మనం గురువు నుండి ఎందుకు అధ్యయనము చేయాలి?

BhaktiSandarbhasComments Off on మనం గురువు నుండి ఎందుకు అధ్యయనము చేయాలి?

                        భక్తి సాధనలో నిమగ్నమవ్వడానికి, ప్రతి సాధకునికీ తమ సాధన గురించి అవసరమైన జ్ఞానం మరియు సాధించాల్సిన లక్ష్యం పట్ల అవగాహన చాలా అవసరం. మనం తరచుగా ప్రశ్నలు వింటుంటాము: “ జ్ఞానం ఒక అర్హతగల గురువు నుండి పొందవలసి ఉందా? అంతర్జాలములో లభ్యమయ్యే పుస్తకాలు, ఉపన్యాసాల సహాయంతో జ్ఞానాన్ని స్వయంగా స్వీకరించడం సాధ్యం కాదా? నేను ఒక గురువుతో ఎందుకు చిక్కుకుపో వాలితమ శిష్యులను లోబరుచుకుని కొంతమంది గురువులు ఎలా దోపిడీ చేస్తారో నేను చాలా కథలు విన్నాను. నేను మోసపోవాలనుకోవడం లేదు. నేను భక్తిని ఇష్టపడుతున్నాను, కాని నేను ఒక సమూహంలో లేదా సంస్థలో భాగం కావాలనుకోవడం లేదు. నేను నా స్వేచ్ఛను ప్రేమిస్తున్నాను. గురువు ద్వారా మాత్రమే తనను సంప్రదించగల విధంగా దేవుడు తనను తాను ఎందుకు పరిమితం చేసుకోవాలి? భగవంతుడు అందరికీ ఒక్కడే, మనమంతా సమానమే కాబట్టి మనం నేరుగా దేవుణ్ణి సంప్రదించలేమా?”  శ్రీ జీవ గోస్వామి ప్రశ్నలకు భక్తి సందర్భము యొక్క అనుచ్ఛేదము 208లో సమాధానం ఇచ్చారు. ఆయన ఉద్ధవునితో శ్రీకృష్ణుని సంభాషణను ఉటంకిస్తారు. దానికి అనువాదం మరియు దానిపై నా వ్యాఖ్యానాన్ని మీకు క్రింద నేను ప్రతిపాదిస్తున్నాను.

అనుచ్ఛేదము 208 యొక్క అనువాదం:

వీటి[శ్రవణ గురువు, శిక్షా గురువు, మరియు మంత్రగురువు]లోశ్రీ కృష్ణుడు పేర్కొన్నట్లు ప్రత్యేకంగా శ్రవణ గురువుతో పరిచయం ద్వారా, తక్షణమే శాస్త్ర సత్యాల యొక్క అంతర్ దృష్టి వ్యక్తమవుతుంది, లేకపోతే, అది సాధ్యమవ్వదు

ఆచార్యోరణిరాద్యః శ్యాద్ అంతేవాసి ఉత్తరారణిః 

తత్ సంధానం ప్రవచనం విద్యా సంధిః సుఖావహః 

ఆచార్యుడు అగ్నిని కాల్చడానికి ఉపయోగించే చెక్క దిగువ భాగం(ఆద్యఅరణి); శిష్యుడు చెక్క పైభాగం (ఉత్తరఅరణి); బోధన అనేది మధ్య భాగమైన రాపిడి చేసే ఒక కర్ర , ఇది అనుసంధాన కర్తగా ఉపయోగించబడుతుంది; జ్ఞానం అనేది వారి కలయిక యొక్క ఫలితం, ఇది ఆనందాన్ని ఇస్తుంది.” (శ్రీ  భాగవతం 11.10.12)

ఆద్య(మొదటిది) అనే పదానికి అర్ధం అగ్నిని కాల్చడానికి ఉపయోగించే చెక్క దిగువ భాగం (అధరః  అరణిః ). తత్సంధానం(వాటి కలయిక ప్రదేశం) అను సమ్మేళనమంటే రెండింటి మధ్య ఉంచిన అనుసంధాన కర్త” (తయోర్ మధ్య మం మంతనకాష్ఠం). ప్రవచనం అంటేమౌఖిక బోధన” (ఉపదేశము). విద్యా, “జ్ఞానంఅనే పదం గ్రంథంలో వెల్లడైన జ్ఞానాన్ని సూచిస్తుంది, దిగువ, ఎగువ మరియు మధ్య చెక్క ముక్కల తాకిడి వల్ల  అగ్ని ఉత్పత్తి అయినట్లు ఇది మూడింటి యొక్క కలయిక నుండి వ్యక్తమవుతుంది.

