పరిచయము:
భక్తి సాధన స్థాయి నుండి ఎనిమిది దశలుగా పురోగతి చెందుతూ చివరకు భావమనే తారాస్థాయి కి చేరుతుందని శ్రీ రూప గోస్వామి భక్తి రసామృత సింధువు(1.4.15-16)లో చెప్తారు. ఇందులో మొదటి దశయైన శ్రద్ధ రెండవ దశ సాధు సంగము(వైష్ణవ సాధువుతో సాంగత్యం)నకు దారి తీస్తుంది. ఈ శ్లోకములపై శ్రీ జీవ గోస్వామి వ్యాఖ్యానిస్తూ శ్రద్ధ పొందడానికి ముందు ఒక మనిషి సాధు సాంగత్యం పొంది ఆ సాధువు కృప వలన శ్రద్ధని పొందుతాడని చెప్తారు. ఆదౌ(మొట్ట మొదట) అను పదానికి ఇలా అర్థం చెప్పారు. ఒక సాధువుని మొదటిసారి కలిసినప్పుడు శాస్త్ర వాక్యములపై విశ్వాసము మనసులో కలుగుతుంది. ఈ విశ్వాసాన్ని శ్రద్ధ అంటారు. శ్రద్ధ పొందినవారు ప్రయత్నపూర్వకంగా ఏమీ చేయకున్నా దాన్ని పొందబడే “నిరంకల్పిత అనుగ్రహము”గా వివరించబడింది. ఈ అద్భుతమును శాస్త్రాలలో యదృచ్ఛ అను పదముతో వర్ణిస్తూవుంటారు. ఈ పదాన్ని అకస్మాత్తు లేదా తనంతట తానుగా వంటి పదాలుగా కూడా శాస్త్రాలలో అన్వయించబడి ఉండటాన్ని మనం గమనించవచ్చు(శ్రీమద్ భాగవతపురాణం 11.20.8, 15).
శ్రద్ధను ప్రసాదించే సాధు సాంగత్యము బద్ధ జీవుడికి గొప్ప వరం. మనిషి హృదయంలో శాశ్వతమైన మార్పును తీసుకువస్తుందిగనుక ఇది శాస్త్రములలో అన్నిటికన్నాశ్రేష్టమైనదిగా కీర్తించబడింది. భాగవత పురాణం(11.12.1-15)లో శ్రీ కృష్ణుడు స్వయంగా సాధు సంగము యొక్క ప్రాముఖ్యత గురించి వివరిస్తాడు.
మానవజన్మ పొందడం దుర్లభము, కానీ సాధు సంగము పొందుట ఇంకా చాలా అరుదు:
దుర్లభో మానుషో దేహో
దేహినామ్ క్షణ-భంగురః
తత్రాపి దుర్లభం మన్యే
వైకుంఠ ప్రియ దర్శనం
“బద్ధజీవులకు మానవ శరీరం అరుదైన వరం మరియు అదికూడా చాలా క్షణికం. కానీ మానవ జన్మ సాధించిన వారికి ఇంకా దుర్లభమైనది వైకుంఠపురి వాసుడైన భగవానుడికి అత్యంత ప్రీతికరమైన భక్తుల సాంగత్యము.” (భాగవత పురాణం 11.2.29)
ముచుకుంద మహారాజు ప్రకారం ఒక మనిషి యొక్క భౌతిక ఉనికి సాధు సంగముతో అంతరిస్తుంది:
భవాపవర్గో భ్రమతో యదా భవేజ్
జనస్య తర్హి అచ్యుత సత్సమాగమః
సత్సంగమో యర్హి తదైవ సద్గతౌ
పరావరేశే త్వయి జాయతే మతిః
“ఓ శ్రీ అచ్యుతా, జీవుడు జననమరణ సంసార చక్రములో తిరుగుతున్నాడు. ఈ చక్రము నుండి విముక్తి పొందే సమయం ఆసన్నమైనప్పుడు తత్వనిష్ఠలో ఉన్నవారి సాంగత్యం లభిస్తుంది. అది మొదలు, ఋషులు సాధించగల పరమ లక్ష్యమగు మరియు కార్య కారణములను నడిపించు నీ యందు భక్తి ప్రవృత్తి మొదలౌతుంది.” (భాగవత పురాణం 10.51.54)
సాధువుల సాంగత్యమను కారణమును భగవంతుడే ఏర్పాటు చేస్తాడు, ఫలితంగా అది సంసారమునుండి ముక్తి మరియు భక్తి వైపు ఆసక్తిని కలుగజేస్తుంది. భౌతిక ఉనికి సాధు సాంగత్యముద్వారా అంతరించినప్పటికీ, ముచుకుందుడు ఒక వ్యక్తి భవ బంధము అంతరించే సమయానికి సాధు సాంగత్యము పొందుతాడని దాని సమర్థతను తెలియజేస్తున్నాడు. అందుకే పర్యవసానాన్ని కారణమునకు ముందు ఉంచాడు.
