రెండవ నామ అపరాధము

SandarbhasComments Off on రెండవ నామ అపరాధము

శివుని నామ గుణములను విష్ణువు నుండి స్వతంత్రమైనవిగా భావించుట

             కృష్ణుని భక్తులలో శివునికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాక, శివుడు గుణ అవతారాలలో ఒకడు. పురాణాలలో ఆయన పరమేశ్వరుడిగా చెప్పబడ్డాడు. హిందువులలో శివుడ్ని పరమేశ్వరుడిగా అంగీకరించే పెద్ద వర్గం కూడా ఉంది. రెండవ నామాపరాధము శ్లోకం చదివినప్పుడు అది సంశయాత్మకంగా ఉంటుంది. శివ మరియు విష్ణు నామాల మధ్య ఏమాత్రం భేదము ఉండకూడదని చెప్తున్నట్లు కనిపిస్తుంది. రెండవ నామాపరాధానికి గల అసలు అర్థం శ్రీ జీవ గోస్వామి ఈ క్రింది అనుచ్ఛేదములో స్పష్టం చేస్తారు.

265.4వ అనుచ్ఛేదము

రెండవ అపరాధానికి సంబంధించి ఈ క్రింది తీర్మానం వినబడుతుంది:

సృష్టిలో కీర్తిగలవి, సంపన్నమైనవి, లేదా శక్తివంతమైనవి అన్నీ కేవలం నా తేజస్సులో ఒక అంశమునుండి ఉద్భవించాయని తెలుసుకొనుము.(గీత 10.41)

శ్రీ బలరాముడు చెప్పినట్లు : “బ్రహ్మ, శివ మరియు నేను కూడా కృష్ణుని అంశములలో అంశములము”(శ్రీ భాగవతం 10.68.37)

శివుడు అన్ని నదులలో సర్వోత్తమమైన గంగా నది పుణ్య జలమును తన తలమీద ఉంచుకొన్నందువలన శివునిగా పేరొందాడు. ఎందుకంటే ఆ గంగ భగవంతుని పాదాలు కడిగిన నీటినుండి ప్రవహిస్తుంది.

మరియు బ్రహ్మదేవుడు చెప్పినట్లు:

ఆయన నియమించినట్లు ఈ విశ్వాన్ని నేను సృష్టిస్తాను, ఆయన పర్యవేక్షణలో శివుడు లయం చేస్తాడు, తనంతట తానే(భగవాన్ హరి) త్రివిధ శక్తులతో పురుష రూపంలో పరిరక్షణ చేస్తాడు.(శ్రీ భాగవతం 2.6.32)

అలాగే, వేదాంత సూత్రం(1.3.3)పై మధ్వాచార్యుల వ్యాఖ్యానంలో ఉటంకించబడ్డ బ్రహ్మాణ్డ పురాణంలో ఈ క్రింది వాక్యాలు మనకు కనిపిస్తాయి.

       జనార్దన భగవానుడు భౌతిక అస్థిత్వ రోగాన్ని పారద్రోలడంచేత రుద్రుడిగా, అందరినీ పాలించడంచేత ఈశానుడిగా, ఆయన మహత్త్వం చేత మహాదేవునిగా పిలువబడతాడు. భవసంసారము నుండి విముక్తిపొంది ఆయన దివ్య ధామ రసము(నాక)ను త్రాగే(పిబన్తి)వారికి ఆధారము కావడంచేత పినాకీ అని విష్ణువు పిలవబడుతున్నాడు. ఆయన పరమసుఖ రూపుడు అగుటవల్ల శివుడి(దయాళువు)గా, అందరిని లయం  చేసే వాడు గనుక హరుడిగా పిలవబడుతున్నాడు. అంతరాత్మగా శరీరంలో ఉండి ప్రేరేపిస్తూ చర్మము(కృత్తి)తో కప్పుబడి ఉన్నందుకు కృత్తివాసుడిగా పిలవబడుతున్నాడు. సృజనాత్మక శక్తి(రేచన)ని విశేష ప్రకారంగా ప్రసరింపచేయడం ద్వారా విష్ణువు విరించిగా పిలవబడుతున్నాడు. పూర్తి వ్యాప్తి(బృహ్మణ)కి ఆధారమైనందున బ్రహ్మము(అనంతముగా విస్తరించబడినది)గా, పరమ ఐశ్వర్యముచేత ఇంద్రుడి(స్వర్గాధిపతి)గా పేరొందాడు. ఈ విధంగా, అనేక అసాధారణ పనులు చేసే ఒకే ఒక్క పురుషోత్తముడు వేద పురాణాలలో పలు పేర్లతో కీర్తించబడుతున్నాడు.