ఇదే విధమైన విషయము వేదాల్లో కూడా చెప్పబడింది:

అథాధి విద్యం, ఆచార్యః పూర్వ-రూపం అంతేవాసి ఉత్తరరూపం 

విద్యా సంధిః, ప్రవచనం సంధానం ఇతి అధి విద్యం

ఇప్పుడు జ్ఞానానికి సంబంధించి: ఆచార్యుడు ముందు రూపం, శిష్యుడు, పృష్ఠ; జ్ఞానం, వారి కలయిక; మరియు బోధన, మాధ్యమం.” (తైత్తిరీయ ఉపనిషద్ 1.3.3)

అందువల్ల, వేదాలు గురువు నుండి ఙ్ఞానం పొందాల్సిన ఆవశ్యకత గూర్చి ఈవిధంగా చెప్పాయి.

తద్విజ్ఞానార్థం గురుమ్ ఏవాభిగచ్చేత్

పరమ సత్యాన్ని తక్షణ సాక్షాత్కారం పొందడానికి, ఖచ్చితంగా ఒక గురువును సంప్రదించాలి.” (ముణ్డక​ ఉపనిషద్ 1.2.12)

   ఆచార్యవాన్ పురుషో వేద 

ఆచార్యుడిని స్వీకరించినవాడు సంపూర్ణ తత్వమును తెలుసుకొంటాడు.” (చాందోగ్య ఉపనిషద్ 6.14.2)

మరియు:

  నైష తర్కేణ మతిర్ ఆపనేయా ప్రోక్తాన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ట

ప్రియమైనవాడా, సంపూర్ణ తత్వమునకు సంబంధించిన జ్ఞానం తర్కం ద్వారా పొందలేము. గురువు నుండి జ్ఞానం పొందినప్పుడే అది నిజమైన అవగాహనకు దారితీస్తుంది” (కథా ఉపనిషద్ 1.2.9).

బాబాజీ సత్యనారాయణ దాస వారి వ్యాఖ్యానం:

               పూర్వ కాలంలో, శమీ చెట్టు యొక్క చెక్కముక్కలు రుద్దడం ద్వారా యజ్ఞం చేయడానికి అవసరమైన అగ్నిని ఉత్పత్తి చేశారు. కలపను అరణి అని పిలిచేవారు. మంటను సృష్టించడానికి, దిగువ చెక్క ముక్క, పై భాగం మరియు మధ్యలో ఒక రాపిడి ముక్క ద్వారా ఘర్షణ సృష్టించబడేది. సమయంలో, అగ్గి పెట్టె అందుబాటులో లేనందున, అగ్నిని ఉత్పత్తి చేయడానికి వేరే మార్గం లేదు. అదే పద్ధతిలో, గురువును సంప్రదించడం ద్వారా తప్ప జ్ఞానం పొందటానికి వేరే మార్గం లేదు.

             ఈ సారూప్యతలో, గురువును చెక్క యొక్క క్రింది ముక్కతో, విద్యార్థిని చెక్క పైభాగానికి, మరియు గురువు నుండి అందుకున్న ఉపదేశాన్ని రాపిడి ముక్కగా పోల్చారు, ఎందుకంటే ఇది విద్యార్థి మనస్సును కదిలిస్తుంది. కలయిక నుండి విద్యార్థిలో ఉత్పన్నమయ్యే జ్ఞానాన్ని అగ్నితో పోల్చారు. యజ్ఞం చేయడానికి అగ్నిని ఉపయోగించినట్లే, ప్రామాణికమైన గురువు నుండి పొందిన జ్ఞానం కూడా అంతిమ లక్ష్యానికి దారితీస్తుంది.

               పుస్తకాలను చదవడం ద్వారా, ఒకరి స్వంత చొరవ ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చని ఒకరు అభ్యంతరం చెప్పవచ్చు. రోజుల్లో, చాలా పుస్తకాలు ముద్రణ రూపంలో లేదా అంతర్జాలములో లభిస్తాయి. శ్రవణ మరియు దృశ్య ఉపన్యాసాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి లేనప్పుడు గురువుగతంలో అవసరమైంది. అగ్గి పెట్టెలు లేదా లైటర్లు ఇప్పుడు మంటలను మొదలుపెట్టేందుకు అనుకూలమైన మార్గంగా ఉన్నందున, చెక్క వాడుకలో లేని విషయమై పోయిందిఅలానే ఇకపై గురువు నుండి జ్ఞానాన్ని పొందవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి అంత ఇబ్బంది పడడం ఎందుకు?

