యోగ్యుడైన గురువు ఎవరు?

Articles by Satyanarayana DasaComments Off on యోగ్యుడైన గురువు ఎవరు?

              ఆధ్యాత్మిక జీవన సాధన చేయడానికి ఒక గురువు ద్వారా శిక్షణ పొందాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జ్ఞానయోగము, అష్టాంగయోగము, రాజయోగము మరియు భక్తియోగము వంటి పలు ఆధ్యాత్మిక మార్గములు గలవు. నేటి ప్రస్తుత పరిస్థులల్లో మార్గముల సంలీనముకూడా ఉంది, కాబట్టి వీటి మధ్యగల సరిహద్దులు అస్పష్టంగా ఉన్నాయి. ఒక మార్గముయొక్క ఆచరణ పద్ధతులు వేరే మార్గాల్లోకూడా కలిసిపోయాయి. ఉదాహరణకు కీర్తన చేయడం మొదట భక్తియోగమునందే ఉండేది. కానీ ఇప్పుడు జ్ఞాన, అష్టాంగ మరియు రాజ యోగములను అనుసరించే వారుకూడా దానిలో పాల్గొంటున్నారు. ఒక మార్గములో విజయంసాధించాలంటే దానిని క్షుణ్ణంగా తెలుసుకోని తదనుగుణంగా సాధన చేయాలి. దానికి ఒక యోగ్యగురువు కావాలి. అలాంటి గురువుకు బోధించడానికి ముందుగా తెలియవలసిన జ్ఞానంతోపాటు సరైన ఉద్దేశ్యం కూడా ఉండాలి. శ్రీ జీవ గోస్వామిచే రచించబడిన భక్తి సందర్భము 203వ అనుచ్ఛేదంలో రాగము కలిగిఉన్న మరియు రాగము లేని రెండు రకాల గురువులగూర్చి చెప్పబడింది. ఒకరి స్వంత ప్రయోజనం కోసం, వారి లక్షణములు తెలుసుకోవడం ముఖ్యం. ఈ అనుచ్ఛేద అనువాదం మరియు దాని వ్యాఖ్యానం తెలుపుటకు ప్రయత్నిస్తాను.

203వ అనుచ్ఛేద అనువాదం:

బ్రహ్మ వైవర్త పురాణంలో గురువుకు ఉండవలసిన అర్హతలగురించి ఖచ్చితమైన వివరణ ఇవ్వబడింది.

వక్తా సరాగో నీరాగో ద్వివిధః పరికీర్తితః

సరాగో లోలుపః కామీ తదుక్తం  హృన్ న సంస్పృశేత్ 

ఉపదేశమ్ కరోతి ఏవ న పరీక్షామ్ కరోతి చ 

అపరిక్ష్యోపదిష్టం యత్ లోక-నాశాయ తద్ భవేత్

ఒక బోధకుడు(వక్త) రెండు రకాలుగా ఉండవచ్చు – అనురాగంతో(సరాగ) లేక అనురాగములేకుండా(నీరాగ). అనురాగంతో ఉన్న బోధకుడు లోభి మరియు  ఆశాపాతకుడు. అతని మాటలు విద్యార్థి హృదయాన్ని తాకలేవు. అలాంటి గురువు కేవలం ఉపదేశమిస్తాడు కానీ విద్యార్థిని పరీక్షించడు. పరీక్షచేయకుండా ఇచ్చిన ఉపదేశం సమాజ పతనానికి దారితీస్తుంది.”

ఇంకా [అనురాగములేని బోధకుడి(నీరాగ వక్త) గురించి]:

కులం శీలం అథాచారం అవిచార్య పరమ్ గురుం 

భజేత శ్రవణాది అర్థీ సరసం సార సాగరం

వినుటకు ఉత్సాహంగా ఉన్న అభిలాషి, ఉన్నత అనుభవమున్న, సర్వోత్కృష్ట రసానుభవాన్ని(సరసము) ఆస్వాదించడంలో నేర్పరైన మరియు ప్రత్యక్షంగా గ్రహించిన సత్యంయొక్క సారసముద్రము (సార సాగరము) అయిన పరమ గురువును కుటుంబ నేపథ్యం, ప్రవర్తన లేదా నడవడిని విచారించకుండా స్వీకరించాలి.

