లౌకిక శ్రద్ధ మరియు శాస్త్రీయ శ్రద్ధ

Articles by Satyanarayana DasaComments Off on లౌకిక శ్రద్ధ మరియు శాస్త్రీయ శ్రద్ధ

                 186వ అనుచ్ఛేదమునుండి 202వ అనుచ్ఛేదమువరకు కర్మ, జ్ఞాన మరియు భక్తి మార్గములకు సంబంధిచిన పలు రకాల సాధువుల గురించి శ్రీ జీవ గోస్వాముల వారు వివరిస్తారు. దీని ముఖ్య ఉద్దేశ్యము ఎటువంటి సాధువులతో సాంగత్యం పొందాలని మనకు తెలియజేయటమే. ఈ క్రమంలో హవి ముని చెప్పినట్లు ఆయన ఒక కనిష్ఠ భక్తుడిని కూడా ప్రస్తావిస్తారు. ఈ శ్లోకం గూర్చి  వివరిస్తూ భక్తుని శ్రద్ధ మీద ఒక ముఖ్యమైన గమనించదగిన నిర్వచనాన్ని చెప్తారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని సాధారణ శ్రద్ధ మరియు శాస్త్రాధార శ్రద్ధ మధ్య గల  భేదాన్ని తెలియచేస్తాను. ఇది 190వ అనుచ్ఛేదము యొక్క టీకలో వివరించబడింది. ఆసక్తిగల పాఠకులకోసం ఇది ఇక్కడ సమర్పించబడింది.

కనిష్ఠ భక్తుని లక్షణాలు

అనుచ్ఛేదము యొక్క అనువాదము

ఇప్పుడు హవి ముని కనిష్ఠ భక్తుడు భగవత్ ధర్మము ఆచరించేక్రమంలో బయటకు విశదమగు భౌతిక లక్షణము(కాయిక-లింగ)లను మరియు కొంతమేరకు మానసిక స్వభావము(మానస-లింగ)లను గురించి వివరిస్తారు:

అర్చాయాం ఏవ హరయే పూజాం యః శ్రద్ధయేహతే 

న తద్-భక్తేషు చాన్యేషు స భక్తః ప్రాకృతః స్మృతః

భగవంతుని మూర్తియందు మాత్రమే శ్రద్ధ కలిగి ఆరాధించేవాడు, ఆయన భక్తులలో లేదా ఇతర ప్రాణులలో భగవంతుని గుర్తించనివాడు ప్రాకృత భక్తుడు, ఇతని స్వభావం(ప్రకృతి) ప్రారంభదశలో ఉంటుంది.”(భాగవత పురాణం 11.2.47)

                ఈ శ్లోకంలో కనిష్ఠ భక్తుడు భగవంతుని అర్చ విగ్రహ రూపంలోనే పూజిస్తాడని ఉంది. అతను భగవంతుని ఉనికిని ఆయన భక్తులలో గమనించడు, తద్వారా ఖచ్చితంగా ఇతరులలో కూడా గుర్తించడు. దీనికి కారణం, అతనికి భగవంతునిపై ప్రేమ లేకపోవడం, భగవంతుని నిజమైన భక్తుల కీర్తి తెలియకపోవడం, మరియు భక్తుని ప్రాధమిక లక్షణమైన అన్ని జీవులపట్ల పూజ్యభావం లేకపోవడం. భక్తిలో అతని శిక్షణ కొత్తగా మొదలైంది కాబట్టి అలాంటి భక్తుడిని ప్రాకృత భక్తుండంటారు. ఇంకా, అతని శ్రద్ధ శాస్త్రము అధ్యయనం చేయడంవల్ల వచ్చినదికాదు. ఇలాంటి స్వభావం ఈక్రింద శ్లోకంలో చెప్పబడింది.

యస్యాత్మ బుద్ధిః కుణపే త్రిధాతుకే

స్వధీః కళత్రాదిషు భౌమ ఇజ్యధీః

యత్తీర్థ బుద్ధిః సలిలే న కర్హిచిత్   

జనేషు అభిజ్ఞేషు స ఏవ గోఖరః

ఎవరు వాత, కఫ మరియు పిత్తములతో కూడిన కళేబరము వంటి ఈ శరీరాన్ని తానుగా భావిస్తారో; తన భార్య, పిల్లలు మరియు ఇతరులను తన స్వంత వారిగా భావిస్తారో; మట్టితో చేసిన బొమ్మలను పూజించదగినవిగా భావిస్తారో; నదిలోని నీళ్లను తీర్థ ప్రదేశాలుగా భావిస్తారో; కానీ తత్వము గ్రహించిన సాధువును అదే పూజ్యభావంతో (తమ అసలు స్వీయంగా, తమ స్వంతమైనవారివలె, తమ పూజ్య వస్తువువలె మరియు తమ తీర్థ ప్రదేశమువలె) చూడరో, అలాంటి వారిని జంతువులలో గాడిదవలె భావించవలెను.”(భాగవత పురాణం 10.84.13)

ఈ భావనలు శాస్త్రముల సిద్ధాంతముపై అవగాహన లేకపోవడంవలన వచ్చేవి.

