వైష్ణవ భావనలో మాయ అంటే?

Articles by Satyanarayana DasaPhilosophyComments Off on వైష్ణవ భావనలో మాయ అంటే?

      భగవంతునికి రెండు శక్తులు ఉంటాయి: పరా మరియు అపరా. పరా అంటే సుదూరమైనది, ఎవరితరంకానిది, గొప్పదైనది మరియు అలాంటివి . ఈ శక్తిని పరా అని అంటాము ఎందుకంటే అది అపరాగా పిలవబడే భౌతిక శక్తి కన్నా చాలా గొప్పది మరియు దానికి అవతల వైపు ఉండేటటువంటిది. శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు జీవ రాసులన్నింటినీ వారి జ్ఞానం వల్ల పరా శక్తిగా పరిగణించవచ్చు అంటారు.

ఈ ఎనిమిది అంచెల శక్తిని  (భౌతిక శక్తి) అపరా అంటారు, ఓ వీర బాహుడా! దీనికి భిన్నమైన జీవమనే నా  పరా శక్తితో విశ్వమంతయూ కొనసాగుతుంది. (భగవద్గీత 7. 5).

 శ్రీ భగవత్ సందర్భములో, శ్రీల జీవ గోస్వాములవారు ఈ శక్తి గూర్చి విపులముగా విశదీకరిస్తారు. పరా శక్తి గూర్చి తెలుసుకోవటానికి ముందు ఆయన అపరా శక్తి    గూర్చి చెప్తారు ఎందుకంటే అది అర్ధం చేసుకోవటానికి సులభతరం అవుతుంది కాబట్టి.  దీన్ని చంద్ర శాఖా న్యాయము లేక చంద్ర శాఖా సూత్రం అని అంటారు, అంటే ఒక క్లిష్ట వాదాన్ని అర్ధం చేసుకోవటానికి ముందు ఒక సులభ విషయాన్ని గూర్చి చెప్పినట్లు. ఇది ఎలా ఉంటుందంటే చందమామ ఎక్కడ ఉన్నాడో చూపటానికి ముందు ఒక చెట్టు కొమ్మను చూపించి నట్లు.

అపరా లేక బాహ్య శక్తిని నిర్వచించడానికి శ్రీ జీవ గోస్వాముల వారు శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మ దేవునితో సృష్టి ఆరంభానికి పూర్వం చెప్పిన భాగవతము(చతుః శ్లోకీ)లోని ఒక శ్లోకాన్ని వాడతారు. ఈ శ్లోకములో భగవంతుడు ఆయన బాహ్య శక్తి అయిన మాయను నిర్వచిస్తారు. మాయ అనే పదానికి రకరకాల అర్ధాలు ఉన్నాయి, అవి అబద్ధం,మోసం, భ్రమ, దయ , అధికారం, జ్ఞానం, బంధం, అదృష్ట దేవత, అద్భుతం మొదలైనవి. కృష్ణుడు ఈ  బాహ్య శక్తిని దిగ్భ్రమ కలిగించే బాహ్య శక్తిగా తెలిపేందుకు వాడతాడు.

ఈ శ్లోకం ప్రకారం మాయకు గల లక్షణాలు ఈ విధముగా ఉంటాయి.

  1. మాయ అనేది భగవంతునిలో ఉండదు .
  2. మాయ భగవంతుడు లేకుండా ఉండలేదు.
  3. మాయ భగవంతునికి బాహ్యముగా ఉంటుంది.
  4. భగవంతుని చూడలేనప్పుడు మాయను చూడగలము.

అయితే ఈ నిర్వచనం గూర్చి ఒక సందేహం రావచ్చు. ఒక బద్ధ జీవుడికి కూడా ఈ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఈ నిర్వచనం లోపభూఇష్టమైనదానిగా, చాలా అసంబద్ధముగా కూడా అగుపించవచ్చు. దీనిని తప్పించేందుకు శ్రీల జీవ గోస్వాములవారు జీవుడు చైతన్యము కలవాడని జీవుడిని భగవంతుని శ్రేణిలో ఉంచుతారు.  ఇంకా చెప్పాలంటే ఈ  శ్లోకములో చెప్పిన జీవ మాయ మరియు గుణ మాయ తీరు తెన్నులను కూడా నిర్వచనములో అదనముగా కలిపి చెప్పాల్సి ఉంది.  మాయ అనేది పరా శక్తిలో లేదు. అంటే దానర్ధము అది జీవుని స్వరూప లక్షణములో  లేక  జీవుని ప్రాకృతిక లక్షణములో లేదు. అది ఒక శుభ వార్త. మాయ అనేది జీవునిలో భాగంగా ఉన్నట్లయితే, దాని నుండి విముక్తి పొందటమనేది లేనే లేదు. 

