నేను మొట్టమొదటిసారి బృందావనం కార్తీక మాసంలో వెళ్ళాను. పుస్తకాల కొనుగోలు మీద ఆసక్తిచేత లోయి బజార్ వెళ్లినప్పుడు అక్కడ గురు మహారాజుగారి చేత ప్రచురించబడిన సందర్భములను చూసాను. వాటిలో ఆయన చిరునామా లభించడంతో వెంటనే ఆయనను కలవాలనుకున్నాను. ఒక సాయంత్రం ఒక్కడినే అక్కడకు వెళ్ళాను. నేను 1983లో మొదటిసారి వెళ్ళినప్పుడు చూసిన గురు మహారాజు ఆశ్రమం ఇప్పుడు మనకి కనిపించేదానికి చాలా భిన్నంగా ఉండేది. ఇప్పుడున్న ఎత్తైన పెద్ద గేటు అప్పుడు లేదు. ఇరువైపులా తోట ఉండేది. గుడిలోకి వెళ్ళినప్పుడు మహారాజుగారు ఒక సన్యాసికి బెంగాలీ భాషలో ఉపదేశమిస్తున్నారు. సన్యాసి ఇస్కాన్ నుండి వచ్చాడని ఆయన పేరు వెంకట స్వామి అని తర్వాత తెలిసింది. నాకు బెంగాలీ రాదు గనుక ఉపన్యాసం నాకు పెద్దగా ఏమి అర్థంకాలేదు. ఉపన్యాసము తర్వాత మాధుర్యరసముమీద మహారాజుగారిని ఒక ప్రశ్న అడిగాను. సంస్కృతమయమైన హిందీ భాషలో చాలా పొడుగు సమాధానం ఇచ్చారు. సమాధానం చాలా స్పష్టంగా అపూర్వంగా అనిపించింది. అలాంటి విషయం ఇంతకముందెప్పుడూ నేను వినలేదు. అది నన్ను అమితంగా ఆకర్షించి నా హృదయానికి హత్తుకుపోయింది. మళ్ళీ ఒక రోజు వచ్చి ఆయన వద్ద అధ్యయనం చేయాలని తీవ్రంగా కోరుకొని నిష్క్రమించాను. అప్పటినుండి తరచూ దీని గురించే ఆలోచిస్తూ ఉండేవాడిని. కానీ, ఇస్కాన్ తిరుపతికి నేను సహా అధ్యక్షుడిగా ఉన్నాను, మరియు ఒక పెద్ద గుడి మరియు విశ్రాంతి గృహం నిర్మించే ప్రయత్నంలో ఉన్నాను. నా సేవను నేను చాలా బాధ్యతగా భావించాను. ఆ ప్రాజెక్టులు బహుశా ఒక పదేళ్లలో అయిపోతే ఉన్న బాధ్యతలకు రాజీనామా చేసి బృందావనం వెళదామని అనుకునేవాడిని. ఈలోపు ప్రతి కార్తీక మాసంలో బృందావనం వెళ్లి మహారాజుగారి దర్శనానికి వెళ్లి కొత్త ప్రచురణలు ఏమైనా ఉంటె కొనుగోలు చేసేవాడిని. ఆ రోజుల్లో ఆయన ప్రెస్ జోరుగా నడిచేది బహుశా రెండు లేదా మూడు ఆవులు ఉండేవి. ఆయన్ని కలిసిన ప్రతిసారి సందర్భములను అధ్యయనం చేయాలన్న నా కోరిక మరింత బలపడేది.
శ్రీ కృష్ణుడి లీలలు అగోచరమైనవి. ఏవో తీవ్ర సమస్యలు తిరుపతిలో తలెత్తడంతో నా సేవను కొనసాగించడం సాధ్యపడలేదు. 1987 వసంత ఋతువులో తిరుపతి వదలి బృందావనం వచ్చేసాను. భక్తి వేదాంత అంతర్జాతీయ గురుకులంలో సంస్కృత అధ్యాపకుడిగా చేరి నా సంస్కృత అభ్యాసంకూడా కొనసాగించాను. కొంత స్థిరపడ్డాక, ఒకరోజు సాయంత్రం మహరాజుగారిని కలవడానికి వెళ్లి నాకు బోధించమని అడిగాను. ఆయనని సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే ఎవరైనా కలవవచ్చు ఎందుకంటే అప్పటిదాకా ఆయన మౌనం పాటించేవారు.
