శ్రీకృష్ణుడు భగవద్గీతలో రాజస గుణ ప్రభావితులైనవారు భూమిపైన జన్మిస్తారని పేర్కొంటాడు (14. 8), అంటే దానర్ధం మానవ పుట్టుక అనేది ప్రధానముగా రాజసిక గుణానికి సంబందించినది. మనం ఏదైనా పని చేయాలంటే దానికి తగ్గ శక్తి లేదా అధికారం కావాలి. అందువల్ల మానవ జన్మ అంతా ఆ శక్తిని పొందటానికై జరిగే పాకులాటే.
అందరూ అధికారము కావాలని అనుకుంటారు. ఎవ్వరూ అధికారం లేకుండా ఉండాలని అనుకోరు. ఒక శిశువు కూడా తాను పెద్దగా అవ్వాలని కోరుకొంటుంది, ఎందుకంటే తను కుటుంబంలోని పెద్దలతో పోలిస్తే శక్తి లేనిది కనుక. మనకు ఏదైనా జబ్బు చేస్తే శక్తి హీనులుగా మనం అవుతాము అందుకే మంచి ఆరోగ్యం కావాలని కోరుకుంటాము. దీనివల్లే మనం వృద్ధాప్యాన్ని కోరుకోము కూడా. మహిళా హక్కుల కోసం, నల్ల జాతీయుల స్వేచ్ఛ కోసం, దళితుల హక్కుల కోసం జరిగే పోరాటాలు అలాగే మార్క్సిస్ట్ ఉద్యమాలు, ఫ్రెంచ్ ఉద్యమాలు అన్నియు కూడా సమాజం లోని భిన్న శ్రేణులలో ఉన్న ప్రజలకు శక్తి లేదా అధికారమును ఇవ్వటానికి జరిగినవే.
మనము దీనిని క్షుణ్ణంగా పరిశీలిస్తే, అందరూ అధికారం కావాలని కోరుకుంటున్నారని అవగతమవుతుంది – వారు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు కావచ్చు, లేక భౌతికవాదులు కావచ్చు, ఆస్తికులు కావచ్చు, నాస్తికులు కావచ్చు. అలా మానవులందరూ శక్తి ఉపాసకులే. భారత దేశంలో శక్తికి రూపంగా భావించే “దేవి”ని పూజించే శాక్తేయులు అనే వర్గానికి చెందిన ప్రజలు కూడా ఉన్నారు.
జ్ఞానము, శారీరిక శక్తి, డబ్బు, సమాజంలో స్థానం, అందం, కళా నిపుణత, వైరాగ్యం, స్వభావం, యోగ సిద్ధులు లాంటివి అన్నీ కూడా మన జీవితంలో కొంతవరకు మనము పొందగల శక్తులే. మనం మన శక్తిని మనకోసమో లేదా ఇతరులకు సహాయంచేయడానికో ఉపయోగించవచ్చు. అయితే దురదృష్టవశాత్తు చాలా మంది దాన్ని తమ స్వలాభానికై వాడటానికి అంతేకాకుండా ఇతరులను దోచుకోవడానికి వాడతారు. ఈ శక్తి ఆజ్ఞ రూపేణా ఇతరులను లోబర్చుకోనేందుకు వాడటం జరుగుతుంది.
అధికారానికై జరిగే యుద్ధాలు మనం అన్ని చోట్లా చూడవచ్చు. అది దేశాల మధ్య కావచ్చు, కార్పొరేట్ కార్యాలయాల మధ్య కావచ్చు , అంతెందుకు కుటుంబ సభ్యుల మధ్య కూడా కావచ్చు. శక్తిమంతులతో మనము అవిధేయతతో ఉంటే వారు మనల్ని శిక్షించవచ్చు. లేదా మనము విధేయతతో ఉంటే బహుమతులు ఇవ్వవచ్చు. ఈ బహుమతి మరియు దండన విధానాన్ని మనం లోకమంతటా చూడవచ్చు. పోలీసులు, రాజకీయనాయకులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నిర్వాహకులు, అలానే ఆధ్యాత్మిక సమాజంలోని అగ్రగణ్యులు కూడా దీన్ని వాడతారు. కొన్ని చోట్ల కొంతమంది వ్యక్తులు ఈ అధికారం పై తిరుగుబాటు చేయవచ్చు, అయితే దానివల్ల ఆ దోపిడీదారుల పేర్లు మారతాయి తప్ప ఇతరులను దోపిడీ చేసే మానవుల యొక్క స్వభావము మాత్రం మారదు.
