కలియుగంలో కీర్తనముయొక్క ప్రాధాన్యము

BhaktiSandarbhasComments Off on కలియుగంలో కీర్తనముయొక్క ప్రాధాన్యము

                       కీర్తనకు కాల ప్రదేశాలతో సంబంధంలేకుండా అన్ని యుగాలలో ప్రాధాన్యం ఉన్నా, ప్రస్తుతమున్న కలియుగంలో దానికి విశేష ప్రాముఖ్యం ఉంది. భక్తి సందర్భము(270-274) అనుచ్ఛేదములలో శ్రీ జీవ గోస్వామి ఆ ప్రాముఖ్యానికి గల కారణాన్ని వివరిస్తారు. వాటి అనువాదము మరియు వ్యాఖ్యానము రాబోయే సంచికలలో మీకు విశదీకరిస్తాను.

270వ అనుచ్ఛేదము

                భగవద్ కీర్తన రూపంలో ఉన్న ఈ భక్తి, సంపద, ఉన్నత జన్మ, ప్రసంశనీయ గుణాలు లేదా ప్రాశస్త్య  విజయాలు లేని అభాగ్యులకు(దీనజనులకు) అమితముగా దయాళువైనది. ఇది వేదపురాణాల నుండి మనం గ్రహించవచ్చు. కలియుగంలో ప్రసిద్ధమైన దీనత్వం బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పబడింది: 

           అందువల్ల, కలియుగంలో తపస్సు, యోగము, వేదాధ్యయనం మరియు యజ్ఞాలు మిక్కిలి సమర్థవంతులు చేసినాకూడా సంపూర్ణంగా చేయబడలేవు.

               కాబట్టి, సహజంగా బాధపడే కలియుగ ప్రజలమధ్యలో కనిపించే సంకీర్తనము, ఇతర యుగాలలో ప్రాముఖ్యమైన అన్ని సాధనల ఫలితాలను సులభంగా వారికి ప్రసాదించి వారిని పరిపూర్ణులను చేస్తుంది. ఈ కారణంచేత కలియుగంలో సంకీర్తనము భగవంతునికి ప్రీతిపూర్వకమైనది.

            ఈ సారాంశం స్కంద పురాణంలో చాతుర్మాస్య మాహాత్మ్యంలో ధృవీకరించబడింది.

         ఈ ప్రపంచంలో శ్రీ హరిని కీర్తించడం మొట్టమొదటి తపస్సు. కలియుగంలో ప్రత్యేకంగా శ్రీ విష్ణువు ప్రీతికొరకు ప్రతి ఒక్కరూ కీర్తనం చేయాలి.

         కాబట్టి, శుకదేవ గోస్వామి చెప్పినట్లు:

     కృతే యద్-ధ్యాయతో విష్ణుమ్ త్రేతాయాం యజతో మఖైః

     ద్వాపరే పరిచర్యాయామ్ కలౌ తద్ హరి కీర్తనాత్ 

సత్యయుగంలో విష్ణువుమీద ధ్యానం చేసిన ఫలితం, త్రేతాయుగంలో విస్తృతముగా చేసిన యజ్ఞాల ఫలితం, మరియు ద్వాపరయుగంలో దేవతార్చన చేసిన ఫలితం కలియుగంలో హరి కీర్తనంతో లభిస్తుంది.” (శ్రీ భాగవత పురాణం 12.3.52)

     మరోమాటలోచెప్పాలంటే , సత్యయుగం మరియు ఇతర యుగాలలో నిర్దేశించబడిన ఆయా సాధనల ఫలితాలు కలియుగంలో కేవలం హరి కీర్తనతో పొందవచ్చు. మరోచోట ఇలా చెప్పబడింది:

     ఒకరు సత్యయుగంలో ధ్యానంతో సాధించేది, త్రేతాయుగంలో యజ్ఞాలు చేయడంద్వారా సాధించేది, మరియు ద్వాపరయుగంలో దేవతార్చనతో సాధించేది కలియుగంలో కేశవుని గురించి కీర్తించడం వల్ల సాధించవచ్చు.(విష్ణు పురాణం 6.2.17)

