స్వేచ్ఛ మరియు మహిళల రక్షణ

Articles by Satyanarayana DasaComments Off on స్వేచ్ఛ మరియు మహిళల రక్షణ

                ఇటీవల కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీలో సామూహిక అత్యాచార విషాద సంఘటన ఒకటి జరిగింది.  ఇందులో బాధితురాలు  చనిపోవటం జరిగింది. ఈ నేరం మొత్తం దేశ దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుండి భారతదేశంలో మహిళల భద్రత, స్వేచ్ఛ మరియు రక్షణ గురించి చాలా విషయాలు వ్రాయబడ్డాయి. ఈ వ్యాసంలో, భారతదేశంలోని వేద కాలంలో మహిళల స్థితిగతులను నేటి ఆధునిక కాలంలో వారి స్థితిగతులతో పోలిస్తే గల భేదాలను వివరిస్తాను.

              వేద కాలంలో, మహిళల స్వేచ్ఛ కంటే వారి  రక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. స్వేచ్ఛ ప్రధానంగా ధర్మం యొక్క కట్టుబాట్లతో కలసి ఉండేది, అలానే  మహిళల స్వయంప్రతిపత్తి వారి స్థితి, తరగతి మరియు విద్యపై ఆధారపడి ఉండేది.

      భారతీయ శాస్త్రాలు  మహిళలను రక్షించడానికి అనేక నియమాలను నిర్దేశించాయి. మను స్మృతి (9.3)లో  ప్రసిద్ధ పద్యం స్త్రీకి స్వాతంత్ర్యము ఇవ్వకూడదనీ, యవ్వనంలో తండ్రి, తరువాత భర్త మరియు వృద్ధాప్యంలో కుమారుడిచే ఆమె రక్షించబడాలి అని సలహా ఇస్తుంది. ఈ పద్యం స్త్రీవాదుల చర్చలకు  మరియు విమర్శలకు తావిస్తున్న ప్రముఖ కారణభూతము. సాధారణంగా ఇది స్త్రీలను హింసించటానికి పురుషులకు ఇచ్చిన ఒక నిషిద్ద ఆయుధంగా  కనిపిస్తుంది. కానీ , దాన్ని  సరైన సందర్భంలో చూసినప్పుడు, మను యొక్క ఉద్దేశ్యం మహిళలను హింసించడం కాదు, వారిని రక్షించడం అని స్పష్టమవుతుంది.

      నేడు మహిళలను రక్షించే భావన తరచుగా తప్పుగా అర్ధం చేసుకోబడింది. ప్రపంచవ్యాప్తంగా మహిళా  హక్కుల ఉద్యమాలు మహిళల స్వాతంత్ర్యము కోసం ప్రయత్నిస్తాయి. పర్యవసానంగా, వారు మహిళల కార్యకలాపాలపై ఎలాంటి పరిమితిని  చేసే  చర్యలనైనా వారి స్వేచ్ఛను అరికట్టే మార్గాలుగా వ్యాఖ్యానిస్తారు.

      ఏదేమైనా, వేద నిషేధాలు మహిళలను పరిమితం చేస్తున్నట్లు  లేదా వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు  కనిపిస్తున్నప్పటికీ , అవి  వారి పట్ల వివక్ష చూపడం కోసం  కాదు, దోపిడీ నుండి వారిని రక్షించడం మరియు వారి హక్కులను వారికీ  కల్పించడం కొరకు మాత్రమే . వాస్తవానికి, వేద నిషేధాలు సమాజములో వివిధ రకాలుగా దోపిడీకి లోనవుతన్న ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించాయి:  ఉదాహరణకు మహిళలు, పిల్లలు, వృద్ధులు మరియు ఆవులకు  కూడా. మను (9.3) యొక్క పద్యం స్త్రీలకు స్వాతంత్ర్యము ఇవ్వకూడదని తరచుగా తప్పుగా చదవబడుతుంది. కానీ, సరిగ్గా అనువదించినప్పుడు, మహిళలు స్వతంత్రంగా వదిలేస్తే తమను తాము రక్షించుకోలేరని అర్థం. ప్రపంచవ్యాప్తంగా వేధింపులకు గురైన మరియు దోపిడీకి గురైన మహిళల సంఖ్యను మనం చూస్తే, మను యొక్క జ్ఞానాన్ని మనం అభినందించవచ్చు.