ఈ ధోరణి ఒక వ్యక్తిని వేరేవారికి శతృవుగా మారుస్తుంది. మానవులకన్నా కసాయి వాళ్ళు వేరే ఉండరు. మృగజీవాలు ఆకలిగా ఉన్నప్పుడు వేటాడి తినవచ్చు కానీ మనుష్యులు మాత్రం వారి వారి అధికార కుయుక్తులతో ఇతరులను కట్టిపడేసే పన్నాగాలు ఎల్లప్పుడూ పన్నుతూనే ఉంటారు. ఇది మానవ సంబంధ బాంధవ్యాలను, కుటుంబాలను పెకలించి వేస్తాయి. అందువల్ల ఇది మానసిక తప్పిదాల మూలము, అలానే సామజిక రుగ్మతలకు కారణము కూడా.
బాహ్య నియంత్రణ రుగ్మత వల్ల ఉత్పన్నమయ్యే బాధలు మనం వద్దని అనుకొన్నా నిరంతరంగా కొనసాగుతూనే ఉంటాయి ఎందుకంటే ఇతరులను నియంత్రించడం అనేది మనము ఉత్తమమైనదిగా భావించినందుకుకాదు, మనకు వేరే మార్గం తెలియదు కనుక. మనం మన పూర్వీకుల, గురువుల, నాయకుల మనోబుద్ధిని వారసత్వముగా పొందాము. ఆధునిక మానవ నైజం ఏంటంటే బల ప్రయోగమే, ఎందుకంటే మనకూ అది తప్ప వేరే మార్గము గోచరించదు.
యెంత క్షోభకు గురిచేసినా బల ప్రయోగాన్ని మనం నిర్ములించకుండా ఉండటానికి వేరే కారణం అది పనిచేస్తుంది కనుక. బలవంతులకు అది తమ కోర్కెలను తీరుస్తోంది. అలానే బలహీనులకు కూడా పనిచేస్తుంది, ఎందుకంటే వారు దానివల్ల సురక్షితంగా ఉన్నామని భావిస్తారు. అది వారు బలవంతులను కలవర పెట్టకుండా ఉండేటట్లు చేసి వారిలో బహుమానము పొందవచ్చు అనే ఆశను రేకెత్తిస్తోంది. బలహీనులు ఈ వ్యవస్థను భయంతో అంగీకరిస్తారు. అందువల్లే దూషణకు గురయ్యే సంబంధాలలో ఉన్నప్పటికీ వ్యక్తులు వాటిలోనే కొనసాగుతారు ఎందుకంటే ఆ సంబంధాల్లోనుంచి బయటకు వస్తే పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయనే భయం ఉంటుంది కనుక.
బలహీనులు తమకు శక్తిలేదని మరియు తమ యోగ్యతకు బలవంతుల గుర్తింపు మరియు ఆమోదం అవసరమని భావిస్తారు. ఈ బలహీనత, బలవంతులను ఒక ఎరవలె బలహీనులవద్దకు ఆకర్షింపజేస్తుంది. బలహీనులు తమ బతుకు తెరువు కోసం బలవంతుల ఆవశ్యకత ఉందని నమ్మడంవల్ల బలవంతులు నిశ్చింతగా ఉంటారు.
అయితే దీని నివారణోపాయం ఏమిటి?
