“మీరు ఈ శరీరం కాదు” యొక్క దుర్వినియోగం

GeneralComments Off on “మీరు ఈ శరీరం కాదు” యొక్క దుర్వినియోగం

ప్రతి ఆధ్యాత్మిక సాధన ఒక తాత్విక సూత్రంపై ఆధారపడి ఉంటుంది. భారతీయ తత్వ దర్శనములు బయటకి విభిన్నముగా కనిపించినప్పటకి అంతరంగా చాలా సాధారణ సూత్రాలను పంచుకుంటాయి. ఈ సర్వసాధారణమైన సూత్రాలలో ఒకటి, వాస్తవానికి, అన్ని తత్వ దర్శనముల యొక్క అత్యంత ప్రాథమికమైన సూత్రం, “నేను ఈ శరీరం కాదు” అనే భావన. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధిస్తున్న మొదటి సూత్రం మరియు ఇది ఆధ్యాత్మికతకు చాలా ఆధారమైనది. ఇది చాలా సాధారణ సూత్రం అయినప్పటికీ, మరియు దాదాపు ప్రతి ఒక్కరూ దాని గురించి విన్నప్పటికీ, మరియు తరచుగా ఉదాహరించినప్పటికీ మన దైనందిక జీవితములో అత్యంత తప్పుగా అర్ధము చేసుకోబడింది.

నాకు ఒక ఆధ్యాత్మిక సంస్థతో పరిచయమైన తొలినాళ్లలోనే, ఈ భావనచాలా ఉత్సాహంగా బోధించబడింది. నాకు దానిని అంగీకరించడంలో అప్పుడు ఎటువంటి సమస్య లేదు, కానీ దాని పర్యవసానం నా ఆరోగ్యం మీద పడింది మరియు ఈరోజు వరకు అది పడుతూనే ఉంది.

ఈ సూత్రంతో నా పూర్వాశ్రమ అనుభవం:

నీవు ఈ శరీరం కానందున, దానిని జాగ్రత్తగా చూసుకోవటానికి ఎక్కువ సమయం వృథా చేయకూడదని, నాకు నా పూర్వాశ్రములో చెప్పబడింది. ఒకరి శరీరాన్ని చూసుకోవడం నిషిద్దమని కూడా నాకు చెప్పటం జరిగింది. శరీరమనగా ‘మాయ’ అనే భావన నాలో బలంగా నాటబడినది.

ఒక కప్పు మజ్జిగపై మాత్రమే నివసించిన మరియు రాత్రి కొద్ది గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకున్న గొప్ప భక్తుల ఉదాహరణలు మాకు ఆచరణకు ప్రోత్సహించబడినవి. ఈ భక్తులు మాకు ఆదర్శమని చెప్పబడిరి. మేము వారిలా ఉండాలి అని, అనారోగ్యానికి గురైతే దానిపై పెద్దగా దృష్టి పెట్టకూడదని మాకు చెప్పబడింది. అదేవిధంగా శారీరకంగా బాధపడుతున్నప్పటికీ వారి సేవలను కొనసాగించిన గొప్ప భక్తుల ఉదాహరణలు మాకు ఇవ్వబడ్డాయి.

ఈ ఆదర్శాలకు అనుగుణంగా జీవించడానికి ప్రయత్నిస్తూ, నేను నా శరీరాన్ని విస్మరించడానికి ప్రయత్నించాను. మరియు రాత్రి భోజనం చేస్తే, నా మనస్సు లైంగికంగా ఆందోళన చెందుతుందనే భావన నా మనస్సులో బాగా పాతుకు పోయింది. నేను బ్రహ్మచారి అయినందున ఉద్దేశపూర్వకంగా నా రాత్రి భోజనాన్ని దాటవేసాను. ఇలా ఎన్నో రాత్రుళ్లు భోజనాన్ని పూర్తిగా విస్మరించాను. నా తోటి వారు భోజనాన్ని స్వీకరిస్తున్నప్పటికినీ నేనుమాత్రం ఆహారాన్ని స్వీకరించకూడదనే సూత్రానికి బలంగా కట్టుబడిపోయాను. అంతిమ లక్ష్యాన్ని సాధించడానికి అన్ని సూత్రాలను అనుసరించడంపై నేను నా మనస్సును సదా కేంద్రీకరించాను.

