వివేకంతో సముచితమైన వివక్షవైపు

Articles by Satyanarayana DasaComments Off on వివేకంతో సముచితమైన వివక్షవైపు

“వివక్ష” అనే పదానికి ప్రతికూల అర్థాలు ఉన్నాయి, ఎందుకంటే మనం దీన్ని చాలా తరచుగా ప్రతికూల సందర్భాలలో ఉపయోగిస్తాము. ఉదాహరణకు, “జాతి వివక్ష” “కుల వివక్ష” “లింగ వివక్ష” మొదలైనవి. దానికి పర్యవసానంగానే వివక్షకు వ్యతిరేకంగా సలహాలు వినడం చాలా సర్వ సాధారణం. వేరొకరి గుణగణాలను గూర్చి గాని, విలువల గురించిగాని బేరీజువేయకుండా అందరితో సమదృష్టితో ఉండాలియని మనకు సలహాలు ఇవ్వబడుతుంటాయి. ఈ ఆదర్శాలు చాలా గొప్పవిగా పరిగణించబడుతున్నాయి, కాని అవి విస్తృతంగా ఆచరించబడడం మనకు కనపడదు. వారిని అనుసరించే వారు కూడా అన్ని సమయాలలో వారిని అనుసరించలేరు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ కొంత స్థాయిలో నిర్ణయాత్మకంగా వివక్ష చూపుతారు-వాస్తవానికి, వివక్ష చూపడం మరియు నిర్ణయాత్మకంగా ఉండడం అనేది మేధస్సు యొక్క పని. తెలివితేటలు ఉన్న వ్యక్తిని నిర్ణయాత్మకంగా ఉండవద్దని అడగడం అంటే చెవులు ఉన్న వ్యక్తిని వినవద్దని అడగడం లాంటిది.

నిజానికి మనం మన దైనందిన జీవితంలో రోజూ నిర్ణయాలు తీసుకుంటూనే ఉండాలి అవి లేకుండా మన జీవనం ముందుకు సాగలేదు. ఒక పురుషుడు విమానాశ్రయంలో స్త్రీల శోచాలయంలోకి ప్రవేశిస్తే, అక్కడ గందరగోళం ఉంటుంది. మీరు మీ కారును వికలాంగుల కోసం రిజర్వు చేసిన ప్రదేశంలో పార్క్ చేస్తే, మీకు జరిమానా విధించబడుతుంది. కొన్ని దేశాలలో, మీరు మీ భాగస్వామిని బహిరంగంగా ముద్దు పెట్టుకుంటే మీ తల కోల్పోతారు. కాబట్టి ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా సరైన నిర్ణయాలు, తీర్పులు తీసుకోవాలి. మనం స్త్రీ-పురుషలకు కేటాయించిన గదుల మధ్య, సాధారణ-వికలాంగుల వాహన నిలుపస్థలాల మధ్య, భావ ప్రకటనకు అనువైన-అనువుగాని స్థలాల మధ్య వివక్షతో వ్యవహరించాలి.

వివక్ష అన్నిచోట్లా ప్రతికూలమైనదికాదు. దీన్ని కేవలం అవమానకరంగా, ద్వేషంగా, అసమానతగా కానే చూడకూడదు. భారతీయ తత్వశాస్త్రంలో, వివక్షను వివేకమని పిలుస్తారు మరియు ఆధ్యాత్మిక పురోగతి కోసం సాధన చేయవలసిన లక్షణంగా పరిగణించబడుతుంది. వివేకా అనే పదం విచిర్ అనే శబ్ద మూలం నుండి ఉద్భవించింది, దీని అర్థం “వేరుచేయడం” లేదా “రెండు వస్తువులు, లక్షణాలు లేదా కార్యకలాపాల మధ్య వ్యత్యాసాన్ని చూడటం”. వివేకం సరైన తీర్పు తీసుకోవటానికి, సరైన అవగాహనకు, వివేచనకు మూలాధారం. జ్ఞాన మార్గంలో, ఇది ఆధ్యాత్మిక క్రమశిక్షణకు చెప్పబడిన నాలుగు లక్షణాలలో ఒకటి.

