శ్రీమద్ భాగవతము కృష్ణునికి భిన్నమైనది కాదు

Articles by Satyanarayana DasaShastraComments Off on శ్రీమద్ భాగవతము కృష్ణునికి భిన్నమైనది కాదు

      శ్రీకృష్ణునికి రెండు రకాల ప్రత్యక్ష స్వరూపాలు ఉన్నాయి, ఒకటి శబ్ద రూపమైన శబ్ద బ్రహ్మము, రెండవది ఆయన వ్యక్తిగతమైన పరబ్రహ్మ రూపము- శబ్ద బ్రహ్మ పరమ్ బ్రహ్మ మమోభే శాశ్వతీ నూ (శ్రీమద్ భాగవతం 6.16.51). మైత్రేయుల వారు విష్ణు భగవానుడు కర్దమ ఋషికి ప్రత్యక్షమైనప్పుడు తన శబ్ద బ్రహ్మ రూపం స్వకీయమైన రూపముగా మారినట్లు చెప్తారు – దర్శయామాస తమ్ క్షత్తః శాబ్దమ్ బ్రహ్మ దధద్ వపుః శ్రీమద్ భాగవతం 3.21.8). విష్ణు భగవానుని చేతిలోని శంఖంమును  కూడా ఆయన శబ్ద బ్రహ్మ రూపానికి ప్రతీకగా  భావిస్తారు. ఇది ధృవుడు చిన్ని బాలుడుగా ఉన్నప్పుడు విష్ణువు ఆయన శంఖంతో దృవుని బుగ్గపై స్పృశించినప్పుడు, ధృవుడు ప్రార్ధన చేయగలగడం ద్వారా మనకు అవగతమవుతుంది. శంఖమును మైత్రేయుడు బ్రహ్మ మాయ అంటారు (శ్రీమద్ భాగవతం 4.9.4).

 అయితే శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణుని ప్రత్యక్ష రూపము. శ్రీ సూత గోస్వామి శ్రీమద్ భాగవతమును “పరమ సత్యాన్ని ప్రకాశింపచేసే దీపం” అంటారు (తత్త్వ-దీపం పురాణం శ్రీమద్ భాగవతం 12.12.68). ఆయన దానిని ”  సర్వోత్కృష్టమైన పరమ సత్యాన్ని తెలిపే వెలుగు” (అధ్యాత్మ-దీపం శ్రీమద్ భాగవతం 1.2.3) అని, ” సర్వోత్కృష్టమైన జ్ఞానాన్ని చూపే శ్రేష్ఠ దీపము”(అతులో జ్ఞాన ప్రదీపః శ్రీమద్ భాగవతం 12.13.19) అని కూడా అంటారు.  శ్రీకృష్ణుడు కంసుని కారాగారంలో తన ముందు ప్రత్యక్షమైనప్పుడు దేవకీ దేవి చేసిన స్తుతిలో ఆయనను “అధ్యాత్మ దీపము” (శ్రీమద్ భాగవతం, 10.3.24) అని సంబోధిస్తుంది. ఈ వ్యాఖ్యానాల ప్రకారం శ్రీమద్ భాగవతం మరియు శ్రీకృష్ణడు అధ్యాత్మ దీపికలని మరియు రెండూ ఒకటేనని మనకు అవగతమవుతుంది. శౌనక రిషి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ సూత గోస్వామి చెప్పే జవాబులో ఈ విషయము తేటతెల్లమవుతుంది.

యోగేశ్వరుడు, బ్రాహ్మణ శ్రేయోభిలాషి, ధర్మ పరిరక్షకుడు అయిన శ్రీకృష్ణడు తన స్వధామమునకు వేగి ఉన్నాడు, ఇక ఇప్పుడు ధర్మము ఎవరి ఆశ్రయమును పొందినదో చెప్పగలరు (శ్రీమద్ భాగవతం 1.1.23). 