మరియు వామన పురాణంలో:

నారాయణ ఇత్యాది నామాలు ఇతరులనుద్దేశించి కూడా వాడబడతాయనడంలో సందేహం లేదు, కానీ విష్ణు భగవానుడు మాత్రమే అన్ని నామాలకు ఆశ్రయంగా ప్రకటించబడింది.

మరియు స్కంద పురాణంలో:

    ఒక రాజు తన వ్యక్తిగత నివాసము మినహా సమస్త రాజ్య పరిపాలనాధికారాన్ని తన మంత్రులకు ఇచ్చినట్లు తన ప్రత్యేక పేర్లు అయిన నారాయణ మొదలగునవి తప్ప ఇతర నామాలను పురుషోత్తముడు దేవతలకు ప్రసాదించాడు.

మరియు బ్రహ్మ పురాణంలో:

      భగవాన్ కేశవుడు తన సొంత ప్రత్యేక నామాలనుకూడా ఇతరులకు ప్రసాదించాడు. బ్రహ్మకు చతుర్ముఖుడని(నాలుగు తలలు గల వాడని), శతానందుడని(వందలమందికి ఆనందమిచ్చువాడని), మరియు పద్మభుడని(పద్మమునుండి జన్మించినవాడని) పేర్లు ఇచ్చాడు; మరియు శివునికి ఉగ్రుడని(భయంకరుడని) అని, భస్మధరుడని(శరీరం భస్మముతో పూయబడిన వాడని) , నగ్నుడని(దిగంబరుడని), మరియు కపాలీ(పుర్రెలమాల ధరించేవాడని) అనే పేర్లు ఇచ్చాడు.

         ఈ విధంగా విష్ణు భగవానుడు సర్వ దేవతలలో మరియు జీవులలో పరమాత్మయని(సర్వాత్మకత్వ) శాస్త్రములనుండి సుప్రసిద్ధంగా తెలుస్తుంది. ఈ కారణంచేత, ఎవరైనా శివుని నామ, గుణ మరియు ఇతర లక్షణాలు విష్ణు నామ, గుణ మరియు లక్షణాలనుండి వేరైనవని, అంటే శివుని సొంత శక్తితో వ్యక్తమైనవని ఆలోచించినా, చూసినా వారు అపరాధి.

          శివ మరియు విష్ణువుల మధ్య అభేదమును సూచించడానికి షష్ఠీవిభక్తి వాడినట్లైతే విష్ణోః తర్వాత “చ” అనే పదం ఉండేది.[విష్ణోః తర్వాత “చ” అంటే కూడా ఉండే వ్యతిరేకార్థం వచ్చేది. అనువాదం ఇలా ఉండేది. “శివ మరియు శ్రీ విష్ణువుల నామ, గుణ, మరియు ఇతర లక్షణాలను భిన్నమైనవిగా భావించే వారు నామానికి అసహ్యం కలిగిస్తారు.” చ అనే పదం లేదుగనక శివ మరియు విష్ణువుల మధ్య అభేదమును వాదించడం ఈ శ్లోకం యొక్క తాత్పర్యం కాదని శ్రీ జీవ గోస్వామి ఉద్దేశ్యము.] భగవాన్ విష్ణు ఆధిపత్యం చూపడానికి గౌరవప్రదమైన శ్రీ అనే పదం విష్ణు పదం ముందు మాత్రమే ఉపయోగించబడింది. అందుచేత, 9వ అపరాధములో ఉన్న శివ-నామాపరాధః(మంగళమైన నామముయందు అపరాధము) అనే సమస్తపదములో కూడా శివ అనే పదం శ్రీ విష్ణువునే సూచిస్తుంది. అలానే, విష్ణుసహస్ర నామాల్లో స్థాణు(స్థిరమైనది) మరియు శివ అనే పేర్లుకూడా విష్ణువునే సూచిస్తాయి.