    అదే పురాణంలో ఈ క్రింద చెప్పినట్లు పరమ గురువు యొక్క రసాస్వాదన ప్రావీణ్యత లక్షణం[ఎందుకంటే యథార్థముగా అలాంటి రసానుభవంలో నిమగ్నుడైన గురువు మాత్రమే దాన్ని వేరేవారికి తెలియజేయగలడు] మనకు కనిపిస్తుంది.

కామ క్రోధాది యుక్తోపి కృపణోపి విషాదవాన్ 

శ్రుత్వా వికాశం ఆయాతి స వక్తా పరమో గురుః

ఏ బోధకుడి నుండి విని కామక్రోధములలో మునిగియున్న లేదా నిరాశతో ఉన్న వ్యక్తి కూడా హృదయము వికసించే అనుభవాన్ని పొందుతాడో అలాంటి బోధకుడు పరమ గురువు.”

          ఇలాంటి సమర్థత కలిగిన గురువు దొరకకపోవచ్చు, కాబట్టి శ్రీ దత్తాత్రేయులు చెప్పినట్లు తార్కిక విశ్లేషణ యొక్క ప్రాథమికాలను మరియు విభిన్న జ్ఞాన పాఠశాలల మధ్య తాత్విక వ్యత్యాసాలను నేర్చుకోవాలనుకొని కొంతమంది చాలా గురువులను స్వీకరిస్తారు.

న హి ఏకస్మాద్ గురోర్ జ్ఞానం సుస్థిరం స్యాత్ సుపుష్కలం 

బ్రహ్మైతద్ అద్వితీయం వై గీయతే బహుధర్షిభిః

బ్రహ్మము సంపూర్ణ తత్త్వము మరియు అద్వితీయం అయినప్పటికీ దానిని వివిధ ఋషులు బహువిధాలుగా కీర్తించారు. ఈ కారణం చేత, కేవలం ఒక్క గురువు వద్ద సముపార్జించిన జ్ఞానము సుస్థిరముగా లేదా సంపూర్ణముగా ఉండదు.”(భాగవత పురాణం 11.9.31)

దీని అర్థము స్పష్టము.

వ్యాఖ్యానము:

       ఇంతకుముందు అనుచ్ఛేదములో, ఒక సాధువు యొక్క అంతర్గత భక్తి భావము మరియు ప్రభావము అతనితో సాంగత్యము పొందిన వారిని ప్రభావితం చేస్తుందని చెప్పబడింది. ఇది సమాజంలో సాధారణంగా అంగీకరించబడని అతని ప్రవర్తన లక్షణాల విషయంలో కూడా వర్తిస్తుంది. అందుకే ఒక సత్ప్రవర్తన కలిగిన సాధువుతో సాంగత్యం చేయమని సిఫారసు చేయబడింది. ఇది ఈ క్రింది వాక్యం సారాంశం.

హీయతే హి మతిస్తాత హీనైః సహ సమాగమాత్ 

సమైశ్చ సమతాం ఏతి విశిష్ఠైశ్చ​ విశిష్ఠతామ్

తన కన్నా నీచ స్వభావం కలిగినవారి సాంగత్యంవలన ఒక వ్యక్తి బుద్ధి దిగజారుతుంది. సమాన సామర్థ్యం కలిగిన వారితో సాంగత్యంవలన బుద్ధి అదే స్థాయిలో ఉంటుంది, కానీ శ్రేష్ఠమైనవారి సాంగత్యంవలన ఒకరి బుద్ధి శ్రేష్ఠమౌతుంది.”(హితోపదేశం 1.41)

