శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం, 17 వ అధ్యాయములో చిత్రకేతు మహారాజు ఆకాశములో తన విమానంలో విహరిస్తూ, విద్యాధరులని పేరుగాంచిన, మధురమైన గానానికి ప్రసిద్ధి చెందిన వందల కొద్దీ దేవ కన్యలతో చుట్టూ కూడి ఉండే వర్ణన ఉంది. చిత్రకేతు మహారాజు ఆ దేవకన్యలతో కలసి భగవంతుని కీర్తనలో నిమగ్నమై ఉండేవాడు. ఒకరోజు, తన ఆకాశవిమానము నుండి, ఆయన క్రిందకు చూడగా పరమశివుడు ఋషి పుంగవ, సిద్ధ, చారణ గణములతో కూడిన సభలో ఉండటాన్ని చూసాడు. అయితే అతను ఇంతటి సభాసదుల మధ్యలోకూడా పరమశివుడు, తన పత్నిఅయిన పార్వతి దేవిని ఆలింగనము చేస్తూ ఉండటాన్ని చూస్తూ ఆశ్చ్చర్యచకితుడు అవుతాడు. దాన్ని చూసి ఉండబట్టలేక, పరమశివుడిని అందరి సమక్షంలో కించపరుస్తాడు. “ఇది చూడండి “, ” ఈయన ప్రపంచానికే గురువు, ధర్మము గూర్చి ప్రసంగిస్తూ ఉంటాడు. ఆయన వస్త్ర ధారణ సర్వసంగ పరిత్యాగిలాగా ఉంటుంది, కానీ ఒక సిగ్గులేని కాముకునివలే ఇంత మంది ఉన్న సభలో తన భార్యను వడిలో ఉంచుకొని కూర్చొన్నాడు. ఇలా ఒక సాధారణ మనుజుడు కూడా చేయలేడు” అని అంటాడు.
పార్వతీ దేవి శాపం
అప్పుడు పరమ శివుడు తీవ్రమైన స్వరముతో నవ్వుతూ, మిన్నకుంటాడు. ఆ సభలో ఉన్న మిగతా వారందరుకూడా నిశ్శబ్ధులై ఉంటారు, కానీ పార్వతి దేవి మాత్రం తన భర్తకు జరిగిన అవమానాన్ని భరించలేక పోయింది. ఆమె పరమ శివుని గొప్పతనాన్ని కీర్తిస్తూ, చిత్రకేతుని గర్వాన్ని ప్రశ్నించి చిత్రకేతుని అసురునిగా మారమని శపించింది.
అప్పుడు చిత్రకేతుడు ఆకాశ విమానము నుండి దిగివచ్చి , తన శిరస్సు పార్వతీ మాత కాళ్ళ వద్ద ఉంచి ప్రణమిల్లుతాడు. “నా వల్ల మీరు దయచేసి కలత చెందవద్దు“,”నన్ను నా పరుష వాక్యాలకు మన్నించండి. మీ శాపాన్ని తిరిగి తీసుకోమని అడగ జాలను, కానీ మీకు నాపైన ఉన్న కోపాన్ని వదిలి వేయమని నా ప్రార్ధన” అని అంటాడు.
శివ, పార్వతులను తన ప్రార్ధన, వినయంతో సంతుష్ట పరిచిన పిమ్మట చిత్రకేతుడు తన విమానంలో అక్కడనుంచి వెళ్తాడు. ఆ తర్వాత పరమ శివుడు వైష్ణవుల ఔన్నత్యాన్ని వివరిస్తూ వారెలా ఏ విషయము గూర్చి భయపడరో, సుఖ దుఃఖములను, పుట్టుక మరియు మరణములను, శాపము మరియు వరములను ఒకే విధముగా చూస్తారో తెలుపుతాడు.