నేను వీలైనంత తక్కువ నిద్రపోయాను.  తెల్లవారుజామున 2 గంటలకే మేల్కొనేవాడ్ని మరియు నా జపతపాలను మంగళ ఆరతికి (తెల్లవారుజామున 4:30 గంటలకు) ముందే పూర్తి చేసే వాడిని.  ఇది నేను చిన్న తనములో ఉండబట్టి నా శరీరం దీన్ని తట్టుకోగలిగింది అయితే, త్వరలోనే ఇది నాకు ఇబ్బందిగా మారడం ప్రారంభమైయింది. ఉదాహరణకు, చల్లటి గడ్డకట్టే నీటిలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల నాకు బాగా జలుబు చేసింది. వాస్తవానికి, నేను ఈ చలిని విస్మరించటంవల్ల నా చెవుల్లో టిన్నిటస్ ఏర్పడింది. నేను గుండెల్లో మంట మరియు మలబద్దకాన్ని కూడా అనుభవించడం జరిగింది. ఇలా క్రమేపీ నా జీర్ణ శక్తి లోపించి,చివరికి రోగ నిరోధక శక్తి సైతం క్షీణించింది. 

“జీవిత-సభ్యులను” (రాజ పోషకులను) చేర్పించడానికి హైవే మీద డ్రైవింగ్ చేయడం మరియు స్టీరింగ్ వీల్ వద్ద నిద్రపోవడం, కునుకు వచ్చినప్పుడు నా వాహనం రహదారిపై భ్రమించడము నాకు ఇంకా గుర్తు ఉన్నాయి. ఇవన్నీ నేను “ఈ శరీరం కాదు” కాబట్టి “నిద్రను తగ్గించుకోవాలి” అనే భావనను అనుకరించటానికి చేసిన విన్యాసములుగా భావించ వచ్చును హైవేలో కారు ప్రమాదాల్లో చాలా మంది భక్తులు చనిపోతున్నట్లు నేను విన్నాను. వారి శారీరక అవసరాలను అతిగా తగ్గించడానికి ప్రయత్నించిన చాలా మంది ఇతరులు నాకు గుర్తు ఉన్నారు. నాలానే వారుకూడా బాధాకరమైన మూల్యాన్ని చెల్లించుకున్నారు.

“మనం శరీరం కాదు” అనేది నిజం, కానీ “మనం శరీరంలో ఉన్నాము” అనేది కూడా నిజం. అందరికీ కారు అంటే తాము కాదని తెలుసు, కాని ప్రతి ఒక్కరూ తమ కారును జాగ్రత్తగా చూసుకుంటారు. పెద్ద సమస్యలున్న కారు నడపడానికి ఎవరూ ఇష్టపడరు. జీవితం అనేది ఒక ప్రయాణం, మరియు శరీరమంటే ఈ ప్రయాణానికి తోడ్పడే వాహనం. మనకు గమ్యాన్ని చేరుకోవాలని ఆసక్తి తీవ్రంగా ఉంటే, ఈ శరీరమనే వాహనాన్ని మంచి పనిచేస్తున్న స్థితిలో ఉంచాలి. దానిపై మన పూర్తి సమయాన్ని వృథా చేయకూడదు, కాని దానిని పూర్తిగా విస్మరించనూ కూడదు.

నా ఆధ్యాత్మిక జీవనపు తొలినాళ్లలో, శరీరం అనేది భగవంతుని ఆలయమని మాకు చెప్పబడినది మరియు అందుకే మనం శరీరము పైన తిలకాన్ని ధరిస్తామని విశ్లేషించబడింది. కాని వింతగా ఈ దేవాలయన్ని విస్మరించమని సూచిండం జరిగింది.  మానవ పుట్టుక చాలా అరుదైనది మరియు విలువైనది అని కూడా మాకు సదా బోధించడమైనది, అయినప్పటికీ ఈ విలువైన వస్తువుపై అంత శ్రద్ధ తీసుకోకూడదని మమ్మల్ని నిర్దేశించేవారు.

