ఇంతకుముందు సంచికలో మనము చిత్రకేతు మరియు శివుని మధ్య గల వ్యవహారాల గూర్చి చర్చించుకున్నాము. పార్వతి దేవి వల్ల శాపగ్రస్తుడైన చిత్రకేతు,వృత్రాసురుడిగా త్వష్ఠా ముని చేసిన యాగములోంచి ఉద్భవించాడు. త్వష్ఠా మునికి విశ్వరూపుడు అనే కొడుకు ఉండేవాడు. అతను ఇంద్రుని పూజారిగా పనిచేస్తూ ఇంద్రునిచేతచంపబడ్డాడు. అందువల్ల ఇంద్రునిపై పగతో త్వష్ఠా ముని, ఇంద్రుని సంహరణకై ఒకరిని సృష్టి చేయ తలపెట్టి ఒక యాగం చేసాడు. ఆ హోమమునుండి వృత్రాసురుడు ఉద్భవించాడు. కానీ, మంత్రోచ్ఛారణలో దోషం చేత వృత్రాసురుడు ఇంద్రుడు వల్ల చంపబడ్డాడు.
వృత్రాసురుడు ఉద్భవించగానే, ఇంద్రుని వధకు ఆజ్ఞాపించబడ్డాడు. అతను ఒక బల్లెంతో ఇంద్రునిపైకి వెళ్ళాడు, ఇంద్రుని, వృత్రాసురుని నాయకత్వంలోని దేవ దానవుల మధ్య భయానక యుద్ధం జరిగింది. వృత్రాసురుని యుద్ధ ధాటికి ఇంద్రుడు ప్రాణ భీతి చెందాడు. విష్ణువు దధీచి మహాముని ఎముకల నుండి వజ్రాయుధాన్ని తయారు చేయమని ఉపదేశించాడు.
ఇంద్రుడు తన ప్రాణాలను దక్కించుకోవటానికి దధీచి మునిని ప్రాణాలను విడవవలసిందిగా వేడుకొన్నాడు. దధీచి ముని సమాధి ముద్రలో కూర్చొని ఆనందముగా తన ప్రాణాలను వదిలాడు. ఇంద్రుడు దధీచి ముని ఎముకలను వజ్రాయుధముగా మలచి దానిని వృత్రాసురుని చేతులను చేధించడానికి వాడాడు. యుద్ధభూమిలో తన శత్రువుతో ముఖాముఖిగా ఉన్నప్పటికీ , వృత్రాసురుడు అంతర్ముఖుడై భగవంతుని ప్రార్ధించాడు. ఇంకా చెప్పాలంటే అతను మరణం భగవంతుని పాదపద్మాల వద్దకు చేర్చుతుంది కాబట్టి దాన్ని తీవ్రంగా కోరుకున్నాడు. అతను మరణించే కొద్ది సమయం ముందు, శ్రీ సంకర్షణుని గూర్చి అత్యంత సుందరమైన శ్లోకాలను పలికాడు. అవి వృత్రాసురుని శుద్ధ భక్తిని మరియు అతని శుద్ధ హృదయాన్ని తెలుపుతాయి.
అహమ్ హరే తవపాదైక మూల
దాసానుదాసోభవితాస్మిభూయః
మనః స్మరేతాసు పతేర్ గుణాంస్తే
గృణీత వాక్ కర్మ కరోతుకాయః
ఓ శ్రీ హరీ!, నాపై దయ యుంచి, నా వచ్చే జన్మలో కూడాను, నీ పాద పద్మాలను ఆశ్రయంచిన దాసులకు దాసుడిగా సేవచేసుకొనే భాగ్యమును కల్పించుమయ్యా. ఓ నా ప్రాణాధారా!, నా చిత్తము సర్వకాలములందు నీ గుణగణాలను గుర్తుంచుకొనేటట్లు, నా వాక్కులు వాటిని పలికేటట్లు, నా దేహం ఎల్లప్పుడూ నీ సేవలో నిమగ్నమయ్యేటట్లు చూడుమయ్యా.” ( శ్రీమద్ భాగవతం 6. 11. 24).
న నాకపృష్టమ్ న చ పారమేష్ఠ్యమ్
న సార్వభౌమం న రసాధిపత్యం
న యోగసిద్ధీర్ అపునర్భవం వా
సమఞ్జసత్వా విరహయ్య కాంక్ష్యే
ఓ సకల ఐశ్వర్య ప్రదాతా! నీ సేవా భాగ్యము లేకున్న , నాకు స్వర్గ ప్రాప్తి కానీ , సత్యలోక ప్రాప్తి కానీ, సమస్త భూమండలము కానీ, పాతాళలోక ఆధిపత్యం కానీ, యోగ సిద్దులు కానీ, ముక్తి అయినా కానీ వలనే వలదు. (శ్రీమద్ భాగవతము 6.11.25).
