వాసుదేవః సర్వం ఇతి

Articles by Satyanarayana DasaComments Off on వాసుదేవః సర్వం ఇతి

                       మనము పుట్టినప్పుడు, చాలా చిన్నగా, తేలికగా కేవలం ఒక అడుగున్నర మాత్రమే పొడుగ్గా ఉంటాం. సంవత్సరాలు గడిచే కొద్దీ, మనము ఎంతగా పెరుగుతామంటే చిన్ననాటి ఫోటోని మనమే పోల్చుకోలేనంతగా. మనలోని ఈ మార్పు రాత్రికి రాత్రి జరిగింది కాదు. ఇది ఎన్నో సంవత్సరాల కొద్దీ జరిగిన నిరంతర ప్రక్రియ వల్ల సంభవించిన ఫలితము. సంవత్సరాల కొద్దీ జరిగిన మార్పు నెలలకొద్దీ జరిగాయి. నెలల కొద్దీ జరిగిన మార్పులు రోజుల కొద్దీ జరిగాయి. రోజుల కొద్దీ జరిగిన మార్పులు గంటల కొద్దీ జరిగాయి. చివరగా చెప్పాలంటే, మార్పనేది మనం చూడలేకపోయినా   ప్రతి సెకండుకీ, ప్రతి గడియకు  నిరంతరం ప్రతి నిత్యం జరుగుతూనే ఉంటుంది.

                   ప్రతి గడియకు మారేదాన్ని “స్థిరమైనది” అని అనలేము. అలా మారేదాన్ని నిర్వచించడం కూడా సులభతరం కాదు. ఇక్కడ మనకు ఉపయోగపడేది ఆ మారే వస్తువులో స్థిరమైన లక్షణాలకై  వెదకడం. మన శరీరం మొత్తం ఒక్క సారే మారదు. ఉదాహరణకు ఘడియ ఏ నుండి ఘడియ బి వరకు కొన్ని మార్పులు జరుగుతాయి, కొన్ని స్థిరముగా ఉంటాయి, మిగతావి ఘడియ బి నుండి సి వరకు జరుగుతాయి. ఈ సంకులము వల్ల   మనం మన దేహాల్లో సంవత్సరాల తరబడి, నెలల తరబడి, రోజూ జరిగే మార్పులను గుర్తించడం సులభతరం అవుతుంది.

              మనలో ఈ మారిన స్థితులన్నింటినీ కలిపేది ఏదైనా ఉందా?. అవును మన ఉనికి గురుంచి మాట్లాడేటప్పుడు అదే మనం మాట్లాడేది. మనం  ఉన్నామనే ఈ భావన చాలా ప్రాధమిక స్థాయిలో క్రియా పదం “ఉండటం” (ఇది “ఉంది”, “ఉన్నాను”, ” ఉన్నాము” వంటి పదాల)చేత చెప్పబడుతుంటుంది. మన ఉనికి మార్పుకు ముందు మరియు తర్వాత స్థితులలో ఉంటుంది. ఒక వస్తువు గుర్తుపట్టలేనంతగా మారినప్పటికీ, దాని ఉనికి అనేది మారదు.  అది అలానే ఉంటుంది.

          ఉండటం అనేది భగవంతుని అస్తిత్వ శక్తి(సత్శక్తి)కి ప్రతీక. ఇది ఉనికి యొక్క సర్వ వ్యాప్త సారాంశం. ఈవిధంగా, ప్రపంచంలో రెండు రకాల సూత్రాలను మనచుట్టూ మనం చూస్తాము. ఒకటి మనల్ని సంబ్రమాచ్ఛార్యాన్ని కలుగ చేసే, ఎల్లప్పుడూ మారుతుండే “సంసారం”, రెండవది ఎప్పటికినీ మారని ఆధార సూత్రం : వాసుదేవ – దేనిలోనైతే అన్ని ఉంటాయో మరియు ఈ ఉనికి అంతటికీ సారాంశమైనది.