రెండు విషయాలు ఒకదానితో ఒకటి వేర్వేరు చేయలేనంతగా కలసిఉన్నప్పుడు వాటిని వేరుచేసేందుకు సరైన వివక్ష చాలా అవసరం. పగలు మరియు రాత్రి లేదా తెలుపు మరియు నలుపు మధ్య వివక్ష చూపడం చాలా సులభం, కానీ తెలుపు రంగులోనే రకరకాల తెలుపుల మధ్య వివక్ష చూపడం కష్టతరం.  అలానే మన జీవితంలో కూడా,శాశ్వతమైన మరియు అశాశ్వతమైనవి ఒకదానితో ఒకటి కలిసిఉంటాయి. కావున, ఆధ్యాత్మిక జీవితములో “వివేకము” అనునది వాస్తవము-అవాస్తము, నిత్యము-అనిత్యము, ఆత్మ-అనాత్మ మరియు భౌతికానందం- బ్రహ్మానందం మధ్య బేధాన్ని గుర్తించగలడం.

జ్ఞానయోగములో మోక్షాన్ని పొందటానికి కావాల్సిన వాటిలో ఇది ముఖ్యమైనది. శ్రీ ఆదిశంకరులు రచించిన “వివేకచూడామణి” అనే ప్రసిద్ధ కావ్యములో వివేకాన్ని మరియు మోక్ష మార్గములో దాని ప్రాముఖ్యతను వివరించారు. వారు వివేకాన్ని ఈ క్రింది విదంగా నిర్వచించారు.

బ్రహ్మ సత్యం జగన్మిత్యే త్యేవమురూపో వినిశ్చయః 

సోయం నిత్యానిత్య వస్తువివే కః సముదా హృతః

“బ్రహ్మము వాస్తవము మరియు విశ్వము అవాస్తవము అని ఖచ్చితముగా గ్రహించి నిశ్చయించుకొనుటనే నిత్య మరియు అనిత్య వస్తువుల మధ్య వివేకము చూపడం అంటారు.”

వివేకం కేవలం జ్ఞానయోగ మార్గము లోనే కాకుండా కర్మ, భక్తి యోగ మార్గాలలో కూడా ముఖ్యమైనది. ఎందుకనగా ఈ మార్గాలన్నీ కూడా ఆత్మ అనేది భౌతిక దేహము మరియు మనస్సుకి భిన్నమైనది అనే ప్రాథమిక సూత్రం మీద ఆధారపడివున్నాయి. ఈ సూత్రం భగవద్గీత ప్రారంభంలో శ్రీకృష్ణుడు బోధించిన ప్రాథమిక సూత్రంకూడా. ఈ మార్గాలన్నీ కూడా మన ఈ దుఖాలకు మూలకారణం మనం కేవలం దేహమనే అఙ్ఞానం అని ప్రబలంగా నమ్ముతాయి. ఇటువంటి అజ్ఞానాన్ని కలిగి ఉండటంచేత మనల్ని మనం దేహముగా భావిస్తాము, దానికి అనుగుణంగానే మనస్సు అట్టి స్థితి లో ఉండేటట్లు చేస్తుంది. ఇది నిరంతర దుఃఖానికి, జనన మరణ సంసారానికి హేతువుగా మారుతుంది. మరోమాటలో చెప్పాలంటే, ఈ ఆధ్యాత్మికమార్గాలన్నీ స్వీయాన్ని ఇతరత నుండి వేరుచేయపోలేక పోవటమనే అసమర్ధతే ఈ దుఃఖానికి మూలకారణంగా నమ్ముతాయి.  కనుక వివేకమనేది ఏ మార్గాన్ని అనుసరిచేటటువంటి ఆధ్యాత్మిక తత్త్వ వేత్త కైనా కావలసిన ముఖ్య లక్షణం.

