మనకు ఉన్నదానితో సంతృప్తిగా ఉండటమా లేక లేని దానిని గూర్చి ఎల్లప్పుడూ పిర్యాదు చేస్తూ ఉండడమా అని ఎంచుకొనే స్వేచ్ఛ మనందరికీ ఉంది. మనలో చాలామంది మాత్రం పిర్యాదు చేయడాన్నే తమ మార్గముగా ఎంచుకుంటారు. మనము ఉన్న పరిస్థితుల గూర్చి మనకు అసంతృప్తి ఉన్న మాట వాస్తవము. ఐతే రాబోయే కాలం మంచిదనే ఆశ మనల్ని ఎప్పుడూ ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యజనితమైన మన పాత మధుర జ్ఞాపకాలే మనకు విశ్రాంతినిస్తాయి.
మనము మనలో ఉన్న తప్పుల గూర్చి అలానే మనల్ని మనము అభివృద్ధి చేసుకోలేక పోవడము గూర్చి సదా అసంతృప్తితో ఉండటం సహజం. ఊబకాయులకు లావు తగ్గాలని ఉంటుంది అలానే బక్క పలుచని వారికి లావెక్కాలని ఉంటుంది. బీదవాడు ఐశ్వర్యవంతుడు అవ్వాలని అనుకుంటాడు అలానే ధనికుడు ఉన్న దానితో సంతృప్తి చెందక ఇంకా ధనార్జన చేయాలని అనుకుంటాడు.
లేనిదాని గూర్చి అపేక్ష, ఉన్న దాన్ని మరవడం అనేది మానవ నైజం. మనము మన దగ్గర ఉన్న వస్తువు యొక్క విలువ దాన్ని పోగొట్టుకొనే వరకు గ్రహించము. కొలనులో ఉన్న చేపకు నీటి విలువ గాలములొ చిక్కేంతవరకు తెలియదు అలానే మనకు మన దంతాల విలువ అవి ఊడేంతవరకు తెలియదు. మనకు మన ఆరోగ్యము విలువ ఆసుపత్రి పాలయ్యేంతవరకు తెలియదు.
మానవ జన్మ పొందటమనేది మనకు గల గొప్ప వరం, కానీ దీన్ని మనం గుర్తించము. ఒక చేప గానో లేక ఎలుకలానో మనం జన్మ ఎత్తితే అప్పుడు మనకు మానవ జన్మ ప్రాముఖ్యత తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు ఏ తిమింగలమో లేక పిల్లో మనల్ని తినేస్తుంది కనుక. ఈ జీవరాసులు తమకు జరిగిన అన్యాయాన్ని ఏ కోర్టులోనూ విన్నవించుకోలేవు మరియు ఏ పోలీసు స్టేషన్లోనూ పిర్యాదు చేయలేవు. మనం మనకు గల ప్రాధమిక హక్కులను అవి ఎంతో విలువైనప్పటికీ చాలా తేలిగ్గా తీసుకుంటూఉంటాము. మనం మన రెండుకాళ్ళతో నడవ గలము, మన చేతుల్ని స్వేచ్ఛగా వినియోగించుకోగలం, మన భావాల్ని మన భాషతో ఇతరులకు వ్యక్త పరచగలము. ఈ సదుపాయాలు దూరమైతే జీవితం ఎలా ఉంటుందో ఒక్క సారి ఊహించుకోండి. అవిలేకుండా అతి తక్కువలో చెప్పాలంటే మన జీవితం దుర్భరం.
పూర్వం ఒక సాధువు ఒక గ్రామం నుండి వేరొక గ్రామానికి పాదయాత్ర చేస్తూఉండేవాడు. ఆయనకు ఆ దారిలో అత్యంత దుఃఖితుడైన ఒక యువకుడు తారసపడ్డాడు. అప్పుడు ఆ యువకుని చూసి జాలిపడ్డ ఆ సాధువు ” నాయనా ! నీవు ఎందుకు అంత చింతితుడవై ఉన్నావు?” అని అడిగాడు. అప్పుడు ఆ యువకుడు తన ఫిర్యాదులను ప్రారంభించి ” నేను చాలా దురదృష్టవంతుడను. నేను పేదకుటుంబంలో జన్మించాను. నా తల్లితండ్రులను చిన్న వయస్సులోనే కోల్పోయాను, నాకు వారినించి సంక్రమించే ఆస్తి కూడా ఏమి లేదు. నా దగ్గర ఎటువంటి సంపదా లేదు. నా జీవితం గడపటం దుర్భరముగా కనిపిస్తూ ఆత్మ హత్యే శరణ్యముగా అగుపిస్తుంది. నా జీవితములో గాఢాంధకారం తప్పితే వేరొకటి లేనే లేదు” అన్నాడు. ఓపికగా ఆ యువకుని మాటలు విన్న ఆ సాధువు ” నువ్వు నాతో పాటు పక్క ఊళ్లోకి రా, నేను నీకు తప్పక సాయం చేస్తాను ! అక్కడ నీకు చాలా డబ్బు ముట్ట చెప్పే ప్రయత్నం చేస్తాను” అని అన్నాడు.
