ఈ క్రింద ఇవ్వబడినవి నామరస దాస పోడ్కాస్ట్ ముఖాముఖి సందర్భములో ఒక ప్రశ్నకు బాబాజీ ఇచ్చిన సమాధానము.
ప్రశ్న: శ్రీకృష్ణుడు భగవద్గీతలో “ఓ పార్థా, నన్ను శరణువేడిన వారు పుట్టుకతో అధములైన స్త్రీ, వైశ్య మరియు శూద్రులైనప్పటికీ నా పరంధామమును పొందగలరు” అని అన్నారు ( శ్రీమద్ భగవద్గీత 9.32). ఈ వర్గాలకు చెందిన వారు బ్రాహ్మణుల వలే అధ్యయనం చేయుట అలవాటు లేనివారు, మరైతే భక్తికి అధ్యయనము చేయడం అనేది మార్గం ఎలా అవుతుంది? అందుకే మహావదాన్యుఁడు అయిన శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణ ప్రేమను మహా మంత్రము ద్వారా అందరికీ ఇచ్చారు, అధ్యయనం ద్వారా కాదు. ఎందుకంటే ఆయన తన కరుణతో భక్తి అనేది అధ్యయనం చేయగల బ్రాహ్మణులకే కాకుండా జనులందరికీ దొరికేటట్లు చేయాలనుకున్నారు.
జవాబు : నా ముఖాముఖి సందర్భముగా నేను శ్రీ చైతన్య మహాప్రభుచే వ్యాపింపచేయబడ్డ భక్తి అనే దాన్ని అర్థము చేసుకోవాలన్న అది కేవలం గోస్వాములు రచనల ద్వారా మాత్రమే సాధ్యమని అన్నాను. మీరు మహాప్రభువు ఉత్తమ భక్తిని వ్యాపింపజేశారని మరియు శ్రీల రూప గోస్వామి మరియు సనాతన గోస్వాముల వారిని గ్రంథ రచన చేయమని కోరారని నేను చెప్పేదానితో ఏకిభవిస్తారు. శ్రీ చైతన్య మహాప్రభువుల వారు వ్యాపింపచేసిన భక్తి ఈ భువిలోని జనులకు మునుపెన్నడూ తెలియనిది అని అందరికీ తెలిసిందే. అనర్పితచరీమ్ చిరాత్ శ్లోకము దానికి రుజువు. దాన్ని బట్టి ఉత్తమ భక్తి అనే దాన్ని అర్థము చేసుకోవడం పండితులైన వారికి కూడా కష్టమని మనం అర్థము చేసుకోవచ్చు, ఎందుకంటే అది భౌతికమైనది కాదు కనుక. మనకు దాని గూర్చి ఎటువంటి అనుభవము లేదు. మనం ఏదైనా కొత్త విషయం గూర్చి అనుభవ పూర్వకముగా అర్థము చేసుకొంటాము. ఉత్తమ భక్తి విషయములో మనకు పూర్వ జన్మలో వాసన ఉంటే తప్ప ఎటువంటి అనుభవము లేదు. మనం దానిని ప్రత్యక్షముగా స్వీయ అనుభవం ద్వారా పొందటం అసంభవం ఎందుకంటే ఉత్తమ భక్తుల కృపచే మాత్రమే పొందగలం కనుక. అందుకే శ్రీ జీవ గోస్వాముల వారు ఇటువంటి భక్తిని “మహా దుర్బోధమని” అంటే అర్థము చేసుకొనుటకు మిక్కిలి కష్టమైందని అంటారు ( భక్తి సందర్భం, అనుచ్ఛేదము 165). శ్రీ రూప గోస్వాముల వారు భక్తికి గల ఆరు లక్షణాలలో సుదుర్లభం, “పొందటానికి కష్టమైనది” అనే దాన్ని చేర్చారు ( భక్తి రసామృత సింధువు 1.1.17).
మనం ఒక మార్గాన్ని అనుసరించాలంటే దాని గూర్చి సరైన అవగాహన ఉండాలనే విషయములో మీరు నాతో అంగీకరిస్తారు. మనం మార్గాన్ని లేదా దాని విధమును సరిగ్గా అర్థము చేసుకోపోయినట్లయితే దాన్ని సరిగ్గా అనుసరించలేము. దాన్ని మనం సరిగ్గా అనుసరించలేకపోతే మనకు సరిగ్గా రావాల్సిన ఫలితము రాదు. ఇది నా అభిప్రాయము మరియు అనుభవము కూడా.
