మహారాజుగారి నుండి గౌఢీయ వైష్ణవ వాఙ్మయం చదువుకొని న్యాయ, వైశేషిక మొదలగు షడ్-దర్శనములు వేరే గురువు వద్ద నేర్చుకుందామని నేను అనుకున్నాను. షడ్-దర్శనములలో పండితులు చాలామంది ఉండవచ్చు కానీ గౌఢీయ వాఙ్మయం మహారాజుగారు తప్ప వేరే ఎవరు చెప్పలేరు గనుక నా ఉద్దేశ్యంలో ఆయన సమయాన్ని దాన్ని నేర్చుకోవడాని వినియోగించాలనుకున్నాను. ఆయనకు ఈ విషయం తెలిసి, ఒకరోజు షడ్-దర్శనాలు కూడా నాకు బోధిస్తానని చెప్పారు. ఆ మాట వినడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. కుమారిల భట్ట రచించిన శ్లోకవార్తికము మరియు విశ్వనాథ న్యాయపంచానన రచించిన న్యాయ సిద్ధాంత ముక్తావళీ బోధించడం మొదలుపెట్టారు. మొదటిది పూర్వమీమాంసముకు సంబంధించినది రెండవది న్యాయమునకు సంబంధించినది. రెండూ చాలా కష్టమైన పాఠ్యక్రమములు. మహారాజుగారు గొప్ప నైయాయికులు. అన్ని దర్శనములలో పట్టాలు పొందినా న్యాయాచార్య అనే బిరుదుకి ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. సాధారణంగా క్రమంగా చెప్తే తప్ప ఈ పాఠాలను చెప్పడానికి ముందస్తుగా తయారు కావలసిఉంటుంది. మహారాజుగారికి తయారుకావడానికి సమయం లేదు. ఆయన తన విద్యార్ధి దశలో చాలా కష్టపడి బెనారస్ లో ఉత్తమ గురువుల వద్ద అధ్యయనం చేశారని, అందుకే ఏ ముందస్తు సన్నాహము లేకుండా చాలా రోజుల తర్వాత వాటిని బోధించగలిగారని చెప్పారు.
ఆయన్ని గమనిస్తూ నేను చాలా నేర్చుకున్నాను. దేవాలయం ముందు ఊడ్చడం, అర్చనకు పూలు మరియు తులసీపత్రాలు కోయడం, నైవేద్యము తయారుచేయడం మొదలగు దేవాలయసేవలు చాలా వరకు ఆయనే స్వయంగా చేసేవారు. భగవదార్చనలో ఎవరి నుండి సహాయం తీసుకొనేవారుకాదు, అలానే, తౌడు చేసి మేత వేయడంవంటి గోసేవ పనులు కూడా తానే స్వయంగా చేసేవారు. ఆయనే ఆశ్రమవాసులందరికీ వంటవండి వడ్డించేవారు. తాను మాత్రం రోజుకి ఒక్కసారి సాయంత్రం 5గంటలకు భోజనం చేసేవారు. దానికి ముందు ఒక్క చుక్క మంచినీరు కూడా త్రాగేవారుకాదు.
ఆయన ఉత్తమ భక్తుడికి చక్కని ఉదాహరణ. ఉన్నతాసనం మీద కూర్చొని ప్రసంగాలు ఇచ్చేవారు కాదు. వేరేవారిచేత మెప్పింపబడడానికో లేదా వారికి ఏదో చూపడానికో ఆయన ఏపనీ చేయలేదు. నిత్యం సేవాభావంలో ఉండేవారు. ఏ పని చేసినా దానిలో నిమగ్నమై వేరే ఆలోచన లేకుండా చేసేవారు. పాఠం చెప్పేటప్పుడు దాని నుండి దారితప్పకుండా దానిలో నిమగ్నమైవుండేవారు.
మొదట్లో నా పాఠం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు విరామము లేకుండా జరిగేది. చాలా అరుదుగా సందర్శకులు వచ్చేవారు, ఒకవేళ ఆ సమయంలో వచ్చినా పాఠం అయ్యేదాకా వారు వేచి ఉండవలసిందే. వేసవికాలంలో విపరీతమైన ఎండ మరియు విద్యుత్ అంతరాయం గంటల కొద్దీ ఉండేది. మహారాజుగారు గ్యాస్ లాంతరు వెలిగించేవారు, దానితో గది ఇంకా వేడిగా ఉండేది, కానీ పాఠం బోధించేప్పుడు ఎప్పుడూ అసౌకర్యానికి గురికాలేదు. విస్తారంగా చెమటలు పట్టేవి, కానీ పాఠం మొత్తం ఒక సమాధివలె ఉండేది. ఏది మమ్మల్ని భంగపరిచేది కాదు. ఆయన ఉనికి ఆశ్చర్యాన్ని ప్రేరేపించేది. ఆయన సమక్షంలో నేను అల్పుడిగా అయ్యాను, కానీ పాఠంలో లేదా గోశాలలో ఆయన మాటలు మరియు కదలికల మీద చాలా ధ్యాస ఉంచేవాడిని.