మాయను గూర్చిన ఈ వివరణ ఏకత్వం భోదించే వారికి భిన్నముగా ఉంటుంది. వారు మాయ సత్ (నిజమైనది) కాదని అలానే అసత్ (అబద్దమైనది)  కాదని  మరియు ఆ రెండిటి మిశ్రమం కూడా కాదని అంటారు. వారి ప్రకారం మాయ అనేది, ఆ రెండిటికి భిన్నమైనది కానీ కల్పితమైనది. అందువల్ల , అది వివరించలేనిది లేక అనిర్వచనీయమైనది మరియు జ్ఞానానికి అది పూర్తి విరుద్ధమైనది. శంకరాచార్యుల వారు మాయను గూర్చి ఈ విధముగా చెప్తారు:

మాయ సత్ మరియు అసత్ కాదు , అలానే అసత్ ,సత్ మిశ్రమం కూడా కాదు. అది బ్రహ్మముకు సమానమైనది కాదు మరియు భిన్నమైనది కాదు. దానికి శాఖలు కానీ గణములు కానీ లేవు. మాయ అనేది అబ్బురపరిచేది మరియు వివరణనీయలేనిది (వివేక చూడామణి 111).

అటువంటి వివరణకు కారణం ఏమిటంటే అద్వైత సిద్ధాంతాన్ని విపరీతముగా నమ్మే వారు బ్రహ్మముకు గల శక్తుల గూర్చి నమ్మరు కనుక. కానీ శ్రీల జీవ గోస్వామి భగవంతుడు అటువంటి ఎన్నో శక్తులను కలిగి ఉన్నాడని అవి పరి పరి విధాల ప్రకటమవుతాయి అని నిరూపిస్తారు. ఇది సరళమైన నిజం, కానీ  దీన్ని అర్ధం చేసుకోకుండా భగవంతుని అర్ధం చేసుకోలేము. అద్వైత వాదులు దీన్ని ఆకళింపు చేసుకోలేరు కనుక దాన్ని కప్పి పుచ్చేందుకు క్లిష్టమైన నిర్వచనాలను వారు చేసేందుకు ప్రయత్నిస్తారు. అచింత్య శక్తిని నమ్మకుండా వారు ఊహకు అందలేని అనిర్వచనీయమైన మాయను బలవంతముగా నిజమని  నమ్మేన్దుకు సిద్ధపడతారు. వారి ఈ విధానమే పూర్తిగా అసమంజసమైనది. 

అద్వైత వాదులు ఈశ్వరుడు మరియు జీవుడు మాయనుండి ఉద్భవించినవారేనని చెప్తారు, అలానే నిరాకారుడు, నిర్గుణుడు అయిన బ్రహ్మమే పరమ సత్యము అని అంటారు. కానీ శ్రీ కృష్ణ భగవానుడు అటువంటి ఆలోచనలను సమర్ధించరు. ఆయన మాయ అనేది నా శక్తి అని మరియు అది పుట్టుక లేనిది అని చెప్తారు ( శ్రీమద్ భాగవతం 11.11.3). బ్రహ్మ దేవుడు కూడా రెండవ అధ్యాయములో “భగవానుడు మాయ యొక్క విద్య మరియు అవిద్య లక్షణములకు మూలాధారము” అని ధృవీకరిస్తారు. (శ్రీమద్ భాగవతం 2.6.20).

బ్రహ్మమును ఈశ్వరునిగానూ మరియు జీవునిగాను మార్చగలిగే వస్తువు ఒకటి ఉందని చెప్పటం అసాధ్యమైనది అలానే ఆమోదయోగ్యం కూడా కానిది. సత్ మరియు అసత్ లకు భిన్నమైన మరొక క్రమమును మనం కొత్తగా కనుగొనలేము. శ్రీకృష్ణుడు శ్రీమద్ భగవద్గీతలో సత్ లేక అసత్ మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశాడు. అద్వైతులు యోచించినట్లు వేరొక మూడో మార్గం లేదు.

అసత్ నిజముగా ఉనికి లేనిది మరియు సత్ ఎల్లప్పుడూ ఉనికి కలిగి ఉంటుంది. ఈ రెండిటి యొక్క తత్త్వ నిర్ధారణ నిజము తెలుసుకొన్న వారు చూశారు.(గీత 2.16)

మాయను గూర్చి ఈ నిర్వచనం శక్తి ఉపాసన(శాక్త)కు కూడా విరుద్ధముగా ఉంటుంది. శక్తి ఉపాసకులు శక్తి లేక దేవి అనేక రూపాలు కలిగి ఉన్న పరమేశ్వరి అని భావిస్తారు. ఆమె  ప్రకృతికి ఆధారమైన మూల ప్రకృతి, మరియు తానే పురుషునిగా మరియు ప్రకృతిగా విభజన చెందుతుంది. ఆమె బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను తన నుండే ఉద్భవించే మహా మాయ మరియు వారి వారి విధి పూర్వక కార్యాలను చక్క దిద్దేటట్లు చేస్తుంది. ఆమె నిజ రూపంలో నిర్గుణ మరియు పరబ్రహ్మమని పిలవబడుతుంది. శక్తి ఉపాసనలో భిన్న వర్గాలు ఉన్నాయి మరియు వారు తమ లక్షాన్ని పొందేందుకు భిన్న భిన్న సాధన మార్గాలను ఎంచుకొన్నారు.

