ప్రాచీన భారతీయ జ్ఞానంతో ఒత్తిడిని జయించడం ఎలా?

Articles by Satyanarayana DasaComments Off on ప్రాచీన భారతీయ జ్ఞానంతో ఒత్తిడిని జయించడం ఎలా?

        రోజు రోజుకీ కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం మరియు మారుతున్నమానవ జీవన విధానాలు మన దైనందిన జీవితాన్ని మరింత అతలాకుతలం చేస్తూ ఒత్తిడికి గురిచేస్తున్నాయి. నేటి ప్రపంచములో నెలకొనివున్న ఆర్థిక సంక్షోభం అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ప్రజలకు ఆందోళన కలిగించే అతిపెద్ద కారణాలలో ఒకటి.  ఈ ఒత్తిడి రాబోయే నాళ్లలో ప్రపంచంలోనే మానవ జాతిని నిర్ములించదగ ఒక గొప్ప మహమ్మారి అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ఈ అంచనానే బాధపడటానికి తగినంత కారణం.

     కాబట్టి, మనల్ని మనం ఎలా ఒత్తిడి నుండి నివృత్తి చేసుకొని సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చో తెలుసుకోవడానికి ప్రాచీన భారతీయ జ్ఞానం వైపు చూడాల్సిన  సమయం ఇప్పుడు ఆసన్నమైంది. కాని ఒత్తిడి, దాని పరిష్కారం గురించి మాట్లాడటానికి ముందు, దాని గూర్చి ప్రాథమిక స్థాయిలో విశ్లేషిద్దాము .

ఒత్తిడిని విశ్లేషించడం

   మనస్సు కోరికలు మరియు భావోద్వేగాలకు మూలము. అవి లేకుండా అది జీవించలేదని అనిపిస్తుంది. సముద్రంలో అలల మాదిరిగా కోరికలు మనస్సులో నిరంతరం కనిపిస్తాయి. కలలు కంటున్నప్పుడు కూడా మనకు కోరికలు ఉంటాయి. ఒక కోరిక నెరవేరినప్పుడు, మనకు తాత్కాలికమైన అనుభూతి కలుగుతుంది. త్వరలో మనం మరో కోరిక కోసం మళ్ళీ కలలు కనడం ప్రారంభిస్తాము. 

      మనము ఏదైనా వైఫల్యాన్ని ఊహించినప్పుడు ఒత్తిడి ప్రారంభమవుతుంది. మనస్సులో ఒక అసౌకర్య భావన అభివృద్ధి చెందుతుంది. కారణం ఉన్నా లేకపోయినా భవిష్యత్తుగురించి దిగులు మరియు భయం మనస్సును భంగపరుస్తాయి. లక్ష్య సాధనలో రాబోయే అడ్డంకులు ఇంకా ఒత్తిడికి గురిచేస్తాయి. ఒత్తిడి మనస్సులో ఉద్భవించినప్పటికీ, అది శరీరమంతా వ్యాపించి దాని ప్రభావాన్ని చూపిస్తుంది. పలు రోగాధ్యనాలలో ఇంతకుముందు అనుకున్నదానికంటే ఎక్కువ వ్యాధులకు ఒత్తిడే కారణం అని తేలింది.

     ఒక వ్యక్తి ప్రమాదాన్ని గ్రహించినప్పుడు, శరీరంలోని సంకేతాల గొలుసుకట్టు ప్రమాదానికి ప్రతిచర్యగా  అడ్రినల్ గ్రంథుల నుండి ఎపినెఫ్రిన్ (అడ్రినాలిన్), నోర్పైన్ఫ్రైన్ మరియు కార్టిసాల్ వంటి హార్మోన్లను విడుదలను ప్రేరేపిస్తుంది. ఇవి వ్యక్తి తిరిగి పోరాడటానికి లేదా పారిపోవడానికి కారణభూతమవుతాయి.  వీటి పర్యవసానంగా, హృదయ స్పందన రేటు, శ్వాసక్రియ మరియు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. ఈ ప్రతిస్పందనలు చాలా శారీరక శక్తిని వాడుకోవటంవలన, కార్టిసాల్ ఇతర భౌతిక ప్రక్రియలైన జీర్ణక్రియ, పునరుత్పత్తి, శారీరక పెరుగుదల మరియు రోగనిరోధక వ్యవస్థలను నెమ్మదికమ్మని లేదా పూర్తిగా ఆపివేయమని ఆదేశిస్తుంది.

