నమ్మకం అనేది మన జీవితంలో అతి ముఖ్యమైన భాగం. న్యూ ఆక్స్ఫర్డ్ అమెరికన్ నిఘంటువు ఆంగ్ల పదము “Faith”ని “ఎవరిపైనైనా లేదా ఏదో ఒకదానిపైన పూర్తి నమ్మకం లేదా విశ్వాసం” గా నిర్వచించింది.
నమ్మకం లేకుండా మనం మన నిజ జీవితములో అంగుళం కూడా కదలలేము. మనకు బ్యాంకులపై నమ్మకం ఉంది, కనుకనే మన డబ్బును వాటిలో జమ చేస్తాము. మనకు మన యజమానిపై నమ్మకం ఉంది, కనుకనే రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తూ నెల చివరివరకు డబ్బు సంపాదించడానికి వేచి ఉండగలుగుతున్నాము. మనకు మన భాగస్వాములు, బంధువులు, స్నేహితులు మరియు పొరుగువారిపై నమ్మకం ఉంది. కోర్టులు, పోలీసులు, సైన్యం, వ్యాపార సంస్థలు,ప్రభుత్వం మొదలైన వాటిపై మనకు నమ్మకం ఉంది. కార్లు, రైళ్లు మరియు విమానాలపై మనకు నమ్మకం ఉంది. జీవితం నమ్మకం మీద నడుస్తుంది, అది లేకుండా ఏదైనా చేయడం అసాధ్యం. నమ్మకం రకరకాలుగా వివిధ కోణాలలో ఉంటుంది. ఎవరూ పూర్తిగా విశ్వాసం లేకుండా ఉండలేరు.
మొదట, మనం మన తల్లిదండ్రులపై, ముఖ్యంగా మన తల్లిపై నమ్మకం ఉంచుతాము. ఆమె తన పిల్లలకు దైవ సమానంగా ఉంటుంది, ఎందుకంటే ఆమె పిల్లవాడిని పెంచి పోషిస్తోంది. క్రమేపి ఈ నమ్మకం కుటుంబంలోని ఇతర సభ్యులలపైకి ఆ తరువాత తమపై తమకుగా మారుతుంది. మనము మన తల్లిదండ్రులపైన ఉంచిన నమ్మకాల నుండి పొందిన అనుభవాలు మనం వేరే వ్యక్తులను ఏ విధంగా ఎంతవరకు నమ్మవచ్చు అని తెలుసుకోగల అతి సున్నితమైన జ్ఞానాన్ని మనకు కలగ చేస్తాయి.
భగవంతునిపై నమ్మకం అనేది బహుశా అత్యంత ఉన్నతమైనది మరియు పరిణతచెందినది. మన తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, పొరుగువారు మరియు యజమానులపై నమ్మకం ఉంచడం చాలా సులభతరం, ఎందుకంటే వారు మనము ప్రత్యక్షంగా అనుభవించగల స్పష్టమైన వ్యక్తులు. కానీ దేవుని గురించి మనకు ఎటువంటి అనుభవము లేదు, అందుకే ఆయన మీద నమ్మకం అంత సులభం కాదు. ఇది అంత సులభం కానప్పటికీ, ఇది ఇది మానవ జీవితములో జరిగే ఒక గొప్ప అద్భుతం.
ప్రపంచం అశాశ్వతమైనది కనుక కేవలం గ్రాహ్య విషయాలపై మాత్రమే విశ్వాసం కలిగి ఉండటం అంత అద్భుతమైనది కాదు. దేవునిపై కాకుండా తనపై మాత్రమే నమ్మకం కలిగి ఉండటం అసంపూర్ణమైనది ఎందుకంటే అది మన ఉనికి, పుట్టుకలను కూడా ప్రశ్నార్ధకంగా మారుస్తుంది.
