భక్తి లేకుండా జ్ఞానం లేదు

Articles by other authorsSandarbhasComments Off on భక్తి లేకుండా జ్ఞానం లేదు

           ప్రతి తత్వ దర్శనమునకు కొన్ని ప్రత్యేక సూత్రాలు ఉంటాయి అవి వాటిని వేరే దర్శనముల కన్నా భిన్నముగా ఉండేటట్లు చేస్తాయి. గౌఢీయ తత్వ దర్శనములో అటువంటి సూత్రం – భక్తి అనేది మాత్రమే తత్వాన్ని( నిజాన్ని) తెలుసుకొనటానికి అవలంబించవలసిన మార్గం, ఆ తత్వమనేది  బ్రహ్మము, పరమాత్మ, మరియు భగవానుడు అని మూడు రకాలుగా వ్యక్తమవుతోంది. మన తత్వ దర్శనం ప్రకారం ముఖ్యముగా భక్తి లేని ఏ ప్రయత్నమైనా తత్వాన్ని తెలుసుకొనడములో విఫలమవుతుంది, అయితే భక్తి ఒక్కటే మిగిలిన అన్ని మార్గాల ద్వారా వచ్చే పరిజ్ఞానాన్ని స్వయం సంపత్తితో ఇవ్వ గలుగుతుంది.  

        అయితే ఇతర మార్గాలను అనుసరించేవారు దీనిని పక్షపాతమని వ్యంగము చేయ వచ్చు, కానీ ఇది పూర్తిగా శాస్త్ర ప్రమాణములను అనుసరించి చెప్పబడింది అందువల్ల దానిని ఎవరో ఆ మార్గాన్ని అనుసరించే సాధువో లేక ఆచార్యుని అభిప్రాయముగా కొట్టి పారవేయరాదు. 

            శ్రీ జీవ గోస్వాముల వారు దీన్ని భక్తి సందర్భములో శాస్త్రములనుండి జ్ఞాన యోగము బ్రహ్మమును అనుగ్రహిస్తుందని, కానీ అది భక్తి కృప లేకుండా అసాధ్యమని  ఉదాహరణలతో సహా చూపిస్తారు. దీనికి కారణం – జ్ఞాన యోగం వైరాగ్యం మరియు మనస్సు , ఇంద్రియములను ఆధీనములోనికి తెచ్చుకొనడం అనే వాటి మీద ఆధారపడి ఉంటుంది. అవి సత్వ గుణానికి సంబంధించినవి అందువల్ల అవి మూడు గుణముల పరిధి  దాటి  ఉండే ఫలితాన్ని ఇవ్వలేవు.

              జ్ఞాన యోగ సాధకులు సత్వ గుణాన్ని కేవలం భక్తి మార్గాన్ని ఆశ్రయించటం ద్వారానే దాటగలరని ఆయన అంటారు, ఎందుకంటే భక్తి అనేది గుణముల పరిధిని మించినది. ఈ సారాంశం శ్రీ కృష్ణుడు భగవద్గీతలో (18.54-55)  చెప్పినదానికి పూర్తిగా సరిపోతుంది. శ్రీ కృష్ణడు ఇలా మొదట  అంటారు:

      “ఓ కుంతీ పుత్రుడా ! కర్మముల లితముల నుండి విముక్తుడై  జ్ఞాన మార్గములోని అత్యంత ఉన్నతమైనదైన   బ్రహ్మ సాక్షాత్కారమును పొందే వ్యక్తి గూర్చి నా నుండి క్లుప్తముగా నేర్చుకొనుము.”

   ఆయన ఇలా ముగిస్తారు :

ఆత్మ  సంతృప్తి కలిగించే బ్రహ్మ సాక్షాత్కారము నా మీద యుండే భక్తి వల్ల మాత్రమే సాధ్యం. భక్తి చేత మాత్రమే నన్ను పూర్తిగా అర్ధం చేసుకోగలరు.”

               అయితే మనం సత్వం జ్ఞానానికి దారి తీస్తుందని ( సత్వాత్ సంజాయతే జ్ఞానం, భగవద్గీత 14.17) దానివల్ల బ్రహ్మ సాక్షాత్కారము పొందవచ్చని ( సత్వం యద్ బ్రహ్మ దర్శనం , శ్రీమద్ భాగవతం 1.2.24) అనుకోవచ్చు. కానీ  ఇక్కడ మనం గుర్తించవలసింది ఏమిటంటే బ్రహ్మ దర్శనమనేది సత్వం ( సత్వాత్ అను పదం చెప్పినట్లు) వల్ల నేరుగా రాదు, అది సత్వం వల్ల సులభతరం అవుతుంది ( అందువల్లే “సత్వం యత్”) . ఇంకా గుర్తుంచుకోవలసినది ఏమిటంటే , “బ్రహ్మ దర్శనం” అనేది బ్రహ్మము యొక్క  మొదటి ఛాయను సూచిస్తుంది, అది భక్తి చేత పొందే పూర్తి సాక్షాత్కారమునకు భిన్నముగా ఉండవచ్చు కూడా ( భగవద్గీత 18.55 మరియు శ్రీమద్ భాగవతం 1.7.4 లలో ఈ విషయం చెప్పబడింది).