                  ఈ సందేహానికి ప్రతిస్పందనగా, శ్రీ  జీవ గోస్వామి  అనుచ్ఛేదము యొక్క ప్రధాన పద్యం ఉదహరిస్తూ  ఒక గురువును తీసుకోవటానికి  గల సంపూర్ణ అవసరాన్ని ధృవీకరిస్తారు. అగ్నిని ఉత్పత్తి చేయడానికి కలపను రాపిడి చేసే పద్ధతి గతంలో మ్యాచ్ బాక్స్‌లు లేదా లైటర్లు లేనందున కాదు, కానీ యజ్ఞాన్ని ఆరంభించే  నియమావళిలో అది ఒక ముఖ్యమైన భాగం కనుక. ఒకరు ఆశించిన ఫలితాన్ని పొందడానికి ఒక యజ్ఞాన్ని ఖచ్చితమైన పద్ధతిలో నిర్వహించాలి. ఏదైనా ఒక పొరపాటు జరిగితే, అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు. మహాభారతం(వనపర్వము, 135వ అధ్యాయం)లో, గురువు నుండి నేర్చుకోవలసిన అవసరాన్ని వివరించడానికి ఒక కథ ఉంది.

               అనగనగా యవక్రీతుడు అనే బ్రాహ్మణ బాలుడు ఉండేవాడు. అతను సాంప్రదాయ పద్ధతిలో గురువుతో కలసి జీవిస్తూ విద్య నేర్చుకునే గురుకులమునకు వెళ్లదలుచుకోలేదు. అతను పెరిగి పెద్దయ్యాక, విద్య లేకుండా బ్రాహ్మణునిగా పనిచేయలేనని గ్రహించాడు. అందుకై, అతను ఏదో ఒకవిధంగా జ్ఞానాన్ని పొందాలని నిర్ణయించుకున్నాడు. కానీ సమయంలో, అతను ఒక గురువు వద్దకు వెళ్లడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే వయస్సులో అతను చాలా చిన్న విద్యార్థులతో ఉండటానికి సిగ్గుపడ్డాడు. తపస్సులను పాటించడం ద్వారా ఏదైనా పొందడం సాధ్యమని అతను విన్నాడు . అందువల్ల అతను దట్టమైన అడవిలోకి వెళ్లి జ్ఞానం సంపాదించాలనే ఆశతో తీవ్రమైన తపస్సులకు పాల్పడ్డాడు. చాలా సంవత్సరాలు గడిచాయి, కాని ఇంకా ఫలితం లేదు.

           ఒక రోజు, యవక్రీతుడు, స్నానానికి సమీపంలోని నదికి వెళ్ళాడు, అక్కడ ఒక వృద్ధుడు కూర్చుని, తన చేతులతో ఒడ్డులోని  ఇసుకను నదిలోకి పోయడం చూశాడు. వృద్ధుడు ఏమి సాధించటానికి ప్రయత్నిస్తున్నాడో తెలుసుకోవటానికి యవక్రీతుడు తెలుసుకోజాలాడు. అప్పుడు యవక్రీతుడు అతని దగ్గరికి వచ్చి నదిలో ఇసుక ఎందుకు పోస్తున్నావని అడిగాడు. వృద్ధుడు అతనికినేను నదిని దాటాలి. ఈత కొట్టడం నాకు తెలియదు, పడవలు అందుబాటులో లేవు, అందువల్ల దానికి అడ్డంగా వంతెన నిర్మించాలని నిర్ణయించుకున్నాను.” అని గంభీరంగా సమాధానం ఇచ్చాడు.

        అది విన్న యవక్రీతుడు, తన నవ్వును నియంత్రించుకోలేకపోయాడు. అప్పుడు వృద్ధుడుదీనిలో అంత హాస్యాస్పదమైనది ఏమి ఉంది? నదిని దాటడానికి సులభమైన మార్గం ఉందని నువ్వు అనుకుంటున్నావా?” అని అతనిని అడిగాడు, అప్పుడు యవక్రీతుడునేను మీ అజ్ఞానాన్ని చూసి నవ్వుతున్నాను. నీటిలో ఇసుక పోయడం ద్వారా మీరు వంతెనను నిర్మించలేరు. ఇది మూర్ఖుడికైనా తెలుసు.” అని అన్నాడు

            దానికి సమాధానమిస్తూ వృద్ధుడునువ్వు గురువును సంప్రదించకుండా జ్ఞానాన్ని పొందగలవని అనుకుంటే, నేను కూడా విధంగా వంతెనను నిర్మించగలను. నేను నా స్వంత ప్రయత్నంతో చేస్తాను.” అన్నాడు. ఇది విన్న బ్రాహ్మణుఁడు నిర్ఘాంతపోయాడు. అప్పుడు వృద్ధుడు బ్రాహ్మణుని పట్ల కరుణతో తన నిజ స్వరూపాన్ని (ఇంద్రునిగా) ప్రకటించాడు. తర్వాత ఇంద్రుడు అర్హతగల గురువును కనుగొని అతని నుండి వేదాలను అధ్యయనం చేయమని ఉపదేశము చేశాడు.




Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    మీ మనస్సుపై నియంత్రణ కలిగి ఉండటానికి మీరు భావాలు మరియు ఆలోచనల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి. లేకపోతే మనం కేవలం పరిస్థితులపై స్పందిస్తూనే ఉంటాము.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.