స్త్రీలకు  మాత్రమే

            మహిళలను రక్షించడానికి నియమాలు మరియు ఏర్పాట్లు ప్రస్తుత కాలంలో కూడా చేయబడ్డాయి. భారతదేశంలోని చాలా రైళ్లలో లేడీస్ కంపార్ట్మెంట్ మహిళల కోసం ప్రత్యేకంగా రిజర్వు చేయబడింది, ఇది పురుషులచే ఇబ్బంది పడకుండా హాయిగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. ఢిల్లీలో, పురుషులు ప్రవేశించకుండా ఉండటానికి మెట్రో రైళ్లలో గార్డులతో ప్రత్యేక మహిళల కంపార్ట్మెంట్లు ఉన్నాయి మరియు మహిళలకు మాత్రమే అనే ప్రత్యేక పబ్లిక్ బస్సులు ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వం రాత్రి 7 గంటల తర్వాత పనిచేసే మహిళా ఉద్యోగులకు  వసతి గృహ సదుపాయాలు కల్పించాలని లేదా  వారు ఇంటికి  సురక్షితంగా  చేరే  మార్గాలను చూడమని కోరుతుంది. ఇటువంటి చర్యలు మహిళలకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించినవి, అయినప్పటికీ వారి స్వేచ్ఛను పరిమితం చేసినట్లు కూడా చూడవచ్చు.

    న్యూయార్క్ నగరంలో, 20 వ శతాబ్దం ప్రారంభంలో, ఒంటరి మహిళలు సొంతంగా అపార్ట్మెంట్ అద్దెకు తీసుకోవడం ఆమోదయోగ్యం కాదు. ఏదేమైనా, ప్రసిద్ధ వెబ్స్టర్ అపార్టుమెంటులతో సహా నగరంలోని వివిధ ప్రాంతాలలో మహిళల కోసం అనేక నివాసాలు ఉన్నాయి. నేటికీ, వెబ్‌స్టర్ అపార్ట్‌మెంట్లు మిడ్‌టౌన్ మాన్హాటన్ లోని మహిళలకు ఒయాసిస్‌లాగా పనిచేస్తాయి. అక్కడ పనిచేసే, అధ్యయనం చేసే  ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన మహిళలకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన గృహాలను అందించడం వారి ప్రధాన ఉద్దేశం .

        ఆధునిక సమాజంలో మరియు మను గ్రంథాలలో ఈ నిబంధనల వెనుక ఉన్న ఉద్దేశ్యం ఒకటే: మహిళలను రక్షించడం. అది వారి స్వేచ్ఛను పరిమితం చేయడము మాత్రం  కాదు.

సందర్భానుసార నియమాలు

             స్మృతి గ్రంథాలు ఒక నిర్దిష్ట కాలానికి మరియు నిర్దిష్ట ప్రజల కొరకు  వ్రాయబడ్డాయి. మను ఈ రోజు జీవించి ఉంటే, అతను ఖచ్చితంగా వేర్వేరు నియమాలను తయారుచేసేవాడు. చీరకట్టుకు బదులు జీన్స్ మరియు టీ-షర్టులను స్వీకరించిన మరియు గాలిలో వీచే జుట్టుతో స్వేచ్ఛగా మోటారుబైకులపై పరుగెత్తే నేటి నవతరం భారతీయ బాలికలను చూస్తే, మను ఈ రోజు మను-స్మతిని ఎలా వ్రాస్తారని ఆశ్చర్యపోవచ్చు. అతని ఆందోళన ఇప్పటికీ మహిళల రక్షణకోసమే ఉంటుంది, ఎందుకంటే సమాజం యొక్క స్థిరత్వం మరియు శాంతికి అది ఎంతో ప్రాముఖ్యమని ఆయనకు తెలుసు.

           పశ్చిమ దేశాల నుండి వస్తున్న లింగ రహిత ఫ్యాషన్‌ను అనుసరించడం ద్వారా మరియు దానితో అనుసంధానమైన  “స్వేచ్ఛ” అనే  ప్రవృత్తి  అవలంబించటం వల్ల, భారతదేశ మహిళల  కట్టుబాట్లు మరింతగా మారే అవకాశం ఉంది. చాలామంది  మహిళలు పురుషుల కంటే మెరుగ్గా పని చేయడం ద్వారా ఇంటి వెలుపల తమ విలువను నిరూపించుకుంటున్నారు. అంతేకాక, తరతరాలుగా మగ వారికి  పరిమితమైనవిగాన అంగీకరించబడిన వాటిని వారు సవాలు చేస్తున్నారు. మహిళలు, భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా, వారి కొత్త గుర్తింపును మరియు దాని శక్తిని ఎక్కువగా కనుగొంటూ దానిలో ఆనందం పొందుతున్నారు. ఈ భరోసా ఉన్న స్త్రీలకు తమకు ఏమి కావాలో తెలుసు మరియు ఈ విజయాన్ని సాధించడం పురుషులపై ఆధారపడటం నుండి వారిని విడిపిస్తుందని భావిస్తారు.

