మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత

Articles by Satyanarayana DasaComments Off on మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత

సృష్టిలో ఉన్న అన్ని జీవ రాశులలో కెల్లా మానవ జన్మ అరుదైనది మరియు అతి ప్రముఖమైనది. మహాభారతం లోని శాంతి పర్వం(180 వ అధ్యాయం)లో, పన్నెండు మంది భక్తాగ్రణ మహాజనులలో ఒకరైన భీష్మ పితామహుడు మానవ జన్మ  ప్రాముఖ్యత తెలుపుటకై  యుధిష్టర మహారాజుకు ఒక కథ చెబుతాడు.

చాలా కాలం క్రిందట “కశ్యపుడు” అనే నిష్టాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన చాలా ధార్మికుడు మరియు అంతర్ముఖ స్వభావము కలవాడు. ఒకసారి ఆయన  నడుస్తున్నప్పుడు, గొప్ప పొగరుబోతైన వైశ్యుడు ఎదురుగా రథం మీద స్వారీ  చేస్తూ వచ్చాడు . తన సంపద మత్తులో ఉన్నందున, ఆ వైశ్యుడు కశ్యపుడిని పట్టించుకోలేదు సరికదా కావాలని అతని రథంతో గుద్దడం ద్వారా ఆయన్ని రోడ్డు పైన విసిరి పడేటట్లు చేసాడు. ఆ ఘటన బ్రాహ్మణుడిని శారీరకంగానే కాక, మానసికంగా కూడా బాగా బాధించింది. ఆయన అది చాలా అవమానంగా భావించాడు, ఆయన పేదవాడు కాబట్టి, తన బ్రతుకు వృధా అని అనుకున్నాడు. ఆయనకు సంపద మీద ఆసక్తి మరియు దాన్ని ఆర్జించటానికి సామర్ఢ్యము కూడా లేదు. ప్రజలు తనలాంటి బ్రాహ్మణుడిని గౌరవించరని ఆయన గ్రహించాడు. జీవితం మీద విసుగు చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 

బ్రాహ్మణుని యొక్క ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకున్న ఇంద్రుడు  ఆయనపై జాలిపడ్డాడు. ఆయనకు  బోధించడానికి, అతను నక్క రూపంలో అగుపించి బోధించడం ప్రారంభించాడు. అప్పుడు ఆ నక్క బ్రాహ్మణునితో  ఇలా  మాట్లాడింది: 

“ఓ బ్రాహ్మణుడా, జీవులందరూ మానవ శరీరాన్ని సాధించాలని కోరుకుంటారు, మరియు మానవులలో,  బ్రాహ్మణుడిగా జన్మించడమూ ఇంకా ప్రశంసనీయం. నీవు మానవుడువి మాత్రమే కాదు, బ్రాహ్మణుడివి. ఆపై నీవు వేదాలను అధ్యయనం చేసావు. ఇటువంటి అరుదైన అవకాశాన్ని పొందిన తరువాత కూడా, దానిని  పనికిరానిదిగా భావించడం మరియు ఆత్మహత్య చేసుకోవటానికి ప్రణాళిక చేయడం చాలా గర్హనీయము. నేను మానవ పుట్టుకను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను దానిని కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. మానవులు సంపద కోసం ఆకాంక్షించినట్లే, జంతువులైన మేము చేతులు కావాలని కోరుకుంటున్నాము. చేతులు కలిగి  ఉండటం కన్నా వేరేదీ గొప్ప లాభంగా మాకు పరిగణించదు . ఓ మునీశ్వరుడా, చాలా సార్లు అడవిలో తిరుగుతున్నప్పుడు, పొదల్లోని ముళ్ళు నా  శరీరానికి  గుచ్చుకుంటాయి. అది నాకు  చాలా నొప్పిగా అనిపిస్తుంది కాని నాకు చేతులు లేనందున, నేను వాటిని బయటకు తీయలేకపోతున్నాను. అదేవిధంగా, ఈగలు, దోమలు మరియు ఇతర కీటకాలు మా  శరీరాలను కొరుకుతాయి, మేము కేవలము దానిని తట్టుకోవాలి. చేతులు లేనందున, వేడి, చలి, వర్షం మరియు వడగళ్ళ నుండి మమ్మల్ని మేము రక్షించుకోటానికి మనుషుల మాదిరిగా ఇళ్ళు నిర్మించుకోలేకపోతున్నాము. మా శరీరాలపైన వస్త్రాలను ధరించలేము, సరిగా మేము తినలేము. తింటున్నప్పుడు, కొన్నిసార్లు పదునైన గడ్డి మా దంతాలను మరియు చిగుళ్ళను చాలా  బాధిస్తుంది. మానవులు జంతువులను పెంపకం చేయవచ్చు మరియు వాటిని భూమికి దున్నటానికి లేదా రవాణా బండిగా, ప్రయాణము కొరకు కూడా ఉపయోగిస్తూ ఆనందించవచ్చు. కానీ మాకు అలాంటి సౌకర్యం లేదు. ఇలా బాధపడుతున్నప్పుడు కూడా నేను ఆత్మహత్య చేసుకోను, ఇది చాలా పాపాత్మకమైన చర్య అని బాగా తెలుసు. ఆత్మహత్య చేసుకోవడం ద్వారా నేను ఇంకా తక్కువ జాతి జీవితంలోకి పడిపోతానని నాకు తెలుసు. 