            శ్రీ సూత గోస్వామి వారు ఈ విషయాన్ని, శ్రీమద్ భాగవతం రెండవ అధ్యాయములో విశదీకరిస్తారు; మొదట ఆయన తత్వమనేది పరస్పరం ఒకటే అయిన మూడు రకాలు- బ్రహ్మము, పరమాత్మ మరియు భగవంతుడు గా వ్యక్తమవుతోందని వివరిస్తారు.  

వదన్తి తత్ తత్వ విస్

తత్త్వం జ్ జ్ఞానం అద్వయం

బ్రహ్మేతి పరమాత్మేతి

భగవాన్ ఇతి బ్ద్యతే

           తర్వాత శ్లోకం 1.2.12 లో ఇలా చెప్పటం జరిగింది “అచంచలమైన విశ్వాసం గల సాధకులు బ్రహ్మ తత్వాన్ని శ్రవణం వల్ల పొందిన భక్తితో లభించిన జ్ఞానవైరాగ్యములద్వారా తమలోనే చూడగలరు”.

చ్చ్రద్ధధానా మునయో

జ్ఞాన వైరాగ్య యుక్తయా

పశ్యన్తి ఆత్మని చాత్మానమ్

భక్త్యా శ్రుత గృహీయా

              ఇక్కడ ఆత్మ (1.2.12 శ్లోకంలో) అనేపదం పైన చెప్పిన మూడు వ్యక్తీకరణములను సూచిస్తుంది. అలానే , మునయః అనే పదం (1.2.12 శ్లోకంలో) మూడు రకాల మార్గాలలోని సఫలీకృతులైన సాధకులు అంటే జ్ఞానులు, యోగులు మరియు భక్తులను సూచిస్తుంది. దీన్ని బట్టి సూత యోగీంద్రుని వాక్యము 1.2.12 లోని ఆత్మ అనే పదం, తత్వాన్ని  సూచిస్తుంది. అలానే  ఇది  ఆ మూడు రకాల సాధకులకు వారి భక్తి చేత పొందిన విశ్వాసం వల్ల స్వయం ప్రకాశమవుతుందని వివరిస్తుంది.

                 ఈ శ్లోకాలను అనుసరించి వచ్చే శ్లోకాలలో, శ్రీ సూత గోస్వామి మనకు పూర్వ కాలంలోని ఋషి పుంగవుల ఉదాహరణలను ఇస్తారు; “అందుచేత జ్ఞానేంద్రియములకు  చిక్కని(అధోక్షజ),  మరియు శుద్ధ తత్వానికి ప్రత్యక్ష రూపమైన(విశుద్ధ సత్త్వ),  ఆ భగవంతుని (శ్రీ కృష్ణుని ) అనాదికాలం నుండి ఆ మునులు పూజిస్తున్నారు.  ఈ లోకంలోని ఏ వ్యక్తిఅయినా వారి మార్గాన్ని అనుసరించి ఆ పరమ పదాన్ని పొందగలరు(శ్రీమద్ భాగవతం 1.2. 25)”.

                   ఈ మూడు రకాల ప్రాకృతిక గుణాలను ఎలా అధిగమించాలి అనే అర్జునుని ప్రశ్నకి జవాబిస్తూ శ్రీకృష్ణుడు చేప్పే మాటల్లో ఈ విషయం మళ్ళా నిర్ధారణ అవుతుంది.

మామ్ యో వ్యభిచారేణ

భక్తి యోగేన సేవతే

స గుణాన్ సమతీత్యైతాన్

బ్రహ్మ భూయాయ కల్పతే

           నన్ను అచంచలమైన భక్తితో సేవజేసే వారు ఈ ప్రాకృతిక గుణాలను పూర్తిగా అధిగమిస్తారు మరియు అలానే బ్రహ్మ సాక్షాత్కారానికి అర్హులు అవుతారు. (భగవద్గీత 14.26)

           అంతటికి ముందు శ్లోకాలలో , శ్రీ కృష్ణుడు కేవలం నన్ను ఆశ్రయించిన వారే ఈ మూడు గుణాలను అధిగమిస్తారని స్పష్టం చేస్తాడు (7.14) . శ్రీకృష్ణుని మరియు సూత గోస్వాముని ఈ వాఖ్యల వల్ల భక్తి లేకుండా బ్రహ్మ సాక్షాత్కారం జరుగదని తేట తెల్లమవుతుంది. దీనికి కారణం భక్తి అనేది ఆ భగవానుని స్వయం ప్రకాశ స్వరూప శక్తి, అందుకే అది ఈ ప్రాకృతిక మూడు గుణాలకు అతీతం. ఇంకా చెప్పాలంటే, అది పరమాత్మ సాక్షాత్కారమును ప్రభావితము చేయ గల కారకము. 