          కాబట్టి, పైన చెప్పినట్లు కనిష్ఠ భక్తుడి శ్రద్ధ కేవలం సామాజిక మర్యాద(లోక పరంపర) వలన వస్తుంది. అందుకని, భగవంతునిపై దివ్యప్రేమ హృదయంలో ప్రకాశించని ఒక ఆధ్యాత్మిక సాధకుడి శ్రద్ధ శాస్త్రజ్ఞానం మీద ఆధారపడిఉండడంవల్ల ఇది కనిష్ఠ భక్తుని ప్రాథమిక ప్రమాణం.

వ్యాఖ్యానము

         ఇంతకముందు భక్తి పొందుటకు శ్రద్ధ ప్రధాన పూర్వాపేక్షితమని చెప్పబడింది. ఈ శ్రద్ధ సాంప్రదాయాలలో ఉండే ఒకరి ఆచార వ్యవహారాలవలన(లౌకిక శ్రద్ధ) లేదా క్రమబద్ధమైన శాస్త్ర అధ్యయనం(శాస్త్రీయ శ్రద్ధ) వలన లభిస్తుంది. భారతదేశంలో ప్రతి ప్రదేశంలో లేదా గ్రామంలో ఒక నిర్దిష్ట దేవతను పూజించడం మనం సాధారణంగా చూడవచ్చు. ఒక ప్రాంతంలో ఉన్న దేవతపై ఆ ప్రాంతీయ వాసులు చిన్నతనంనుండి వారి పెద్దలు ఆ దేవతను పూజించడంవలన భక్తివిశ్వాసాలు కలిగిఉంటారు. వారు ఆ దేవతకు సంబంధిచి అక్కడ జరిగే పండుగలలో కూడా పాల్గొంటారు. ఇదంతా వారి మనస్సులలో ఒక దృఢమైన సంస్కారములను ఏర్పడేలా చేస్తుంది, మరియు వారు పెరిగి పెద్దైనతర్వాత కూడా ఆ దేవతను పూజించే సంప్రదాయాన్ని కొనసాగిస్తారు.

            క్రమేపీ, ఈ సంప్రదాయం ఒక స్థిరమైన సామాజిక ఆచారమౌతుంది. ఒక వర్గానికి చెందినవ్యక్తి దానికి తగ్గట్లు నడుచుకోకపోతే అతను తన వర్గమునుండి బహిష్కరించబడినట్లు భావిస్తాడు. సహజంగానే ఇది సమాజంలో తన మనుగడకు సమస్య అవుతుంది. అందుకని భారతదేశంలో పలు ప్రదేశాలలో చాలా మంది ప్రజలు ఆ ప్రాంతంలో పూజించబడే కృష్ణుడినో, రాముడినో, గణేశుడినో, శివుడినో, కాళీదేవినో లేక అనేకమైన ఇతర దేవతలనో పూజిస్తారు.

ఈ ఉపాసకులకు శాస్త్రం గురించి తెలియదు. వారు కేవలం వారి ముందువారిని అనుసరిస్తారు.

           ఇది క్రైస్తవ, యూదుల, మహమ్మదీయ, సిక్కు మొదలగు ఇతర మతాలను అనుసరించే వారికి కూడా వర్తిస్తుంది. ఒక మతపరమైన సాధన లౌకిక శ్రద్ధ మీద మాత్రమే ఆధారపడి ఉంటే దానికి శాస్త్రము లేదా ఈశ్వరతత్త్వముపై జ్ఞానం ఉండదు. తద్వారా, అది బలహీనమైనదిగా ఉండడం వల్ల ప్రతివాదనలకు అవకాశం ఎక్కువ మరియు శ్రద్ధ కోల్పోవడం జరుగుతుంది.

      రెండవ రకమైన శ్రద్ధ(శాస్త్రీయ శ్రద్ధ) ఒక అర్హతకలిగిన భక్తుని పర్యవేక్షణలో శాస్త్రమును విని మరియు అధ్యయనం చేయడం ద్వారా కలుగుతుంది. భక్తి రసామృత సింధువు(1.2.17-19) లో వివరించబడిన మూడు రకాల యోగ్యులైన భక్తులకు ఈ శ్రద్ధ ఆధారం. అలాంటి భక్తులు చాలా అరుదు.

