రాగ ద్వేషముల సమస్యకు పరిష్కారం

Articles by Satyanarayana DasaComments Off on రాగ ద్వేషముల సమస్యకు పరిష్కారం

అనురాగము మరియు పగ(ద్వేషము) మానవుడు అనుభవించే భావములలో ప్రధానమైనవి. ఈ రెండూ అవిద్య(ఆత్మ జ్ఞానం మరియు భవగవంతుని జ్ఞానం లేకపోవడం) వలన కలుగుతాయి.

యోగ సూత్రము(2.3)లో, పతంజలి మహర్షి, అవిద్య వలన మనిషి భౌతిక మనస్సు మరియు శరీరంతో తాదాత్మ్యం చెంది ఉండటము వలన రకరకాల వస్తువులపై లేక పరిస్థితులపై అనురాగము మరియు పగను పొందుతాడు అని వివరిస్తాడు. ఇది సర్వ జీవులకు మూల వ్యాధి. భగవద్గీత(3.35)లో శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని ఇంకా ఇలా వివరిస్తాడు. “ఇంద్రియములకు ఉన్న అనురాగము లేదా ద్వేషము ఇంద్రియ విషయములపై ఆధారపడి ఉంటాయి. మనిషి అలాంటి అనురాగము లేదా ద్వేషములలో ఊగిసలాడకూడదు ఎందుకంటే అవి ఆధ్యాత్మిక సాధకునికి అడ్డంకులు”.

ఇక్కడ ఇంద్రియములనగా ముఖ్యంగా జ్ఞానేంద్రియాలని అర్థం. ప్రతి ఇంద్రియానికి అనురాగం మరియు ద్వేషము ఉన్నాయి. వీటిని అదుపులో ఉంచకపోతే ఆధ్యాత్మిక పురోగతికి ఇవి అడ్డంకులవుతాయి. ఉదాహరణకు, తీపి ఆహారం మీద ఆసక్తి నియంత్రించుకోలేకపోతే అది ఒకరి ఆరోగ్యం, క్రమ శిక్షణ మరియు ఆధ్యాత్మిక సాధన మొదలగు వాటికి సమస్యగా మారుతుంది.

ఈ ఐదు ఇంద్రియములలో జిహ్వ(నాలుక)ను నియంత్రించడము చాలా కష్టతరం. భాగవత పురాణం(11.8.21)లో చెప్పబడినట్లు, ఒకరు నాలుకను నియంత్రించగలిగితే, ఇతర ఇంద్రియాలను సులభంగా నియంత్రించవచ్చు, కాని నాలుక నియంత్రణలో లేకపోతే, ఇతర ఇంద్రియములు కూడా అదుపులో లేనట్లే.

ఆహారం అనేది జీవించడానికి ముఖ్యం అందువల్ల రుచిమీద అనుబంధం తీవ్రంగా ఉంటుంది. బాహ్య ఇంద్రియాలన్నిటికి రాజు మాత్రం మనస్సు- ఇది జ్ఞానేంద్రియము మరియు కర్మేంద్రియము వలె పనిచేసే మన అంతః కరణము. అందువల్ల దీనిని గమనించడం, అర్థం చేసుకోవడం, అదుపులో ఉంచడం చాలా కష్టం. మనస్సు యొక్క అనురాగము మరియు ద్వేషం బాహ్య ఇంద్రియాల కంటే ప్రమాదకరమైనవి.

అనురాగము మరియు ద్వేషము ఒకే నాణెముకు ఉన్న బొమ్మ బొరుసు లాంటివి, కావున అవి కలిసి ఉంటాయి. భగవద్గీత(3.37-39)లో కృష్ణుడు మనిషికి ఈ రెండూ నిజమైన శత్రువులు అని చెప్తాడు. ఇంద్రియ నిగ్రహణతో వాటిని నియంత్రించాలని చెప్తాడు, కానీ భగవద్భక్తి అనుగ్రహం లేకుండా ఇంద్రియ నిగ్రహణ అసాధ్యం(గీత 2.59). భక్తితో కాకుండా ఇంద్రియాలను నియంత్రించాలని ప్రయత్నిస్తే యాతన మాత్రమే ప్రాప్తిస్తుందని బ్రహ్మదేవుడు భాగవతం(10.14.4)లో చెప్పాడు.