ఆ యువకుడు ఆచ్చర్యచకితుడయ్యాడు. ఆ సాధువును నమ్మలేకపోయాడు, అయినప్పటికీ అతనితో వెళ్తే కోల్పోయేది ఏదీ లేదుకదా అనుకోని ఆయనతో వెళ్ళాడు. ఆ ప్రక్క ఊళ్ళో ఆ సాధువు ఆ యువకుడిని తన శిష్యుడైన ఒక ధనిక వ్యాపారి ఇంటికి తీసుకు వెళ్ళాడు. ఆ వ్యాపారి సాధువును సాదరంగా ఆహ్వానించాడు. ఆ వ్యాపారితో ఏకాంతంగా ఆ సాధువు మాట్లాడాక ఆ యువకునితో ” నీ రెండు కళ్ళకు మూల్యంగా ఆరు లక్షల వరహాలు ఇవ్వడానికి ఈ వ్యాపారి సిద్ధం” అని అన్నాడు.
ఆచ్చర్యచకితుడైన ఆ యువకుడు ” నేను గుడ్డి వాణ్ణి కావడానికి సిద్ధంగా లేను” అని అన్నాడు. అప్పుడు ఆ సాధువు అయితే నీ రెండు చేతులకు మూల్యముగా మూడు లక్షల వరహాలకు కూడా ఈ వ్యాపారి సిద్ధం అని అన్నాడు .
అలా ఆ సాధువు ఆ యువకుని ప్రతి అంగానికి ఒక విలువ పలుకుతూ అతను నిజంగా యెంత ధనికుడో తెలియజేశాడు.
మనం మానవ దేహముతో ప్రపంచములో ఉన్న సంపదే కాక సమస్త ఐశ్వర్యాలకు అధిపతి అయిన భగవంతుని కూడా పొందవచ్చు. భక్త ప్రహ్లాదుడు తన మిత్రులతో ” ఈ మానవ దేహం అశాశ్వతం. కానీ దీనివల్ల శాశ్వతమైన మంచి అంటే భగవంతుని పొంద వచ్చు” అన్నాడు. అందుకే ఈ మానవ శరీరం చాలా దుర్లభమైంది. అశాశ్వతమైనది శాశ్వతమైనదాన్ని ఇవ్వడమనేది తప్పకుండా చాలా అరుదు. అయినప్పటికీ అధిక శాతం మానవులు దీన్ని కేవలం క్షణ భంగుర కాలం నిలిచే తృప్తి పొందుటకే వినియోగిస్తూ దుఃఖాన్ని మూటకట్టుకుంటున్నారు. కానీ నా అనుభములో, ఈ మానవ జన్మ విలువ తెలుసుకున్న వారు సయితం దురదుష్టవశాత్తు అసూయ, రాగ, ద్వేష మరియు భౌతిక భాందవ్యాలలో చిక్కుకు పోయి ఉంటారు. వారు తమ సమయమంతా ఇతర సాధకులను విమర్శించడంలో, లేదా ఏదో ఒక విషయం గూర్చి ప్రజల్ప తో వృధా చేస్తుంటారు. వారు తాము పొందిన అమూల్యమైన అవకాశాన్ని గుర్తించలేరు. ఒక విధముగా చెప్పాలంటే వీరు పామరులైన జనం కంటే ఎక్కువ దురదృష్టవంతులు. ఎందుకంటే ఇంతతెలిసాక కూడా వారు తమ సమయాన్ని టీవీ చూడటంలోనో లేదా తమ స్మార్ట్ ఫోన్ యాప్లు పరికించడం లోనే గడిపేస్తుంటారు.