అజాతపక్షా ఇవ మాతరం ఖగాః
స్తన్యం యథా వత్సతరాః క్షుధార్తాః
ప్రియం ప్రియ ఇవ వ్యుషితమ్ విషణ్ణా
మనో ‘రవిందాక్ష దిదృక్షతే త్వామ్
“ఇంకా రెక్కలు రాని పక్షులు వాటి తల్లి తమకు ఆహారాన్ని తీసుకు వచ్చేందుకు వేచిఉండేటట్లు, లేగ దూడ తన తల్లి పొదుగు నుండి పాలు త్రాగేందుకు వేచిచూసేటట్లు, విదేశములో ఉన్న తన ప్రియమైన భర్త తిరిగి రావటం కొరకు భార్య వేచిచూసేటట్లు, ఓ కమలాక్షుడా, నా మనస్సు నిన్ను చూచుటకు ఆత్రుతతో నిరీక్షిస్తున్నాయి”. (శ్రీమద్ భాగవతము 6.11.26)
మమోత్తమ శ్లోక జనేషు సఖ్యమ్
సంసారచక్రే భ్రమతః స్వకర్మాభిః
త్వన్మాయయా ఆత్మాత్మజ దార-గేహేషు
ఆసక్త చిత్తస్య న నాథ భూయాత్
“ఓ భగవానుడా ! నాకు ముక్తి వలదు, అలానే నా కర్మ ఫలముల చేత మరిన్ని జన్మలు సిద్ధించినా పరవాలేదు. కానీ నేను ఏ ప్రాణిగా రూపము తాలించినా , నీ భక్తుల స్నేహము ఒసగేటట్లు ప్రార్థిస్తున్నాను. ఓ నా ప్రాణనాధా! నీ మాయకు లోబడి దేహ,పుత్ర, జీవిత భాగస్వామ్య, గృహ బంధనాలలో చిక్కుకున్న వారి సాంగత్యముకు నాకు దూరముగా ఉండేటట్లు చూడు స్వామీ“(శ్రీమద్ భాగవతము 6.11.27)
ఈ శ్లోకాలను పలికే ముందు, వృత్రాసురుడు వజ్రాయుధాన్ని వాడి తనన్ని సంహరించమని ఇంద్రుని అడిగాడు. వృత్రాసురుడు ఇంద్రునికి “భగవంతుడు ఒట్టిఐశ్వర్యాలను తన కృపను ఇవ్వజాలని వారికి మాత్రమే ఒసగుతాడని” చెప్పాడు. విష్ణువు ఇంద్రునికి వజ్రాయుధాన్ని వాడి తన ఐశ్వర్యాలను కాపాడుకోమని దారి చూపాడు, అంటే దాని అర్ధం విష్ణుని కృపా కటాక్షాలు ఇంద్రుని మీదలేవని వృత్రాసురుడు వ్యక్త పరచాడు.
ముందున్న మరణం గూర్చి, ఇంద్రుని వజ్రాయుధం గూర్చి పట్టించుకోకుండా వృత్రాసురుడు ఆ భగవానుని భక్తుల సాంగత్యము- ఏదైతే భగవంతునికి మన మీద కృపకు నిదర్శనమని భావించాడో, దాన్ని ఒసంగమని కోరుతూ స్తుతించసాగాడు. అతను భౌతికమైనది ఏదీ కోరలేదు, బ్రహ్మాధిపత్యమును కూడా అడుగలేదు. జన్మ మృత్యు సాగరం నుండి విముక్తి భగవంతునికి, భగవద్భక్తులకు సేవ చేసే భాగ్యం లేకుండా చేసేటట్లయినతే దాన్ని కూడా కోరలేదు. భగవానుని ఎడఁబాటు వల్ల కలిగే విరహవేదన చేత, అతని హృదయాన్ని భగవత్ సేవ తప్ప వేరే ఏదైనను సంతృప్తి పరచలేదు.
భక్తి భావ వర్ణనకు వాడిన మూడు ఉపమానములు
మూడవ శ్లోకంలో, భగవంతుని నుండి దూరమైనందున కల్గిన విరహాన్ని వర్ణించటానికి వృత్రాసురుడు మూడు ఉపమానములను పలికాడు. అందులో మొదటిది అప్పుడే జన్మించి, ఎగురుట చేతకాని పక్షులు తమ రక్షణ, ఆహారానికై తమ తల్లిపై ఆధారపడి ఉండే స్థితి. అవి తమ తల్లి తినడానికి ఆహరం వెదుకుట కొరకు వెళ్ళినప్పుడు, తమ గూటిలో కూర్చొని తల్లి రాకకై ఎదురుచూస్తూ ఉంటాయి. అవి వీచే గాలికి ఊగే చెట్టుకొమ్మల రాపిడిని, తమ తల్లి తిరిగి వచ్చిందని అనుకొంటూ, చిన్న చిన్న శబ్దాలు చేస్తూ, ఆహరం కోసం తమ చిన్ని ముక్కును తెరుస్తాయి. కానీ ఈ ఉపమానంతో వృత్రాసురుడు సంతృప్తి చెందలేదు, ఎందుకంటే ఆ చిన్న పక్షులు కేవలం ఆహరం కోసం మాత్రమే వేచి చూస్తాయి, తల్లి కోసం కాదు. తమ తల్లి వాటికి ఆహరం తినిపించిన తర్వాత, అవి ప్రశాంతంగా కూర్చుంటాయి. అవి వాటి తల్లి గూర్చి ఆలోచించడం మానేస్తాయి.