రాగద్వేషముల సమస్యను భక్తి సమూలంగా పరిష్కరిస్తుంది. చేతనమైన భక్తి యొక్క అంతరంగ శక్తిని ఆత్మలో ప్రవేశింపచేయుట వలన మూల కారణమైన అవిద్య తొలగుతుంది. భక్తి యొక్క అంతరంగ శక్తి లేకుండా అవిద్యను తొలగించలేము. చేతనం కలిగిఉన్న జీవుడు అవిద్యకన్నా శ్రేష్ఠుడైనప్పటికీ పరమాణుడగుటచేత అవిద్యచే ప్రభావితుడగుచున్నాడు. జీవుడు భక్తిని పొందినప్పుడు అవిద్య తన అధికారం కొనసాగించలేదు.

కానీ రాగద్వేషములు ఉన్న వ్యక్తికి భక్తి దుర్లభము. అంటే అవిద్య వ్యాధి ఉన్న మనిషి దాని చికిత్సకి అనర్హుడు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? బద్ధుడైన జీవుడు అవిద్యనుండి విముక్తి పొంది తన స్వరూపంలో ఎలా ఉండగలడు?

ప్రాధమికంగా భగవంతుని గురుంచి తెలియకపోవడమే అవిద్య. భగవంతుని అర్చవిగ్రహ రూపంలో పూజించడము ఆయనను తెలుసుకొనుటకు వేగవంతమైన సాధనం అని ఆవిర్హోత్ర ఋషి భాగవతం(11.3.47)లో సిఫారసు చేసాడు. ఇది క్రమేపి అన్ని జీవులలో భగవంతుని ఉనికిని చూడడానికి దారితీస్తుంది. మనం ఇతరులలో కూడా పరమ పురుషుడిని చూస్తే ద్వేషానికి తావే ఉండదు. భగవంతుని అర్చవిగ్రహ రూపంలో పూజిస్తూ, ఇదే భగవంతుడు అన్ని వస్తువులలో మరియు మనుషులలో ఉన్నాడని అర్థంచేసుకుంటే మన ద్వేషము సహజంగానే అదృశ్యమౌతుంది. నాణెములో బొమ్మ లేకుంటే బొరుసుకూడా లేనట్లే వస్తువులపై మనకున్న అనురాగం కూడా ఉండదు.

ఇదే విషయాన్ని శ్రీమద్భాగవతం(3.29.25)లో కపిల భగవానుడు తన తల్లి దేవహూతికి ఇలా బోధిస్తాడు. “నన్ను అన్ని జీవుల హృదయాలలో ఉన్న ఈశ్వరునిగా ఒకరు ప్రత్యక్షంగా గ్రహించనంత కాలం, అతను నిర్దేశించిన ధర్మమును నిర్వర్తిస్తూ నన్ను అర్చవిగ్రహ రూపంలో ఆరాధించాలి.” ఇక్కడ జీవుడు ఉత్తమ భక్తికి అనర్హమవుటవలన నిర్దేశించిన ధర్మముమీద ఆధారపడమని చెప్పబడింది.

శ్రీ నారద ముని ప్రకారం, త్రేతా యుగంలో ప్రజలు ఒకరిమీద ఒకరు ద్వేషంతో ఉండడం మొదలవడంవల్ల ఋషులు దేవతార్చన ప్రచారం చేశారు(భాగవత పురాణం 7.14. 39). దీనికి ముందున్న సత్యయుగంలో ప్రజలు ద్వేషరహితంగా ఉండేవారు. కాలానుక్రమేణ మనుషులు లోభానికి గురై ఆస్తులను స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టాక రాగ ద్వేషములచేత ప్రభావితులయ్యారు. దీనిని నివారించుటకు ఋషులు దేవతార్చన ప్రచారం చేశారు. మనిషి ఇతర జీవుల పట్ల ద్వేషభావం విడవకుండాఉంటే దేవతార్చన సఫలం కాదని నారదుడు చెప్తాడు. కపిలదేవుడు కూడా భాగవత పురాణం(3.29.21,24)లో ఇదే చెప్తాడు . మనం ఇతరులపట్ల ద్వేషం కలిగిఉన్నాము కనుక, భగవతార్చన చేయాలి కానీ మనకు ద్వేషభావం ఉన్నంతవరకు అర్చన సఫలం కాదు. మరి ఇది ఎలా పనిచేస్తుంది?