     ముప్పు దాటిన తర్వాత, శరీరం యొక్క ఒత్తిడిసూచిక తదనుగుణంగా సర్దుబాటు అవుతుంది.  కార్టిసాల్ స్థాయిలు తిరిగి సాధారణ స్థితికి వస్తాయి, మరియు శరీరం దాని సాధారణ విధులను తిరిగి ప్రారంభిస్తుంది. ఒత్తిడి విడుదల కానప్పుడు లేదా మనస్సు ముప్పును గ్రహించినప్పుడు సమస్య ఏర్పడుతుంది. ఇలాంటి  పరిస్థితులు కార్టిసాల్‌ ఎక్కువ కాలం బహిర్గతం కావడానికి కారణమవుతాయి. ఇది కొత్త నాడీజాల  పెరుగుదలను నిరోధిస్తుంది,  మరియు భయం మరియు ఇతర భావోద్వేగ ప్రతిస్పందనలను నియంత్రించే మెదడులోని అమిగ్డాలా అనే భాగం యొక్క పెరుగుదలకు కారణమవుతాయి.

     హిప్పోకాంపస్, అనే కొత్త జ్ఞాపకాలు ఏర్పడటానికి సహాయపడే ప్రాంతం కూడా ఈ ఒత్తిడి వల్ల ప్రభావితమవుతుంది. దీనివల్ల ప్రజలు బాగా గుర్తెరిగిన బంధువు పేరు, అలానే సుపరిచితమైన విషయాలను కూడా మరచిపోయే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా, ఒత్తిడి నిరాశ, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పిటిఎస్డి), గుండె జబ్బులు, పేగు సమస్యలు, చిగుళ్ల వ్యాధి, అంగస్తంభన, వయోజన ప్రారంభ మధుమేహం, పెరుగుదల సమస్యలు మరియు క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది.

ఒక పరిష్కారాన్ని ఎంచుకోవడం

     పైన పేర్కొన్నవన్నీ ఒత్తిడి పెరగడానికి బలమైన కారణాన్ని ఇస్తాయి. వేదాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, పురాణాలు మరియు భగవద్గీత రూపంలో ఉన్న పురాతన భారతీయ జ్ఞానము మానవాళి ఎదుర్కొంటున్న ప్రాథమిక మానవ సమస్యలతో పాటు నేటి ఆధునిక యుగంలో మనం ఎదుర్కొంటున్న దాదాపు ప్రతి సమస్యకు పరిష్కారాలను కలిగి ఉన్నాయి. ఈ మూలాల ద్వారా, ఒత్తిడికి అనుభావిక సమాధానం మనము తప్పకుండా కనుగొనవచ్చు.

     శ్రీ కృష్ణుడు ఒత్తిడిని ఎదుర్కోవడానికి మనకు ఒక అమూల్యమైన సూత్రాన్ని ఇస్తాడు. ఆయన  “తస్మాద్ అపరిహార్యార్థే త్వమ్ శోచితుమ్ అర్హసి(అనివార్యమైన విషయాల గురించి చింతించకండి)” అని చెప్తారు. చాలావరకు ఒత్తిడి అనేది మన స్వంత మూర్ఖత్వం యొక్క ఫలితం, దీనికి పరిష్కారం హేతుబద్ధమైన విచక్షణ కలిగి ఉండటమే.