                  సంసారంలో మనం మన భౌతిక శరీరాన్ని మన చుట్టూ ఉండే ప్రపంచంతో వేరుచేసి చూస్తాము. కాని నిజానికి, మన భౌతిక శరీరానికి మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మధ్య ఏమి అంతరం లేదు. ఈ రెండునూ ఒకే రకమైన పదార్థాలర్ధంతో తయారయైనవే. శ్రీకృష్ణుడు ఈ పదార్థాలను “వేరు చెయ్యబడ్డ శక్తి”, భిన్న ప్రకృతి ( శ్రీమద్ భగవద్గీత 7. 4), అని అవి నిరంతర మార్పుకు లోనయ్యేవి అని చెప్తారు. ఈ మార్పు అనేది, స్థిరమైన, ఎప్పటికీ మారని జీవమనే ఆధార సూత్రం చుట్టూ తిరుగుతుంటుంది.

               ఈ భౌతిక శరీరం మరియు సంసారమనే ప్రపంచం జీవమనే చైతన్య శక్తి లేకుండా ఉండలేవు. అందుకే జీవము ఈ ఉనికికి సారాంశం మరియు యజమాని అయిన వాసుదేవ అని  చెప్పబడుతుంది . జీవము విష్ణువులో ఒక భాగం మరియు ఆయన లేకుండా ఉండలేదు. అందుకే , అంతిమ వాసుదేవుడు విష్ణువే. 

       సంసారము యొక్క ఈ మారుతున్న స్థితి గతులు పూర్తిగా వాస్తవమైనవి కావు. దీన్ని అర్ధం చేసుకొనే తర్కం ఈ విధముగా ఉంది: ప్రస్తుత క్షణానికి ముందు మరియు తరువాత ఒకటి ఉండిఉంటే, ఈ క్షణాన అది ఉండటం అనేది పూర్తిగా నిజం. ఈ క్షణాన ఉండేది ఏదైనా పూర్వం, లేదా ఆ తర్వాత   లేకుండా   ఉంటే అవి  వాస్తవమైనవవి కావు. ఈ అంశాన్ని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి బోధించాడు. “గతం లో ఉనికిలో లేని, భవిష్యత్తులో ఉనికిలో ఉండనిది ఏదైనా మధ్యలో ఉండనే జాలదు. అది కేవలం పేరులోనే ఉండగలదు”(శ్రీమద్ భాగవతం 11.28.21).   

           సంసారములో వ్యక్తమయ్యేవి,  వాటి సృష్టికి ముందు ఉండవు అలానే నాశనము తర్వాత ఉండవు, అంటే దానర్థం అవి ప్రస్తుతం కూడా ఉండవు . కేవలం భగవంతుడు మాత్రమే ఈ అన్ని సృష్టులకు  ముందు మరియు వాటి నాశనం తర్వాత ఉంటాడు. అందుకే ఆయన ఒక్కడే నిజమైన వాడు. ఆయన బ్రహ్మ దేవునికి దీని గూర్చి ఈ విధంగా వివరించాడు: ” ప్రారంభములో, నేను ఒక్కడినే ఉన్నాను, సత్, అసత్ , వాటికి పరమైన వాటితో సహా వేరెవ్వరూ లేరు.  దాని తర్వాత , ఈ విశ్వమంతటిలోనూ మిగిలేది నేనే “. ( శ్రీమద్ భాగవతం 2. 9. 35.).

              అందుకే, వాసుదేవుడు మాత్రమే నిజమైన వాస్తవము. ఆయన లేకుండా ఏ  ఇతర వ్యక్తీకరణలు ఉండనే జాలవు . వాస్తవానికి, ఆయన  ఈ అన్ని వ్యక్తీకరణల యొక్క సారాంశం. ఈ కారణంగానే శ్రీకృష్ణుడు అర్జునతో ఇలా అంటాడు , “చాలా జన్మల తరువాత, ఒక వ్యక్తి నన్ను శరణు వేడతాడు ఎందుకంటే అతను జ్ఞానం సంపాదించి,‘ వాసుదేవుడు సర్వస్వం ’ అని అర్థం చేసుకొంటాడు. అలాంటి  గొప్ప వ్యక్తి చాలా అరుదు.” (భవద్గీత  7.19) అటువంటి జ్ఞానం లేని వారు  కేవలం మారుతున్న సంసారము, భౌతిక ప్రపంచాన్ని మించి ఏమీ చూడలేరు. వారు ఈ భౌతిక ప్రపంచానికి మూలం మరియు పోషకుడు  వాసుదేవుడు అని అర్థం చేసుకోలేరు. ఆయనే ఈ ప్రపంచంగా  వ్యక్తమవుతాడు అనే వాస్తవాన్ని వారు గమనించలేరు.