దేవతార్చన మనిషి హృదయాన్ని శుభ్రం చేయడం ప్రారంభిస్తుందని శ్రీ కపిలదేవుడు చెప్తాడు(భాగవత పురాణం 3.29.25). ఇది ఒకరి రాగ ద్వేషములను కొంతవరకు నిరోధిస్తుంది, దానివల్ల అర్చావిగ్రహంలో ఉన్న భగవంతుడు అందరిలో ఉన్నట్లు గుర్తించగల సామర్థ్యము మెల్లగా అభివృద్ధి చెందుతుంది.

దురదృష్టకరంగా, నేను భక్తులలో ఒక సామాన్య సమస్య చూసాను. వారు తమకు వేరే వారి మీద ద్వేషము ఉన్నట్లు గ్రహించరు, గ్రహించినా అంగీకరించరు. అపక్వతకారణంగా, వారు ద్వేషాన్ని జయించి పురోగతి సాధించినట్లు అపోహలో ఉంటారు. కావున వేరే వారి మీద ద్వేషము(ఇది సాధారణంగా అసూయ లాగ మారుతుంది)ను ఒకరు గుర్తించడానికి అంతర్దర్శనం, నిజాయితి మరియు వినయత చాలా అవసరం.

దేవతార్చన ఒక ప్రామాణిక గురువు ఉపదేశంతో చేయవలెనని గుర్తించవలెను. ఆవిర్హోత్ర ఋషి కూడా భాగవత పురాణం(11.3.48)లో ఇదే చెప్తాడు. భగవద్భక్తుని సాంగత్యం వలన శ్రద్ధ కలిగి, సాంప్రదాయ భక్తి మార్గములో ఒక గురువుని స్వీకరించినప్పుడు శ్రీ కృషుని దేవతార్చన ఒకరు ప్రారభించవచ్చు. మొదట్లో బాహ్యదృష్టి ఉండుటచేత ఆ భక్తుడు కృష్ణుడి ఉనికిని అర్చనారూపంలో చూడలేడు. కానీ, శ్రద్ధ కలిగి ఉండుటచే అర్చన కొనసాగిస్తాడు. క్రమేణ, స్వయం ప్రకాశమైన అంతరంగ శక్తి ప్రభావం వల్ల శ్రీ కృష్ణుడు మరియు అర్చనవిగ్రహము ఒకటే అని ద్రువీకరణం కావడము వల్ల వెంటనే తన రాగ ద్వేషములనుండి విముక్తుడౌతాడు. దీని పర్యవసానంగా అన్ని జీవులలో కృష్ణుని ఉనికిని చూడగలడు.

ఇది ప్రేమ మరియు సహకారం మార్గముగా ఉన్న వైష్ణవ ధర్మము యొక్క అద్వితీయమైన గొప్పదనం. అహంకారం, ద్వేషము, ఈర్ష్య మరియు అసూయలకు ఇక్కడ తావు లేదు.

మర్యాద అనేది అన్ని జీవులకు ఇవ్వదగినదే కానీ శరీరంలో వ్యక్తమైన చేతన ప్రమాణాన్ని బట్టి దాన్ని తెలియచేయాలి. అందువల్ల, ఒక కుక్కని మరియు వైష్ణవుడిని ఒకేలా ఆదరించకూడదు. నేటి సామాజిక వాతారణంలో ఎలాంటి వివక్షయైనా దూష్యమైనదియు మరియు అందరూ సందేశరహితంగా మరియు బేషరతుగా సమానంగా ఆదరించబడాలనియు ఒక విస్తారమైన దృక్పథం ఉంది. కానీ ఇది నిజమైన జ్ఞానానికి లక్షణం కాదు. వివేకము వాడకుండా ఉండటం చాలా సులభతరం మరియు దానికి సూక్ష్మ బుద్ధి అవసరం లేదు. ఒక పిచ్చివాడు తన బుద్ధి కోల్పోయినందున అందరిని ఒకేలా ఆదరిస్తాడు. బుద్ధి యొక్క ధర్మము సత్యాసత్యములను, తప్పొప్పులను మరియు ఉన్నతాధములను గుర్తించుట. మన వ్యవహార శైలిలో కూడా మనం అందరిని ఒకేలా ఆదరించము. ఒక దేశ అధిపతి సందర్శనానికి వస్తే, అతనికి ప్రత్యేక ఆదరణ లభిస్తుంది. ఇది సాధారణంగా ఉన్న వ్యవహార శైలి.