చాలా అరుదైన మానవ జన్మ పొందిన నీవు ఎంత అదృష్టవంతువో నీవు గ్రహించాలి. పేదరికం కారణంగా నీవు విలపిస్తున్నావు, కానీ కేవలం సంపద మాత్రమే ఆనందాన్ని ఇవ్వదని నీవు తెలుసుకోవాలి. ఈ మానవ శరీరంలో ఉండటం వల్ల నీకు తెలివితేటలు ఉన్నాయి. ఈ తెలివితేటలను సంపద ఆర్జించచడానికి కాదు, జ్ఞానార్జనకు ఉపయోగించాలి. ఒకవేళ ఆధ్యాత్మిక ప్రగతి కోసం నీవు పని చేయకపోతే, ఈ మానవ రూపాన్ని దుర్వినియోగం చేస్తున్నావని తెలుసుకో, దాని పర్యవసానముగా చివరికి జంతుజాలములలో జన్మించాల్సి వస్తుంది. అలానే మానవులలో కూడా అందరూ పరిపూర్ణ ఆరోగ్యవంతులు కారు, కొందరు వికలాంగులుగా కూడా ఉన్నారని నీకు తెలుసు. వారిలో కొందరు గుడ్డివారు, మరికొందరు చెవిటివారు లేదా కుంటివారు. కానీ, ఓ బ్రాహ్మణా, నీవు ఆరోగ్యకరమైన శరీరాన్ని కలిగి ఉన్నావు . ఈ శరీరాన్ని భౌతిక అనురక్తి నుండి విముక్తి పొందటానికి నీవు ఉపయోగించాలి. అప్పుడు నీవు ధనిక లేదా గర్విష్టులైన వ్యక్తుల నుండి అవమానానికి గురికావలసిన అవసరం లేదు. భౌతిక ఆనందం మరియు బాధ ఒకరి గత కర్మ ఫలితాల వల్లే  వస్తాయి. దానిని సహించి భగవంతుని పట్ల శుద్ద భక్తిని ఆచరించు. 

నేను నా గత జీవితంలో మానవుడిగా పుట్టాను కానీ నా తెలివితేటల పైన గర్వంగా వుండేవాడిని. నేను బ్రాహ్మణలతో వాదించేవాడిని మరియు వేదాలను విమర్శించేవాడిని. నాకు గ్రంథాలపై గౌరవం ఉండేదికాదు,  అనుభవపూర్వక లౌకిక జ్ఞానము మరియు తర్కము మాత్రమే జ్ఞానానికి మూలాధారమని భావిస్తూ ఉండేవాడిని. నేను నాస్తికుడిని మరియు మూర్ఖుడిని, కానీ నన్ను నేను ప్రజ్ఞాశాలిగా మరియు మేధావిగా సదా భావిస్తూ ఉండేవాడిని. అలాంటి ప్రవర్తన ఫలితంగా నేను ఇప్పుడు నక్కగా జన్మించాను. ఈ నక్క శరీరంలో నేను ఏ శాస్త్రాధ్యయనం లేదా భక్తి సాధనలో పాల్గొనలేను. నేను మానవుడిగా పుట్టాలని చాలా తపిస్తూన్నాను, కానీ అది నా నియంత్రణలో లేదు.”

కశ్యపముని నక్క యొక్క ఈ మాటలు విని  ఆశ్చర్యపోయాడు. తన జ్ఞాన నేత్రముతో పోల్చుకొని, ఈ నక్క ఇంద్రుడేనని నిర్ధారించుకున్నాడు. అప్పుడు ఆయన ఆ నక్కకు గొప్ప గౌరవం ఇచ్చి ఈ అద్భుతమైన సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాడు. అలానే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను విడిచిపెట్టి, భగవంతుడిని ధ్యానించడానికి సిద్ధపడి అడవికి వెళ్ళాడు.

ఇది మానవ శరీరం యొక్క ప్రాముఖ్యతను చేతులవల్ల ల ప్రయోజనాలతో చూపించే సరళమైన కథ, కాని మనుషులుగా మనకు వాక్కు మరియు వివక్షత కలిగిన వివేకము(బుద్ధి) రూపంలో ఇంకా ఎన్నో సామర్థ్యాలు ఉన్నాయి. మనము ఈ సామర్థ్యాలను నిర్లక్ష్యం చేయకుండా వాటిని జీవితపు అంతిమ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలి.  శ్రీల వేదవ్యాసుని యొక్క చివరి మరియు అత్యున్నత రచన అయిన శ్రీమద్భాగవతపురాణము ప్రకారం, జీవితం యొక్క పరమార్ధ ఉద్దేశ్యం సంపూర్ణ వాస్తవికతను మరియు తత్వజిజ్ఞాసను తెలుసుకోవడం అంతేకాని ఈ జీవితాన్ని కేవలము సంపదార్జనలో ధార పోయడము కాదు.

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    విద్య యొక్క ప్రధాన ప్రయోజనం వ్యక్తిత్వ స్వభావాన్ని అభివృద్ధిచేయడం అంతేగాని విద్యార్థి మెదడుని సమాచారంతో నింపడం కాదు.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.