ఆయనకు ఆయనే సాటి
గోశాలలో ఉన్నప్పుడు ఆయన చాలా అరుదుగా మాట్లాడేవారు. ఆయనతో ఉండడం ఒక లోతైన ధ్యానంలో ఉన్నట్లుండేది. నేను ఏదైనా చేయాల్సినప్పుడు తన చేతి సైగలతో లేదా కంటిచూపుతో చెప్పేవారు, దానిని నేను గ్రహించాల్సివచ్చేది. ఒక్కోసారి నేను గ్రహించలేకపోయినప్పుడు ఆయన చాలా కలతచెందేవారు. దానికి కారణం ఆయన దృష్టిలో గోసేవ సాధారణ పని కాదని, శ్రీకృష్ణుడికి ప్రియమైన గోవులకు సేవచేయడమని నాకు అర్థమైంది. వాటిని ఆయన ఇష్ట దేవతలుగా లేదా పూజించదగినవిగా భావించారు కానీ పశువులుగా కాదు. అందుకనే వాటిసేవలో చిన్న తప్పిదాన్ని లేదా ఆలస్యాన్ని భరించలేకపోయేవారు. మొదట్లో ఆయన భావాన్ని అర్థంచేసుకోనందున ఇది అస్పష్టంగా అనిపించింది. ఉదాహరణకి ఆయన గోశాలకు వచ్చేముందు మేము అంతా శుభ్రం చేసి, నీరు మార్చి, మేత వేసేవాళ్ళం. ఆయన వచ్చి తౌడు కలిపేవారు, నీటిలో ఒక్క ధాన్యపు పొట్టు కనబడినా నావైపు చూసేవారు, దానర్థం మొత్తం నీరు మళ్ళీ మార్చమని. మొదట్లో నాకు అర్థంకాలేదు కానీ తర్వాత ఇది దేవుడికి నైవేద్యం ఒక కంచములో పెట్టినట్లేనని, నీటి గ్లాసులో పొట్టు తేలుతూవుంటే అది కృష్ణుడికి ఎలా నైవేద్యం పెట్టగలమని అర్థమైంది. గోసేవ ఇలాంటి భావనతో చేయడం నేను మరెక్కడా కనీవినీ ఎరుగలేదు.
తన కిష్టమైన ప్రతిపాదనలతో ఒకటి “సేవ అంటే సేవ చేయడము, సేవ అంటే పని చేయడం కాదు”. సేవ మరియు పని మధ్య బేధం ఉంది. పనిలో ఏకాగ్రత పరిణామము మీద ఉంటుంది, అది అయిపోయినతర్వాత ఉపశమనం మరియు ఆనందం కలుగుతాయి. పని పూర్తైన తర్వాత తృప్తి కూడా కలుగుతుంది. సేవలో మొదటి నుండి ఆనందం ఉంటుంది. త్వరగా పూర్తి చేయాలనే తొందర ఉండదు, సహజంగా ఏ చీకూ చింతా లేకుండా ఉంటుంది, అది చేసేవారు దానిలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. మహారాజుగారిలో నేను ఇదే గమనించాను. ఆయన ఎప్పుడు సేవ పూర్తి చేయాలని తొందరపడడమో లేదా చింతించడమో చేయలేదు.
ఆధ్యాత్మిక జగత్తులో సమయం నమ్యమని చెప్తారు. అది భగవంతుని లీలలకు సహకరిస్తుంది. కాబట్టి భగవంతుడు ఎప్పుడూ తొందరపాటుతో ఉండడు. మహారాజుగారిలో ఈ భావనను నేను గమనించాను. నేను ఏదైనా త్వరగా పూర్తిచేస్తే “పంజాబ్ మెయిల్” అని పాతకాలంలో వేగవంతమైన రైలునుద్దేశిస్తూ అనేవారు.
