శ్రీ భాగవతపురాణ శ్రవణం యొక్క ప్రాముఖ్యత

Articles by Satyanarayana DasaComments Off on శ్రీ భాగవతపురాణ శ్రవణం యొక్క ప్రాముఖ్యత

                 శ్రీ కృష్ణుడి గురించి శ్రవణం చేయడం భక్తి సాధనలో మొట్టమొదటి మెట్టు. అనేక శాస్త్రములు కృష్ణుడికథలను వివరించాయి, వాటిలో శ్రీమద్ భాగవత పురాణం సర్వోన్నతమైనది. కావున, దాని శ్రవణం ప్రాధాన్యమైనది. దీనిగురించి శ్రీ జీవ గోస్వామి భక్తి సందర్భములోని క్రింద తెలియజేసిన రెండు అనుచ్ఛేదములలో వివరిస్తారు.

260వ అనుచ్ఛేదము – భాగవత పురాణ వాక్యముల ప్రాముఖ్యత

         వినవలసిన భగవంతుని కథలన్నిటిలో శ్రీమద్ భాగవత కథ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే క్రింద వివరించినట్లు దానిలో అద్భుతమైన శక్తిమంతమైన పదాలు(తాదృశ-ప్రభావమయ-శబ్ద) ఉన్నాయి. అంతేకాక, అది పరమ రసమయమైనది.

వీటిలో మొదటి లక్షణము భాగవతంలో ఉన్న ఈ క్రింద ఉన్న శ్లోకంలో సూచించబడింది.

ధర్మః ప్రొహిజిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణామ్ సతామ్

వేద్యమ్ వాస్తవం అత్ర వస్తు శివదమ్ తాపత్రయోన్మూలనం

శ్రీమద్ భాగవత మహాముని కృతే కిమ్ వా పరైర్ ఈశ్వరః

సద్యో హృది అవరుధ్యతే అత్ర కృతిభిః శుశ్రూషుభిః తత్ క్షణాత్

                 శ్రేష్ఠ ఋషి పుంగవుడైన వ్యాస మహర్షిచే తెలియజేయబడిన ఈ భాగవత పురాణంలో ఈర్ష్య మరియు కపటం లేకుండా ఉండి యధార్థమైన ఉనికియందు స్థిరపడిన వారిగురించి చెప్పబడింది. ఇక్కడ, వాస్తవంగా అస్థిత్వము కలిగిఉన్న మరియు మూడు విధములైన తాపములను నిర్మూలించే, శుభములను ప్రసాదించే వస్తువు తెలుసుకోగలిగినది మరియు ప్రత్యక్షంగా అనుభవం పొందగలిగినది. ఇతర శాస్త్రముల శ్రవణం ద్వారా సర్వోత్కృష్టుడైన సర్వశక్తిగల ఈశ్వరుడు హృదయంలో స్థాపించబడతాడా?[లేదు]. కానీ, ఆయన శుశ్రూషకులు భాగవతం వినాలని అనుకున్న ఆ క్షణమే వారి వశమౌతాడు.(భాగవత పురాణం 1.1.2)

            మహా-మునిః(గొప్ప ముని) అనే పదం ఇక్కడ మహా సిద్ధ పురుషుల(మహత్)చేత పూజించబడే శ్రీ భగవంతుని సూచిస్తుంది. కిమ్ వా పరైః “ఇతర శాస్త్రముల అవసరమేముంది?” లేదా “ఇతర శాస్త్రముల శ్రవణం ద్వారా ఈశ్వరుడిని హృదయంలో వశపరచుకోవచ్చా?” అను ప్రశ్న శ్రీమద్ భాగవత పురాణంయొక్క స్వాభావిక మహాత్మ్యాన్ని తెలియజేస్తున్నాయి.

261వ అనుచ్ఛేదము – శ్రీమద్ భాగవతం రసముతో నిండినది.

             ఇంతకముందు అనుచ్ఛేదములో శ్రీమద్ భాగవతం సర్వోన్నత రసమయమని పైన చెప్పిన రెండవ లక్షణం ఈ క్రింది శ్లోకంలో వర్ణించబడింది.

సర్వ వేదాంత సారమ్ హి శ్రీ భాగవతం ఇష్యతే

తద్-రసామృత తృప్తస్య నాన్యత్ర స్యాద్ రతిః క్వచిత్

                   ఈ చక్కని భాగవతం వేదాంతములన్నిటికి(ఉపనిషత్తులు) సారముగా కొనియాడబడుతుంది. ఈ శాశ్వత అమృతమైన రసమును ఆస్వాదించి పారవశ్యం పొందినవారు వేరే శాస్త్రమునకు ఆకర్షితులు కారు.(భాగవత పురాణం 12.13.15)

                     శ్రీమద్ భాగవతం యొక్క రసం అమృతం. ఈ శ్లోకం ఆ రసము యొక్క అమృతమువలన పరమానందం పొందినవారిని సూచిస్తుంది.