నిజం చెప్పాలంటే, మన శరీరాన్ని మనం గౌరవించాలి. ఇది కృష్ణుని యొక్క అద్భుతమైన సృష్టి. కృష్ణుని సేవకి మనం ఈ శరీరాన్ని ఉపయోగించాల్సి వస్తే, దానిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి! మనం అపవిత్రమైన, పనిచేయని లేదా విరిగిన వస్తువును విగ్రహారాధనకు కూడా వాడం. తంత్రంలో ఒక సామెత ఉంది, “దేవో భూత్వా దేవమ్ యజేత్”-మొదట దైవంగా మారాకే దైవాన్ని ఆరాధించాలి.

మనం కృష్ణుని శరణము పొందినప్పుడు, మన శరీరం ఆయనకే చెందుతుంది. అది ఆయనది కనుక దానిని విలువైన వస్తువుగా మనం రక్షించాలి. కాబట్టి, మన శరీరాలను జాగ్రత్తగా చూసుకోవడం ఆధ్యాత్మిక మార్గంలో అత్యంత కీలకమైన భాగం, ఎందుకంటే ఇది మనల్ని ఆరోగ్యంగా మరియు బలంగా ఉంచడానికి సహాయపడుతుంది.  కాబట్టి మనం స్థిరమైన మనస్సుతో మన సేవలో పాల్గొనవచ్చు.

ఇది సరిగ్గా అనిపించకపోవచ్చు, కాని మొదట మనల్ని మనం చూసుకోవాలి. ఇది ఒక విమానం బయలుదేరే ముందు మనమువినే భద్రతా సూచన వంటిది – “క్యాబిన్ ఒత్తిడి తగ్గినట్లయితే, మొదట మీ ఎయిర్ మాస్క్ను పెట్టుకోండి, ఆపై మీ పక్కన ఉన్న పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోండి.” మొదట మనల్ని మనం సరిగ్గా చూసుకోనట్లయితే మనం వేరే ఎవరినినీ సరిగ్గా చూసుకోలేము. మనలో చాలా మంది దీనికి విరుద్ధంగా చేస్తారు మనకు మనం చూపించే ఏ చిన్న సంరక్షణనైనా నేరంగా భావిస్తారు. మరింత ఉన్నతంగా మనం మారాలంటే ఈ విధమైన అపరాధభావాన్ని మనం మొట్టమొదట విడనాడాలి.

ఆయుర్వేదం జీవితంలోని నాలుగు సాధనలలో దేనినైనా విజయవంతం చేయడానికి మంచి ఆరోగ్యం అవసరమని తెలుపుతుంది – “ధర్మ-అర్థ-కామ-మోక్షాణాం ఆరోగ్యం మూలం ఉత్తమం”. మంచి ఆరోగ్యం లేకుండా మనం భౌతికంగా లేదా ఆధ్యాత్మికంగా విజయవంతం కాలేము. అందువల్లే శ్రీకృష్ణుడు ఈ మధ్యే మార్గం అనుచరణ యోగ్యమని మరియు అతివాదిగా మన ప్రవర్తన ఉండరాదని సలహా ఇస్తాడు (భ.గీ  6.16-17):

“ఓ అర్జునా, అతిగా తినేవారికి లేదా తినడం మానేసినవారికి, లేదా అధికంగా నిద్రపోయేవారికి లేదా విపరీతంగా మేల్కొని ఉన్నవారికి యోగాలో విజయం గురించి ప్రశ్న లేదు. ఆహారం మరియు వినోదంలో మితంగా, చర్యల పనితీరులో క్రమబద్ధంగా మరియు నిద్ర మరియు మేల్కొలుపులో నియంత్రించబడే వ్యక్తికి, యోగాభ్యాసం అన్ని కష్టాలను తొలగిస్తుంది.”

ఇది చాలా అద్భుతమైన సలహా. సమతుల్య పద్ధతిలో తినడం, నిద్రపోవడం మరియు విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యంగా ఉండగలరు. ఆయుర్వేదం కూడా ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యం ఆరోగ్యానికి మూడు స్తంభాలు అని చాలా స్పష్టంగా చెప్తుంది. ఒక భవనం స్తంభాలపై నిలబడినట్లే, ఈ మూడు విషయాలపై మన ఆరోగ్యం ఎల్లప్పుడూ ఆధారపడి ఉంటుంది. నిర్లక్ష్యం లేదా అతివాద మార్గాలు మనల్ని బలహీనపరచి, మన ఆరోగ్యంపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి.