మీ అభ్యంతరము భగవద్గీతలోని శ్లోకం (9.32) మీద ఆధారమైనది. నేను ఇక్కడ ప్రస్తావించదల్చుకున్నది ఏమిటంటే ఈ శ్లోకం వర్ణాశ్రమ ధర్మము సరిగ్గా నడుస్తున్న కాలములో చెప్పబడినది. మీరు ఇక్కడ ఆ శ్లోకాన్ని వినియోగించడం అర్ధరహితము. ఈ ఆధునిక సమాజములో చదువు మీద ఎటువంటి నిర్బంధము లేదు. మీ ప్రశ్న “ఈ వర్గాలకు చెందిన వారు బ్రాహ్మణుల వలే అధ్యయనం చేయుట అలవాటు లేనివారు, మరైతే అధ్యయనము చేయడం అనేది భక్తికి మార్గం ఎలా అవుతుంది?”లో ఇక్కడ బ్రాహ్మణులు అనే పదం అంటే ఏమిటి? శాస్త్రాధ్యయనములో నిమగ్నులైన బ్రాహ్మణులు ఎక్కడ ఉన్నారు. నా దగ్గర అధ్యయనము చేస్తున్న విద్యార్థులలో ఎక్కువమంది స్త్రీలు, బ్రాహ్మణులు కాదు. అందువల్ల మీ అభ్యంతరం చెల్లనది మరియు నేడు వాడుకలో లేనిది.
భక్తిని అర్థము చేసుకోవడానికి శాస్త్రాన్ని చదవాల్సిన అవసరం లేదు అనే అభ్యంతరం సరైనది అయినట్లయితే అది జరుగుతుండం నేను చూడాలనుకొంటున్నాను. నాకు సరైన భక్తి శాస్త్రముల అధ్యయనము లేకుండా భక్తి మార్గము మరియు లక్ష్యము గూర్చి పూర్తి అవగాహనతో ఉన్నవారిని చూపించండి. నా స్వానుభవములో అటువంటి వారిని నేను చూడనే లేదు. దానికి బదులుగా నేను దశాబ్దాలుగా సాధన చేస్తూ మరియు ఉత్తమ భక్తి గూర్చి సరైన అవగాహన లేని ఎంతోమంది భక్తులను నేను చూసాను. నామ, నామ అభాస, నామ అపరాధము వంటి చిన్న చిన్న విషయాల గూర్చి కూడా జనులు గందరగోళ పడుతుంటారు. నేను ఇక్కడ ఏవో కొన్ని శ్లోకాలను ఉచ్చరించడం గూర్చి మాట్లాడం లేదు, మార్గం మరియు లక్ష్యము గూర్చి పూర్తి అవగాహన కలిగి ఉండటం గూర్చి మాట్లాడుతున్నాను.
ఇంకాచెప్పాలంటే భగవద్గీతను వాడి మిమ్ములను మీరే విరోధించుకుంటున్నారు. ఎలా అంటే, శాస్త్రాన్ని చదవాల్సిన అవసరం లేదు అని అనటానికి మీరు శాస్తాన్ని వాడుతున్నారు కనుక. దీన్నే వదతో వ్యాఘాటమంటారు – చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకపోవడం. ఇది ఎలా ఉంటుందంటే ఒకరు తమ నోటితో “నా నోట్లో నాలుక లేదు” అన్నట్లు ఉంటుంది. అది చాలదన్నట్లు మీరు ఒక తప్పును సమర్దించుకోవడానికి శ్లోకాన్ని వాడుకొంటున్నారు. ఆ శ్లోకాన్ని చెప్పిన శ్రీ కృష్ణుని ఉద్దేశ్యం శాస్త్రములను చదవ వద్దు అనేది కాదు. భక్తికి గల గొప్పతనాన్ని చెప్పడం అనేది ఆ శ్లోకం వాడిన సందర్భములోని ముఖ్య ఉద్దేశ్యము. మనం వక్త చెప్పిన ఉద్దేశ్యం కన్నా వేరే అర్థము ఆపాదించు కోరాదు. శ్రీకృష్ణుడు స్వయముగా శాస్త్ర అధ్యయనము ఆవశ్యకతను అన్వయము మరియు వ్యతిరేకమును రెండిటినీ వాడి శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు (శ్రీమద్ భగవద్గీత 16.23-24).
యః శాస్త్ర విధిమ్ ఉత్సృజ్య వర్తతే కామ కారతః
న స సిద్ధిమ్ అవాప్నోతి న సుఖమ్ న పరామ్ గతిమ్
తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ
జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమ్ ఇహార్హసి
“శాస్త్ర విధులను పూర్తిగా మరచి, భౌతిక కోర్కెల ప్రేరేపణతో విచక్షణా జ్ఞానమును మరచి జీవించే వ్యక్తి సుఖాన్ని కానీ పరిపక్వతను కానీ లేక పరమ లక్ష్యాన్ని కానీ పొందలేడు”
“అందువల్ల కేవలం శాస్త్రము మాత్రమే మీకు ఏమి చేయాలో మరియు చేయకూడదో చెప్పే విషయములో ప్రమాణము. మీరు శాస్త్ర నిబంధనలు గూర్చి తెల్సిన తర్వాత మాత్రమే ఏ కార్యములను అయినా తల పెట్టవచ్చు.”