వ్యాఖ్యానం

               పురాణాలలో ఉన్న వర్ణనలద్వారా మునుపటి యుగాలలో మనుషులు ఇప్పటి మనుషులకన్నా దీర్గాయుష్షు, తపోసంపద, ఆత్మనిగ్రహం, ఆధ్యాత్మిక భావం మరియు వైరాగ్యం ఎక్కువ కలిగి ఉండేవారని మనకు తెలుస్తుంది. తద్వారా, కఠోర తపస్సులు లేదా శాస్త్ర సంబంధిత యజ్ఞములు విస్తృతంగా చేయడానికి వారికి సామర్థ్యం ఉండేది. సహజంగా ఉన్నత సామర్థ్యాలు కలిగిన వారు కీర్తనము వంటి సులభమైన మరియు సాధారణమైన ప్రక్రియ సిద్ధిని పొందటానికి ఉపయోగపడుతుందనుకోరు. అందుకని, ఆ యుగములలో కీర్తనము ప్రచారం చేయబడలేదు. కలియుగంలో, సాధారణంగా మనుషులకు మునుపటి యుగములలో ఉన్న అర్హతలు లేవు. దీనివల్ల ఒక ప్రయోజనం, మనుషులు గర్వితులు కావడానికి యే కారణం లేదు. కీర్తనములో పాల్గొనడానికి కావాల్సిన ప్రాథమిక అర్హత వినయం. ఈ వినయం ఇప్పటి కాలంలో సాధారణంగా ఇబ్బందులతో జీవించే మనుషులలో ఉండడం సహజం. కాబట్టి, మునుపటి యుగములలో చేయదగిన ధార్మిక కార్యాలన్నటి ఫలితాలు వినమ్రతతో కీర్తన చేయడంతో పొందవచ్చు.

      దురదృష్టముచేత, “బిచ్చగాడు కూడా తన వద్ద ఉన్న సొమ్ముతో గర్వించవచ్చు” అనే సామెత ప్రకారం, సరియైన కారణం లేకుండానే ఒకరు గర్విగా మారవచ్చు. ఈ అవినయం జనాలను ఉత్సాహంతో వాస్తవంగా కీర్తనలో పాల్గొనేందుకు అనర్హులను చేస్తుంది. కీర్తనను సాధారణ ప్రక్రియ అనుకొని దానిలో పాల్గొనరు లేదా కేవలం ప్రదర్శనకోసం దానిలో పాల్గొంటారు. అలాంటి డాంబికులు ఇతరులను మెప్పించేందుకు కీర్తన చేస్తారు కానీ భక్తి కార్యమువలె కాదు. ఇదికూడా వారికి ఉపయోగకారమే ఎందుకంటే కనీసం వాళ్లు లౌకిక పాటలు పాడకుండా ఉంటారు కానీ అది ఆశించిన ఫలమైన దివ్య ప్రేమను ఇవ్వదు.

              బ్రహ్మ వైవర్త పురాణంలోని శ్లోకము, కలియుగంలో ధార్మిక సాధనాలైన తపస్సు మరియు యోగము మనము  పరిపూర్ణంగా నిర్వర్తించలేము అని చెప్తుంది. ఎందుకంటే, దీనికి కారణం కార్యనిర్వాహకుడియొక్క అసమర్ధత మరియు ధర్మాన్ని అమలు చేయుటకు అవసరమైన పదార్థాల అనర్హత. కలియుగంలో ధార్మిక కార్యక్రమాలు కీర్తన లేకుండా సంపూర్ణమైనవి కావని దీని అర్థం. కాబట్టి, వాటి ఫలితాలు పొందాలంటే వాటిని కీర్తనతో పాటు చేయాలి. కానీ కీర్తనను వేరే యే ధార్మిక చర్యతో పోల్చలేము. 265వ అనుచ్ఛేదములో వివరించినట్లు అలా చేయడం నామ అపరాధము అవుతుంది. అన్ని సాధనములకంటే కీర్తన ఉన్నతమైనదనియు మరియు ఇతర ధార్మిక చర్యలకు పరిపూర్ణత కలిగించడానికి అది అవసరమైనదని అర్థం చేసుకోవాలి.

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    జీవితంలో విజయం సాధించడానికి ఇతరుల సహాయం మనకి కావాలి. అంటే ఇతరులను మనం నమ్మాలి. కానీ అనర్హమైన వారిని మనం నమ్మకూడదు.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.