ప్రశ్న: శ్రీమద్ భగవత్ సందర్భం ఉపోద్ఘాతములో మీరు ఇలా వ్రాసారు “భగవంతుని ఉనికికి మరియు రూపానికి వ్యత్యాసము లేనట్లే , భగవంతుని నామము కూడా ఆయన ప్రతిరూపమే. ఆ నామానికి భగవంతునికి గల శక్తులన్నీ గలవు మరియు అది ప్రాకృతిక ఇంద్రియముల చేత గ్రహించలేనిది. ఆ నామాన్ని కేవలం ఒక్క సారైనా అర్ధం చేసుకొన్నట్లైతే ఈ ప్రాపంచిక బంధనముల నుండి మనం విముక్తులము కాగలము.”
ఇక్కడ నేను అర్ధం చేసుకొన్నది ఏమిటంటే సర్వోత్కృష్ట నామములో భిన్నత్వం ఉన్నది. మనం నామమును ఒక వైపు మన ప్రాపంచిక ఇంద్రియములతో వింటాము మరియు జపిస్తాము, కానీ మరో వైపు నుండి చూస్తే నామమనేది మన వివేకంతో తెలుసుకోలేనిదిగా ఉంటుంది. దీన్ని ఎలా సమన్వయించుకోవాలి?
జవాబు : భగవన్నామము సర్వోత్కృష్టమైనది మరియు కృష్ణునితో ఏకమైనది. అది ఆయనతో పరస్పరం ఏకమై మరియు భిన్నమై ఉంటుంది. మనం నామాన్ని జపించినప్పుడు రెండు విషయాలు ఒక్కసారిగా జరుగుతాయి. ఒకటి మనము మన స్వర పేటిక ఉపయోగించి నామాన్ని పలకటం మరియు రెండవది మన నాలుకపైన నామము ప్రస్ఫుటమవ్వటం. నామమనేది ప్రాపంచికమైనది కాదు, భౌతిక ఇంద్రియములతో దాన్ని ఉత్పత్తి చేయలేము. అది ఆద్యంతరహితమైనది మరియు మనం ఉచ్చరించాలని కోరుకున్నప్పుడే ప్రత్యక్షమౌతుంది. నామ సాక్షాత్కారము మరియు మన నాలుకతో చేసే నామ ఉచ్చారణ ఒకే సారి జరుగుతున్నట్లు అగుపించినా, అవి రెండూ రెండు భిన్న విషయాలు.
ప్రశ్న : నామ సర్వోత్కృష్ట జ్ఞానాన్ని మనం పొందటానికి , నామాన్ని జపించేటప్పుడు మనకు ఉండాల్సిన మానసికావస్థకు ఉన్న సంబంధం ఏమిటి?
జవాబు : మన నాలుకపై నామ సాక్షాత్కారమనేది మన హృదయ శుద్ధితో ముడిపడి ఉంటుంది. మన హృదయమనేది భౌతిక వాంఛలతో నిండి ఉంటే, నామము తన పూర్తి శక్తితో సాక్షత్కారమవ్వదు. మనము నామ భావోద్వేగం చెందలేము, కేవలం మన ఉచ్చారణను మాత్రమే అనుభూతి పొందగలము.
ప్రశ్న : నామాన్ని ఒకసారైనా తెలుసుకొనడం అంటే ఏమిటి?
జవాబు : నామాన్ని తెలుసుకొనడమంటే మన నాలుకపై నామ సాక్షాత్కారం పొందటం.
ప్రశ్న : ఒక సాధకునిగా అటువంటి సాక్షాత్కారం పొందాలంటే నేను ఏమి చేయాలి?
జవాబు : నామమును అనుభవ పూర్వకముగా పొందాలంటే, సాధకునికి హృదయము ప్రత్యేకముగా నామ-అపరాధము నుండి నివృత్తి అయినది అయ్యి శుద్ధితో ఉండాలి. మనం నామ-అపరాధముతో ఎంత కాలమైతే ఉంటామో అంత వరకు శుద్ధ నామమనేది సాక్షాత్కారము అవ్వదు, ఎందుకంటే అవి రెండూ ఒకే సారి ఉండలేవు. నామ-అపరాధ రహితులై ఉండాలంటే నామ-అపరాధములను చేయకుండా ఉండాలి మరియు శుద్ధ భక్తిని ప్రత్యేకముగా నామ జపము, నామ కీర్తనలను చేస్తూ ఉండాలి.
ప్రశ్న: జపమాలతో 64 రౌండ్లు జపము చేయాలనేది ప్రాతిపదికగా ఉండాలని శ్రీ మహాప్రభువుల వారు ఉపదేశించారు అని నేను విన్నాను. కానీ అటువంటి పెద్ద సంఖ్యలో నామాన్ని జపము చేయడానికి తగిన నిశ్చయం లేక ఉత్సాహమును పొందలేక పోతున్నాను. అంతటి సంఖ్యతో జపాన్ని చేయకుండా ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని మరియు కృష్ణ నామామృతాన్ని అనుభవించగలమా?
జవాబు : ఇక్కడ మొదట మీరు నిజముగా 64 రౌండ్లు జపము చెయ్యాలా లేక వద్దా అనేది నిర్ణయించుకోవాలి. మీరు ఒక వేళ 64 రౌండ్లు జపము చెయ్యాలని, అది మహాప్రభువు ఉపదేశమని అనుకొన్నట్లయితే , నేను మీకు విన్నవించేదల్లా ఏమిటంటే మీరు ఎవరి దగ్గర ఈ విషయం విన్నారో వాళ్లనే దీని గూర్చి అడగండి. నేను 64 రౌండ్లు జపము చేయమని చెప్పను, అలానే మహాప్రభువు అలా చెప్పినట్లు కూడా ఎక్కడా చదవలేదు కూడా. నేను అటువంటి విషయాన్ని భక్తి మరియు సాధన ఎలా ఉండాలి అని కూలంకషంగా విశదీకరించిన రెండు ప్రధాన పుస్తకములైన భక్తి రసామృతసింధువు, లేక భక్తి సందర్భములో కూడా చదవలేదు. అలానే హరి భక్తి విలాసములో కూడా దాని గూర్చి ఎక్కడా చెప్పబడలేదు.
నాకు సంబందించినవరకు, ఇక్కడ ప్రధాన విషయం సంఖ్య కాదు, నాణ్యత. 64 రౌండ్లు వేగముగా వెళ్ళే రైలు బండిలాగా చేసే జపము కన్నా శుద్ధ జపం చేయటానికి నేను ప్రాధాన్యతను ఇస్తాను. నామానికి శక్తి అంతా ఉంది, కానీ అది శుద్ధతతో చేయాలి. మీరు 64 రౌండ్లు చెయ్యాలనే ఆత్రుతతో ఉన్నప్పుడు దాని మీద సరిగ్గా ధ్యాసను ఉంచలేరు. 64 రౌండ్లు చేయడమనేది రోజంతటిలో మీరు ఏ ఇతర విషయం చేయక పోతే సాధ్యమవుతుంది, కానీ ఇక్కడ విషయం అది కాదని నాకు తెలుసు. ఎందుకంటే, ఆలా అయితే మీరు నన్ను ఈ ప్రశ్న అడగరు కనుక.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.