శ్రీకృష్ణుడు ఈ బలానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని , ప్రేమను ఇచ్చారు, ప్రేమలో స్వాతంత్ర్యము, ఎంచుకొనే అవకాశం ఉంటుంది. ఒక దోపిడీదారుడు తన ఆశ్రీతులను, నిర్బంధులుగా , బలహీనులుగా ఉంచుతాడు కానీ ఒక ప్రేమికుడు వారిని స్వాలంబనంతో ఉండేవారిగా, శక్తిసాయులుగా ఉంచుతాడు. ఉదాహరణకు , కృష్ణుడు ఎవరి మీదా ఏదీ బలవంతముగా రుద్దడు. శ్రీకృష్ణుడు మన ముందున్న మార్గములోని బలాబలాలు విశదీకరించి వాటిని ఎంచుకొనే స్వతంత్రతను ఇస్తాడు. ఆయన అర్జునకు ఇచ్చిన ఉపదేశాల్లో ఇది తేట తెల్లమవుతుంది. అర్జునుని ప్రశ్నలకు సమాధానమిచ్చిన పిమ్మట, ఆయన (18.63), “నీకు రహస్యాల్లోకి అన్నింటికన్నా రహస్యమైన జ్ఞానాన్ని ప్రసాదించాను. దాన్ని అవగతం చేసుకుని యథేచ్ఛతో కార్యాన్ని చేయుము” అని అంటాడు.
ప్రేమ అనేది అత్యంత శక్తివంతమైనది. దాని కన్నా శక్తివంతమైనది ఏదీ లేదు. దాని శక్తి ఎంతటిది అంటే సర్వశక్తివంతుడైన శ్రీకృష్ణ భగవానుడు కూడా దానికి బద్ధుడు అవుతాడు. శ్రీకృష్ణుడు తన భక్తుల యొక్క ప్రేమతో నియత్రించబడతాడు. గోపికల ప్రేమకు బద్ధుడనే విషయాన్ని ఆయన నిర్మొహమాటంగా అంగీకరిస్తారు( శ్రీమద్ భాగవతం 10.32.22)
శక్తి యొక్క దుర్యుపయోగం బలవంతునికి మరియు బలహీనునికి మధ్య అంతరాలకు దారి తీస్తుంది, అలానే ప్రేమ అనేది వారిద్దరినీ ఏకం చేస్తుంది.
బలవంతులు ఎల్లప్పుడూ తాము బలాన్ని కోల్పోతామనే భయంలో ఉంటారు, అందుచేత వారు తమకు ప్రత్యర్థులు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తారు. ఎవ్వరు ఎంత బలశాలులైనా, వారు ఎవరోఒకరి గూర్చి అసూయతో ఉంటారు, అలానే వారి ప్రత్యర్థులను గూర్చి భయాన్ని కలిగి ఉంటారు. కానీ ప్రేమలో మాత్రం అలాంటి వాటికి తావనేదే లేదు. ప్రేమలో ఉన్నవారు వేరొకరు శక్తిమంతులు కావటం చూసి భయపడరు. శ్రీకృష్ణుడు ఆయన భక్తులు దీనికి సరైన ఉదాహరణలు. అందుచేతనే, వ్రజ మండలంలో సమాజాన్ని నియంత్రించడానికి ఎటువంటి వ్యవస్థ లేదు. అక్కడ అంతా ప్రేమ-సహకారమనే అనే సూత్రంపై ఆధారపడి నడుస్తుంది, అక్కడ నియంత్రణకు తావు లేదు అలానే అసూయకు కూడా ఆస్కారం లేదు.
శ్రీమద్ భాగవతం ప్రకారం శ్రీ కృష్ణుడే ఆది దేవుడు (1.3.28). దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఆయన తన అనుచరులతో అధికారంతో కాకుండా ప్రేమతో వ్యవహరించే శైలే. ఈ తరహా ప్రవర్తన ఆయన్ని వేరే అవతారముల అన్నింటికన్నా శక్తిమంతుడుగా చేస్తుంది. అందుచేతే రాగానుగ భక్తి వైధిక భక్తి కన్నా అత్యంత శక్తివంతమైనది.
ప్రేమ మరియు నియంత్రణ అనేవి ఒకదానికొకటి పరస్పరం విరుద్ధమైనవి అయినప్పటికీ, అవి రెండూ కూడా కలసి ఉండగలవు. మన చైతన్యం ఎంత ముతకగా ఉంటే ఇతరులను నియంత్రించాలన్న ఆవశ్యకత అంత ఉంటుంది. మన చైతన్యం సూక్ష్మముగా మెరుగు పడే కొద్దీ నియంత్రించాల్సిన ఆవశ్యకత లేకుండా పోతుంది. మీరు ముతక స్వభావంతో ఉన్నప్పుడు, అధికారము కోసం ఉవ్విళ్లూరుతారు, దాని వల్ల ప్రేమ దూరమై పోతుంది. అధికారము చలాయించడం నమ్మకం లేక పోవటానికి, ప్రేమ లేక పోవటానికి నిదర్శనం. మనం ఎంత ఎక్కువగా నియంత్రించడానికి ప్రయత్నిస్తే, దాని ప్రభావం అంత తక్కువ అవుతుంది. ప్రేమ ఎంత తక్కువ అయితే అంత ఎక్కువ నియంత్రణ ఉంటుంది. మీరు ఎంత ఓర్పు కలిగి ఉంటే అంత నియంత్రణ పై ఆధిక్యాన్ని పొందగలరు. ప్రేమ ఎంత ఎక్కువైతే నియంత్రణ అంత తగ్గుతుంది.
