మంచివాళ్ళు ఎందుకు కష్టాలపాలౌతారు?

Articles by Satyanarayana DasaComments Off on మంచివాళ్ళు ఎందుకు కష్టాలపాలౌతారు?

                   చాలా తరుచుగా “మంచివాళ్ళు ఎందుకు కష్టాలపాలౌతారు మరియు చెడ్డవాళ్ళు ఎందుకు ఆనందంగా ఉంటారు?” అనే ప్రశ్న జనాలు అడుగుతూఉంటారు. ఇది ఒక పురాతన ప్రశ్న. ద్రౌపదీ మనస్సులోకూడా ఈ అనుమానం వచ్చింది. యుధిష్ఠిర మహారాజు జూదంలో తన రాజ్యాన్ని కోల్పోయినప్పుడు తాను, తన సోదరులు మరియు ద్రౌపదీ రాణి పన్నెండు సంవత్సరాలు అజ్ఞాతవాసం చేయాల్సివచ్చింది. రాజ భోగాలు అనుభవించిన తర్వాత అడవిలో జీవించడం ఉల్లాసమైన అనుభవమేమీ కాదు. జూదం ఆడడానికి ఒక్కరోజు ముందు పాండవులు మరియు ద్రౌపదీ రాణి అన్ని సౌకర్యాలు మరియు సంపదలు ఉన్న రాజ భవనంలో నివసించారు. అకస్మాత్తుగా, వారి రాజసంబంధమైన దుస్తులను, జీవితాన్ని వదిలేసి కనీస అవసరాలైన తిండి నిద్రకు కూడా సరైన సౌకర్యాలు లేని అడవిలో తిరగవలసివచ్చింది. ఇది ఖచ్చితంగా ఘోరంగా అనిపించివుండచ్చు, ముఖ్యంగా రాణి ద్రౌపదీకి. పాండవులు వేటకోసం అడవులకు వెళ్లేవారు కానీ ద్రౌపదీ అరణ్యంలో నివసించే అనుభవం ఏమాత్రంలేని ఒక సుకుమారమైన రాణి. అంతేకాక అడవికి రాకముందు, ఆమె దుర్యోధన మరియు అతని సోదరుడైన దుశ్శాసన చేత తీవ్రంగా అవమానించబడింది. దుశ్శాసనుడు ఆమెను రాజులు మరియు యువరాజుల సమావేశంలో జుట్టుపట్టుకుని లాగి వివస్త్రను చేయడానికి ప్రయత్నించాడు. అంతేకాక, ఈ సంఘటనను భీమార్జునులతో సహా వీరులైన తన ఐదుగురు భర్తలు మౌనంగా చూస్తూ ఉండిపోవడం ఇంకా ఆమెకు బాధను కలిగించివుంటుంది. ఇదంతా గుర్తుచేసుకొన్న ద్రౌపదీకి చాలా కోపం వచ్చినప్పటికి నిస్సహాయురాలిగా ఉండిపోయింది. ఇది జరుగుతున్నట్లు ఆమె నమ్మలేదు. ఆమె సాధారణ స్త్రీ కాదు, అయోనిజ(గర్భమునుండి జనియించినది కాదు) అని ఆమెకు పేరు.