కానీ “మహిళల స్వేచ్ఛ” అంటే ఏమిటి? మహిళలు నిజంగా స్వతంత్రంగా ఉన్నారా? పురుషులతో సమానంగా పోటీ చేసే స్వేచ్ఛను పొందడం ద్వారా, మహిళలకు ఇకపై రక్షణ అవసరం లేదా? లేదా ఆ స్వాతంత్ర్యము అంటే మహిళలు తమ భద్రత కోసం బాధ్యతను స్వీకరిస్తారా? ప్రపంచవ్యాప్తంగా మహిళలపై  పెరుగుతున్న హింస రేటును చూస్తే, మహిళల స్వేచ్ఛ మరియు రక్షణ ఒకేసారి సాధ్యమేనా అని మనము ఆచ్చర్య పోతాము .

        మహిళలకు ఇష్టానుసారం వేర్వేరు భాగస్వాములను మరియు విడాకులను ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది, కానీ అది వారికి ఆనందాన్ని ఇస్తుందా? అది వారికి ప్రేమను ఇస్తుందా? ప్రేమ లేని స్వేచ్ఛ వల్ల ఉపయోగమేంటి?        

మహిళల గత జీవితాన్ని నేటితో పోల్చి చూస్తే, చివరికి వారి బంధం కేవలం చూడడానికి వేరుగా అనిపిస్తుంది. సాంప్రదాయ మహిళలు వందలాది నియమ నిబంధనలకు కట్టుబడి ఉన్నారు, నేటి మహిళలు వారి స్వేచ్ఛ యొక్క పరిణామాలకు కట్టుబడి ఉన్నారు, వారు కోరుకున్నది చేయాలనుకుంటున్నారు లేదా వారు కోరుకున్న వారై ఉండాలని అనుకుంటున్నారు.

స్వేచ్ఛ వల్ల చెల్లించాల్సిన మూల్యం 

        పతనమవుతున్న నారీ ప్రాతివత్యం వారి స్వేచ్ఛ కోసం వారు చెల్లిస్తున్న మూల్యంగా చెప్పవచ్చు . ఈ స్వేచ్ఛ అలాంటి మహిళలు లైంగికంగా అందుబాటులో ఉన్నారనే దురభిప్రాయాన్ని పురుషులలో  సృష్టించవచ్చు, అలానే  వారిని కేవలం  ఆట వస్తువులుగా మాత్రమే చూడటానికి  పురికొల్పవచ్చు.

       కొంతమంది మహిళలు స్వేచ్చ అనేది తమ హక్కు అని ప్రగల్భపడుతున్నప్పటికీ , నేటి  సమాజములో రోజు రోజుకీ పెరుగుతున్న లింగవివక్షా  ధోరణిని మనము తిరస్కరించలేము. మహిళా విలువల  క్షీణత చాలా ఆమోదయోగ్యంగా మారింది, ఇది ఇప్పుడు ప్రశ్నించదగినదికాకుండా నిరసన లేకుండా నిరంతరాయంగా కొనసాగుతోంది. వివిధ సమాచార స్రవంతులు  విభిన్న రీతులలో  మహిళలను లైంగిక వస్తువులుగా ప్రచారం  చేస్తూ  అత్యంత స్పష్టమైన అశ్లీలతకు ఆనవాలుగా మారాయి. దీని ప్రభావం వల్ల ఈ  కొత్త  పురుష జాతి ఇకపై మహిళల సామాజిక విలువలను గుర్తించడం లేదా అభినందించడం సాధ్యం కాదు. అలాంటి పురుషులు తమ ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడానికి మరియు సమర్థించడానికి  మహిళల ప్రత్యేక  ప్రాధాన్యత ఎట్టిదో  గుర్తించడంలో పూర్తి  వైఫల్యం చెందుతారు.