ఇక్కడ సాధారణ అన్వయ సూత్రం ఒకటి ఉంది. మనం మనకు ఉన్న దాన్ని అభినందిస్తే, అది మరింత రెట్టింపై మనకు ఇవ్వబడుతుంది. అదే విధంగా దాన్ని పదే పదే విమర్శిస్తే ఉన్నది కూడా చేజారి పోవటం తధ్యం. నా జీవితంలో దీన్ని చాలా దగ్గరగా చూసాను. అత్యంత పవిత్రమైన వృందావనములో ఉండి తమ గురువుకు, సాధువులకు సేవ చేసుకొనే భాగ్యాన్ని కొంతమంది భక్తులు సుకృతితో పొందుతారు. అయితే ఇటువంటి అవకాశాన్ని పొందినప్పటికీ వారు దాన్ని గ్రహించకుండా తమ శక్తినంతా ఆశ్రమములోని లోటుపాట్ల గురుంచి లేదా వ్యర్ధ పదార్ధాలవల్ల పర్యావరణానికి జరుగుతున్న హాని గురుంచి, వసతి సదుపాయాల గురుంచి, వ్యక్తుల గురుంచి ఆలోచించడములో పెడతారు. దీని వల్ల వారు వృందావనాన్ని వదలటం, తమ సేవను కోల్పోవటం జరుగుతుంది. ఇంకొందరైతే పూర్తిగా భౌతిక జగత్తులోకి నెట్టి వేయబడతారు కూడా. వారు ముందు చేసిన సేవ వ్యర్ధమైతే కాదు కానీ వారి ఆధ్యాత్మిక స్థితిలో పురోగతి లేకుండా పోతుంది.
శ్రీ గోపాల కృష్ణుని గూర్చి, బ్రహ్మ దేవుడు ఇలా ప్రార్ధన చేసాడు.
తత్ తే అనుకంపామ్ సు సమీక్షమాణో
భుఞ్జాన ఏవాత్మ కృతం విపాకం
హృద్వాగ్ వపుర్భిర్ విదధన్ నమస్తే
జీవేత యో ముక్తి పదే స దాయ భాక్
“మా పూర్వ కర్మ కఠిన ఫలితములు అనుభస్తున్నప్పటికీ మా చుట్టూ ఉన్న నీ కరుణ వలన నీకు మనసారా నమస్కరిస్తూ ఈ ప్రపంచంలో మేము జీవిస్తాము. అలాంటి వ్యక్తికి ముక్తిని ప్రసాదించే భగవంతుని పాదములు పొందుతాడు.” ( శ్రీమద్ భాగవతం 10. 14. 8)
ఇది అద్భుతమైన సలహా ! భగవంతుని దయ మన పైన ఉందంటే అతిశయోక్తి కాదు. మనము దీన్ని గమనించపోయినప్పటికీ ఇది సత్యం. నిజానికి సులభమైన శ్వాస ప్రక్రియ సులువుగా జరగాలన్నా భగవంతుని దయ తప్పక ఉండాలి. అదే మనంతట మనం కృత్రిమముగా శ్వాస పీల్చాలంటే మూడు చెరువుల నీళ్లు తాగినంత పనిఅవుతంది, నిద్రకూడా పోలేము.
శ్రీ బ్రహ్మ దేవుని వాక్యాలకు తాత్పర్యాన్ని తెలుపుతూ శ్రీ విశ్వనాథ చక్రవర్తుల వారు భక్తులు కాలం, కర్మల యొక్క ప్రభావితుల పరిధి దాటి ఉంటారని చెప్తారు. అందుకే భక్తులు తమ జీవితములో ఎదుర్కొనే ఏదైనా అనుకూలమైన లేదా ప్రతికూలమైన పరిస్థితులు వారి వారి పూర్వ కర్మల పర్యవసానంగా వచ్చినవికాదు అవి కేవలం ఆ భక్తుల ఉన్నతికి తోడ్పడేందుకు శ్రీకృష్ణ పరమాత్మ వొసంగినవి మాత్రమే. ఆయన శ్రీకృష్ణుని, ఒక రోగ గ్రస్తుడైన పుత్రుని రోగ నివారణ కొరకు చేదైన ఔషధం త్రాగించే కన్న తండ్రితో పోల్చుతారు. ఆ పుత్రుడు దీన్ని ఇష్ట పడక పోవచ్చు కాని ఆ తండ్రి ఉద్దేశ్యం ఆ పిల్లవాడ్ని ఇబ్బంది పరచటం కాదు అతన్ని తొందరగా ఆరోగ్యవంతుడని చేయడం మాత్రమే. అలానే భౌతిక జగత్తులో మనం మలిన పడుతుంటాము. శ్రీకృష్ణుడు మనల్ని ఇబ్బందికర పరిస్థులలో పెట్టడం మన మాలిన్యాలను తొలగించుట కోసమే. అది ఆయన మన మీద చూపే కృప. దాన్ని మనం ఆక్షేపింప రాదు. మనం అటువంటి ప్రతికూల పరిస్థుతులు ఎదురైనప్పుడు వాటిని అంగీకరించపోయినా, అవి ముగిసిన తర్వాత అవి మనకు జరగటం ఎంత ఉపయోగమైనదో గ్రహిస్తాము.
