం విస్తరిస్తుంది. యోగాశాస్త్రము లేదా వేదాంతము సూచించిన విధానాన్ని అనుసరించడం ద్వారా, ఏ పరిస్థితిలోనైనా మనము శాంతియుతంగా మరియు సంతోషంగా మారవచ్చు.

నేటి ఆధునిక జీవితం ఆందోళన మరియు ఒత్తిళ్లతో నిండి ఉంది. చాలా వ్యాధులు ఒత్తిడి, తప్పుడు జీవనశైలి, సరికాని ఆహారం తీసుకోవటం మొదలైన వాటి నుండి పుట్టుకొస్తాయి. ఇవన్నీ మనకు తెలియకుండానే మనలో పాతుకుపోతాయి. ఆధునిక విద్య సంపదను సంపాదించడానికి శిక్షణ ఇస్తుంది కాని దానిని ఎలా ప్రయోజనకరంగా ఉపయోగించాలో తెలియచేయదు. ఇది హాయిగా బ్రతకడానికి సౌకర్యాలను ఇస్తుంది కాని ఎలా జీవించాలో నేర్పించదు. ఇది జ్ఞానాన్ని ఇస్తుంది కాని దాని ప్రయోజనం గురించి తెలియజేయదు.

మరో మాటలో చెప్పాలంటే, ఆధునిక విద్య జీవితంలో పరిపూర్ణతను కలిగించదు. ప్రస్తుత విద్యకు సనాతన ధర్మ వ్యవస్థల పరిజ్ఞానం జతచేయబడితే, ఆర్థిక, సామాజిక, రాజకీయ లేదా ఆధ్యాత్మిక రంగములలో అన్ని విధాలుగా మెరుగైన జీవితాన్నిప్రతి వ్యక్తి గడపగలుగుతాడు. భారతీయ జ్ఞాన వ్యవస్థల్లో, ముఖ్యంగా వేదాంతంలో ప్రజలకు శిక్షణ ఇస్తే, అవినీతి, నేరం, కుటుంబ అనైక్యత, దోపిడీ మొదలైన నేటి సమాజములోని ప్రబలమైన చెడులను నిర్మూలించ గలుగుతాము. ఈ వ్యవస్థలు గతంలో వేలాది సంవత్సరాలుగా చెడు నిర్ములనకు ఉపయోగించబడి భారతదేశానికి కీర్తిని తెచ్చాయి. సాంప్రదాయ విజ్ఞాన వ్యవస్థలను నిర్మూలించినప్పుడు భారతదేశం యొక్క కీర్తి గణనీయముగా క్షీణించింది. కానీ భారతీయ స్వదేశీ జ్ఞాన వ్యవస్థలను సద్వినియోగం చేసుకుంటే అది తిరిగి ప్రపంచం మొత్తాన్ని ప్రేరేపిస్తుంది.

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    పురుషులు మరియు మహిళలు వేర్వేరు స్వభావాలు, భావాలు, కోరికలు మరియు ప్రాధాన్యతలను కలిగి ఉంటారు. ఈ వాస్తవాన్ని తెలుసుకోకపోవడం మరియు వారు అన్ని విధాలుగా సమానమని భావించడం విఫలమౌతున్న సంబంధాల వెనుక ఉన్న అతి పెద్ద కారణాలలో ఒకటి.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.