ఇక్కడ మీకు మొదట శాస్త్రమును చదవాలి మరియు దాని తర్వాత ఏదైనా పని చేయాలి అని అనే విధి చాలా స్పష్టం. లేకపోతే మీకు కావాల్సిన ఫలితాన్ని మీరు పొందలేరు. నా ముఖాముఖిలో నేను దీనికి భిన్నముగా ఏమి అనలేదు. నిజానికి నా వాక్యాలకు మద్దతుగా శాస్త్రములను ఉదహరించాను. అందువల్ల మీరు నేను చెప్పినదానితో అంగీకరించక పోతే మీరు శాస్త్రాన్ని కూడా అంగీకరించనట్లే , అది శృతి-శాస్త్ర నిందనము అనే నామాపరాధముగా పరిగణించబడుతుంది.
ఇంతేకాదు, మీరు ఉటంకిస్తున్న గ్రంథములోనే శ్రీకృష్ణుడు శాస్త్ర అర్థమును తెలుసుకొనుటకు ఒక గురువును ఆశ్రయించమని చెప్పారు (శ్రీమద్ భగవద్గీత 4.34).
తద్ విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానిన తత్వ దర్శినః
“ఈ జ్ఞానాన్ని గురువుకు ప్రణమిల్లి, సేవచేసి మరియు జిజ్ఞాసతో అడిగి తెలుసుకోవాలి. సత్యాన్ని తెల్సిన ఆ మహనీయులు ఆ జ్ఞానము గూర్చి మీకు బోధించగలరు”.
ఇక మీ ప్రశ్న రెండవ భాగములో నామమును పలకడంతో కృష్ణ ప్రేమను పంచడము మరియు కేవలం అధ్యయన అభిలాషులైన బ్రాహ్మణులకు ఆ ప్రేమ పరిమితం కాకుండా చేయడములో మహాప్రభువు ఔన్నత్యాన్ని గూర్చి మీరు ప్రస్తావించారు. అధ్యయనం అనేది కేవలం బ్రాహ్మణులకే అని మీరు ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థము కావటం లేదు. మన గోస్వాముల భక్తి రచనలను ఎవ్వరైనా చదవవచ్చు. ఇక్కడ ఇంకోవిషయం ఏమిటంటే, మీరు నాకు అంతటి దయాళువైన మహాప్రభువు తన ఆంతరంగిక అనంగులను వృందావనమునకు ఎందుకు పంపించారో మరియు వారిని భక్తిని గూర్చి రచనలను చేయమని ఎందుకు నిర్దేశించారో చెప్పాలి. అది భక్తులు కాని వారిని ప్రభావితం చేయడానికా? శ్రీ రూప గోస్వాముల వారు మహా ప్రభువు హృదయాన్ని వశము చేసుకున్నవారు. ఆయన భక్తి రసామృత సింధువు లాంటి పుస్తకాన్ని ఎందుకు వ్రాసారు? ఆయన కేవలం నామ జపం మరియు నామ సంకీర్తనం పైన ఏవో కొన్ని పేజీలు మాత్రమే వ్రాసి ఉండొచ్చు కదా, అది సరిపోయేది. గొప్ప గొప్ప ఆచార్యులంతా పుస్తకాలు వ్రాసారు. వారు ఎందుకు వ్రాసారనుకొంటున్నారు? పుస్తకాలు కేవలం ఇతరులకు ఇవ్వడం కోసమేనా? నేనలా అనుకోవడం లేదు. ఈ ఆధునిక సమాజములో భక్తి మార్గములోనికి వచ్చిన వారిలో అధిక సంఖ్యాకులు పుస్తకాలు చదవడం ద్వారా వచ్చిన వారే. వారు ఒక భక్తుని ద్వారా భక్తి గూర్చి తెలుసుకొన్నప్పటికీ దాని గూర్చి పుస్తకంలో చదివిన తర్వాత మాత్రమే నమ్మి ఉంటారు.
నాకు భక్తి అంటే పూర్తిగా తెలియకుండా దాని లక్ష్యాన్ని పొందిన వారి ఉదాహరణలు తెలియదు. కానీ నాకు శాస్త్ర అధ్యయనం చేసి, భక్తి యొక్క లక్ష్యాన్ని పొందిన వారి ఉదాహరణలు తెలుసు. శ్రీకృష్ణుడు ఇలా : శ్రేయో హి జ్ఞానం అభ్యాసాద్ (శ్రీమద్ భగవద్గీత 12.12), ప్రియో హి జ్ఞానినో అత్యర్థం అహం స చ మమ ప్రియః (7.17), బహవః జ్ఞాన –తపసా పూతా మద్ భావమ్ ఆగతాః (4.10), ఏవం యో వేత్తి తత్వతః (4.9) మొదలగునవి అనడంలో ఎటువంటి అతిశయోక్తి అనిపించడం లేదు.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.