     ప్రస్తుతం, మూడవ రకమైన శ్రద్ధ ప్రసిద్ధిలో ఉంది, అదేమనగా, మత మార్పిడి వలన సంభవించిన శ్రద్ధ. అలాంటి శ్రద్ధను పొందిన వారు భక్తిమార్గమును(లేదా వేరే మతమును) బోధన ప్రభావంవల్ల స్వీకరిస్తారు. సాధారణంగా ఇలాంటి సాధకులు శాస్త్రమును ప్రామాణికంగా అధ్యయనం చేయరు అలాగని వారు మొదటిరకం వారివలె పూర్తిగా శాస్త్ర జ్ఞానం తెలియనివారు కూడా కాదు.

        ప్రస్తుత భక్తుల్లో చాలా మంది మొదటి లేదా మూడవ రకానికి చెందినవారు. శాస్త్రము ఆధారంగా ఉన్న శ్రద్ధ కనిష్ఠ భక్తుని ప్రాథమిక ప్రమాణమని శ్రీ జీవ గోస్వామి వ్యాఖ్యానించారు. భక్తి రసామృత సింధు(1.12.19) లో అతడు ఇలా వర్ణించబడ్డాడు: “శాస్త్రీయ శ్రద్ధ బలహీనం(కోమల)గా ఉన్న వ్యక్తిని కనిష్ఠుడంటారు.”

         శ్రీ జీవ గోస్వామి పైశ్లోకానికి టీకలో కనిష్ఠ భక్తుడికి శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని వాదించడం తెలియదని మరియు ప్రత్యర్థి ఎవరైనా భక్తికి విముఖంగా వాదనలు వినిపించి అతడిని ఖండించవచ్చని వ్రాస్తారు. దీనర్థం, కనిష్ఠ భక్తుడు భక్తి మార్గంవదలి వెళ్ళిపోతాడనికాదు, ఎందుకంటే అతనికి నిజమైన విశ్వాసం మొదటి దశలో లభించింది. అతను మొదట ప్రత్యర్థియొక్క ప్రతివాదనలవలన కలతచెందవచ్చు కానీ త్వరలోనే భక్తిమీద మనస్సుని లగ్నం చేస్తాడు.

          హవి ముని వర్ణించిన కనిష్ఠ భక్తుడు ఇంకా తక్కువ లేదా మొదటి రకానికి చెందినవాడు. తన విశ్వాసముతో భగవంతుని ఉనికిని అతడు కేవలం అర్చ విగ్రహంలో చూస్తాడు, కానీ భక్తులతోసహా ఇతర జీవులలో భగవంతుని చూడలేడు. ఎందుకంటే, అతని దృష్టి క్రమబద్ధమైన శాస్త్ర అధ్యయనము ద్వారా తెలుసుకోబడలేదు మరియు తీర్చిదిద్దబడలేదు కాబట్టి.

       భక్తి రసామృత సింధు శ్లోకములో చెప్పబడిన కనిష్ఠ భక్తుడు ఈ అనుచ్ఛేదంలో ప్రధాన శ్లోకంలో వివరించబడిన కనిష్ఠ భక్తుడికన్నా మేలు. తక్షణం అనుభవం లేకపోయినా అతనికి ఇతర భక్తులయందు గౌరవం మరియు ఇతర జీవులలో భగవంతుని ఉనికి గమనించడానికి అనుకూలత ఉన్నాయి. ఎల్లప్పుడూ విజయవంతం కాకపోయినా అతను శాస్త్రమునకు కట్టుబడివుండుటకు ప్రయత్నిస్తాడు. పోల్చిచూస్తే, మధ్యమ భక్తుడికి భక్తులపట్ల ఇంకా లోతైన గౌరవాభిమానాలు ఉంటాయి ఎందుకంటే అతనికి భగవంతుని, భక్తియొక్క మరియు భక్తులయొక్క కీర్తి బాగా తెలుసు. భక్తులను అగౌరవపరచడం భగవంతుడికి ఇష్టం ఉండదని కూడా అతనికి తెలుసు. ఈ కారణాలచేత అతడు వారితో స్నేహం(మైత్రి) చేస్తాడు.

       ఈ అనుచ్ఛేదంలోని  ప్రధాన శ్లోకంలో కనిష్ఠ భక్తుడి లక్షణాలు భౌతికమైనవి మరియు మానసికమైనవిగా చెప్పబడ్డాయి. భగవంతుని పూజించుట అనేది భౌతిక ప్రక్రియ, మరియు ఆ ప్రక్రియ వెనుక ఉన్న శ్రద్ధ మానసిక లక్షణము.  

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    మనం ఇతరులకు గౌరవం ఇవ్వడం ద్వారా మన విలువను తగ్గించుకుంటామని అహంకారం చేత అనుకుంటాము. కానీ నిజం దీనికి పూర్తి విరుద్ధం.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.