జ్ఞాన అనేది జ్ఞానము అను పదము యొక్క సాధారణమైన రూపం. దీనికి విద్య లేక తెలుసుకొనడం అని సామాన్యమైన అర్థం. విశేషముగా దేనిద్వారా మనం తెలుసుకొంటామో దానిని జ్ఞాన అంటారు. ఇది మన ఐదు ఇంద్రియముల వలే గ్రహించుటకు మరియు తెలుసుకొనుటకు ఒక సాధనము వంటిది. ఇది ఇంద్రియము కావడం వల్ల భౌతికమైనది, మరియు సూక్షమైనది కనుక ఇది ఒక మానసిక అవస్థ లేదా మన చిత్తములో ఏర్పడే ఒక వృత్తి.
ప్రతి ఇంద్రియమునకు అది గ్రహించే ఒక వస్తువు ఉంటుంది. దృష్టి వెలుతురుని గ్రహిస్తుంది. వినికిడి శబ్దాన్ని గ్రహిస్తుంది. జ్ఞానము జ్ఞేయము(తెలియదగినది)ను గ్రహిస్తుంది. గ్రహించగల జ్ఞానమును విషయీ అని, జ్ఞానముచే గ్రహించబడే జ్ఞేయమును విషయమని అంటారు.ఈ రెండూ కాక మూడవ వస్తువైన తెలుసుకొనువాడిని జ్ఞాత/జ్ఞాని అంటారు. ఇతడు చేతన కలిగినవాడు. జ్ఞానము మరియు జ్ఞేయము భౌతికమైనవి.
జ్ఞానము అనే పదము ఒక మూల పదమువలె తరచుగా పై మూడింటి యొక్క సహ నిర్వహణలలో ఉపయోగించబడుతుంది.
వేరే పదములలాగానే “జ్ఞానము” అను పదము ఉపయోగించిన సందర్భమును బట్టి వివిధ భావాలను కలిగి ఉంటుంది. “జ్ఞానయోగము” అను మాటలో దాని అర్థం జ్ఞాత మరియు జ్ఞేయముల మధ్య తేడాను తొలగించి కేవలం చేతన(జ్ఞానము)ను సర్వత్రా వ్యాప్తమై ఉన్న నిర్గుణమైన బ్రహ్మమని గ్రహించడం. ఈ అర్థం చాలా సందర్భ విశేషమైనది, ఇది తెలుసుకోకపోతే జ్ఞానము అంటే మనము చాలా కలవరపడతాము లేదా తప్పుదారిన పడతాము.
“జ్ఞాని” అని మరొక పదానికి “విద్యావంతుడు” లేదా “పండితుడు” అని అర్థం, కానీ అతను జ్ఞానయోగమును అనుసరించే వ్యక్తి కాకపోవచ్చు. జ్ఞానయోగమును సాధన చేసే వ్యక్తిని జ్ఞానయోగి అంటారు, మరియు జ్ఞాని(పండితుడు) అయిన వ్యక్తికి జ్ఞానయోగి అనే పదము వర్తించవచ్చు లేదా వర్తించకపోవచ్చు.
భక్తిని ఉద్దేశించి జ్ఞానము అను పదము వాడినప్పుడు, దాని అర్థం భగవంతుని సంబంధిత నామమును, రూపమును, గుణములను, సహచారకులను, ధామమును మరియు లీలలను దివ్యజ్ఞానంతో ప్రత్యక్షంగా తెలుసుకొనడం. ఇది భక్తి నుండి వేరైనది కాదు కావున భౌతికమైనది కాదు. దీనిని లభ్యం చేసుకొనే పధ్ధతి లౌకిక జ్ఞానము పొందడంలాంటిదే కానీ సరిగ్గా ఒకేలా ఉండదు. ముఖ్యముగా భక్తిమార్గములో భక్తుని త్రికరణశుద్ధి మరియు నిర్మలత్వములను బట్టి జ్ఞానము ప్రసాదించబడుతుంది.
భక్తి తత్వవిచారమును లోతుగా అర్థముచేసుకొనుటను భక్తియోగులు తరచుగా జ్ఞానయోగములో జ్ఞానము వంటిదని భావిస్తారు. అందువల్ల భక్తి సంబంధమైన జ్ఞానమును తెలుసుకోనవసరం లేదనీ, భక్తిలో జ్ఞానము ఉండకూడదని అనుకుంటారు. వారి అభిప్రాయమునకు మద్దతుగా, శ్రీ రూప గోస్వామిచే నిర్వచించబడిన ఉత్తమ భక్తి వివరణముని సూచిస్తారు. ఈ నిర్వచనము ఉత్తమభక్తి జ్ఞానము, కర్మ మరియు ఇత్యాది వాటిచే చేత కప్పబడి ఉండకూడదు అని చెప్తుంది(జ్ఞాన కర్మాది అనావృతమ్, భక్తి రసామృత సింధు 1.11). వారు భాగవత పురాణం(10.14.3)లో, బ్రహ్మదేవుడు భక్తులు జ్ఞాన సంపాదనకోసం పాటుపడకూడదని, పరమ భక్తుల నోటిద్వారా కృష్ణుని గురించి వింటూ జీవించాలని(జ్ఞానే ప్రయాసముదపాస్య నమన్తయేవ జీవన్తి సన్ముఖరితాం భవదీయవార్తామ్) చెప్పిన మాటలను కూడా సూచిస్తారు. ఇంకా దీన్ని శ్రీమద్ భాగవత పురాణములో ముఖ్యమైన బోధనను రూప మరియు జీవ గోస్వాములు వివరించినట్లు, భక్తి జ్ఞానము మీద ఆధారపడదని సమర్థిస్తారు.