శ్రద్ధను పొందిన వ్యక్తి, మరల సాధు సంగమునకు చేతన ప్రయత్నము చేస్తాడు. ఇది ఎనిమిది దశలలో రెండవది. ఇక్కడ సాధువనగా గురువు, ఎందుకంటే మూడవ దశ భజన క్రియ(భక్తి సాధన దశ), రూప గోస్వామి ప్రకారం ఉత్తమభక్తి సాధన ఒక యోగ్యమైన గురువుని శరణుకోరడంతో మొదలౌతుంది(భక్తి రసామృత సింధు 1.2.74). ఇంకోమాటలో చెప్పాలంటే సరియైన శ్రద్ధ కలిగినప్పుడు ఒకరు గురువుకోసం అన్వేషిస్తారు.
సాధువుగా జీవించాలని కలగనుట
నా జీవితంలో అలాంటి ఒక యోగ్యుడైన గురువును కలవడం, ఇప్పుడు ఆయన భౌతిక సహవాసము కోల్పోయినప్పటికీ నా అదృష్టం. ఆయన శ్రీ శ్రీ రాధా గోవిందదేవుల నిత్యలీలలోకి 2013 అక్టోబరు 6న ప్రవేశించారు. ఈ వియోగంలో ఆయన సాంగత్యంలో నేను పొందిన అనుభూతులు నా మనస్సును ఉత్తేజపరుస్తున్నాయి. వీటివల్ల భక్తి మార్గములో ప్రయాణించే ఇతరులకు లాభం కలిగించవచ్చని అగుపించి మీ అందరితో వాటిని చెప్పటానికి ఇష్టపడుతున్నాను.
నాకు ఆయన పరిచయం కావడం, అకారణంగా ఆయన కృపను పొందడం ఒక అద్భుతమైన ప్రయాణం. గతావలోకనములో చూస్తే ఇది శ్రీ కృష్ణుడి యాదృఛ్చిక కృప తప్ప మరేదీ కాదని నా అభిప్రాయం. ఆయనే నా గురువుగారి రూపంలో కనిపించారు.
నాకు చిన్నతనమునుండి ఒక సాధువులా జీవించాలని ఒక ప్రగాఢ అభిలాష ఉండేది. అందుకనే నేను భౌతికజీవితానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోలేదు మరియు నేను ఎప్పటికీ వివాహం చేసుకోనని నిశ్చయించుకున్నాను. చిన్నతనంలో నేను నా మంచం మీద పడుకుని మరణం గురించి ఆలోచించేవాడిని. స్వభావికంగా నేను చాలా మితభాషిని మరియు ఎవరికీ సాధువుగా మారాలనే నా ప్రణాళికను ఎప్పుడూ వెల్లడించలేదు, అందువల్ల మా కుటుంబంలో నాకు అలాంటి అభిలాష ఉందని ఎవ్వరూ అనుమానించలేదు.