వివేక అభివృద్ధి

మన దైనందిన జీవితంలో తీసుకునే నిర్ణయాలలో వివేకం నిగూఢమంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులు, సహోద్యోగులతో మరియు సమాజంలోని సభ్యులతో మంచి మానవ సంబంధాలు కలిగి ఉండటానికి మనకు వివేకం ఎంతో అవసరం, ఎందుకంటే మనం అందరినీ ఒకే విధంగా చూడలేము. మనము మన తల్లిదండ్రులతో వ్యవహరించే విధానం మన పిల్లలతో వ్యవహరించే ఒకే విధంగా ఉండదు. అలానే మనం మన క్రింది వారితో వ్యవహరించే తీరు మన యజమానితో వ్యవహరించే తీరు కంటే భిన్నంగా ఉంటుంది.

వివేకం జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. మనం మన వివేకాన్ని వినియోగించి ఏది మనకు ప్రయోజనకరమోకాదో నిర్ణయిస్తాము. విద్య మనకు వివేకాన్ని, నైతికతను, నీతిని ఒసగుతుంది. దాని వల్ల మనం విచక్షణ కలిగి మంచి, చెడుల మధ్య వ్యత్యాసాన్ని సులభంగా చేయగలుగుతాము. కనుక వివేకమును శ్రద్ధతో కూడిన విద్య వల్ల మరియు ఒక సంఘటన లేదా పరిస్థితిని విమర్శనాత్మకకోణంతో పరిశీలించడం ద్వారా అభివృద్ధి చేయగలుగుతాము. 

వివేకం యొక్క ఉపయోగాలు

వివేకం మన ప్రాధాన్యతలను నిర్ధారించుకోవడానికి మరియు వాటి యందు లగ్నమవడానికి సహాయపడుతుంది. వివేకం ఒక వ్యక్తికి ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తుంది. అది లేకపోతే మనం గుంపు మనస్తత్వాన్ని అనుసరిస్తూ గొర్రెలుగా మిగిలిపోతాము. వివేకం చెడు అలవాట్లను విచ్ఛిన్నం చేయడానికి కూడా తోడ్పడుతుంది. మనకు మన అలవాట్లు మనకు ఆనందాన్ని కలిగించే చర్యలను అనేకసార్లు చేయడం వల్ల ఏర్పడతాయి. కాని ఈ ఆనందం అనవసరమైన ఖర్చుతో వస్తే అది చెడ్డ అలవాటు. మనస్సు స్వతహాగా ఒక అలవాట్లను విచ్ఛిన్నం చేయదు.  ఎందుకంటే ఇది ఎల్లప్పుడూ అలవాటుపడిన ఆనందం వైపు ప్రవహిస్తునే ఉంటుంది. శ్రీకృష్ణుడు వివేకం మనస్సు కంటే గొప్పదని భగవద్గీతలో (3.42) వివరిస్తాడు. ఎందుకంటే “ఆగు సుమా! ఇది మంచి కంటే ఎక్కువ హానిని కలిగిస్తుంది.” అని మనకు సూచన చేయగలిగేది వివేకం మాత్రమే. 