         అయినా, ఆమె కనీసం కింద ఆసనం కూడా లేకుండా నేలమీద కూర్చొని ఉంది. తన కోపం, బాధ మరియు అసహనాన్ని యుధిష్ఠిర మహారాజుకు విన్నవించుకుంది: “ధర్మాన్ని అనుసరించేవారిని ధర్మం కాపాడుతుందని నేను విన్నాను. మీరు చాలా ధార్మికులని నాకు తెలుసు. నన్ను, మీ తమ్ములను మీరు వదిలేస్తారేమోగానీ ధర్మాన్ని మాత్రం విడనాడరు. మీరు ఒక్క అధార్మిక పని చేయడం కూడా నేను చూడలేదు. మీరు వినయం, కరుణ, దాతృత్వము మరియు సాధు గుణములు కలిగి ఉంటారు, కానీ ఇప్పుడు ధర్మము మిమ్మల్ని కాపాడడం నేను చూడలేదు. మీరిలా చెట్టుక్రింద కూర్చొని ఉండడం చూస్తుంటే కలతగా ఉంది. ధర్మం ఎక్కడుంది? ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఒక ఎద్దుని ముక్కుతాడుతో నియంత్రించినట్లు ప్రతిఒక్కరూ ఈశ్వరుడి ఆధీనంలో ఉంటారని చెప్పబడింది. ఒకరు స్వర్గం లేక నరకం వెళ్ళడానికి ఈశ్వరుడు ఏర్పాటు చేస్తాడని చెప్పబడింది. అన్ని సుఖదుఃఖాలు కూడా ఈశ్వరుడి ఆజ్ఞ చేతనే లభిస్తాయి. ఒక శిశువు బొమ్మలతో ఆడుకొన్నట్లు ఆయన అందరితో ఆడుకొంటాడు. ఓ రాజా, ఈశ్వరుడు అందరి సంరక్షకుడు మరియు కరుణ కలిగినవాడని నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఆయన మన మీద అనుగ్రహం చూపట్లేదు. ధర్మానికి బద్ధులమైన మనం కష్టాలు అనుభవిస్తున్నాము, మోసగాడైన దుర్యోధనుడు రాజ జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఈశ్వరుడి ఈ అన్యాయమైన ప్రవర్తన నేను మెచ్చుకోలేకపోతున్నాను. క్రూరుడైన, లోభియైన, అహంకారియైన మరియు అధార్మికుడైన దుర్యోధనుడికి ఈశ్వరుడు సంపద ప్రసాదించడం వల్ల ఉపయోగమేముంది? ప్రతి ఒక్కరు వారి కర్మ అనుభవించాలన్నప్పుడు ఈశ్వరుడు కూడా ఈ పాప కర్మలో ఇరుక్కుంటాడు. కానీ మీరు ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు ఏ పాపం అంటలేదు అంటే నాకు దుఃఖం వస్తుంది.” అని ఇలా పలికి ద్రౌపదీ రోదించింది.

               దుఃఖితురాలైన ద్రౌపదీ మాటలు విన్నాక, నిశ్శబ్దంగా మరియు ప్రశాంతంగా ఉన్న యుధిష్ఠిర మహారాజు ఈ వివేకమైన జవాబు ఇచ్చాడు: “ఓ ప్రియమైన రాణి, నీవు చెప్పినది బాగా ఆకర్షణీయంగా మరియు తార్కికంగా ఉన్నట్లు ఉంది, కానీ అవి అజ్ఞానం వలన పలికిన మాటలు మరియు అది నిరీశ్వరవాదుల అభిప్రాయము. ఏదో ఒక ఫలితం కోసం నేను ధర్మాన్ని అనుసరించను, కేవలం నా బాధ్యతగా అనుసరిస్తాను. స్వర్గముపొందాలని నేను దానం లేదా యజ్ఞము చేయను. మంచి చెడు ఫలితాలతో సంబంధంలేకుండా నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తాను. ధార్మిక కర్మల ఫలితాలను ఆకాంక్షించను. ధర్మమును అనుసరించడం నా స్వభావం. ఏదో లబ్ధి పొందాలని ధర్మాన్ని అనుసరించేవారు నిజానికి ధార్మికులు కారు, వారికి ధర్మం ఒక వ్యాపారం. ఒక వ్యాపారి వస్తువులను కొనుగోలు లేదా అమ్మకం చేయడం కొంత లాభం కోసం చేసినట్లు, అదే విధంగా అలాంటి వారు ధర్మాన్ని కూడా అదే ఉద్దేశ్యంతో అనుసరిస్తారు.   పాపబుద్ధి గల వ్యక్తులు, నాస్తిక ఆలోచనల ప్రభావంతో ధర్మంలో పాల్గొంటారు కానీ ఇంకా దాని గురించి సందేహాలు ఉంటాయి.

