పూర్వ మీమాంశ శాస్త్రములో (3. 1. 22) ఒక ముఖ్యమైన సూత్రము ఉంది. గుణానాం చ పరార్థత్వాత్ అసంబంధః సమత్వాత్ స్యాత్. దాని అనువాదము చాలా సాంకేతికమైనది, అందువల్ల దానిని సరళ భాషలో వివరిoచేందుకు ప్రయత్నిస్తాను.
ఇక్కడ గుణ అనే పదం యజ్ఞానికి కావలసిన వస్తువులు, దానిలో చెయ్యవలసిన పనులను సూచిస్తుంది, అలానే పర అనే పదం యజ్ఞాన్ని సూచిస్తుంది. అగ్నిని సంస్కరించే ఆధాన(అగ్నిని వెలిగించడం) మరియు పవమాన-హవిస్(అగ్నికి ఇచ్చే ఒక రకమైన నైవేద్యం) అను కర్మలకు సంబంధించి ఈ సూత్రం ఉంది. అగ్ని అనేది ఇక్కడ ప్రధానమైంది మరియు ఆధాన-క్రియ , పవమాన-హవిస్ అనేవి అగ్నితో పోలిస్తే ద్వితీయమైనవి. సూత్రపాయంగా చూస్తే ఆధాన-కర్మకు మరియు పవమాన-హవిస్ కు ప్రత్యక్ష సంబంధం లేదు. ఈ వస్తువులు మరియు పనులు అగ్నితో సంబంధం కలిగి ఉన్నాయి ఎందుకంటే అవి అగ్నికి అనుబంధమైనవి కాబట్టి , కానీ వాటికి పరస్పర సంబంధము లేదు.
ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే, ఈ సూత్రం ప్రకారం ఒక ప్రధాన వస్తువు దాని అనుబంధమైన పరికరములతో కలసి ఉన్నప్పుడు, ఆ అనుబంధ పరికరములు ప్రధాన వస్తువు లేకుండా ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండవు. ఇంకో మాటలో చెప్పాలంటే, ఆ అనుబంధ పరికరాల మధ్య ఎటువంటి సంబంధం ఉండదు.
గుణము అనే పదానికి “లక్షణం” అని అర్థం. లక్షణం ఒక పదార్థంలో నిక్షిప్తమై ఉంటుంది. ఆ పదార్ధం లేకుండా లక్షణమనేది ఉండదు. ఇక్కడ పదార్ధమనేది ప్రధానమైనది అయితే , లక్షణమనేది పదార్ధం మీద ఆధారపడి, మూలంగా ఉండేది కనుక అది అనుబంధనీయమైనదిగా చెప్పపడుతుంది. ఒక పదార్ధానికి ఎన్నో లక్షణాలు ఉండవచ్చు. ఈ లక్షణాలన్నంటికీ , ప్రధానమైన పదార్ధంతో తప్ప ఒకదానితో ఒకటికి ఎటువంటి సంబంధం లేదు. ఉదాహరణకు ఒక పసుపు కమలానికి రంగు, ఆకారం, వాసన, బరువు లాంటివి లక్షణాలుగా ఉన్నాయి. రంగు, బరువు, వాసన మరియు ఆకారానికి పరస్పర సంబంధము లేదు. వాటి సంబంధం కేవలం ఆ కమలముతోనే.
అలానే , ఒక వ్యక్తి వేర్వేరు పనులు చేస్తూ ఉంటే , ఆ పనులకు ఒక దానితో ఒకటికి సంబంధం లేదు. రామదాసు అనే వ్యక్తి స్నానం చేసి, తిలకం పెట్టుకొని, వంట చేసి, కృష్ణునికి నైవేద్యం సమర్పించి, ప్రసాదం స్వీకరించి తన పనికి వెళ్తుంటాడు. రామదాసుతో సంబంధం లేకుండా ఇక్కడ స్నానం, తిలకం పెట్టుకోవటం, వంటచేయడం, నైవేద్యం పెట్టడం, ప్రసాదం స్వీకరించడం లాంటి పనులన్నింటికీ ఒక దానితో ఒకటికి ఎటువంటి సంబంధం లేదు.