నాస్తికులకు భౌతిక విషయాలపై, లేదా తమపై కూడా నమ్మకం ఉంటుంది, కానీ అలాంటి నమ్మకం అసంపూర్ణమైనది. ఉదాహరణకు, విశ్వ చరిత్రలో హిరాణ్యకశిపుడు అత్యంత శక్తివంతమైన రాక్షసుడు. అతను ఎవరినైనా ఓడించగలడు. అతను అంత శక్తివంతుడు అయినప్పటికీ తన రక్షణ మరియు భద్రతపై పెద్ద నమ్మకం లేనివాడు మరియు తన సొంత చిన్న పిల్లవాడైన ప్రహ్లాదునికి భయపడ్డాడు. ప్రహ్లాదుడు పసివాడైనప్పటికీ పూర్తిగా నిర్భయంగా ఉన్నాడు, ఎందుకంటే అతనికి దేవునిపై పూర్తి నమ్మకం ఉంది.
ఆధునిక ప్రజలు ఇంచుక సమయం కూడా దేవుని గురించి ఆలోచించరు, భౌతిక విషయాలపై లేదా తమ యొక్క అసంపూర్ణ భావనలలో మాత్రమే విశ్వాసం కలిగి ఉంటారు. అందుకే నేటి ప్రపంచం చాలా అసురక్షితంగా మరియు భయంతో నిండి ఉంది. మనము శాశ్వతమైనవారము, కానీ ప్రపంచం ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది. శాశ్వతమైన జీవి, తన నమ్మకాన్ని కేవలం తాత్కాలిక వస్తువుల మీద లేదా అనుబంధాల మీద పెట్టడం వల్ల గొప్ప ప్రయోజనం చేకూరదు. అందువల్ల, అన్ని భౌతిక విజయాలు కేవలం నెరవేరనివిగా మిగిలి పోతాయి. దేవునిపై విశ్వాసం ఉన్న వ్యక్తి మాత్రమే సదా పరిపూర్ణతతో ఉంటాడు. మిగతా వారందరూ ఖాళీగా ఒంటరిగానే మిగిలి పోతారు.
దేవునిపై నమ్మకం ఉంచటం అంటే మనము దేవునికి ఎదో ఉపకారం చేస్తున్నామని కాదు. ఇది మనకు మనం ఉపకారం చేసుకొంటున్నామని. దేవుడు తనపై మనకున్న నమ్మకం వల్ల ప్రయోజనం పొందడు, కాని మనం పొందుతాము. మనకు భగవంతునిపై ఉన్ననమ్మకం వల్ల మన దైనందిన జీవితంలో ప్రశాంతంగా, సమతుల్యముగా, ఆందోళరహితముగా, సురక్షితముగా , దయ, సహనంతో, సంతోషంగా, ప్రేమగా ఉండగలుగుతాము. ఈ లక్షణాలను ఎవరు వద్దనుకుంటారు? ప్రజలు వ్యక్తిత్వవికాశములను పెంపొందించే సెమినార్‌లకు హాజరవుతారు మరియు థెరపిస్ట్‌లను వినియోగించి ఈ లక్షణాలను పొందడానికి ప్రయత్నిస్తారు. అయితే వారు తరచుగా ఇటువంటి ప్రయత్నాలలో విఫలమవుతారు లేదా తాత్కాలిక విజయం మాత్రమే సాధిస్తారు. చిన్న పిల్లవాడైన ప్రహ్లాదుడుకూడా అటువంటి ప్రమాదము ఎదురుపడ్డప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేవాడు.