            కాబట్టి శాస్త్ర ప్రమాణంగా ధర్మాన్ని అనుమానించవద్దని నీకు సూచిస్తున్నాను. ధర్మాన్ని లేదా శాస్త్ర ప్రమాణాన్ని అనుమానించే వ్యక్తి తిర్యక్ జాతులలో జన్మిస్తాడు. అలాంటి వాడు మానవులలోకెల్లా అధముడు. ఆ వ్యక్తి ధార్మికులు వెర్రివాళ్ళని, తన సొంత బుద్ధి మరియు తర్కానికి విలువనిస్తాడు. అలాంటి వ్యక్తి శుభప్రదమైనది ఏదీ సాధించలేడు. ఈశ్వరుడిచేత స్థాపించబడిన మరియు జీవితంమీద లోతైన అవగాహన గల గొప్ప ఋషుల చేత ఆచరించబడుతున్న ధర్మాన్ని మనం ఎప్పుడూ శంకించకూడదు. ధర్మాన్ని అనుసరించడంద్వారా కష్టాలు వస్తే వ్యాస, వశిష్ట, మైత్రేయ, నారద, శుకదేవ మొదలగు గొప్ప ఋషులు ధర్మాన్ని ఆచరించరు. ధర్మాధర్మములకు వాటి ఫలితాలు తప్పకుండా ఉంటాయి. అవి వాటివాటి ఫలితాలు ఇస్తాయి. ధార్మిక కర్మ ఫలితమైన నీ జన్మని గుర్తుచేసుకో. కర్మయొక్క ఫలితాలు అర్థం చేసుకోవడం సులభంకాదు. గొప్ప ఋషులు లేదా దేవతలు మాత్రమే కర్మ ఎప్పుడు ఎలా ఫలితాన్ని ఇస్తుందో తెలుసుకోగలరు. ధర్మానికి వెంటనే ఫలితం చూడలేకపోయావని దానిని, దేవతలను, శాస్త్రాన్ని లేదా ఈశ్వరుడిని శంకించకూడదు. ధర్మానికి ఫలితం నిర్ణీత సమయానికి వస్తుంది. అలానే, అధార్మికంగా ఉన్నవారికి కూడా ముందో వెనకో ఫలితం వస్తుంది. వేరే వారిని మోసంచేసేవారు భోగాలు అనుభవిస్తున్నట్లు అభివృద్ధి చెందుతున్నట్లు కనిపించవచ్చు కానీ వారి అధార్మిక కర్మ వారిని నరకానికి తీసుకువెళ్తుంది. కేవలం సరైన సమయం రావాలంతే. ఇది తెలుసుకొని, నువ్వు కలత చెందకుండా ధర్మము మరియు ఈశ్వరుని మీద విశ్వాసము కలిగిఉండు.”

            ఈ చక్కని సంవాదం మహాభారతంలోని వనపర్వంలోని 30 మరియు 31వ అధ్యాయాలలో ఉంది. కేవలం మన జీవితంలో కొన్ని కష్టాలు వచ్చాయని శాస్త్రాన్ని శంకించకూడదు. ధర్మము మరియు అధర్మము రెండూ వాటి ఫలితాలను ఇస్తాయి. మన కష్టాలు మన పూర్వ కర్మ ఫలితాలు కావచ్చు. మనం భక్తి మార్గములో దృఢముగా ఉండడానికి కృష్ణుడు వాటిని ప్రసాదించినట్లు అనుకోవచ్చు. గొప్ప భక్తులైన పాండవులు కూడా అనేక కష్టాలపాలయ్యారు, కానీ ధర్మ మార్గాన్ని విడవలేదు. భక్తిని పరమ ధర్మమని అంటారు. కాబట్టి, ఉన్నతమైన భక్తి మార్గమునుండి దారితప్పాలన్న ఆలోచనకూడా ఉండకూడదు.

 

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    నాయకుడు కావాలంటే పాఠకుడు కావాలి. ఏ రంగంలో విజయానికైనా స్వాధ్యాయము తప్పనిసరి. మనం క్రమం తప్పకుండా చదువుకోవడానికి కొంత సమయం కేటాయించాలి.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.