శూద్రులా లేక వైశ్యులా?

Articles by Satyanarayana DasaComments Off on శూద్రులా లేక వైశ్యులా?

కలియుగంలో ప్రతిఒక్కరూ శూద్రులే”, కలౌ శూద్రాః సంభవాః అను నానుడి నేను చాలా సార్లు విన్నాను, కానీ ఇది ఎక్కడినుండి వచ్చిందనేది కనుగొనలేకుండా ఉన్నాను. అలానే , అందరూ శూద్రులుగా జన్మిస్తారు అని వేరొక శ్లోకము కూడా ఉంది.

జన్మనా జాయతే శూద్రః సంస్కారాత్ ద్విజ ఉచ్యతే

శాపానుగ్రహ-సామర్థం తథా క్రోధః ప్రసన్నతా (స్కంద పురాణము, నాగర ఖండము 239.31)  

పుట్టుకతో మనిషి శూద్రుడు, సరియైన సంస్కారముచేత బ్రాహ్మణుడు అవుతాడు. అలాంటి మనిషి కోపంలో శపించగలడు మరియు ఆనందంలో వరమివ్వగలడు.” 

ఇక్కడ, శ్లోకంలో “జన్మనా జాయతే శూద్రః”(పుట్టుకతో శూద్రుడైనప్పటికీ సంస్కారములతో బ్రాహ్మణుడు అగుట)కి బదులు జన్మనా జాయతే బ్రాహ్మణ(బ్రాహ్మణ పుట్టుకతోనే మనిషి ద్విజుడౌతాడని) అని ఉండాలని కొందరు పండితులు వాదిస్తారు. 

కలియుగంలో అందరూ శూద్రులే అనే అంశంపై నేను ఆలోచించాను. ప్రస్తుతం మనలో చాలా మంది వైశ్యులు అని నా అభిప్రాయం. పరిస్థితులు భవిష్యత్తులో మంచిగానో లేక చెడుగానో మారవచ్చు కానీ ప్రస్తుతానికి మాత్రం వైశ్య మనస్తత్వం అధికంగా ఉంది.

ఆధునిక వైశ్యులని రెండు రకాలుగా విభజించవచ్చు. స్పష్టమైన వారు మరియు అస్పష్టమైన వారు. స్పష్టమైన వైశ్యులను గుర్తించడం చాలా తేలిక. వీరు రకరకాల వ్యాపారాలు, కార్యాలయాలు, దుఖాణాలు, సంస్థలు నడుపుతారు. కొంతమంది రోడ్డు మీద తోపుడు బండితో, లేదా మడత బల్ల మీద పూలమ్ముకుంటూ, లేదా సైకిల్ మీద వేలాడదీసిన కొన్ని సంచులతో వ్యాపారం చేస్తారు. కొంతమంది వీధుల్లో తమ వస్తువుల ప్రచార పత్రం చేతికివ్వడం కానీ లేదా కారు తలుపు తీసుంటే కారులో వేయడం చేస్తుంటారు. కొందరు మీ తలుపు తడతారు. కొందరు స్పామ్ ఈ మెయిల్స్ పంపుతారు. నేను నా ఈ మెయిల్ చూసుకున్న ప్రతిసారీ నాకు విమాన టిక్కెట్ల నుండి ఆత్మరక్షణ వరకు ఏదో ఒక రకంగా అమ్మడానికి ప్రకటనలు అగుపిస్తూనే  ఉంటాయి. 

ఇవన్నీ చూస్తుంటే, అసలు శూద్రులు ఎక్కడున్నారు? అనిపిస్తుంది నాకు. వాళ్ళు మన చుట్టూ ఉండాలి కదా?

ఈ వృత్తులగూర్చి నారదుడు యుధిష్ఠిర మహారాజుకి భాగవత పురాణం(7.11.14-20)లో వివరణాత్మకముగా చెప్పిన వర్ణనను విశ్లేషిద్దాము. ఆధునిక ప్రపంచంలో యే దేశమూ ధర్మశాస్త్రములను పాటించట్లేదు కాబట్టి, వర్ణములు పురాతన రూపంలో లేకున్నను, మిశ్రమముగా వర్ణ సంకరముగా ఉన్నాయి. ఎందుకంటే, ఇవి గుణకర్మలకు ముఖ్యంగా సహజమైన మానసిక ప్రవృత్తులకు మూలాలు. అందువల్ల నారదుడు వర్ణాలకు చెప్పిన వృత్తులు ఆధునిక ప్రపంచానికి కుడా వర్తిస్తాయి.