వ్యాఖ్యానము

             పూర్ణ తత్వమైన పరతత్త్వమును తెలుసుకోవడానికి భాగవత పురాణం అత్యంత ప్రామాణిక శాస్త్రమని తత్త్వ సందర్భములో శ్రీ జీవ గోస్వామి నిరూపించారు. కానీ, ఇదిమాత్రమే దీని గొప్పదనం లేక మహాత్య్మము కాదు. ఇది సత్యమును ప్రత్యక్షంగా అనుభవం పొందడానికి సర్వోత్తమమైన ఉపాయం కూడా. అంతేకాక, దివ్య కర్త, శ్రేష్ఠమైన సందేశం మరియు గ్రంథ పదాల వలన కూడా అది కీర్తించబడుతుంది. దీనర్థం, ఒకవేళ పాఠకులకు లేదా శ్రోతలకు భాగవత పదాల అర్థం తెలియకపోయినా ఒక శక్తిగల ఔషధం తెలియక మింగినట్లు అవి వారిమీద బలమైన ప్రభావం చూపుతాయి. ఇంకా, నిత్య విష్ణుజన ప్రియుడు(భగవంతుని భక్తులకు ఎప్పుడూ ప్రియుడు)గా పిలువబడే దాని అసలు వక్త శుకదేవుడి వలన కూడా భాగవత పురాణానికి కీర్తి కలుగుతుంది.

               భాగవత పదాల ప్రభావశక్తికి ఉదాహరణ శుకదేవుడే. అతని చేతన పుట్టుకతోనే బ్రహ్మానందంలో నిమగ్నమైనది(స్వ-సుఖ నిభృత చేతాః భాగవత పురాణము 12.12.68). పుట్టిన వెంటనే ఏ విద్యాభ్యాసం లేకుండా(అనుపేతం, భా.పు 1.2.2) ఇంటిని విడిచివెళ్ళాడు. అయినా కృష్ణుని లీలలను వర్ణించే కొన్ని శ్లోకములు విన్నవెంటనే అతని ఆత్మ అనివార్యంగా వాటికి ఆకర్షితమైంది(అజిత-రుచిర-లీలాకృష్ట-సారః, భా.పు 12.12.68). కేవలం కొన్ని భాగవతశ్లోక పదాలు విన్నందుకే జరిగిన ఈ అంతర్గత పరిణామం వల్ల ఆయన తన తండ్రియైన శ్రీ వ్యాసమహర్షి వద్దకు తిరిగి వెళ్లి భాగవత పురాణం పరిపూర్ణంగా అధ్యయనం చేసాడు(భా.పు 2.1.8). అందువలన, “వేరే శాస్త్రము అవసరమేమున్నది?” అని శ్రీ వ్యాసమహర్షి ప్రశ్నిస్తారు(భా.పు 1.1.2). శ్రీమద్ భాగవతంయొక్క ఉన్నతస్థానాన్ని నొక్కి చెప్పడానికే ఈ చాతుర్యమైన ప్రశ్న. శ్రీధర స్వామి ప్రకారం, కిమ్ వా పరైః అనే ప్రశ్న వాక్యనిర్మాణానుసారం ఈశ్వరః సద్యో హృది అవరుధ్యతే అను పదాలకు సంబంధించినది. దానిని ఆయన “ఇతర శాస్త్రముల శ్రవణం ద్వారాగాని లేదా వాటిలో సమర్థించబడిన పద్ధతులను అనుసరించిగాని(తదుక్తమ్ సాధనైర్ వా) ఈశ్వరుడు హృదయంలో వశమౌతాడా?” అని వ్యాఖ్యానిస్తారు. ప్రశ్నలో ఉన్న వా అనే పదానికి హేళన చేస్తున్నట్లు లేదా ఆక్షేపిస్తున్నట్లు అర్థం, కనుక అది ఖచ్చితంగా కాదు.

                 శ్రీమద్ భాగవత పురాణము మీద అనురక్తి ఏర్పడిన ఎవరికైనా వేరే శాస్త్రము రుచింపదు, ఎందుకంటే దానితో సరితూగగలది మరొకటి లేదు. స్వాదువైన స్వచ్ఛముగా తాజాగా వండిన భోజనం చేసిన వ్యక్తికి  పాచిపట్టిన మరియు కుళ్లిపోయిన ఆహారం రుచింపదు. అందుకే రసికులందరినీ ముక్తి మరియు తదనంతరం కూడా భాగవత రసమును ఆస్వాదించాలని వ్యాసమహర్షి ప్రేరేపిస్తారు(పిబత భాగవతమ్ రసం ఆలయం, భా.పు 1.1.3).

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    విద్య యొక్క ప్రధాన ప్రయోజనం వ్యక్తిత్వ స్వభావాన్ని అభివృద్ధిచేయడం అంతేగాని విద్యార్థి మెదడుని సమాచారంతో నింపడం కాదు.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.