ప్రస్తుతం ఉన్న దేవాలయం కట్టకముందు ఇప్పుడున్న తోటస్థానంలో వెనుక భాగంలో ఆయన ఉండేవారు. భవనానికి ఉత్తరదిశగా కొన్ని చిన్న గదిలో ఆయన గురుదేవులతో ఉండేవారు. ఆయన గురుదేవులు పరమపదించిన తర్వాత కొన్ని సంవత్సరాలు అక్కడే ఉన్నారు తర్వాత ప్రక్కనున్న స్థలాన్ని కొనుగోలు చేసి ఇప్పుడున్న దేవాలయం మరియు గోశాల నిర్మించారు. ఈ గదుల ముందు భాగం కొన్ని చెట్లు నాటడం వాళ్ళ మరియు మరమ్మతు చేసే క్రమంలో పడగొట్టబడ్డాయి. ఆ గదులలో ఉంటున్నప్పుడు సూర్యాస్తమయం వరకు మౌనం పాటించేవారు. ఆయన పాత గది బయట ఒక పలకమీద “సందర్శకులు సూర్యాస్తమయం తర్వాత మాత్రమే” అని హిందీలో రాసి ఉండేది. స్థానికంగా మహారాజుగారిని మౌనీ బాబా(నిశ్యబ్దంగా ఉండే బాబా) అనేవారు.
ఆయన ఆశ్రమానికి వచ్చినప్పుడు గుడిబయట హరే కృష్ణ బాబాని కలిసాను. మహారాజుగారి వద్ద చదువుకోవడం గురించి అడిగాను. విద్యార్థుల దుష్ప్రవర్తన కారణంగా మహారాజుగారు ఎవరికీ బోధించడం లేదని ఆయన చెప్పారు. ఇది నాకు దిగ్భ్రాంతి కలిగించింది మరియు నా కల చెరిగిపోయింది. ఆయన దర్శనం సాధ్యమౌతుందేమోనని అడిగినప్పుడు మహారాజుగారు సాధారణంగా సాయంత్రం 5 గంటల తర్వాత సందర్శకుల కోసం గుడిలో కూర్చుంటారు కానీ ఆరోజు ఆయనకు వేరే పని ఉందని చెప్పారు. నా గుండె పగిలింది. మహారాజుగారి వద్ద చదువుకోవాలని సంవత్సరాల తరబడి వేచి ఉన్నాను. ఇప్పుడు ఆ కల సాధ్యం కాదు.
జీవ గోస్వామి యొక్క సందర్భములు ఎవరైనా నాకు బోధిస్తారేమోనని బృందావనంలో ఉన్న ప్రముఖ గౌఢీయ సంప్రదాయ పండితులందరిని సంప్రదించాను. నా నిరాశకు ప్రతిఒక్కరూ తమ అశక్తతను నాకు తెలియజేసి మహారాజుగారు మాత్రమే వాటిని బోధించగలవారని చెప్పారు. నా సంస్కృత అధ్యయనం కొనసాగిస్తూ ఒక రోజు ప్రావీణ్యత వచ్చినప్పుడు సందర్భములను చదవడానికి ప్రయత్నం చేయవచ్చని ఆశించాను.
నా జీవితంలో అత్యంత సంతోషకరమైన సన్నివేశం
కొన్నినెలల గడిచాక మళ్ళీ ఒక అద్భుతం జరిగింది. ఒకరోజు కృష్ణ బలరామ దేవాలయ ప్రధాన పూజారి పూర్ణ చంద్ర దాసతో సందర్భములు చదవాలనుకుంటున్నట్లు చెప్పాను. నా ఆశ్చర్యానికి ఆయనకు మహరాజుగారు స్వయంగా పరిచయమని నన్ను ఆయన వద్దకు తీసికెళ్తానని ఆయన నాకు వాగ్దానం చేసాడు. దీనిని శ్రీ శ్రీ రాధా శ్యామసుందరుల ప్రత్యేక వరంగా నేను భావించాను.