నమ్మకాన్ని ఒక గొప్ప ఆశీర్వాదంగా భావించవచ్చు. ఇది మన జీవితంలో నిజమైన మార్పు తెచ్చే ఏకైక విషయం. అందువల్ల, నమ్మకం భక్తి యొక్క ప్రారంభమని శ్రీల రూప గోస్వామి వారు చెప్పారు. ప్రతి ఆధ్యాత్మిక మార్గానికి నమ్మకం లేదా శ్రద్ధ అనేది పునాది లాంటిది. దీనికి భక్తిలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందువల్ల, దానిని ఎంత మూల్యమైనా చెల్లించి పొందదగినదే. మనకు అది లేకపోతే, దాని కోసం ప్రార్థించాలి. ఇది భక్తుల దయ ద్వారా సులభంగా వస్తుంది. అందువల్ల, మనకు అది కావాలంటే, వారితో సహవాసం చేయాలి, వారి చర్చలు వినాలి మరియు వారికి సేవ చేయాలి. దేవునిపై నమ్మకం అంటే శాస్త్రముల పై నమ్మకం కలిగి ఉండటం, మరియు దానిపై నమ్మకం ఉన్నవారి ముఖతః వినడం ద్వారా ఆ నమ్మకం వస్తుంది.
నమ్మకం గురించి ఇంత చెప్పుకున్నాక, అసలు ఒక ఆధునిక భక్తుడికి ఆచరణాత్మక స్థాయిలో నమ్మకం అంటే ఏమిటి? మనకు నిజంగా దేవునిపై నమ్మకం ఉందో లేదో ఎలా నిర్ణయించవచ్చు? మరియు, మనకు ఎంత నమ్మకం ఉందో ఎలా చెప్పగలం?
మనము ఉన్నదానికన్నా ఎక్కువ విశ్వాసం ఉందని అనుకొంటూఉంటాము. మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలంటే ఒక మంచి పరీక్ష ఏమిటంటే, మనకు ఈ భువిలో శ్రీకృష్ణ స్వరూపమైన గురువుపై మనకు విశ్వాసాన్ని అంచనా వేయడమే. ఇది చాలా సంక్లిష్ట పరీక్ష. గురువు కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా తనపై మరియు భగవంతునిపై మనకు గల విశ్వాసాన్ని పరీక్షించే విధంగా వ్యవహరించవచ్చు. అలాంటి పరిస్థితులలో మనం నిశితంగా ఆత్మపరిశీలన చేసుకొని నిజాయితీగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆయన మాటలను, ఆయన సూచనలను, ఆయన తీసుకున్న నిర్ణయాలను మనం అనుమానిస్తున్నామా? లేదా మన విశ్వాస లేమి దాని కంటే ఇంకా కూడా సూక్ష్మంగా ఉందా?. ఆయన కంటే మనకు బాగా తెలుసు అని మనకు అనిపిస్తుందా? ఆయన మరొక భక్తునికి కొంత అనుకూలంగా ఉన్నప్పుడు మనం కలత చెందుతున్నామా లేదా అసౌకర్యంగా భావిస్తున్నామా, మరియు ఆ భక్తుడికి అర్హత లేదని అనుకుంటున్నామా? మనం గురు ప్రవర్తనను విమర్శిస్తున్నామా , లేదా విమర్శాభావన ఉన్నాకూడా దాన్ని నిరోధించడానికి ప్రయత్నిస్తున్నామా?
మనము నిజంగా గురువుపై విశ్వాసంతో నిండి ఉంటే, మన హృదయం ఇద్దరు ప్రేమికుల హృదయల మాదిరిగా మన గురువు హృదయంతో జత పడుతుంది. మన హృదయం మన గురువు హృదయంతో ఎంత సమం చేయబడితే, మనం భగవంతుడితో అంత అనుసంధానము అవుతాము. అందుకే గురువు మనకు ఒక గొప్ప పరీక్షా స్థలం. ఒక వేళ మన హృదయాన్న గురువు హృదయముతో సరిపోల్చలేకపోయినా కానీ , మనం గురువు పట్ల ఎన్నడూ అసూయతో మాత్రం ఉండరాదు. లేకపోతే దానివల్ల మనకు మనమే అధః పాతాళనికి నెట్టివేసుకోబడతాము.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.