                మనము మన  మనస్సుల ద్వారా ప్రపంచాన్ని గ్రహిస్తాం. మనం వాసుదేవుడి నుండి స్వతంత్రంగా ఉన్నామని అనుకున్నంత కాలం మనం ప్రపంచాన్ని వాసుదేవునిగా చూడలేము. దానికి  బదులుగా, మనం దానిని ఆయన నుండి వేరుగా చూస్తూ, మనం సొంత యజమానులుగా భావిస్తూ దోచుకొనే ప్రయత్నం చేస్తాము. ఏదేమైనా, ఈ ప్రపంచ దృక్పథం సరియైనది కానందున, ప్రపంచాన్నినియంత్రించడానికి మరియు ఆస్వాదించడానికి మనం చేసేన  ప్రయత్నాలు నిష్ఫలంగా మరియు నిరాశపరిచేవిగా మిగిలి పోతాయి.

             మనల్ని మనం భౌతిక శరీరంగా మాత్రమే భావించినప్పటికీ , మన భౌతిక ఉనికి విస్తారమైన ప్రకృతి మొత్తంలో ఒక స్మూక్ష్మ  భాగం మాత్రమే అని మనం చూడగలగాలి.  ఈ స్మూక్ష్మ భాగం, మొత్తాన్ని ఎలా నియంత్రించ గలదు లేదా ఆస్వాదించ గలదు?.  దీనికి  విరుద్ధంగా, ఒక భాగం మిగతా మొత్తానికి  సేవ చేయడానికి మాత్రమే ఉద్దేశించబడింది. ఈ ఆధార సూత్రాన్ని తలక్రిందులు చేయడానికి చేసే మన ప్రయత్నాలు విఫలమే అవుతాయి .

            అయినప్పటికీ, ఎవరైతే శ్రీకృష్ణునికి  అనుకూలమైన మనస్తత్వంతో ఉంటారో వారు  ఈ  వాస్తవికతను సరిగ్గా చూడగలిగి దాని  అనుభూతి పొందగలరు. అందుకే  శ్రీకృష్ణుడు ఆయన్ని అర్థం చేసుకోవడానికి భక్తి  అనే మానసిక స్థితి ఆవశ్యమని చెప్తాడు (భగవద్గీత  18.55). అలాంటి వ్యక్తులు ప్రతి వస్తువులో, ప్రతిచోటా వాసుదేవుని చూడటం ప్రారంభిస్తారు. వారు ప్రపంచాన్ని వాసుదేవుడి నుండి వేరుగా చూడరు. వారికి “వాసుదేవః సర్వం” అనే  దృష్టి ఉంటుంది.

               మనం వారి దృష్టిని ఒక పోలిక ద్వారా అర్థం చేసుకోవచ్చు. కాంక్రీటును విక్రయించే ఒక వ్యాపారవేత్త, ఉదాహరణకు, మట్టిని కేవలం మట్టిగా ఇసుకను కేవలం ఇసుకగా చూడడు, అతను వాటిని డబ్బుగా చూస్తాడు. చూడడానికి మనకు, అతను ఇసుకతో వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ అతనికి డబ్బుతో వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంది . అదేవిధంగా, శ్రీకృష్ణుని యొక్క భక్తుడు భౌతిక ప్రపంచాన్ని ఒక సాధారణ వ్యక్తిలాగే అదే కళ్ళతో చూస్తాడు. కానీ అతని మనస్తత్వం కారణంగా, ఆ కళ్ళు అతనికి ప్రతిచోటా వాసుదేవుడిని చూపిస్తాయి.

                       ప్రతిచోటా వాసుదేవుడిని చూడటానికి అనుకూలమైన మనస్తత్వాన్ని పెంపొందించడంలో మనకు సహాయపడటానికి శ్రీకృష్ణుడు శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయం  ఉపదేశించారు. ఆ అధ్యాయంలో కృష్ణుడు వివరించే విషయాలపై అవగాహనతో భక్తిని అభ్యసించడం వల్ల ప్రతిదీ వాస్తవానికి వాసుదేవడని  – వాసుదేవః సర్వం అని బోధపడుతుంది .

 

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    మీరు యౌవనంలో ఉన్నప్పుడు అన్నీ తింటారు. మీరు వృద్ధాప్యంలో అన్నిటికీ దూరంగా ఉంటారు.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.