ఈ సంఘటన మనల్ని విస్మయానికి గురిచేసేదాని వలే ఉంటుంది. చిత్రకేతునకు శివుడు కందర్పుడని ” మన్మథ సంహరుడని“, కామ ఛాయలు కూడా లేనివాడని తెలుసు. అలాంటప్పుడు అతను ఆయనను అగౌరపరుస్తూ ఎందుకు నిందించాడు?
శ్రీ విశ్వనాథ చక్రవర్తుల వారు దీనికి పలు రకాల కారణములు ఉన్నాయని తెలుపుతారు. పరమ శివుడు, చిత్రకేతుడు ఇద్దరూ సంకర్షణ భగవానుని భక్తులు, దాని వల్ల సహోదర భక్తులు. చిత్రకేతుడు తన అగ్రజ సహోదరుడు మూర్ఖుల వల్ల నిందించ పడటాన్ని చూడలేడు, అందుకే మూర్ఖులచే తప్పుగా అర్ధం చెసుకోబడే శివుని ప్రవర్తనను ఆటంక పరుచుటకు ప్రయత్నించాడు.
నిగూడమైన కీర్తన
అందుకే చిత్రకేతుడు శివున్ని“లోక–గురు“( ప్రపంచానికే బోధకుడు) అని సంభోదించాడు. చిత్రకేతుడికి శివుడు కామాన్ని అధిగమించినవాడని తెలుసు, అందువల్ల ఎప్పుడు లేదా ఎక్కడ ఆయన తన పత్నిని ఆలింగనం చేసుకొన్నాడనేది అప్రస్తుతం. కానీ కామ వాంఛలతో ఉన్న ప్రజానీకం ఆయన ప్రవర్తనను ఉదహరిస్తూ తమ భోగ విలాసాలను సరియైనవని అనుకోకుండాలని చిత్రకేతుడు భావించాడు. చిత్రకేతుని ఆక్షేపణలు ఒక ప్రాపంచిక విమర్శకుడిగా చేసినవి కావు. అవి శివునిపై ప్రేమతో, ఆయన ఖ్యాతికి భంగం కలుగకుండేందుకు, అలానే సాధారణ ప్రజానీకం తమ అవాంఛనీయ ప్రవర్తనను ఒప్పుగా భావించకుండా ఉండేందుకు చేసినవి. చిత్రకేతుడు, శివుడు సన్నిహిత స్నేహితులు కనుక మరియు చిత్రకేతుడు ఆ వ్యాఖ్యలు ప్రేమతో చేసినవి కాబట్టి, ఆ కఠోర వ్యాఖ్యలు శివునికి ఆనందాన్ని కలిగించాయి. అందుకే శివుడు ఆ వాఖ్యలకు ప్రతిగా నవ్వుతూ మిన్నకుండి పోయాడు.
ఆ తర్వాత చిత్రకేతుడు పార్వతీదేవి చేత శాపగ్రస్తుడైన పిమ్మట, శివుడు వైష్ణవుల గొప్పతనం గూర్చి చెప్పాడు. వాటి అంతరార్థం “ఓ నా ప్రియమైన పార్వతీ! నీవు అనవసరముగా ఎందుకు నీ నిగ్రహాన్ని కోల్పోవుతున్నావు?”
ఆయన ఆమెతో ఇలా అన్నాడు, “చూడు దేవి, నేను నవ్వి నిశ్శబ్దముగా ఉన్నాను. దానివల్ల చిత్రకేతునకు ఈ విధముగా జవాబు చెప్పాను: ఓ నా మిత్రమా, నిజమే. నీవు చెప్పినట్లే నేను ఉన్నాను, కానీ నీలాగా సంకర్షణుడి భక్తునిగా చెప్పుకుంటూ, రహస్యముగా విద్యాధరులతో రమించే కపటవాదిని కాను. నేను దానికి విరుద్ధముగా ఉంటాను. నేను చూడటానికి ఒక కాముకుడిలా, నా భార్యను వడిలో కూర్చోబెట్టుకొనే వాడిలా ఉంటాను, కానీ నిజానికి నేను సర్వసంగ పరిత్యాజిని. మనము విరుద్ధమైన వారము. నీవు ఒక భక్తుడుగా ప్రకటించుకుంటూంటావు, అలానే నీ ఇంద్రియ భోగాల్ని దాచుకుంటుంటావు. నేను ఒక భోగిలా అగుపిస్తూ నా భక్తిని దాచుకుంటాను. ఇదే మన ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం.