శ్రీమద్ భాగవతం(3.29.28-33)లో కపిల భగవానుడు గౌరవ స్థాయికి ప్రాతిపదికగా ఉనికి మరియు చేతన అని వివరిస్తాడు. ఈ సోపానపంక్తిలో అందరికన్నా పైన ఉన్నది భగవంతుడు, ఆయన్ని ప్రత్యక్షంగా తెలిసికొన్న వారు తరువాత అత్యంత పరిణతి చెందినవారు. ప్రతి జీవికి దాని స్థాయిని బట్టి గౌరవం ఇవ్వాలని ఉన్నప్పటికీ, వైష్ణవులు సర్వదా పూజ్యులు. వారిని నొప్పించకుండా అప్రమత్తంగా నడుచుకోవాలి. ఈ చర్చను భాగవతం(3.29.34)లో శ్రీ కపిలుడు, భగవంతుడు అందరిలో తన పాక్షిక అంశలైన ఆత్మగా మరియు, ఆత్మని నియంత్రించే పరమాత్మలా ఉన్నాడని తెలుసుకొని అందరినీ లోపల గౌరవించాలని సారాంశంగా చెప్పి ముగిస్తాడు.

శ్రీమద్ భాగవతముయొక్క మూలసూత్రం ప్రకారం అద్వయమగు సంపూర్ణ తత్త్వం ఒక్కటే, అది పలురకాలుగా ప్రకటితమౌతుంది. ఆ తత్త్వం తన సంపూర్ణ స్వయం శక్తులతో ఉన్నప్పుడు దానినే భగవంతుడు, అద్వయ వ్యక్త సంపూర్ణుడు అంటారు. ఆయన ఆరాధనకు మరియు ఆదరణకు అంతిమ లక్ష్యం. ఆయన నుండి స్వతంత్రంగా ఏది లేదు. అందుకని అన్ని వస్తువులు సహజంగా ఆయనతో సంబంధించి ఉండడంచేత గౌరవప్రదమైనవి. ఒకరు ఆయనపై భక్తితో ఎంత దగ్గరైతే అంత ఆదరణకు వారు అర్హులు.

భక్తి ఆరంభంలో, ఈ ఆదరణని సూత్రాత్మకంగా భగవంతుని ఉనికి అన్నిటిలో ఉందని అంగీకరించి ఉపయోగించాలి. దీనివల్ల, సాధకుడు రాగ ద్వేషములనుండి విముక్తి పొందుతాడు. ఈ మార్గంలో సాధన కొనసాగించేకొద్దీ, సాధారణంగానే భగవంతుని మహత్వం అన్నిటిలో తెలుసుకొని వాటికి తగిన ఆదరణ ఇస్తాడు. భగవంతుని ఆధారంగా కాకుండా చూపించే ఆదరణ లేక సానుభూతి బంధమునకు కారణములౌతాయి. ఇది మనకు భాగవతంలోని ఐదవ స్కంధములో ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న భరత మహారాజు కథ వలన విదితమౌతుంది. ఒక జింక పిల్లపై ఉన్న మమకారం చేత ఆయన తన తర్వాతి జన్మలో ఒక జింకగా జన్మించాడు. అప్పుడే జన్మించిన జింక పిల్ల గంఢకీ నదిలో పడిపోకుండా కాపాడి దానిని చేరదీయడం ఆయన చేసిన తప్పు కాదు. కానీ, ఈ క్రమంలో దాని మీద ఆసక్తితో తన సాలగ్రామ పూజను వదిలేయడం తన పొరపాటు. కావున ఇతర జీవులను పరమాత్మ అంశలుగా, మరియు ఆయన వారి హృదయాలలో నివసిస్తున్నట్లు భావిస్తూ వారిపై ఎల్లప్పుడూ కరుణతో ఉండాలి.

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    చాలామంది భౌతిక విషయాలలో చాలా చాకచక్యంగా ఉంటారు కానీ ఆధ్యాత్మికవిషయాలలో మందకొడిగా ఉంటారు. కొంతమంది ఆధ్యాత్మిక విషయాలలో చాకచక్యంగా ఉండి భౌతికవిషయాలలో మందకొడిగా ఉంటారు. రెండు విషయాలలో నేర్పుగా ఉండడం కోరదగినది, కానీ ఒకవేళ రెండింటిలో ఏదోఒకదాన్ని ఎంచుకోవలసివస్తే రెండవది ఉత్తమము.

    — ,Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.