అయితే దానికి పూర్తి భిన్నముగా, శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ భగవానుని మద్దతు లేకుండా మాయ ఉండలేదని స్పష్టము చేస్తుంది. మాయ ఆయన ముఖారవిందాన్ని కూడా చూడ జాలదు ( శ్రీమద్ భాగవతం 2.7.47). భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు “మాయ నా ప్రాకృతిక దివ్య శక్తి” అని చెప్తారు (7.14).    భగవద్గీత ప్రామాణికమైనదిగా శంకర అనుచరులు కూడా అంగీకరించారు కాబట్టి, శక్తి ఉపాసకుల ప్రతిపాదన అయిన శక్తే మూలమనేది  వైదిక సైద్ధాంతికులు అంగీకరించిన మూడు శాస్త్ర మూలాలైన ప్రస్థాన త్ర్యయము చేత కూడా అంగీకరించబడదు.

శ్రీల జీవ గోస్వాముల వారు మాయను  ఆమె చేసే పనులను బట్టి రెండు రకాలుగా విభజించవచ్చు అని చెప్తారు.వాటిలో మొదటిది జీవ మాయ, అది ప్రతి జీవి యొక్క  సహజ సిద్ధ లక్షణాన్ని లేక స్వరూపాన్ని కప్పి ఉంటుంది. ఆయన  ఈ మాయ  జీవులను కప్పిఅజ్ఞానంధకారములో ఉంచుతుంది కాబట్టి దానిని గూర్చి ప్రస్తావించేందుకు నిమిత్తాంశ  అనే పదాన్ని కూడా వాడతారు. అయితే ఈ మాయ మన జిజ్ఞాస లేక జీవుని స్వభావాన్ని పూర్తిగా మూసివేయలేదు. ఆత్మ యొక్క దాస్యాన్ని సంపూర్ణం చేయాలంటే ఆమె దానికి ఒక ప్రాకృతిక శరీరాన్ని,  ఇంద్రియాలను మరియు  జీవుని తృప్తి కొరకు ఇంద్రియ భోగాలను  ఇవ్వాలి. దీన్ని గుణ మాయ అంటారు ఎందుకంటే ఇవన్నీ మాయ యొక్క గుణముల రూపాంతరములే కాబట్టి.

ఈ గుణ మాయ తీరును ఉపాదానము లేక ప్రాకృతిక స్వభావము అని కూడా అంటారు ఎందుకంటే అది ప్రాకృతిక ద్రవ్యాలను ఒనర్చుతుంది కాబట్టి. ఒక వ్యక్తి రాత్రి క్లబ్లోకి వెళ్లి మొదట మద్యపానంతో మత్తులోకి జారుతాడు, అది అతని బుద్ధిని కప్పేస్తుంది (జీవ మాయ తరహాలో), ఆ తర్వాత అతడు ఇంద్రియముల చేత ఆకర్షించ పడతాడు, ఎలా అంటే ఒక సుందరమైన యువతిని చూడటం లాంటివాటి వల్ల (గుణ మాయతో పోల్చదగ్గ). ఇది ఆ మాయను పూర్తి చేస్తుంది. ఇలా మాయ యొక్క ఆక్రమణ రెండు విధాలుగా – బాహ్యం , అంతర్గతంగా ఉంటుంది. ఈ రెండు విధములు ఒకదానిని ఒకటి సమన్వయించుకొంటూ బలపడుతూ ఉంటాయి. ఈ విధముగా ఒక బద్ధ జీవికి గుణముల సహాయత లేకుండా మాయ యొక్క కబంధ హస్తాల నుండి బయట పడటం అనేది అసాధ్యం. 

అయితే ఇక్కడ మనకు ఒక శుభ వార్త ఏమిటంటే మాయ అనేది నిజమైనప్పటికీ మరియు మాయనుండి ఉత్పన్నమైన ఈ ప్రపంచము కూడా నిజమైనప్పటికీ జీవుని బద్ధ స్థితి అనేది నిజం కాదు. అలా కాకుండి ఉంటే ముక్తికి మార్గమే ఉండేది కాదు.

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    మనం ఇతరులకు గౌరవం ఇవ్వడం ద్వారా మన విలువను తగ్గించుకుంటామని అహంకారం చేత అనుకుంటాము. కానీ నిజం దీనికి పూర్తి విరుద్ధం.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.