ఎనిమిదవ నామ అపరాధము

GeneralSandarbhasComments Off on ఎనిమిదవ నామ అపరాధము

నామాన్ని పుణ్య కార్యాలతో సమానంగా చూడడం

భక్తి మరియు కర్మ రెండు భిన్నమైన మార్గాలు. వాటికి అవసరమైన అర్హతలు కూడా భిన్నమైనవే. ఈ భేదమును తెలుసుకోవడం చాలా ముఖ్యం. వైదిక ధర్మంలో ఉన్న కర్మలకు ప్రత్యామ్నాయంగా జపము లేదా కీర్తన ఒకరు చేయకూడదు. ఇది ఒక అపరాధముగా పరిగణించబడుతుంది. శ్రీ జీవ గోస్వామిచే ఈ విషయం భక్తి సందర్భములో వివరించబడింది.

265.8వ అనుచ్ఛేదము

భగవన్నామమును శాస్త్రాలలో సిఫారసు చేయబడ్డ శుభ కర్మ(శుభ క్రియ)లతో సమానంగా భావించడం ఎనిమిదవ అపరాధము. అంటే, వర్ణాశ్రమ ధర్మాలను, ఆచారాలను మొదలగు వాటిని నామముతో సమానంగా భావించడం నామానికి అమర్యాద చేసినట్లవుతుంది. కాబట్టి అతిదేశ సూత్రముప్రకారం, నామ మహిమలు మాత్రమే ఈ క్రింద శ్లోకంలో చెప్పబడ్డాయి:

ఎప్పుడైతే ద్విజులచేత వేద అక్షరములు పలుకబడతాయో, అప్పుడు ప్రతి సారీ నిజానికి హరి భగవానుని నామములు కీర్తన చేయబడుతున్నాయి. దీనిలో సందేహం లేదు.

ఇంతకముందు స్కంద పురాణమునుండి ఉటంకించి చెప్పినట్లు:

ఓ భృగు వంశోత్తముడా! శ్రీ కృష్ణుని దివ్య నామము మధురమైన వాటన్నిటిలోకెల్లా మధురమైనది మరియు మంగళమైన వాటన్నిటిలోకెల్లా మంగళప్రదమైనది. ఇది సర్వ వేదాల కల్ప వృక్షానికి గల సర్వోత్కృష్టమైన ఫలము మరియు శుద్ధ చైతన్య స్వభావంగలది(చిత్ స్వరూపము). శ్రద్ధతోనైనా లేక ఏమరికగానైనా ఎవరైతే కృష్ణ నామమును ఒక్కసారి ఉచ్చరిస్తారో అది వారిని భవాంబుధినుండి ముక్తి ప్రసాదిస్తుంది.

విష్ణు ధర్మములో చెప్పినట్లు:

“హ-రి” అన్న రెండు అక్షరాలను పలికిన వారు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మరియు అథర్వవేదముల అధ్యయనము వెంటనే పూర్తి చేసినట్లే.

స్కంద పురాణములో పార్వతీ దేవి చెప్పినట్లు:

ఓ నా ప్రియమైన బాలుడా !, యజుర్వేదం మరియు సామవేదాలను అధ్యయనం చేయకు. సదా కీర్తనకు అర్హమైన ఏకైక హరి భగవానుని నామమైన “గోవింద” అని గానం చేయుము.

పద్మ పురాణంలో ఉన్న రామాష్టోత్తర శత నామ స్తోత్రములో, ఇలా చెప్పబడింది:

విష్ణు భగవానుని ప్రతి ఒక్క నామము అన్ని వేదములకన్నా శ్రేష్టమైనది.(పద్మ పురాణం 6.254.27)

సత్యనారాయణ దాస బాబాజి వారి వ్యాఖ్యానం

నామాన్ని వైదిక కర్మ కాండలకు ఉపయోగించడం అపరాధము. ఇది ముందు చెప్పబడిన అపరాధమైన సొంత ప్రయోజనాల కోసం నామాన్ని దుర్వినియోగం చేసే అపరాధానికి సాదృశ్యాన్ని కలిగి ఉంది. సాధకునికి నామ మహిమపై విశ్వాసం ఉన్నా, దాన్ని ఉద్దేశించిన ప్రయోజనం కోసం కాకుండా మత సంబంధిత సాంప్రదాయ ఆచార కర్మలను నెరవేర్చుకొనుటకు ఉపయోగిస్తాడు. బదులుగా, సాధకుడు నామజపాన్ని ఇతర సామాన్య పుణ్య కర్మలతో సమానంగా భావించవచ్చు. విష్ణు ధర్మములో హరి నామ ఉచ్చారణతో వేదములన్నీ పఠించబడినట్లు చెప్పడానికి ముఖ్య ఉద్దేశ్యం నామ మహిమను వివరించడమే. అంతేగాని, ఒక యజ్ఞములో వేద మంత్రములకు బదులు హరి నామము ఉచ్చరించమని దానర్థం కాదు. అలా చేయడం నామాన్ని యజ్ఞానికి కేవలం ఒక  పరికరంగా వాడినట్లౌతుంది. అలాగే, స్కంద పురాణంలో పార్వతీ దేవిచేత చెప్పబడిన వాక్యానికి అర్థం ఒకరు వేద అధ్యయనం చేయరాదని కాదు, గోవిందుని నామ జపము చేయాలని మాత్రమే.

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    జీవితంలో విజయం సాధించడానికి ఇతరుల సహాయం మనకి కావాలి. అంటే ఇతరులను మనం నమ్మాలి. కానీ అనర్హమైన వారిని మనం నమ్మకూడదు.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.