ఈ క్రింద చెప్పబడిన సూత గోస్వాముల వారి సమాధానం శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణుని యొక్క ప్రత్యక్ష ప్రతినిధి అని స్పష్టతను ఇస్తుంది. (తత్ ప్రతినిధి రూపేణ ఆవిర్భావ). శ్రీకృష్ణుడు తన స్వధామమునకు వెడలిన పిమ్మట, స్వయంప్రకాశముగల సూర్యుని వలె కలిని చూసి దుఃఖితులై ఉన్న జనుల ఉద్ధరణకై ధర్మము, సర్వోత్కృష్ట విద్య( జ్ఞానము), మిగతా దివ్యాంశ విభూతులతో కూడి ఈ భాగవత పురాణ రూపము ఉదయించెను.

 పద్మ పురాణములో, శ్రీమద్ భాగవతం యొక్క మహత్యాన్ని కీర్తిస్తూ, సనక సనాతన కుమారులు నారదుల వారితో ఇలా అంటారు. “శ్రీమద్ భాగవతం అనే ఈ పురాణం శ్రీకృష్ణుడే తప్ప వేరొకరు కాదు” ( ఉత్తరా ఖండం 198.30). అలానే స్కంద పురాణంలో ఈ విధముగా చెప్పబడినది. “శ్రీమద్ భాగవతం మరియు శ్రీకృష్ణుడు ఆద్యన్తరహితమైన, శుద్ధ తత్వము(సత్), మరియు చిదానందమును సమగ్రముగా, పరిపూర్ణ ఏకత్వాన్ని ( స్వరూపం) కలిగి ఉన్నారు(విష్ణు కాండము 6.4.3). అందువల్ల శ్రీమద్ భాగవతములోని పన్నెండు అధ్యాయములు శ్రీకృష్ణుని దివ్య విగ్రహములోని పన్నెండు అంగములతో సమానముగా చెప్పబడ్డాయి.

శ్రీమద్ భాగవతం మొదటి రెండు అధ్యాయాలు శ్రీకృష్ణుని పాదాలు, మూడు, నాలుగు అధ్యాయాలు ఆయన ఊరువులు, ఐదో అధ్యాయము ఆయన నాభి, ఆరు వక్షస్థలం, ఏడు, ఎనిమిది ఆయన రెండు చేతులు. ఓ రాజా ! తొమ్మిదో అధ్యాయం కృష్ణుని కంఠము, హసితముతో వికసిస్తున్న కమలము వంటి ఆయన ముఖము పదవ అధ్యాయం, పదకొండు ఆయన లలాటము, పన్నెండు ఆయన శిరస్సు. నేను, ఆదిదేవుడు, కరుణామూర్తి, ఎవరి దేహ ఛాయ తమాల వృక్షమును పోలి ఉండునో , ఎవరి అవతార లక్ష్యము జీవోద్ధరణో, ఎవరు సంసార సాగరమును దాటుటకు సేతువో మరియు ఎవరు ప్రత్యక్షంగా శ్రీమద్ భాగవత స్వరూపాన్ని  చేపట్టియున్నారో అట్టి వానిని పూజించెదను.

అందుచేత గౌడీయ వైష్ణవులకు శ్రీమద్ భాగవతము కేవలం ఒక గ్రంథము మాత్రమే కాదు అది శ్రీకృష్ణుని శబ్ద రూప సాక్షాత్కారము. శ్రీకృష్ణుని వలె శ్రీమద్ భాగవతము కూడా పూజ్యనీయము. శ్రీల సనాతన గోస్వాముల వారు శ్రీ చైతన్య మహా ప్రభువుల వారిని కలవక ముందే శ్రీమద్ భాగవతమును తన ఇష్ట దైవముగా కొలిచేవారని చెప్పబడినది.

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    మనం ఇతరులకు గౌరవం ఇవ్వడం ద్వారా మన విలువను తగ్గించుకుంటామని అహంకారం చేత అనుకుంటాము. కానీ నిజం దీనికి పూర్తి విరుద్ధం.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.