చిత్రకేతునితో ఇలాంటి అంతర్గత లీలను మహాశివుడు ఆస్వాదించాడు, పార్వతీ దేవి దీన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేక తన సహనాన్ని కోల్పోయింది. పరమ శివుడు చిత్రకేతుని మాటలకంటే పార్వతీ దేవి చేసిన దాని వల్ల ఎక్కువ బాధపడ్డాడు. ఈ అధ్యాయంలోని 36 వ శ్లోకం చిత్రకేతు, పరమ శివుని మధ్య గల అంతర్ముఖ వ్యవహారాన్ని తెలుసుకొన్న పార్వతీ దేవి ఆశ్చర్యానికి గురైనదని మనకు తెలుపుతోంది. “చిత్రకేతుడు కేవలం ఒక క్షత్రియుడు మాత్రమే, భక్తి మార్గంలోకి ఈ మధ్యనే అడుగు పెట్టాడు“అని ఆమె అనుకొన్నది. “అలాంటి అతను శ్రీ భగవానుని నిష్టాగరిష్ట భక్తుడైన నా భర్తతో అటువంటి అంతర్గత, అనురాగ పూర్వక సంబంధాన్ని కలిగి ఉండటం ఎలా సాధ్యం!“.
భక్తి యొక్క గొప్పతనం
ఈ సంఘటనకు వేరొక తాత్పర్యము కూడా ఉంది. అది ఏంటంటే, శ్రీకృష్ణుడు చిత్రకేతుడు తన వద్దకు రావాలని అనుకొన్నాడు. కానీ చిత్రకేతుడు విద్యాధరులతో కలసి ఆట, పాటలలో మునిగి ఉండిపోయాడు. అతను శ్రీకృష్ణుని వద్దకు చేరాలంటే ఈ శాపమే ఒక సదుపాయము.
పార్వతి యొక్క శాపంవల్ల చిత్రకేతుడు వృత్రాసురుడుగా మారాడు. వృత్రాసురుడిగా జీవనం, చిత్రకేతుని భగవానుని చేరాలనే ఆతృతను ఎన్నోరెట్లు పెంపొంచింది. చివరకు అతనికి భగవానుని దర్శన భాగ్యము కలిగినప్పుడు, వృత్రాసురుడు శ్రీమద్భాగవతములోని కొన్ని అత్యద్భుతమైన ప్రార్థనలను భగవానుని గూర్చి పలికాడు.
వృతాసురుని వృత్తాన్తము మనకు భక్తి గొప్పతనాన్ని, భక్తి ఏవిధముగా ప్రాపంచిక విషయాలైన జన్మ, దేహము, నడవడిలక మీద ఆధారపడి ఉండదని స్పష్టం చేస్తోంది. దాన్ని ఋజువు చేసేందుకే పార్వతీ దేవి చిత్రకేతుని శపించడం జరిగింది.
వృత్రాసురుని ప్రార్ధనల గూర్చి మనం వచ్చే సంచికలో చర్చించుకుందాము.
ప్రేమ మరియు భక్తితో జీవించాలనుకుంటున్నామా లేదా అసూయ మరియు ద్వేషపూరిత జీవితాన్ని గడపాలనుకుంటున్నామా అని ఎంచుకునే అవకాశం మనకు ఉంది. కాని ఈ ఎంపిక మరియు చర్యలు మన హృదయంలో ఉన్న భావముల అనుగుణంగానే జరుగుతాయి.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.