నా తల్లితండ్రులు మరియు తాతగారు వాళ్ళు హిత హరివంశ గోస్వామిచే స్థాపించబడిన రాధావల్లభ సంప్రదాయంలో కృష్ణ భక్తులు. మా తాతగారి ఇల్లు రాధాకృష్ణులు మరియు శివపరివారము ఉన్న గుడిపక్కనే ఉండేది, కావున గుడి ఉత్సవాలలో పాల్గొంటూ పెరిగాను. మా ఇంట్లో నాకు ఒక పూజ గది కూడా ఉండేది, అక్కడ నేను ఆరతి ఇచ్చి ఇంట్లో మా అమ్మ వండిన పదార్థాలను నైవేద్యము పెట్టేవాడిని. రామాయణం మరియు మహాభారతం చదవడం మిక్కిలి ఆసక్తికరంగా ఉండేది, వాటిని మా గ్రామవాసులకు చదివి వినిపించేవాడిని. అప్పుడప్పుడు సాధువులు గ్రామ దేవాలయానికి వచ్చేవారు, కానీ వారు పెద్దగా జ్ఞానవంతులు కారు.
నా ఇంజనీరింగ్ విద్య పూర్తవగానే ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు. ఆధ్యాత్మిక జీవనాన్ని ఎలా గడపాలా అని ఆలోచిస్తూ ఉండేవాడిని మరియు సాధువుల సాంగత్యం కోసము వెతికేవాడిని. అవకాశం దొరికినప్పుడల్లా సాధువులను కలుస్తూ ఉండేవాడిని కానీ నా మనసును ఆకట్టుకొనే సాధువును కలవలేదు. మా గ్రామంలో ఆశ్రమాలు లేదా ఆధ్యాత్మిక సంఘములు లేనందున ఆధ్యాత్మిక జీవనాన్ని ఎలా మొదలుపెట్టాలో ఖచ్చితముగా తెలిసేది కాదు. అందువల్ల తప్పనిసరిగా ఉద్యోగంలో చేరాల్సివచ్చింది. నా తల్లిదండ్రులకు మరియు ఇతర కుటుంబసభ్యులకు నా వ్యక్తిగత ప్రణాళిక తెలియదు కాబట్టి వాళ్ళు నేను సాధారణ జీవితాన్ని గడుపుతానని, క్రమంగా పెళ్లి చేసుకుంటానని అనుకున్నారు. ఇతరులతో వ్యవహరించడంలో నేను చాలా మితముగా ఉండేవాడిని మరియు జనంతో కలవడానికి పెద్దగా ఆసక్తి చూపేవాడినికాదు. నేను వారితో వ్యవహరించేటప్పుడు మాత్రం, నాకు ఆధ్యాత్మిక అభిరుచులు లేనట్లుగా వ్యవహరించేవాడిని.
మా స్వగ్రామంలో ఒక ఉద్యోగంలో చేరాక ఒక పెళ్ళిసంబంధము వచ్చింది. ఇది నా ప్రణాళికను నాశనం చేస్తుందని భావించి దానికి రాజీనామా చేసి మా ఊరికి 1000కి.మీ దూరం ఉన్న ముంబయిలో వేరే ఉద్యోగంలో చేరాను. ఇక్కడ నన్ను పెళ్లిచేసుకోమని ఎవరూ ఒత్తిడి చేయరు కనుక నాకు ఉపశమనం కలిగింది!
ముంబయిలో ఉన్నప్పుడు ఒక ఆధ్యాత్మిక సంస్థకోసం వెదకసాగాను. డాక్టర్లు మరియు ఇంజినీర్లకు ప్రత్యేకంగా రాజస్థాన్లో అబు పర్వతమువద్ద ఒక ధ్యాన సంస్థ ప్రధాన కార్యాలయంవద్ద ఏర్పాటుచేసిన మూడు రోజుల ధ్యాన శిబిరానికి వెళ్ళాను. ఆ ప్రసంగాలలో నాకున్న చాలా ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులు దొరకలేదు. కావున నిరాశతో ముంబయికి తిరిగి వచ్చేసాను.