బలమైన వివేకవంతుడు మనస్సు యొక్క ఇష్టాలు, అయిష్టాలు, భయాలు, కోరికలను తాత్కాలికమైనవిగా మరియు ఆత్మను శాశ్వతమైనదిగా చూస్తాడు. అందువల్ల అతను మనస్సు యొక్క ఇష్టాలకే పూర్తిగా పరిమతం కాకుండా   వాటిని మార్చడానికి మరియు కొత్త అలవాట్లను ఏర్పరుచుకోవటానికి శక్తిని సమీకరించగలడు. ఈ కారణంగా, ఈ విధమైన వివక్ష కల్గిన వ్యక్తి చివరికి తన దృష్టిని భౌతిక  ప్రపంచం నుండి మళ్లించి, ఆత్మ యందు  దృష్టి పెట్ట కలుగుతాడు . ఇది జ్ఞానయోగం యొక్క ప్రధాన సాధనము. వివక్షత పరిపూర్ణమయ్యే వరకు, ఒక వ్యక్తి తాత్కాలిక ఆనందాలు మరియు బాధల ప్రపంచంలో చిక్కుకుంటూనే ఉంటాడు. స్వీయ(ఆత్మ) లేదా సంపూర్ణ వాస్తవికతను మనం చాలా ముఖ్యమైనదిగా అర్థం చేసుకుంటే, మన ప్రయత్నాలు సహజంగానే ఈ స్వీయతను తెలుసుకునే దిశగా ఉంటాయి. ఇది మనం వివేకాన్ని సరిగ్గా ఉపయోగిస్తేనే సాధ్యమవుతుంది.

వివేకం నుండి వైర్యాగ్యంలోకి

 వివేకము అందువల్ల వైరాగ్యము (“రాగద్వేషముల లేమి”) ను ఉత్పత్తి చేస్తుంది. వైరాగ్యము అనే పదానికి రాగం నుండి విముక్తి అని అర్ధం, మరియు రాగము అంటే అభిరుచి లేదా అనుబంధం. మనస్సు రాగము మరియు దాని వ్యతిరేకమైన, ద్వేషము అను గాడిలో కదులుతూ ఉంటుంది.

“అనుబంధం” అనేది ఒక నిర్దిష్ట వస్తువు లేదా కార్యాచరణకు అనుకూలాత్మమంగా ఉండే ప్రేరణ. మనస్సు సహజంగా దానికి అనుసంధానించబడిన వస్తువులపై దృష్టి పెడుతుంది.  అనుబంధంఎంత తీవ్రంగా ఉంటే, మనస్సు ఆ వస్తువు లేదా కార్యాచరణపై మరింత లోతుగా ధ్యానం చేస్తుంది. అందువల్ల, రాగ-ద్వేష ప్రభావంలో ఉన్న వ్యక్తి యొక్క మనస్సు ఎల్లప్పుడూ నెట్టివేయబడుతుంది మరియు లాగబడుతుంది అలానే నిజంగా శాంతియుతంగా లేదా స్వేచ్ఛగా ఉండదు.

ఒక వ్యక్తి యొక్క మనస్సు. ఇష్టాలు మరియు అయిష్టాలు లేకుండా ఉండడం కూడా సాధ్యమేనా అని ఒకరు ఆశ్చర్యపోవచ్చు: “మనకు ఇంద్రియాలు ఉన్నంతవరకు, అవి కొన్ని వస్తువులపై వాటి ఆకర్షణ మరియు వికర్షణ కలిగి ఉంటాయి. విముక్తి పొందిన వ్యక్తి కూడా కొన్ని ఆహారాలను ఇష్టపడతారు మరియు ఇతరులను ఇష్టపడరు.” ఇష్టాలు మరియు అయిష్టాలు కలిగి ఉండటం సమస్య కాదు. సమస్య వాటితో అనుబంధం కలిగి ఉండటంలో ఉంటుంది. విముక్తి పొందిన వ్యక్తి యొక్క మనస్సు అతని ఇష్టాలు మరియు అయిష్టాలకు అనుసంధానించబడదు. అతను వాటిని కలిగి ఉండటం లేదా కలిగి లేకపోవడం వల్ల అతను ఆందోళన చెందడు. అతను ఎల్లప్పుడూ సమతుల్యతతో ఉంటాడు. అతను వాటి పైన ఆధారపడిఉండడు. అతను ఒక నిర్దిష్ట ఆహారం యొక్క రుచిని ఇష్టపడి, దానిని పొందలేకపోతే, దానితో ఆందోళన చెందడు. మరోవైపు, ఒక సాధారణ వ్యక్తి తన ఇష్టాలు మరియు అయిష్టాలకు కట్టుబడి ఉంటాడు. అవి అతనికి ఒక విధమైన వ్యసనం మరియు అవి అతనికి సరఫరా చేయకపోతే, అతను జీవితాన్నిదుర్భరంగా భావిస్తాడు. అందువల్ల, జ్ఞానోదయం లేదా విముక్తి పొందడం అంటే మొత్తం ఇష్టాలు లేదా అయిష్టాలు లేకపోవడం కాదు. విముక్తి పొందిన వ్యక్తికి భావోద్వేగాలు లేవని కూడా దీని అర్థం కాదు. అతను రాతిలాంటి వాడు కాదు. అతను కోరికలు మరియు భావోద్వేగాలను కలిగి ఉంటాడు కాని వాటిని నియంత్రించగలడు మరియు అతను వాటి నియంత్రణలో ఉండడు.