కొంత మంది భక్తులు శాస్త్రాధ్యయనం జ్ఞానముకోసమని, జ్ఞానయోగము అనుసరించేవారు చేసేదని అందువల్ల భక్తిమార్గమునకు అది అవసరం లేదని మరియు ప్రమాదకరమని భావిస్తారు. ఆ అధ్యయనం మనిషిని గర్విష్ఠిగా చేస్తుందని, భక్తి మార్గములో అది తప్పకుండా అవరోధమని చెప్తారు. అందుకని శాస్త్రము చదవకపోడవం ఒకరిని వినయపూర్వకమైన ప్రవర్తనతో ఉంచుతుందని అనుకుంటారు.
ఈ దృక్పథం చాలా ప్రబలమైనది, కానీ ఇది భక్తి మార్గంలో పురోగతికి పెద్ద అడ్డంకిని కలిగించే చాలా తీవ్రమైన అపోహ.
పైన చెప్పినట్లు, ఈ అపోహకు కారణం జ్ఞానము అనే పదాన్ని జ్ఞానయోగంలో జ్ఞానము యొక్క అర్థముగా తీసుకొనుట, తర్వాత జ్ఞానయోగమును నిందించు పద్యాలను అవి జ్ఞానమును కూడా నిందించినట్లు ఉపయోగించుట.
జ్ఞానము లేకుండా భక్తి చేయడం చాలా ప్రమాదకరం. భగవంతుని మరియు భక్తి తత్త్వములను గోస్వాములు వివరించినట్లు లోతుగా తెలుసుకోకుండా భక్తి సాధన చేయడం ఆవేశపూరితంగా లేదా సాంప్రదాయక మత సంబంధముగా చేయడం అవుతుంది.
భక్తి జ్ఞానముమీద ఆధారపడదని వర్ణించే మాటల అర్థం భక్తుడు జ్ఞానయోగం సాధన చేయనవసరంలేదని. అంతేకాని శాస్త్రాధ్యయనం చేయనవసరంలేదని కాదు. నిజానికి శాస్త్రమునుండే ఈ ప్రాథమిక సత్యాలన్నీ తెలుస్తాయి. సాధన-భక్తిలో మొట్ట మొదటి మెట్టు కృష్ణుడి గురించి శ్రవణం చేయడమని సాధారణంగా చెప్పబడుతుంది. గురువు ద్వారా లేక స్వయంగా శాస్త్రం చదవడం వినడంలోని భాగమే. ఊరికే ఏవో కొన్ని కథలు వాటి పరమార్ధం తెలుసుకోకుండా వినడం కాదు.
భక్తి మార్గములో శ్రవణమునకు చాలా ప్రాధాన్యత ఉంది. కేవలం వినడం ద్వారా భక్తి యొక్క పరిపూర్ణతను పొందవచ్చని అంటారు. పద్యావళిలో శ్రీ రూప గోస్వామి పరిక్షిత్ మహారాజును దీనికి ఉదాహరణగా పేర్కొంటారు.
ఎందుకంటే భక్తిలో శాస్త్రాధ్యయనం చేయడం యొక్క ఉద్దేశ్యం భగవంతుని గురించి ప్రామాణికంగా శబ్దము ద్వారా తెలుసుకోవడం. ఇది భగవాన్ అను వాచకమునకు మరియు తెలియజేయు లేదా ప్రకటించబడే తత్త్వమైన భగవంతుడి(వాచ్య)కి సహజ సంబంధము కలిగిఉండడం. శ్రీ జీవ గోస్వామి భగవంతుని గురించి సంపూర్ణ పరిశోధన కొరకు రచించిన సందర్భములలో మొదటిదైన తత్త్వ సందర్భములో ఇది తెలియజేసారు.