గోశాలలో గోవుల సంఖ్య తర్వాత రోజుల్లో పెరిగినప్పుడు ఉదయం 2గంటల దాకా ఒక్కోసారి 3గంటలదాకా గోసేవ చేసేవారు. కాలానికి అతీతంగా ఉండేవారు. సాంప్రదాయక భారతీయ బుద్ధిని ఆయనను చూసి అర్థంచేసుకునేవాడిని.
మహారాజుగారిలో రెండు భావాలు ఉన్నట్లు నేను అనుకున్నాను. పాఠం బోధించేప్పుడు శాస్త్రాలలో లీనమై వేరే మనిషిలా ఉండేవారు, నేను ఏ ప్రశ్నయినా అడగవచ్చు దానికి చాలా వివరణగా సమాధానం ఇచ్చేవారు. గోసేవ చేసేప్పుడు మాత్రం గంభీరంగా ఉండి మితంగా మాట్లాడేవారు. ఎవరినుండి ఏ ఆటంకాలని ఇష్టపడేవారు కాదు. ఆయన సేవలో చాలా అప్రమత్తంగా మరియు తప్పిదాలపై అసహనంతో ఉండేవారు. నేను నా జీవితంలో చాలా మంది సాధువులను కలుసుకున్నాను, కాని అలాంటి సేవా భావం ఉన్న వారిని నేను చూడలేదు.
మహారాజుగారు ఆయన రకానికి చెందినవారు. ప్రాచీన పద్ధతికి సంబంధించినవారు. బహుశా ఆయన బృందావన గోస్వాముల భావంతో ఉన్న ఆఖరి మనిషి కావచ్చు, సకల శాస్త్ర పాండిత్యం, అత్యంత వైరాగ్యం, మరియు తన దేహంపై ఆందోళన లేకుండా సేవాభావంతో ఉండడం. ఈ కలియుగంలో అలాంటి మనిషి మళ్ళీ భూమిమీద నడుస్తాడా అని ఆశ్చర్యపోతున్నాను.
ఆయన ఉన్నత వ్యక్తిత్వం నా భాగ్యం మరియు ఆయన సాంగత్యం పొందిన అందరి భాగ్యం. కనిపించే గురువుని చూడకుండా ఉత్తమభక్తిని అర్థంచేసుకోవడం ఎంత విన్నా మరియు చదివినా కష్టం. ఇది నా అనుభవం మరియు దృఢ నమ్మకం.
మహారాజుగారు మనల్ని వదిలి వెళ్లడం(అక్టోబర్ 6న, 2013)తో ఇదంతా ఒక కలలా ఉంది. కాలీదహలో ఆయన భౌతికంగా లేరని అంగీకరించడం కష్టం. చాలా సంవత్సరాలు ప్రతిరోజూ నేను అక్కడికి వెళ్లి ఆయనను చూసాను. బృందావనంలో నివసిస్తున్నపుడు నేను నా గది నుండి కాలీదహకి మళ్ళీ తిరిగి వెనక్కి గదికి మాత్రమే వెళ్ళేవాడిని. బృందావన పరిక్రమము గానీ, గోవర్ధన పరిక్రమము గానీ లేదా వ్రజభూమి చుట్టు ప్రక్క ప్రాంతాలు చూడడం గానీ చేసింది పెద్దగా లేదు. ఇంత ఆకస్మికంగా ఆయన వదిలి వెళ్తారని నేను అనుకోలేదు, ఆయన 100 సంవత్సరాలు ఉంటారని కొంత ఖచ్చితముగా అనుకున్నాను. కానీ భగవంతుడి, ఆయన భక్తులగురించి ఎవరు చెప్పగలరు? ఆయన మాటలను, చాలా దగ్గరగా చుసిన వ్యక్తిగత జీవితాన్ని తలుచుకుంటూ జీవిస్తాను, మరియు డెట్రాయిట్ నుండి మహారాజుగారివద్దకు రావడాన్ని శ్రీ కృష్ణుడు ఎలా ఏర్పాటు చేశాడా అని ఆశ్చర్యపోతున్నాను. ఇది యాదృచ్ఛికము మాత్రమే కాగలదు.
కృష్ణుడు గురుత్వాకర్షణ కేంద్రం. గురుత్వాకర్షణ శక్తికి కారణమేమిటో తెలుసుకోటానికి శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. కృష్ణుడే గురుత్వాకర్షణ శక్తి, ఎందుకంటే అతనే పరిపూర్ణ ప్రేమ స్వరూపుడు. అతను అందరినీ ఆకర్షిస్తాడు. ఇదే కృష్ణ అనే పదానికున్న అర్ధాలలో ఒకటి.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.