ఒక బ్రాహ్మణుడు శాస్త్రముల అధ్యయనము చేయాలి, వాటిని ఇతరులకు బోధించాలి, తన యజ్ఞకార్యములను చేయాలి, ఇతరులకి ఋత్విక్కుగా పౌరోహిత్యం చేయాలి, దానము స్వీకరించాలి, దానం చేయాలి. దానము కొన్ని పనులకి సంభావన లాంటిది. అతడు దానమును యాచించవచ్చు లేదా యాదృచ్చికంగా వచ్చింది స్వీకరించవచ్చు.

ఒక క్షత్రియుడు ప్రజలనుండి బహుమతులు పొందవచ్చు మరియు వారినుండి పన్ను వసూలు(బ్రాహ్మణుల మీద కాకుండా) చేయవచ్చు. అతడు బ్రాహ్మణుడి పనులు(దానం స్వీకరించడం మినహా) కుడా చేయవచ్చు. 

ఒక వైశ్యుడు వ్యవసాయం, పశుపాలన మరియు వ్యాపారం చేసి జీవనం సాగిస్తాడు.

ఒక శూద్రుడు జీతభత్యము తీసుకొని ఇతరులకోసం పనిచేస్తాడు. 

అత్యవసర పరిస్థులలో ఒకరు తన క్రింది వర్ణముల వృత్తిని చేయవచ్చు. కానీ, అవసరమైతే ఒక క్షత్రియుడు బ్రాహ్మణుడి విధులని స్వీకరించవచ్చు. అత్యవసర పరిస్థితిలో బ్రాహ్మణ క్షత్రియులు వైశ్య వృత్తులని చేయవచ్చు కానీ శూద్ర పనులు చేయరాదు. ఆసక్తికరమైన విషయమేమిటంటే మిగిలిన వాటి కన్నా వైశ్య వృత్తులు ఇతర వర్ణములలోకి బాగా వ్యాపించగలవు.  

ఆధునిక బ్రాహ్మణులు బహుశా మేధావులైన కవులు, రచయితలు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, ఋత్విక్కులు మొదలగు వృత్తులలో కనిపించవచ్చు. వీరందరి జీవితాలని పరిశీలిస్తే దాదాపు అందరూ ఏదోఒకటి అమ్మడాన్ని(వైశ్యుల ముఖ్య పని) మనము చూడవచ్చు. వారు కంటికి కనబడే పుస్తకాలు అమ్మవచ్చు లేదా కంటికి కనబడని జ్ఞానాన్ని, సలహాలని అమ్మవచ్చు. 

ఏదైనా అమ్మేప్పుడు దానిని ప్రకటన చేయాలి. నేటితరం బ్రాహ్మణులు అందుకు సామాజిక మాధ్యమాలలో ఉంటారు.

ఇది అస్పష్టమైన(అంతర్గతమైన) వైశ్యుల ఉదాహరణ. స్పష్టమైన వైశ్యులవలె అస్పష్టమైన వైశ్యులకు షోరూం మరియు దుఖాణాలు ఉండవు. కానీ, వీరు తమ వస్తువు లేదా పనిని ఇతరులు కొనదగినవని ప్రేరేపించడానికి, ప్రభావితం చేయడానికి, నమ్మించడానికి చాలా సమయం గడుపుతారు. అందుకనే  బ్రాహ్మణ, క్షత్రియ లేదా శూద్రుల యొక్క యే వృత్తి అయినా అంతర్గతంగా వైశ్య భావంతో  నిక్షిప్తమై  ఉన్నాయి. అన్ని ప్రైవేటు సంస్థలు- విద్యారంగమైనా, భద్రతారంగమైనా లేక యే సేవచేయు సంస్థలైనా వ్యాపార దృక్పథంతోనే  నడపబడుతున్నాయి.  బ్రాహ్మణుల వైద్యశాలలు మరియు విశ్వవిద్యాలయాలు కూడా వ్యాపారాలవలె పనిచేస్తున్నాయి. సీసపుపని, ఇంటిపని, కూలిపని మొదలగు శూద్ర పనులు కూడా వ్యాపారప్రవృత్తితో నడుస్తున్నాయి. క్షత్రియుల సైనిక మరియు ప్రభుత్వ కార్యకలాపాలు కూడా వ్యాపారంలా చేయబడుతున్నాయి. వైద్యులు మందులు లేక చికిత్సను అమ్ముతారు. న్యాయవాదులు వాదనలని అమ్ముతారు. ఉపాధ్యాయులు తమ పాఠాలను అమ్ముతారు. రచయితలు తమ పుస్తకాలను అమ్ముతారు. శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు నిధులకోసం తమ ఊహ/అనుమానమును అమ్ముతారు. రాజకీయవేత్తలు ఓట్లకోసం లేదా నమ్మకంకోసం తమని మరియు తమ వాగ్దానాలని అమ్ముకుంటారు. సైన్యంకూడా నిధులకోసం తమ ఉద్దేశ్యములను మరియు ప్రణాళికలను అమ్ముకుంటుంది. 