భక్తిలో జ్ఞానమీమాంసముయొక్క ఉద్దేశ్యం కేవలం తార్కికంగా తత్త్వమును స్థాపించడమే కాదు, దాన్ని ప్రత్యక్షంగా అనుభవం పొందడానికి మార్గము చూపించడం కూడా. శాస్త్రాధ్యయనమును కేవలం బుద్ధిబలమని లేదా జ్ఞానానికి సంబంధిచినదని కొట్టిపారేయడం మొత్తం ప్రయత్నాన్ని మరియు అందువల్ల పొందగలిగే ప్రత్యక్ష అనుభవ సామర్థ్యాన్ని కోల్పోవడమే. ఇది ప్రస్తుతం చాలామంది నేటితరం భక్తి సాధకులకున్న సాధారణమైన కానీ కఠోరమైన అపార్థం.
జ్ఞానమనే పదానికి సరియైన సందర్భమునుబట్టి అర్ధాన్ని తెలుసుకోవాలి. భక్తికి జ్ఞానం అనవసరమనుకుంటే శ్రీ కృష్ణుడు ఉద్ధవుడికి చేసిన బోధ అర్థరహితమౌతుంది: “జ్ఞానము మరియు విజ్ఞానము కలిగి భక్తిభావంతో నన్ను ఆరాధించు” – జ్ఞాన-విజ్ఞాన సంపన్నో భజ మామ్ భక్తి-భావతః(భాగవత పురాణం 11.19.5).
భక్తి జ్ఞానమంతా ఇవ్వగలదు అనేది నిజమే, కానీ భక్తి సాధన చేయడానికి ప్రతి ఒక్కరికీ జ్ఞానమనేది అవసరం. జ్ఞానమును ఇవ్వగల భక్తిని ఒక అజ్ఞాని ఎలా ఆచరించగలడు? భక్తి ఒక భౌతిక ప్రక్రియ కాదు మరియు ఏ భౌతిక వ్యక్తికీ దాని గురించి తెలియదు. దాన్ని యోగ్యమైన ఒక గురువు నుండి తెలుసుకోవాలి. అందుకనే గురువు కలిగిఉండడం అవసరమని నొక్కి చెప్పబడింది. నిజానికి శ్రీ రూప గోస్వామి చెప్పినట్లు, భక్తి మార్గములో గురువును స్వీకరించడము, తరువాత సాంప్రదాయకపూర్వంగా దీక్ష తీసుకొని అభ్యసించడము మొదటి మెట్టు- గురు-పాదాశ్రయ తస్మాత్ కృష్ణ దీక్షాది-శిక్షణమ్ (భక్తి రసామృత సింధు 1.2.74). గురువు వద్ద అభ్యసించడమంటే జ్ఞానమును పొందడము. అర్జునుడిని కూడా కృష్ణుడు గురువు వద్ద అధ్యయనం చేయమని సలహా ఇస్తాడు. ఉద్ధవునికి కుడా ఇలాంటి ఉపదేశము పలుమార్లు ఇచ్చాడు.
చివరగా, శాస్త్రములో అధ్యయనం చేయాలని స్పష్టముగా ఉన్నాకూడా చాలా మంది భక్తులు చదవడం జ్ఞానమార్గములో అవసరం భక్తి మార్గములో కాదు అనే తప్పుడు భావనలో ఎందుకున్నారని ఒకరికి అనిపించవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం తక్కువ కఠినమైన మార్గమును ఎంచుకొనే మనస్సు యొక్క స్వభావంవలన అని నా అభిప్రాయం. అధ్యయనం చేయడం కష్టతరమైన పని, ఇది మనస్సుకు అంత సమ్మతము కాదు. మనందరికి మన చిన్నతనంలో అనుభవం ఉన్న విషయం మన తల్లితండ్రులు పాఠశాలకు వెళ్ళమని చెప్తే మనము ఆడుకోవడానికి మొగ్గుచూపేవాళ్ళము. బుద్ధిని ఉపయోగించడం బుద్ధి అవసరం లేని పనులు చేయడంతో పోలిస్తే ఎప్పుడూ కష్టంగా అనిపిస్తుంది. దీని కారణంగానే జనం బుద్ధి ఎక్కువ అవసరంలేని, భక్తిసంబంధితమైన పనులను చేయుటకు ఇష్టపడతారు. శాస్త్రాధ్యయనం దుర్భరమైనదిగా అనిపిస్తుంది, మరియు భక్తి మార్గము జ్ఞానము మీద ఆధారపడదని వారికి చెప్తే వెంటనే ఆనందించి ఇక చదవనవసరం లేదని ప్రకటిస్తారు.
అలాంటి భక్తులు ఎవరైనా శాస్త్రాధ్యయనం చేసేవారితో మెలగడానికి కొంత ఇబ్బందిపడతారు. కాబట్టి, అధ్యయనం చేయడం అవసరంలేదనే వారి ప్రవృత్తిని హేతుబధ్ధంచేయడము మరియు అధ్యయనం చేయడము కేవలం జ్ఞానము యొక్క వ్యాయామమని కించపరచడం చేయవలసిన అవసరం వస్తుంది.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.