      మనము పరీక్షలో విఫలమవడం లేదా కావలసిన ఉత్తీర్ణతా శాతము సాధించకపోవడం వంటి ప్రతికూల ఫలితాలను ఊహించినప్పుడు తరచుగా చింతించటం ప్రారంభిస్తాము. కానీ అలాంటి ఆందోళన వ్యర్థం-దీనివల్ల ప్రయోజనం లేదు. అంతేకాదు, అది మనకు హాని చేస్తుంది మరియు స్వీయ-సంతృప్త జోస్యా లకు దారితీస్తుంది.

   కావున మనం ఒక్క క్షణం ఆగి, మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి, “ఈ ఆందోళన నిజంగా మన లక్ష్యాన్ని సాధించడంలో లేదా ఊహించిన అడ్డంకులను అధిగమించడంలో సహాయపడుతుందా?”. దానికి స్పష్టంగా  సమాధానము “లేదు”. అప్పుడు, మనము ఎందుకు ఆందోళన చెందాలి మరియు ఎందుకు ఒత్తిడితో ఉండాలి?  ప్రతి ఒక్కరూ తమరు ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితుల మధ్య సమతుల్యతతో ఉండగలగాలన్నదే శ్రీకృష్ణుడి సలహా.

విజయవంతుడైన కానీ దుఃఖితుడైన ఒక వ్యక్తి గా

    ఈనాడు, మనకు మనుగడ అనేది అతి పెద్ద ఆందోళనగా తయారైంది. అది మన ఆర్థిక స్థిరత్వంపై చాలావరకు ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ ఎలుకల మాదిరి పరుగిడి పోటీ పడవలసి ఉంటుంది. ఒక కథతో వివరిస్తాను:

    ఒకప్పుడు తన జీవిత  కాలం శ్రమించి ఎనలేని  ధనాన్ని  మరియు కీర్తిని సంపాదించిన  ఒక విజయవంతమైన వ్యక్తి ఉండేవాడు. అతను తన చురుకైన జీవితంలో ఎక్కువ భాగం తన వృత్తిని కొనసాగించడానికి మరియు వృత్తిపరమైన నిచ్చెన ఎక్కడానికి గడిపాడు. అతను వృద్దుడయ్యాక, తన విజయం బూటకమని దుఃఖితుడై గ్రహించాడు.  అతన్ని ఊబకాయం, గుండె జబ్బులు మరియు అంతులేని అలసట కమ్మేసాయి. అతను తనకు తాను పెట్టుకున్న ఈ పోటీ కారణముగా జీవిత భాగస్వామి నుండి, తన పిల్లల నుండి విడిపోయాడు. తల్లిదండ్రులను కూడా నిర్లక్ష్యం చేశాడు.  ఫలితముగా నిరంతరం ఒత్తిడికి గురయ్యాడు. అతని విజయం అతని ఆరోగ్యము, కుటుంబ సంబంధాలు మరియు మనశ్శాంతి లేమికి కారణమైంది. అప్పుడు అతను ఈ సంపాదనకై తాను తీసిన పరుగు తెలివైనదా, దీనికి విలువఉన్నదా? అని నిర్లిప్తతో ప్రశ్నించుకున్నాడు. 

   ఈ కథ  నుండి  మనము పొందాల్సిన నీతి ఏమిటంటే: ప్రాపంచిక సంపదను గుడ్డిగా చూడటం ద్వారా మరియు భారీ సంపదను సంపాదించడం ద్వారా, ఈ ఎలుకల మాదిరి పరుగులో విజయం సాధించినట్లు అగుపించవచ్చు, కానీ  దాని  పర్యవసానంగా మిగతా అన్ని రంగాల్లోనూ ఓడిపోతారు . ఒకవేళ ఒకరు గెలిచినా, వారు ఇంకా ఎలుకగానే  మిగిలి పోతారు!

సమతుల్య జీవితం

     స్థిరమైన ఆర్థిక జీవితం కోసం కష్టపడటం తప్పనిసరిగా తప్పు కాదు, కాని మనం సమతుల్య జీవితాలను గడపాలి- మనం భౌతిక సంపదకై పాకులాటకు మరియు ఆధ్యాత్మిక పురోగతికి మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవాలి.