యాదృచ్ఛిక వైరాగ్యం మరియు నిజమైన వైరాగ్యం 

వైరాగ్యము రెండు రకాలు. మొదటి రకం యాదృచ్ఛిక లేదా కారణ వైరాగ్యం కొన్నిసార్లు దీనిని స్మశాన వైరాగ్యం అని కూడా పిలుస్తారు. ఈ రకమైన వైరాగ్యము జీవితంలో సంభవించిన కొన్ని దుఃఖాల వల్ల లేదా కుటుంబంలో జరిగిన మరణం వంటి పరిస్థితుల ప్రభావం వల్ల వస్తుంది. ఇది శాశ్వత వైరాగ్యం కాదు, ఎందుకంటే పరిస్థితి మారిన వెంటనే, వైరాగ్యం కూడా అదృశ్యమవుతుంది. 

యాదృచ్ఛిక వైరాగ్యం ఉన్న వ్యక్తి యొక్క మనస్సు అతను వదిలిపెట్టినదాన్ని ఆస్వాదించడానికి వేచి ఉంటుంది. అతనికి అవకాశం వచ్చిన వెంటనే, అతను తిరిగి దాని ఆస్వాదనలో మునుగుతాడు. అతని నిజస్వరూపం బయటకు వస్తుంది, మరియు అతను తిరిగి పూర్వ స్థితికి వెళ్తాడు. వాస్తవానికి, ఇప్పుడు అతను మరింత తీవ్రతతో దాన్ని ఆస్వాదిస్తాడు ఎందుకంటే అతని ఇంద్రియాలు ఈ భోగలాలసకై ఎంతోకాలంగా ఆకలితో ఉన్నాయి కనుక.

రెండవ రకం వైరాగ్య వివేకం పైన ఆధారపడి ఉంటుంది. ఇది వాస్తవానికి మరియు భ్రమకు మధ్యగల వ్రత్యాసంపై పూర్తి అవగాహనకలిగిన వివక్షను కలిగి ఉంటుంది. అటువంటి వైరాగ్యము కలిగి ఉన్నవాడు ఇంద్రియ సుఖం కోసం పెంపర్లాడడు.  ఎందుకంటే అవి భ్రమ అని అతనుకు పూర్తిగా తెలుసు. ఈ రకమైన వైరాగ్యము స్థిరంగా ఉంటుంది మరియు ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తుంది. అలాంటి వ్యక్తి ఆధ్యాత్మిక అభ్యాసాన్ని వదులుకోడు మరియు ఇంద్రియ భోగాలకై వెనక్కి తిరిగి చూడడు.

English Translation for reference:

Viveka–Proper Discrimination

https://www.jiva.org/viveka-proper-discrimination/

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    నాయకుడు కావాలంటే పాఠకుడు కావాలి. ఏ రంగంలో విజయానికైనా స్వాధ్యాయము తప్పనిసరి. మనం క్రమం తప్పకుండా చదువుకోవడానికి కొంత సమయం కేటాయించాలి.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.