కొంత కాలం క్రితం తన భౌతిక జీవితం లోని ఒడిదొడుకులను దైర్యంగా ఎదుర్కొంటూ విజయుడైన ఒక వ్యక్తి గాథను నేను విన్నాను.
పెంగ్ షులీన్ ఎత్తు 78 సెంటీమీటర్లు. 1995 సంత్సరములో ఒకానొక రోడ్డు ప్రయాణములో అతని శరీరం రెండుగా చీల్చబడింది. అతని శరీరము క్రింద భాగం, కాళ్ళు బాగుచేయలేనంతగా ద్వంసమయ్యాయి, డాక్టర్లు అతని మొండాన్ని మాత్రము సర్జరీతో అమర్చగలిగారు. షులీన్ రెండు సంవత్సరాల పూర్తి కాలం ఆసుపత్రిలో అవయవాల సర్జరీలోనే గడిపాడు. దాని తర్వాత అతను తన దగ్గర ఉన్న శక్తినంతా కూడపెట్టుకుంటూ, చేతుల కొరకు వ్యాయామం, దంత దావనం వంటివి చేస్తూ అన్ని ప్రతికూల పరిస్థుతులకూ ఎదురొడ్డి నిలిచాడు. ఇప్పుడు పదేళ్ల తరువాత నడవటం తిరిగి మొదలు పెట్టి వైద్యులను కూడా అబ్బురపరుస్తున్నాడు. అతని ప్రత్యేక పరిస్థితి తెల్సిన వైద్యులు అతని కొరకు అతని శరీరాన్నిఒక గుడ్డులాగా అంటి పెట్టుకొని ఉండే ఒక పరికరాన్ని అతనికి అమర్చారు. ఇప్పుడు అతను బీజింగ్ పునరావాస కేంద్రం వరండాలలో తిరుగాడుతున్నాడు. అతను తిరిగి నడక ప్రారంభించిన తొలినాళ్లలో ” పదేళ్ల తరువాత తిరిగి నడువగలటం ఎంతో తృప్తినిస్తుందని” అన్నాడు. ఆ వైద్యశాల సహాధ్యక్షుడు లిన్ లు అతన్ని పరీక్ష చేస్తే ఆ వయస్సులోని మిగతా వాళ్ళకన్నా అతను ఇంకా ఆరోగ్యంగా ఉన్నడన్నాడు.
పెంగ్ షులీన్ తన స్వంత కిరాణా వస్తువుల దుకాణం ఏర్పాటు చేసి “సగం మనిషి — సగం ధర ” అని దానికి పేరు పెట్టాడు. ఈ 37 ఏళ్ళ యువకుడు ఎందరో అంగవికులకు ఆదర్శం గా నిలుస్తున్నాడు. కేవలం రెండు అడుగుల ఎత్తు ఉండే ఈ వ్యక్తి తోపుడు బండిలో తిరుగాడుతూ అంగవైకల్యాలను ఎలా ఎదుర్కోవచ్చో చెప్తున్నాడు. అతని వైఖరి ప్రశంసనీయం. అతనికి ఎవ్వరి మీద పిర్యాదులు లేవు. అతని చిరునవ్వే అతని బలం. అతని జీవితం ఓర్పుకు చిహ్నం, అతని కథ ఎట్టి ప్రతికూల పరిస్థుతలనైననూ అధిగమించవచ్చు అనటానికి నిలువెత్తు నిదర్శనం.
ఈసారి ఎపుడైనా మీకు దేనిమీదనైనా పిర్యాదు చేయాలని అనిపిస్తే పెంగ్ షులీనిన్ని గుర్తు తెచ్చుకోండి. మీరు పూర్తి అవయవ సౌష్టం గల శరీరాన్ని కలిగివున్నారు. మీరు చాలా అరుదైన భక్తి మార్గములో ఉన్నారు. మీకు దేనిమీదా పిర్యాదు చెయ్యాల్సిన ఆవశ్యకత లేనేలేదు. ఆనందముగా ఉండండి. శ్రీకృష్ణ పరమాత్మ మీకు తన అపార కృప చేత ఒసంగిన అవకాశాన్ని కృతజ్ఞతతో స్వీకరించండి. నలుదిశలా వ్యాపించి ఉన్న ఆయన అపార కరుణను చూడండి. ఇటువంటి వైఖరి వల్ల మీరింకా ఆయన కృపను పొందగలరు. ఇది బ్రహ్మ దేవుని సలహా.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.