        ఇది  జ్ఞాన యోగం గూర్చి అద్వైత సిద్ధాంత ధోరణిలో ఆలోచించే వారికి  మతి పోయేటట్లు చేస్తుంది. వాస్తవముగా ఏ బాహ్య రూపమూ లేని భగవంతునిపై మనస్సు ధ్యానం చేయడానికి  భక్తి అవసరమని వారు భావిస్తారు. వారు అది మెల్లగా అటువంటి అవివేకుల ధ్యానానికి ఉపకరించి వారిని బ్రహ్మ సాక్షాత్కారం వైపు మరలుస్తుంది అని అనుకుంటారు. ఇది కొందరికి ఇంపుగా అగుపించవచ్చు కానీ దీనికి ఎటువంటి శాస్త్రాధారము లేదు. ఇంకా చెప్పాలంటే ఇది శాస్త్రంలో ఉటంకించిన విషయాలను పైన చెప్పినట్లు వ్యతిరేకిస్తోంది.

        అలానే ఇలాంటి అభిప్రాయం ఈ క్రింద విశదీకరించినట్లు తర్కముతో చూసినా సరిగ్గా అగుపించదు. 

           శ్రీ భగవత్ సందర్భము సారాంశంలో విశదీకరించినట్లు, బ్రహ్మమనేది తత్వము యొక్క నిర్గుణమైన వ్యక్తీకరణం. ఇంకోవిధముగా చెప్పాలంటే, బ్రహ్మమనేది ఆ పరమాత్మ యొక్క నిజ శక్తిని దాచియున్న రూపము, అందువల్ల అది ఆయన యొక్క నిజ లక్షణాలను కలిగి ఉండదు. కానీ అదే తత్వమైన భగవంతుడు దీనికి భిన్నముగా ఆయన యొక్క అసమానమైన, గుర్తించగల  లక్షణాలను సదా  ప్రదర్శిస్తాడు. ఈ కోణంలో చూస్తే, బ్రహ్మమనేది పాక్షిక లేదా నిగూఢ తత్వ రూపం, అయితే భగవంతుడు పూర్తి ప్రత్యక్ష స్వరూపం. అలాంటప్పుడు భగవంతుడి మీద శ్రద్ధాసక్తులు కలిగి ఉండటం అనేది అవివేకం ఎలా అవుతుంది.

          వివేకవంతులు కాని వారికి శాస్త్రాధ్యనయం మరియు జ్ఞాన యోగం చేత వచ్చే వైరాగ్యం కన్నా కూడా భక్తి సాధన సులువు అనేది నిజం, కానీ దానర్ధం భక్తి అనేది అవివేకులకు మాత్రమే అని కాదు. సాధకుల శక్తి ప్రమేయం లేకుండా ఆనందముగా భక్తి యోగం సాధన చేయటమనేది భక్తికి ఉన్న సహజ లక్షణము. అందుచేతనే శ్రీ జీవ గోస్వాముల వారు అనుచ్ఛేదం 67 లో భక్తి అనేది సులభముగా ప్రావీణ్యం సంపాదించగలిగినది, సుఖ-సాధ్యత్వం అని వ్రాస్తారు. ఇంకా చెప్పాలంటే భక్తి అనేది ఆ పరమాత్మ గూర్చి పూర్తి విజ్ఞానాన్ని మరియు వివేకాన్ని కలిగిస్తుంది, జ్ఞాన-జనకత్వం- అంటే దానిలో బ్రహ్మము గూర్చి  అవలీలగా తెలుసుకొనే జ్ఞానం యోగ ముఖ్యోద్దేశము కూడా ఉంది. భక్తియోగము చేయటానికి సులువుగా ఉండటం, ప్రావీణ్యత సంపాదించడానికి అనువుగా ఉండటం దాన్ని జ్ఞాన యోగం కన్నా శ్రేష్ఠముగా చేస్తుందే తప్ప తక్కువగా మాత్రం కాదు.