కుటుంబసభ్యులను చూడడానికి మా గ్రామానికి వచ్చిన ప్రతిసారి ఒక పెళ్ళిసంబంధము ఉండేది. పెళ్లి చేసుకోకుండా సాధువుగా జీవితం గడపాలనుకుంటున్నట్లు నా తల్లిదండ్రులను ఒప్పించగలనని నేను అనుకోలేదు. భారతీయ కుటుంబాలు సాధువుపట్ల గొప్ప మర్యాద కలిగిఉంటారు కానీ తమ కుటుంబంలో ఎవరైనా సాధువుగా మారాలని కోరుకుంటే దానిని తీవ్రంగా తిరస్కరిస్తారు. భారతదేశంలో ఏదైనా ఆశ్రమంలో చేరితే నా మీద వారికున్న అనురాగంవలన నన్ను తప్పకుండా వెతికి నా ఆధ్యాత్మిక సాధనను వదిలివేయమని నాకు నచ్చజెప్తారని నాకు తెలుసు. కాబట్టి భారతదేశం వదలి పశ్చిమదేశాలకు వెళ్లాలని నిశ్చయించుకున్నాను. 1979 జనవరిలో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న మయామి అనే నగరానికి వెళ్ళాను.
అక్కడికి వెళ్ళాక నాకు ఒక అనుభవం కలిగింది. సనాతన ధర్మము యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాను మరియు ఆధ్యాత్మిక సాధన చేయాలన్న కోరిక మరింత ధృఢపడింది. అమెరికా జీవనశైలి నన్ను ఆకర్షించలేదు. అమెరికా గురించి అక్కడ ఉన్నత జీవనం గురించి చాలా విన్నాను కానీ అదంతా డొల్లగా అనిపించింది. అసలు విషయం లేకుండా పైపై మెరుగులు ఉన్నట్లు అనిపించింది. అదే సమయంలో, నన్ను పెళ్లిచేసుకోమని బలవంతంచేయడానికి ఎవరూ లేనందున చాలా సురక్షితంగా అనిపించింది. అక్కడ బంధువులు లేరు, మరియు భారతదేశంలోఉన్న కుటుంబంతో వర్తమానం కేవలం ఉత్తరాలద్వారా ఉండేది. ఒక ఉత్తరానికి బదులు ఉత్తరం రావటానికి నెలరోజులు పట్టేది.
ఆ రోజుల్లో హిందూ దేవాలయాలు లేదా సంస్థలు అమెరికాలో ఎక్కువలేవు. మయామిలో కృష్ణమూర్తి ఎడ్యుకేషనల్ సెంటరుకు మరియు బాలభగవాన్(ప్రసిధ్దముగా గురూజీ) సెంటరుకు వెళ్తూఉండేవాడిని కానీ అవి నన్ను ప్రభావితం చేయలేదు. తర్వాత నేనుంటున్న ఇంటికి కొన్ని కిలోమీటర్ల దూరంలో అమెరికా దేశస్థులచే నడపబడుతున్న ఒక దేవాలయంగురించి విన్నాను, ఒక ఆదివారం సాయంత్రం ప్రసంగము విన్నాను. అప్పటిదాకా నాకు ఇస్కాన్ గురించి తెలియదు కాని సందర్శించిన తరువాత సంస్థ గురించి మరింత తెలుసుకున్నాను. అక్కడి వాతావరణం చాలా వింతగా అనిపించింది మరియు అక్కడ భక్తుల దుడుకుదనం నాకు నచ్చలేదు. వారు తమ పుస్తకాలను అమ్మడానికి ఎక్కువగా ఆసక్తి కనబరిచారు. నేను ఎప్పుడూ పుస్తకాలు కొనడానికి ఇష్టపడతాను, కాని వారి ప్రవర్తన కారణంగా నేను కొనుగోళ్లు చేయడానికి నిరాకరించాను. వీలైనంత త్వరగా ఆలయాన్ని విడిచిపెట్టాను మరియు తిరిగి వెళ్ళలేదు. “ఈ సంఘము నాకు తగినది కాదు” అని అనుకోవడం గుర్తుంది.
(తరువాయి భాగం వచ్చే సంచికలో)
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.