    కేవలం మన సమయాన్నిఅంతా సంపదన కొరకే కేటాయించకూడదు.  మనం మన ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు మరియు మానసిక శాంతిపై కూడా శ్రద్ధ వహించాలి.  మనకు డబ్బు కావాలి, ఎందుకంటే తద్వారా మనం సంతోషకరమైన, ఆరోగ్యకరమైన మరియు ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చనే కదా! కానీ డబ్బు సంపాదించడం ఈ లక్ష్యాలను నాశనం చేయకూడదు.  జీవితం అమూల్యమైన మైనది, దాన్ని తేలికగా తీసుకోవడం అవివేకం మాత్రమే అవుతుంది.

  అమెరికాలో, మోకాలి గాయానికి పరిహారం, $200,000 డాలర్ల వరకు ఉంటుంది. ఐతే దెబ్బతిన్న మెదడు, గాయపడిన కన్ను, విరిగిన వివాహం లేదా మానసిక విచ్ఛిన్నం యొక్క విలువ ఎంతై ఉంటుందో ఒక్క సారి ఊహించుకోండి!

   మన ఆర్థిక లక్ష్యాలతో పాటు వీటన్నింటికీ   ఒక చిట్టా పత్రం తయారు చేసి, అవి సమతుల్యంగా ఉన్నాయా లేదా మనం అప్పుల్లో ఉన్నామా అని  బేరీజు వేసుకోవాలి.

ఒత్తిడిని తొలగించడం

   ధ్యానం చేయడానికి మీరు పర్వతాలను సందర్శించాల్సిన అవసరం లేదు.  ఇది మీ రోజువారీ పనుల మధ్య కూడా చేయవచ్చు. కళ్ళు మూసుకోవడం, లోతైన శ్వాస తీసుకోవడం మరియు నాసికా రంధ్రాల ద్వారా మరియు బయటికి ప్రవహించే శ్వాసను గమనించడం వంటి సాధారణ ధ్యాన కార్యకలాపాలు కూడా అద్భుతాలు చేస్తాయి మరియు మీకు ఉపశమనం ఇస్తాయి. మీరు ప్రతిరోజూ లేదా మీకు అవసరమైనప్పుడు దీన్ని సాధన చేయవచ్చు. సరళమైన పద్ధతులను నేర్చుకోవటానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి ఆయుర్వేద జీవనశైలి నియమావళి గురించి తెలుసుకోవడం. డాక్టర్ ప్రతాప్ చౌహన్ జీవానందను ప్రతిపాదించారు, ఇది శ్రామిక ప్రజల కోసం ఒక అద్భుతమైన ప్రణాళిక. మరిన్ని వివరాలు https://www.jiva.com/about-us/jivananda నుండి పొందవచ్చు

   అలానే ఒత్తిడిని తొలగించుకోడానికి వేరొక  ముఖ్యమైన మార్గం ఏమిటంటే ఆధ్యాత్మిక కార్యకలాపాలలో పాల్గొనడం లేదా సేవ (నిస్వార్థ సేవ) చేయడం. ఇతరులకు కొంత మేలు చేయడం మరియు ప్రతిఫలంగా ఏమీ కోరుకోకపోవడం ఆనందం మరియు మానసిక ఉపశమనం ఇస్తుంది, ఇది వర్ణనచేయడంకన్నా అనుభవిస్తే బాగా తెలుస్తుంది. వీటిని ఎప్పుడైనా ప్రయత్నించి చూడండి, ఒత్తిడిని మీరు శాశ్వతముగా పారద్రోల గలుగుతారు.

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    జీవితంలో విజయం సాధించడానికి ఇతరుల సహాయం మనకి కావాలి. అంటే ఇతరులను మనం నమ్మాలి. కానీ అనర్హమైన వారిని మనం నమ్మకూడదు.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.