లాభాపేక్షలేని సంక్షేమ మరియు ఆధ్యాత్మిక లేదా మతపరమైన సంస్థలకు కూడా డబ్బు అవసరం. అందుకని వారు కూడా తమ అభిప్రాయాలను అమ్మాలి మరియు తమ కార్యకలాపాల్ని ప్రకటన చేయాలి.

నిజానికి, మనము ఒక వస్తువుగా మారాము! ఇతరులను మన వైపు  ఆకర్షించడానికి మరియు వారి  డబ్బుకు మనం తగినవారమని నమ్మించడానికి మనము వివాహవేదికలు, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ మొదలగు అనేక మాద్యమాలు వాడతాము. మనల్ని ఏదోఒక రూపంలో ఇతరులు కొనడానికి మనం మన కోసం కాకుండా ఇతరులకోసం బట్టలు ధరిస్తున్నామంటే ఆశ్చర్యపోనవసరంలేదు. మన దైనందిన జీవితంలో ఇతరుల దృష్టిలో మనం ఒక మంచి వస్తువుగా కనబడేందుకు మాత్రమే పనులు చేస్తున్నాము.ఉదాహరణకు, మిమ్మల్ని మీరు “నేను ఫేస్బుక్ ఎందుకు వాడుతున్నాను?” అని ప్రశ్నించుకోండి.

మీ ఆలోచనేదో వృద్ధిపరచుకోవాలని మీకు లేదా? మీకు ప్రేక్షకులని పెంపొందించుకోవాలని లేదా? మీ దగ్గర ఉన్న ఏదో ఒక వార్తను వ్యాప్తి చేయాలని అనుకోవడంలేదా? ఇవన్నీకూడా మిమ్మల్ని మీరు, మీ అభిప్రాయాలని, మీ సందేశాల్ని అమ్ముకోవడమే.  

ఫేస్బుక్ వాడుతున్నప్పుడు మీ భావాలను గురించి ఒకసారి ఆలోచించండి. మీ దృష్టిలో చాలా యథార్థమైన, ముఖ్యమైన ఒక సందేశమును మీరు పెట్టినప్పుడు ఎవరైనా దాన్ని ఖండిస్తూ, అజ్ఞానంతో లేదా మొరటుగా బదులు ఇస్తే ఎలా భావిస్తారు? బహుశా అనాదరణ వల్ల కోపమో లేక బాధో చెందుతారు. ఇలాంటి విషయాలకు మనం ఎందుకు భావోద్వేగాలకు గురౌతాము? ఎందుకంటే ఇలాంటి ఎత్తి చూపుల మరియు అనాదరణల అర్థం మనల్ని లేదా మన అభిప్రాయాలని వారు ఆమోదించకపోవడం అని. 

దాదాపు మనమందరం అంతర్గత వైశ్యులం, ఇది మన మనస్సును బాగా లోతుగా ప్రభావితం చేసింది. అంతర్జాలం వలన పెరిగిన ఈ అసాధారణ భావన కొత్తది కావడంవల్ల బాగా గుర్తించబడట్లేదు. కావున, నేను కలియుగంలో అందరూ శూద్రులు కాదు, వైశ్యులు అని భావిస్తున్నాను. 

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    ప్రేమ మరియు భక్తితో జీవించాలనుకుంటున్నామా లేదా అసూయ మరియు ద్వేషపూరిత జీవితాన్ని గడపాలనుకుంటున్నామా అని ఎంచుకునే అవకాశం మనకు ఉంది. కాని ఈ ఎంపిక మరియు చర్యలు మన హృదయంలో ఉన్న భావముల అనుగుణంగానే జరుగుతాయి.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.