బుద్ధుని జీవితం నుండి కథ

బుద్ధుని జీవితంలో జరిగిన ఒక సంఘటన ద్వారా ఇది వివరించబడింది. ఒక యువరాజు అతని అనుచరుడు అయ్యాడు. అతను స్వాభావికంగా రాజు కావడంతో పెద్ద అహం ఉండేది. దానివల్ల అతను తనే బుద్ధుని ఉత్తమ అనుచరుడిగా ఉండాలని కోరుకునేవాడు. ఇతర సన్యాసులు రోజుకు రెండుసార్లు తింటుంటే, అతను ఒక్కసారి మాత్రమే తినేవాడు. వారు ఉదయం 5 గంటలకు మేల్కొంటుంటే, అతను తెల్లవారుజామున 4 గంటలకు మేల్కొనేవాడు. అందరూ నీడలో కూర్చుంటే, తనుమాత్రం సూర్యుని క్రింద కూర్చొనేవాడు. అతని కాఠిన్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. జీవితాంతం సుఖంగా జీవించిన వ్యక్తి అంతగా ఎలా తట్టుకోగలడని వారు నమ్మలేకపోయేవారు.

అలా రోజులు గడిచే కొద్దీ యువరాజు శరీరం క్షీణించసాగింది. ఒక రోజు అతను ఒంటరిగా కూర్చున్నప్పుడు, బుద్ధుడు అతనిని సమీపించి, “మీరు యువరాజుగా ఉన్నప్పుడు సంగీతాన్ని ఆస్వాదించారా?”  అని అడిగాడు. దానికి సన్యాసిగా మారిన యువరాజు – “అవును, నేను మంచి విద్వాన్సుడను అని అన్నాడు. బుద్ధుడు ఇంకా అడిగాడు, చెప్పు, వీణ తీగలు చాలా గట్టిగా ఉంటే, అది చక్కగా ఆడుతుందా?”

యువరాజు, “ఖచ్చితంగా కాదు. గమనికలు సులభంగా వంగవు” అన్నాడు. అప్పుడు బుద్ధుడు, “తీగలు  మరి బాగా  వదులుగా ఉంటే?” అని అడిగాడు. “అప్పుడు మీరు దేనినీ పలికించలేరు” అని యువరాజు అన్నాడు. 

బుద్ధుడు చిరుమందహాసంతో “యువరాజా! నీ శరీరం కూడా వీణ లాంటిదే. నువ్వు ఒక యువరాజుగా అపారమైన భోగములలో తేలియడావు మరియు సన్యాసిగాకఠినమైన జీవితాన్ని జీవిస్తున్నావు. ఈ రెండూ కూడా జ్ఞానార్జనకు సరియైనవికావు. మితమైన జీవితాన్ని అనుసరించు.” అన్నాడు.

ఇక్కడ మనందరికీ ఒక సందేహం రావొచ్చు. అది ఏంటంటే” మరి కఠోర తపస్సులు చేసిన భక్త శిఖామణుల మాటేమిటిఅని?”. దానికి సమాధానం ఏంటంటే అటువంటి భక్త శిఖామణుల కఠోర జీవనం ఒక సాధన కాదు అది వారు ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉండటం వల్ల పొందిన ప్రయోజనంగా మనం గుర్తించాలి. వాళ్ళు ఈ ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నందువల్ల సదా కృష్ణ నామ స్మరణలో ఉండేవాళ్ళు. అందువల్ల దేహాన్ని పట్టించుకోలేకపోయేవాళ్లు. వైరాగ్యం అనేది భక్తి వల్ల ఉత్పన్నమయ్యే ఒక ఫలితం. మన భక్తి ప్రభలమయ్యేకొద్దీ వైరాగ్యం అనేది మనలో స్వతహాగా పెరుగుతూ వస్తుంది. కానీ అంతవరకు మాత్రం మనం మధ్యేమార్గాన్ని అనుసరిస్తూ మన ఆరోగ్యాన్ని మనమే శ్రద్ధగా కాపాడుకోవాలి.

English Translation for reference:

Misapplication of You Are Not The Body

https://www.jiva.org/misapplication-of-you-are-not-this-body/ 

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    మన తల్లిదండ్రులతో పిల్లలుగా మనకున్న సంబంధము బట్టి, పెద్దయ్యాక ఇతరులతో మనం అలాంటి సంబంధాలు కలిగివుంటాము.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.