      హరి భక్తి సుభోదయమును ప్రమాణంగా తీసుకొని, స్పటికముకు దగ్గరలోఉన్న వస్తువురంగు దానిలో ప్రతిబింబము చెందినట్లు, సాధువు లేదా గురువు యొక్క లక్షణాలు శిష్యునిలో ప్రతిబింబిస్తాయని శ్రీ రూప గోస్వామి చెప్తారు(భక్తి రసామృత సింధువు 1.2.229). అందుకని, గురువు ఉత్తమ గుణశీలి కావాలి లేకపోతే అతని ప్రభావం శిష్యుడిమీద తీవ్రంగా పడుతుంది. ఆత్మజ్ఞానం కలగని గురువు మరియు తాను బోధించే వాటిపై తనకు నమ్మకంలేని గురువు శిష్యుడి మనసును ప్రభావితంచేయలేడు. ఈ కారణంచేత ప్రబుద్ధ అనే ముని గురువు ప్రత్యక్షంగా తత్త్వమును తెలుసుకొని ఉండాలని స్పష్టంగా నిర్ణయించారు, పరే-బ్రహ్మణి నిష్ణాతమ్(శ్రీమద్ భాగవతం 11.3.21).

          గుంపులుగా జనాలను ఆకర్షించే శ్రీమద్భాగవత ప్రవచనాలను వృత్తిరీత్యా చెప్పేవారు వృందావనంలో మరియు వేరేప్రదేశాలలో ఉన్నారు. కానీ, వారి ప్రవచనాలు వినేవారిమీద అనుకూల ప్రభావం పెద్దగా చూపవు. ఎందుకంటే, అలాంటి ప్రవచనకర్తలు భాగవత బోధనలను తమకుతాము అనుసరించరు. వారు ఈ ప్రవచనాలను కేవలం ధనజన సంపాదన కోసం వాడతారు. అలాంటి ప్రవచన కర్తలు మిఠాయిలు పంచే ఒక చెంచా లాంటివారు – చెంచా తను వడ్డిస్తున్న మిఠాయిలరుచి ఎరుగదు. వృందావనంలో వృత్తిరీత్యా భాగవత ప్రవచనకర్తలను తయారుచేసే పాఠశాలలు కూడా ఉన్నాయి. ఈ పాఠశాలల ధ్యేయానికి భగవంతుని తెలుసుకోవడంతో సంబంధంలేదు.

          ఇంకొక ముఖ్యమైన విషమేమిటంటే గురువు కూడా శిష్యుడిని పరీక్షించాలి. అర్హతలేని శిష్యుడికి జ్ఞానాన్ని బోధించకూడదు. ఒకవేళ అలాబోధిస్తే అది సమాజ వినాశనానికి దారితీస్తుంది. ఎందుకంటే, అర్హతలేని శిష్యుడు ఆ విద్యను భౌతిక ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తాడు. పూర్వం గురువులు చాలా ఖచ్చితంగా ఉండేవారు అందరికీ బోధించేవారుకాదు. శిష్యుడి ఆసక్తి డబ్బు సంపాదన మీద కాకుండా భక్తిమీద ఉందని నిర్ధారణ చేశాకే బోధించేవారు. ఇది గురువు తానే దురాశ మరియు లోభానికి అతీతుడైనప్పుడే సాధ్యం. శ్రీ రామానుజాచార్యులవారిని ఆయన గురువు పద్దెనిమిది సార్లు నిరాకరించినట్లు ఒక కథ ఉంది. అలాగే నరోత్తమ దాస థాకురులను శిష్యుడిగా లోకనాథ గోస్వామి చాలాకాలం నిరాకరించారు.

              ప్రస్తుతం, సాధారణంగా విద్యార్థులను అలా ఖచ్చితంగా పరీక్షించడం జరగడంలేదు. గురువులు శిష్యులను పొందాలని ఆకాంక్షతో ఉన్నారు మరియు వారి మధ్య పోటీ కూడా ఉంది. ఈ కారణంచేత భక్తి యొక్క ప్రమాణం గత యాభై లేదా అరవై సంవత్సరాలక్రిందతో పోలిస్తే చాలా దిగజారిపోయింది.

           ఈ అనుచ్ఛేదములో మొదట పేర్కొన్న బ్రహ్మ వైవర్త పురాణంలోని రెండు శ్లోకములకు మరియు మూడవ శ్లోకానికి మధ్య వైరుధ్యము ఉన్నట్లు అనిపిస్తుంది. మొదటిరెండు శ్లోకాలు లోభియైన భౌతిక వస్తువులపై అనురాగంతో ఉన్న(సరాగ వక్త) గురువునుండి విద్యను పొందకూడదని శిష్యుడిని హెచ్చరిస్తున్నాయి. ఇది శిష్యుడు గురువు వ్యక్తిత్వాన్ని పరిశీలించడం తప్పనిసరని చెప్తుంది.