అయితే ఇక్కడ ఒక ప్రశ్న అడగవచ్చు, ప్రేమనేది అంత సరళమైనది, ఆకర్షణీయమైనది, అసూయకు తావు లేనిది, శక్తివంతమైనది అయితే వ్యక్తులు ఎందుకు దానిని ఆచరించరు? ప్రేమను నేర్పే, చెప్పే, ఆచరించే ఆధ్యాత్మిక సంస్థలలో కూడా అధికారం కోసం ప్రాకులాడే రాజకీయ క్రీడలను మనం చూస్తుంటాము. ఆచరణలో ప్రేమ మార్గము ఎందుకు కనపడదు? దీనికి సమాధానం ఏమిటంటే మన భౌతిక అహంకారములు అడ్డుపడడం వలన. అవి నిస్వార్ధ ప్రేమకు పెద్ద అడ్డంకి. ఈ అహంకారమనేది ఎంత తెలివైందంటే అది మన బుద్ధితో పని చేస్తూ మనలను “నేను అణకువగల వాడను, శరణాగతుడను, ప్రేమ స్వభావుడను. నా సేవను నేను సహృదయముతో చేస్తాను. నా హృదయాన్ని గురువుకు, శ్రీ కృష్ణునకు అర్పించాను. సమస్య అంతా వేరే వారిలోనే ఉంది” అని అనుకొనేటట్లు చేస్తుంది. చాలా మంది సాధకులు ఇలానే అనుకుంటారు. ఈ లోతైన, దట్టమైన, ప్రబలమైన అనర్థము లేకుంటే ఎటువంటి అసూయ, పోటీ వ్యక్తిత్వం లేని సుందరమైన, మధురమైన భక్త సముదాయములను చూసేవారము.
మనం అందరం ప్రేమమార్గంలో జీవిస్తున్నామని అనుకుంటానప్పటికీ, దురదృష్టవశాత్తు చాలా అరుదుగా ఎవరైనా ఈ ప్రేమ వైఖరిని నిజముగా అవలంభిస్తుంటారు.
నిజానికి ఈ నకిలీ నవ్వులు, అబద్ధపు ప్రణామాల ముసుగులో జరిగేది నియంత్రణకు ప్రయత్నాలే. బలవంతులు తమ బాహ్య ఆకర్షణ శక్తితో బలహీనులైన, తమపైన ఆధారపడే గణాలను విచ్చలు విచ్చలుగా అమర్చుకొంటారు. ఈ బలవంతులకు అహంకారమనే వాపు ఉండటం చేత వారికి తాము సదా శక్తివంతులమనే అహంకారంతో ఉండటానికి తమకన్నా శక్తి హీనులైన జనుల గణం ఉండటం అవసరం మరియు ఆవశ్యము. ఈ అహంకారము ఎంత పెద్దతైతే అంత ఇతరులను తుంగలో తోసుకొంటూ ఎలాగైనా పైకి చేరాలనే లక్ష్యం అధికముగా ఉంటుంది. అందుకే, శ్రీ చైతన్య మహాప్రభువుల వారు మనలను ఒక గడ్డిలాగా ఒదిగి ఉండమని, ఒక వృక్షానికి ఉన్నంత ఓపిక, సహనంతో ఉండమని మరియు మన సేవా దృక్పధంతో ముందుకు సాగమని ఉపదేశిస్తారు. అలాంటి దృక్పధం మనం పొందగలిగితే, వేరొకరిని నియత్రించాలనే ఆలోచనకు ఆస్కారం ఉండదు.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.