అందుకే అతను గడ్డి మేయటానికి తన తల్లి పొలానికి వెళ్లగా త్రాడుతో కట్టివేసి ఉన్న లేగ దూడను రెండవ ఉపమానముగా వాడతాడు. ఆ లేగ దూడ తన తల్లి రాకకు చాలాఆతృతతో ఎదురు చూస్తోంది. తన తల్లి పొలం నుండి రాగానే, తల్లి దగ్గరకు ఆ లేగదూడ తోక పైకెత్తి పరుగెత్తుతుంది. కానీ, ఇక్కడకూడా లేగదూడ నిరీక్షణ నిజానికి దాని తల్లి కోసం కాదు, అది దాని పొదుగు కోసం. ఒకసారి పాలు త్రాగిన తర్వాత, ఆ లేగదూడ తన తల్లి కోసం నిరీక్షించడం పరిసమాప్తం అవుతుంది.
తర్వాత మూడవ ఉపమానంలో, ఒక భార్య తన భర్త నుండి దూరమైనప్పుడు పొందే విరహ వేదనను వృత్రాసురుడు వివరిస్తాడు. ఆమె తన భర్తను చూసేందుకు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది మరియు అతన్ని సంతృప్తి పరచేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఈ ఉపమానం వృత్రాసురుని సంతుష్టపరచింది మరియు భగవంతునిపై అతనికి గల అనురక్తిని సరిగ్గా వ్యక్తపరిచింది.
వైష్ణవుల వినయం
భక్తి స్వతహాగా వినయముగా వ్యక్తమవుతుంది. దాన్ని కలిగి ఉంటటం వల్లే, వృత్రాసురుడు తనన్ని తాను భగవంతుని సాంగత్యానికి అర్హత లేని వాడుగా భావించాడు. అందుకే చివరి శ్లోకంలో, కేవలం ప్రతి జన్మలో భగవద్భక్తుల సాంగత్యం కోరుతూ ప్రార్ధించాడు. భక్తి వల్ల కల్గిన వినయం చేత వృత్రాసురుడు మానవ జన్మను పొందటానికి కూడా తనకు అర్హతలేదని భావించాడు. వృత్రాసురుడుగా జన్మించడం వల్ల అతను భక్తి మార్గంలో లేని వారితో సాంగత్యం చేయవలసి వచ్చింది. అందువల్ల అటువంటి సాంగత్యములో ఉండే భాధ అతనికి పూర్తిగా అవగతమైంది. అందుకే వచ్చే జన్మలోనైనా భక్తుల సాంగత్యం దొరక్కపోయినా, ప్రాపంచిక జనుల మధ్య మిగలకుండా ఉండేటట్లు చూడమని ప్రార్ధించాడు.
ఈ శ్లోకాలు శ్రీమద్ భాగవతములో ఎంతో ముఖ్యమైనవి, ఎందుకంటే అవి ఒక భక్తుని మనస్సు ఎలా ఉంటుందనే విషయాన్ని ఆవిష్కరిస్తాయి. అవి భాగవతము సరిగ్గా మధ్యలో, ఆరవ అధ్యాయములో చేర్చబడినవి. ఈ శ్లోకాల ప్రాముఖ్యత మనకు వృత్రాసుర వధ వేరే పురాణాలలో కూడా వర్ణించడంవల్ల తెలుస్తుంది, అలానే ఇది శ్రీమద్ భాగవతముకు గల ప్రాశస్త్యాన్ని మనకు చెప్పకనే చెబుతుంది. “శ్రీమద్ భాగవతము 18,000ల శ్లోకాల, 12 అధ్యాయాల సమాహారం. ఇది దధీచి మహాముని నేర్పిన బ్రహ్మ విద్యా ఉపదేశములను కలిగి ఉంది , వృత్రాసురుని వదను వర్ణిస్తుంది, గాయత్రీ మంత్రముతో మొదలవుతుంది”. ( భావార్థ-దీపిక 1.1.1)
మనం దేనికోసం ప్రార్థించాలో కనీసం తెలుసుకోవాలి. ఇది మా ఏకైక ప్రార్థన అని మనం స్పష్టంగా చెప్పాలి – ‘కృష్ణ, నిన్ను ఎప్పటికీ మరచిపోనివ్వకు. నా మనస్సు ఎప్పుడూ మీపైనే స్థిరముగా ఉండనివ్వు. ’మనం నిద్రపోతున్నా, మేల్కొని ఉన్నా, తింటున్నా, మన మనస్సు ఎప్పుడూ కృష్ణుడిపైనే ఉండాలి, అది మన మానసిక స్థితి కావాలి.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.