సత్యనారాయణ దాస బాబాజీ వారి వ్యాఖ్యానం

     సంపూర్ణ తత్త్వమొక్కటనేదే అన్ని శాస్త్రాల ప్రధాన సారము. జీవ గోస్వామిచే రచించబడిన తత్వ సందర్భములో సంపూర్ణ తత్త్వమును తెలుసుకోవడానికి సర్వోన్నత ప్రమాణంగా నిరూపించబడిన భాగవత పురాణం(1.2.11)లో ఇది స్పష్టముగా చెప్పబడింది. ఈ సంపూర్ణ తత్త్వము మూల రూపంలో స్వయం భగవానుడైన శ్రీ కృష్ణుడిగా గుర్తించబడింది(1.3.28). ఆయననుండి ఎవ్వరూ వేరుగా ఉండలేరు(బ్రహ్మ సంహితా 5.1, భగవద్గీత 10.8). ఈ విషయము కృష్ణ సందర్భము(అనుచ్ఛేదములు 1-29)లో వివరించబడింది. దీనివల్ల ఎవ్వరూ ఆయనకు సాటి లేరని మరియు ఆయనకన్నా ఉన్నతమైనవారు ఉండే అవకాశమే లేదని తెలుస్తుంది. అర్జునుడు దీన్ని తన ప్రార్థనలో ధృవీకరిస్తాడు(భగవద్గీత 11.43). కృష్ణుడే తనకు తానుగా తనకంటే ఉన్నతమైనది ఏదీ లేదని చెప్తాడు(భగవద్గీత 7.7).

      శివ మొదలగు అన్ని నామాల అసలు అర్థము విష్ణువు అని నిరూపించుటకు శ్రీ జీవ గోస్వామి అనేక శ్లోకాలను ప్రమాణంగా చూపించారు. ఈ అనుచ్ఛేదములో అపరాధముల వర్ణనలో శివ అనే పదము విష్ణువుకు ఉపయోగించడం(పద్మ పురాణం, బ్రహ్మ ఖంఢము 25.17) ద్వారా కూడా ఇది మనకు విశదమౌతుంది. కాబట్టి, శివుని నామ గుణాలను కృష్ణుని నుండి వేరైనవిగా లేదా కృష్ణునితో సమానవైనవిగా భావించడం అజ్ఞానం మరియు అది కృష్ణుడిని  అవమానించడం అవుతుంది. ఈవిధముగా నామానికి అగౌరవం కలిగించడం అపరాధము. ఇది ఒక చక్రవర్తి సమక్షంలో అతని మంత్రిని చక్రవర్తి అని సంబోధించి గౌరవించడం మరియు చక్రవర్తిని మంత్రిగా సంబోధించడం వంటిది.

         ఇక రెండవ అపరాధం విషయంలో, శివస్య విష్ణోర్ య ఇహ గుణ నామాది సకలమ్ ధియా భిన్నం పశ్యేత్ స ఖలు హరినామాహితకరః అంటే “శివుని నామ, గుణ మరియు ఇతర లక్షణాలను భగవాన్ విష్ణు నామ, గుణ మరియు ఇతర లక్షణాల నుండి భిన్నమైనవని అనుకోవడం నామ అపరాధము” అని అపార్థం చేసుకోకూడదు. విష్ణోః అనే పదం షష్ఠీవిభక్తిలో వాడినట్లు అనుకుంటే అలా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు “యః” బదులు “చ” అనే పదం వాడాలి. కానీ జీవ గోస్వామి వివరణ ప్రకారం విష్ణోః అనే పదం పంచమీ విభక్తిలో ఉంది మరియు ఇది కృష్ణుడు సంపూర్ణ తత్త్వానికి ఉన్నత వ్యక్తీకరణమనే సత్యానికి అనుగుణంగా ఉంది.

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    ప్రతిఒక్కరూ తమ ఆనందమును ఒక ప్యాకేజీగా బయటకు ప్రదర్శిస్తున్నారు, కానీ లోపల అసంతృప్తితో ఉన్నారు. మనము ఇతరుల బాహ్య ఆనందాల ప్యాకేజీలను చూసి అసూయ చెందుతున్నాము.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.