ప్రథమ గురువు మహిళ

        స్త్రీ పాతివ్రత్యము  యొక్క శక్తి పురుషుని ఆత్మగౌరవాన్ని ఎలా పెంచుతుందో  మరియు ప్రభావితం చేస్తుందో వేద సంస్కృతికి బాగా తెలుసు. ఉదాహరణకు, స్వాతంత్ర  సమరయోధుడు స్వామి శ్రద్ధానంద (1856-1926) ఒకసారి తన తల్లి సహనం మరియు ఆత్మబలిదానం తన తాగుబోతు భర్తను ఎలా మార్చిందో చెప్పారు.

     స్వామి శ్రద్ధానంద తండ్రి లాలా నానక్ చంద్ కాన్పూర్ లో పోలీసు అధికారి. అతని భార్య శివదేవి తన భర్త మీద మిక్కిలి అనురాగముతో  ఉండటంతో, కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తినడం పూర్తేయ్యేవరకూ తను తినకూడదనే  నిబంధనను శ్రద్ధగా పాటించేది. ఒక సారి, లాలా నానక్ ఒక పార్టీకి వెళ్లి తను నడవలేనంతగా త్రాగాడు. అతను ఇంటికి వచ్చినప్పుడు, ఆ త్రాగుడు వల్ల  వాంతి చేసుకొన్నాడు, చివరగా  స్పృహ కోల్పోయాడు.

           అతని భార్య  ఆ  స్థితిలో ఉన్న అతనికి పెరుగు మరియు నిమ్మకాయ నీరు ఇచ్చియింది , స్నానం చేయించింది, బట్టలు మార్చింది, విసనకర్రతో గాలి విసిరింది, అతనికి తలకు  మసాజ్ ఇచ్చింది. చివరగా ఉదయాన్నే అతను మేల్కొన్నాడు, ఆ తరువాత  తన భార్య నుండి పొందుతున్న మంచి సంరక్షణను గ్రహించాడు. ఆమెను  తిన్నావా  అని అతను  అడిగినప్పుడు, భార్య తల ఊపుతూ, “మీరు మీ భోజనం ముగించ కుండా నేను ఎప్పుడూ తినలేదు.” అని జవాబిచ్చింది.  ఆ క్షణంలో, ఆమె భర్త తన తప్పును గ్రహించి, త్రాగుడును పూర్తిగా  మానేశాడు.

      ఇటువంటి ఉదాహరణలు భారతదేశంలో కోకొల్లలుగా మనం వింటుంటాం. భర్త ఇంటికి వచ్చేవరకు భార్య తినదు. ఆమె అతని కోసం వేచి ఉండి, అతనికి ఆప్యాయంగా సేవ చేశాకే తాను ఏదైనా తింటుంది.

       ఇటువంటి నిజ జీవిత కథలు పురుషుల కంటే మహిళల పాత్ర మరియు సమగ్రతకు ఎందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడిందో తెలియజేస్తాయి. స్త్రీ వ్యక్తిత్వం ఆమె భర్త మరియు పిల్లలను ప్రభావితం చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఒక మహిళ ద్వారా ఈ ప్రపంచానికి వస్తారు మరియు తరువాత ఆమె ద్వారా పెరుగుతా రు. అందువల్ల వేద సంస్కృతి స్త్రీలను మొదటి గురువులుగా ప్రకటించింది. అలానే వారిని సమాజానికి పునాదిగా సముచిత స్థానము కల్పిస్తూ  గౌరవించింది. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని, హిందుధార్మిక సిద్ధాంతకర్త  అయిన  మను, పురుషుల చేతిలో మహిళలు  అధఃకరణము చెందకుండా ఉండేందుకు శ్రద్ధ వహించారు. నేటి ఆధునిక స్త్రీలు ఈ  సంస్కృతిని ప్రశంసించకపోయినా, వాస్తవానికి  ఈ ప్రాచీన కాలపు అనుసరణ మార్గాల వెనుక లోతైన జ్ఞానం ఉంది.

 

Notify me of new articles

Comments are closed.

 • Satyanarayana Dasa

  Satyanarayana Dasa
 • Daily Bhakti Byte

  మీ మార్గాన్ని ఇతరులకు తెలియజేయడానికి ఉత్తమ మార్గం శాంతియుతంగా, ప్రశాంతంగా మరియు ఇతరులను అంగీకరించే మీ వ్యక్తిగత ప్రవర్తన. ఇది వారిలో ఉత్సుకతను రేకెత్తిస్తుంది.

  — Babaji Satyanarayana Dasa
 • Videos with Bababji

 • Payment

 • Subscribe

 • Article Archive

 • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.