           అందుకే శ్రీకృష్ణుడు ఉద్ధవునకు జ్ఞాన యోగమును ఉపదేశించిన పిమ్మట భక్తి యోగము గూర్చి ఉపదేశిస్తాడు. ఆయన భక్తి యోగం గూర్చి తన సమీక్షను ప్రారంభిస్తూ  “నాద బ్రహ్మము (వేదములు) సవివరముగా చదివినా కూడా, సర్వ వ్యాపిత బ్రహ్మము గూర్చి తెలుసుకోనట్లయితే, అటువంటి వ్యక్తి  చేసే ప్రయత్నమంతా కేవలం అది ఒక శ్రమ మాత్రమే, ఎందుకంటే అది పాడి లేని ఆవును పాల కోసం పిదకటం లాంటిది” (శ్రీమద్  భాగవతం 11. 11.18) అని అంటారు.

    అంటే ఇక్కడ అర్ధం మనం మొదట శాస్త్రాలను చదవాలి అప్పుడే  వాటి జ్ఞాన సంబంధమైన విషయాల గూర్చి పూర్తి అవగాహన పొందగలుగుతాము (శబ్ద-బ్రహ్మణి నిష్ణాత). దానివల్ల ఆ సర్వ వ్యాప్త బ్రహ్మము గూర్చి అవగాహన కలుగుతుంది (పర-బ్రహ్మణి నిష్ణాత). అది జరగ కుంటే, వేదాల తాత్విక సిద్ధాంతము తెలుసుకోవాలని ఒకరు చేసిన ప్రయత్నమంతా వృధా అని కృష్ణుడు నొక్కి వక్కాణిస్తాడు.

            అనుచ్ఛేదం 67లో శ్రీ జీవ గోస్వాముల వారు భక్తికి గల ప్రత్యేక స్థానం గూర్చి మరియు దాని సాధన సులభతరాన్ని గూర్చి వివరించే ఒక ముఖ్య విషయాన్ని విశదీకరిస్తారు. ఆయన పరబ్రహ్మమనేది ఉపనిషత్తుల ప్రధాన విషయం అయినప్పటికీ, పరబ్రహ్మము మీద దృఢమైన విశ్వాసం(నిష్ఠ) అనేది సాధకుడు కొన్ని లక్షల సార్లు యోచించుటం వల్ల రాదు అని చాలా దైర్యంగా చెప్తారు. ఆ నిష్ఠ అనేది భగవంతుని లీలలను స్మరించుకొనే శబ్ద బ్రహ్మము మీద దృష్టి పెట్టడం వలన మాత్రమే కలుగుతుంది. నిజానికి చాలా తరచుగా జ్ఞానులు మరియు యోగులు కృష్ణ లీలలను వింటూ లేదా ప్రస్తావిస్తూ వాటిని తమ భావానికి అనుగుణంగా అర్థం చేసుకోవడం మనం చూస్తూ ఉంటాము. భగవంతుని లీలా స్మరణ లేకుండా కేవలం వారి మార్గాల గూర్చి జనబాహుళ్యానికి ప్రవచనాలు ఇచ్చే జ్ఞానులు మరియు యోగులను మనము చూడడమనేది చాలా అరుదు.

       పరబ్రహ్మము మీద గల నిష్ఠకు మరియు లీలా స్మృతుల శబ్ద బ్రహ్మముకు గల సంబంధము మీద తన అభిప్రాయమును నిజమని చూపించడానికి శ్రీ జీవ గోస్వాముల వారు శ్రీ శుకదేవ గోస్వామి మహారాజు పరీక్షిత్తునకు చేసిన ఉపదేశమును ఉటంకిస్తారు. “తీవ్రమైన బాధల దావానలములో చిక్కుకొని, ప్రాపంచిక విషయాలను(సంసారం) దాటాలని కోరుకొనే వ్యక్తులకు,  ఆ పురుషోత్తముడు అయిన భగవంతుని(శ్రీకృష్ణుడు)  దివ్య లీలా వర్ణనలో రస భావంతో నిమగ్నమవడం తప్ప వేరే తరుణోపాయం లేదు (శ్రీమద్  భాగవతము 12. 4. 40)”.

                                                  సత్యనారాయణ దాస

Notify me of new articles

Comments are closed.

 • Satyanarayana Dasa

  Satyanarayana Dasa
 • Daily Bhakti Byte

  మనం దేనికోసం ప్రార్థించాలో కనీసం తెలుసుకోవాలి. ఇది మా ఏకైక ప్రార్థన అని మనం స్పష్టంగా చెప్పాలి – ‘కృష్ణ, నిన్ను ఎప్పటికీ మరచిపోనివ్వకు. నా మనస్సు ఎప్పుడూ మీపైనే స్థిరముగా ఉండనివ్వు. ’మనం నిద్రపోతున్నా, మేల్కొని ఉన్నా, తింటున్నా, మన మనస్సు ఎప్పుడూ కృష్ణుడిపైనే ఉండాలి, అది మన మానసిక స్థితి కావాలి.

  — Babaji Satyanarayana Dasa
 • Videos with Bababji

 • Payment

 • Subscribe

 • Article Archive

 • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.