ఈ సూత్రాన్ని మన మధ్యగల సంబంధాలకు కూడా అన్వయించుకోవచ్చు. ఈ ప్రాకృతిక జగత్తులో నిజంగా చెప్పాలంటే మూడు మూల విషయాలు మాత్రమే ఉన్నాయి : పదార్ధాలు , లక్షణాలు మరియు కార్యాలు. ఇవన్నీ కూడా చివరకు కృష్ణుని మీద ఆధారభూతమై ఉంటాయి. అందువల్ల , ఆయనను ఈ కారణములకు కారకుడుగా, సర్వ-కారణ-కారణం(శ్రీ బ్రహ్మ సంహిత 5.1)గా పేర్కొనడం జరిగింది. కృష్ణుడు శ్రీ భగవద్గీతలో తనే ఈ చరాచర సృష్టి ప్రక్రియకు మూలమని చెప్తాడు : అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే (భగవద్గీత 10.8). ఇక్కడ ప్రభవః అనే పదము పదార్ధాలను మరియు ప్రవర్తతే అనే పదం క్రియలను సూచిస్తుంది. లక్షణాలు అనేవి పదార్ధాల నుండి విడదీయలేనివి, అందువల్ల కృష్ణుడు వాటిని ప్రత్యేకించి పేర్కొనలేదు. శ్రీకృష్ణుడు ఈ ప్రాకృతిక జగత్తులోని జీవులందరూ తనలోని భాగాలేనని, అంశలని అంటాడు(భగవద్గీత 15.7). అంటే దానర్ధం కృష్ణుడు పరిపూర్ణుడు కాబట్టి ప్రధానమవుతాడు అలానే జీవులందరూ అతని అంశలు కాబట్టి వారందరూ అతని అనునీయులు అవుతారు. పైన చెప్పిన పూర్వ మీమాంశ సూత్రము ప్రకారము, ఏదైనా రెండు లేక దాని కన్నా ఎక్కువ జీవముల మధ్య ఎటువంటి సంబంధం లేదు. ఆ సంబంధమనేది సర్వసృష్టికి మూలమైన కృష్ణుని వల్ల మాత్రమే అస్థిత్వమై ఉంటుంది.అంటే దీనర్ధం ఈ ప్రపంచం లోని మనుష్యుల మధ్యగల ఏ సంబంధమైనా కృష్ణుని మూలముగా ఉంచకపోతే అది నిజముగా పనిచేయదు ఎందుకంటే అది కేవలం కల్పన మాత్రమే కనుక. ఇంకా చెప్పాలంటే, ఇక్కడ ఎవ్వరూ దేనికీ యజమానులు కారు ఎందుకంటే యజమాని మరియు వస్తువుల మధ్య యాజమాన్య సంబంధం సాధ్యం కాదని అర్థమౌతుంది. ఇక్కడ యజమాన్యత్వాలన్నీ ఊహా కల్పితాలే ఎందుకంటే అవి ప్రజల మధ్య గల చట్టం లేక రాజ్యాంగమనే ఒడంబడికల మీద ఆధారపడి ఉంటాయి. అందుకే భౌతిక వాదులు మరియు శాస్త్రాల మీద నమ్మకం లేని వారు ఎప్పుడూ తమ మధ్య గల సంబంధాలలో లేక తమ వద్ద గల సంపదల వల్ల తృప్తిని చెందలేరు.
ఇంకా చెప్పాలంటే, శ్రీ కృష్ణునియందు ఎలా భక్తితో ఉండాలో చెప్పే శ్రీ రూప గోస్వామి చేత నిర్వచించ బడిన ప్రాధమిక సూత్రాన్ని తమ మనస్సులలో స్థిరముగా ఉంచుకోలేక పోవడం వల్ల శాస్త్రాలను నమ్మేవారు మరియు చాలా కాలం నుండి భక్తిమార్గంలో ఉన్న వ్యక్తులు కూడా పరస్పరం ప్రేమ, దృఢమైన సంబంధాలను కలిగి ఉండలేకపోతున్నారు.
అన్యాభిలాషితా శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం
ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిర్ ఉత్తమా ( 1. 1.11) శ్రీ భక్తి రసామృత సింధు
ఈ ఆశయాన్ని మనం మర్చిపోవటం వల్లే అసూయ, ద్వేషం, శత్రుత్వం, భౌతిక పోటీతత్వం మరియు ఆరోపించే తత్వం అనేవి పూర్తిగా మన మనస్సులను కమ్మేస్తాయి. ఇటువంటి ధోరణిలో ఉండటం చేత గురువు యొక్క శిష్యులు ప్రతి ఒక్కరూ కూడా కృష్ణుని భాగాలే అనే విషయాన్ని మనము చూడలేము. అలానే గురువు భగవంతుని ప్రత్యక్ష రూపమని మరియు భక్తులందరూ ఆయనకు సేవచేసే అనుంగులని మనం చూడలేము. ఎవరైతే ఈ విషయాన్ని చూడగలరో అలానే ఈ సూత్రాన్ని ఆధారముగా చేసుకొని నడవగలరో అట్టివారు వైకుంఠమును ఇక్కడే అనుభవించగలరు. ఎందుకంటే వైకుంఠమనేది కేవలం ఒక స్థలం మాత్రమే కాదు. వైకుంఠమంటే ప్రధానముగా భక్తిరసామృతసింధువులో నిర్వచించినట్లు ఒక భావ చైతన్యం. అదే శ్రీమద్ భాగవతం యొక్క మూల బోధన. ఇదే మనము తెలుసుకోవలసిన రహస్యం.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.