                కానీ, మూడవ శ్లోకం గురువు కుటుంబ నేపథ్యం మరియు వ్యక్తిత్వాన్ని పట్టించుకోనవసరంలేదని ప్రకటిస్తుంది. ఏ ఆపేక్ష లేకుండా ఉన్న మరియు సర్వోత్కృష్ట రసానుభవాన్ని(సరసము) ఆస్వాదించడంలో నేర్పరైన గురువునుద్దేశించి చెప్పబడింది కాబట్టి పైకి వైరుధ్యంగా అనిపించినా అది పరిష్కరించబడింది. ఒక వ్యక్తికి ఇలాంటి ఉన్నత స్థాయి గురువును కలిసే భాగ్యం కలిగినప్పుడు అతని కుటుంబ నేపథ్యము మరియు వ్యక్తిత్వము వాటి ప్రాముఖ్యతను కోల్పోతాయి. ఆ వ్యక్తి యొక్క విచారణ శక్తి సామర్థ్యాలు అలాంటి గురువువద్ద శిక్షణ పొందడానికి చక్కగా ఉపయోగపడతాయి.

          అదే పురాణంలో చెప్పిన విధంగా, అలాంటి ఉన్నత గురువు మాటలు కామ, క్రోధ మరియు లోభములతో పీడించబడుతున్న వ్యక్తి విన్నాకూడా అతనిలో మార్పు తెచ్చి హృదయాన్ని వికసింపజేస్తాయి. వాస్తవానికి, గురువు యొక్క మాటలు శిష్యునికి కామము మరియు లోభమునుండి విముక్తిని ఇస్తున్నాయంటే, అలాంటి గురువు కూడా ఈ మూల లక్షణాలకు అతీతుడై ఉండాలి.

              ఒకవేళ ఇక్కడ మరియు ముందు అనుచ్ఛేదములలో వివరించినటువంటి గురువు ఒకరికి లభించనప్పుడు, తత్వమును వివిధ గురువులనుండి నేర్చుకొనడానికి ప్రయత్నించాలి. దత్తాత్రేయ స్వామి వారు దీనికి ఉదాహరణ. భాగవత పురాణం(11.7.33-35)లో ఆయన ఇరువదినాలుగు గురువులగురించి చెప్తారు. వారి బోధన చెవుల ద్వారా వినడానికి వారు మానవ గురువులు కాదు. కానీ, వారు పంచ మహా భూతాలు లేక జంతుప్రపంచంలోని కొన్ని జంతువులు. దత్తాత్రేయ స్వామివారే వాటిని జాగ్రత్తగా పరిశీలించో లేదా ఆయన సహజజ్ఞానంతోనో స్వయంగా నేర్చుకున్నారు. చేతనలేని దృగ్విషయాలైన భూమి మరియు వాయువును కూడా ఆయన తన గురువులుగా పేర్కొన్నారు.

                     ఈ ఉదాహరణ అర్థం ఒక సజీవ గురువు ఉండాల్సిన ఆవశ్యకతను కించపరచటము కాదు, ముఖ్యముగా భక్తి మార్గములో ఉన్నవారికి. భక్తిమార్గములో ఒకరికి ఒకే మంత్రము లేదా దీక్ష గురువు ఉండాలి మరియు అతని వద్దనే అధ్యయనం చేయాలి. దీక్ష ఇచ్చిన గురువు చెప్పలేని కొన్ని పాఠ్యాంశాలు ఉన్నా లేదా భౌతికంగా దగ్గరగా లేక చెప్పలేకపోయినా ఆయన అనుమతితో అతని భావంతో ఉన్న మరియు ప్రతికూలంగా లేని వేరే గురువుల వద్ద అధ్యయనం చేయవచ్చు.   

 

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    అహంకారం పతనానికి దారితీస్తుంది. కాని వినయంతో ఉండటం వల్ల పతనమే ఉండదు.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.