ఒక సాయంత్రం పూర్ణచంద్రతో నేను మహారాజుగారి ఆశ్రమానికి వెళ్ళాను. మేము వెళ్ళినప్పుడు మహారాజుగారు మేడ మీద కూర్చుని గోశాల మొదటిభాగం నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్నారు. అప్పుడు నాలుగు ఆవులు ఒక ఎద్దు మాత్రమే ఉన్నాయి. బొంగుతో చేసిన నిచ్చెనమీద కిందకి దిగి ఇప్పటికీ ఉన్న ఒక చెట్టుమీద ఆనుకోని నిల్చున్నారు. ఆయనకు నమస్కారం చేశాము, పూర్ణచంద్ర నన్ను మహారాజుగారికి పరిచయం చేసాడు. నేను సందర్భములని బోధించమని మనవి చేసుకున్నాను. ఆయన నన్ను చూసి కొంచెంసేపు మౌనంగా ఉన్నారు. తర్వాత “మొదట హరి నామామృత వ్యాకరణం(జీవ గోస్వామి రచించిన సంస్కృత వ్యాకరణ గ్రంథం) చదవచ్చుగదా?” అని అన్నారు. అప్పుడు పాణిని సంస్కృత వ్యాకరణం స్వామి అఖండానందజీ ఆశ్రమంలో ఒక వైష్ణవ సాధువుదగ్గర చదువుతూ ఉన్నాను. ఒకేసారి రెండు వ్యాకరణ శాస్త్ర గ్రంథములను చదవడం కష్టమౌతుందని, పాణిని వ్యాకరణం పూర్తైనతర్వాత హరినామామృత వ్యాకరణం తప్పక చదువుతానని చెప్పాను. మహారాజుగారు మళ్ళీ కాసేపు మౌనంగాఉండి “సరే, నీకు బోధిస్తాను.” అని అన్నారు. అది నా జీవితంలో అత్యంత సంతోషకరమైన సన్నివేశం.
శాస్త్రాన్ని అనుసరించిన జీవితం
నా అధ్యయనము మొదటిరోజు ఆయనను పూజించడానికి పూలమాల మరియు కొన్ని పూజా ద్రవ్యములు తీసుకెళ్ళాను. పూలమాల సమర్పించిన వెంటనే దాన్ని తీసేసారు. ఇది నాకు వింతగా అనిపించింది. ఇస్కాన్ లో గురువులు ఎప్పుడూ పూలమాలతో కనబడేవారు. ఆయన ప్రవర్తనతో నాకు వినయమంటే ఏమిటో తెలిసింది. మహారాజుగారు షట్ సందర్భములను బోధించగల గొప్ప పండితులైనాకూడా చాలా సామాన్యంగా ఉన్నారు. ఎత్తైన వ్యాసాసనం మీద కాకుండా నేలమీద ఒక చెక్కబల్లముందు కూర్చున్నారు. తాను గొప్ప పండితుడు లేదా ఆచార్యుడనే భావన ప్రదర్శించలేదు. ఆయన జీవితాన్ని శాస్త్రాన్ని అనుసరించి గడిపారు కాబట్టి తగినట్లు శాస్త్రీ అని పిలువబడ్డారు.
ఆయన నాకు మొదట జీవ గోస్వామి రచించిన షట్ సందర్భములు : తత్త్వ, భగవత్, పరమాత్మ, కృష్ణ, భక్తి మరియు ప్రీతి సందర్భములు బోధించారు. వీటి తర్వాత జీవ గోస్వామి రచించిన సర్వ-సంవాదినీ, శ్రీ హరినామామృత వ్యాకరణం, రూప గోస్వామి రచించిన లఘుభాగవతామృతము, భక్తి రసామృత సింధువు మరియు ఉజ్జ్వల నీలమణి, సనాతన గోస్వామిరచించిన బృహత్ భాగవతామృతము మరియు హరిభక్తివిలాసము, బలదేవ విద్యాభూషణుడు రచించిన సిద్ధాంత దర్పణము మరియు గోవింద భాష్యము, విశ్వనాథ చక్రవర్తి రచించిన మాధుర్య కాదంబినీ మరియు కృష్ణదాస కవిరాజ గోస్వామి రచించిన చైతన్య చరితామృతము బోధించారు. కేవలం ఈ గ్రంథాలే కాక వాటి వ్యాఖ్యానాలు(గోవింద భాష్యం మరియు సర్వ-సంవాదిని తప్ప ఎందుకంటే అవి టీకాలే గనుక) కూడా బోధించారు. అంతేకాక, భగవద్గీత శ్రీ విశ్వనాథ చక్రవర్తి మరియు శ్రీ బలదేవ విద్యాభూషణుల వ్యాఖ్యానాలతో, భాగవత పురాణం శ్రీధరస్వామి, శ్రీ జీవ గోస్వామి మరియు శ్రీ విశ్వనాథ చక్రవర్తుల వ్యాఖ్యానాలతో బోధించారు.
(తరువాయి భాగం వచ్చే సంచికలో)
మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు, చాలామంది సలహాలు మరియు అభిప్రాయాలను ఇస్తారు. మీరు ఏమి అనుసరిస్తున్నారో మరియు ఎవరిని అనుసరిస్తున్నారో జాగ్రత్తగా ఉండండి.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.