భగవద్గీత అర్జునుడికి కలిగిన “యుద్ధం చేయాలా లేక యుద్ధ భూమిని వెడలి వెళ్లాలా” అనే సంశయముతో ఆరంభమవుతుంది. అర్జునుడు తన అస్త్ర శస్త్రాలను త్యజించటానికి, యుద్ధభూమిని వీడటానికి మొగ్గుచూపుతూ ఉంటాడు. అతను తన గురువైన ద్రోణాచార్యునిపైన అలానే తన పితామహుడైన భీష్మునిపైన తాను బాణాలను సంధించటాన్ని కలలో కూడా ఉహించలేడు, ఎందుకంటే వారు అతనికి అత్యంత ప్రీతి పాత్రులు కనుక. అర్జునిడికి దుర్యోధనుని నాయకత్వంలో ఉన్న ప్రత్యర్ధులు తనకు, తన కుటుంబానికి అన్యాయం చేసారని తెలుసు. పాండవులు ఒప్పొందానికి కట్టుబడి పన్నెండేళ్ళు వనవాసం, ఆ పిమ్మట సంవత్సరకాలం అజ్ఞాతవాసం చేసిన తర్వాత కూడా దుర్యోధనుడు వారికి వారి సామ్రాజ్యాన్ని తిరిగి అప్పగించటానికి ఏ మాత్రం సుముఖత చూపలేదు. ఒక క్షత్రియునిగా, తన హక్కులకై పోరాడి సాధించుకోవడం అర్జుని వృత్తి ధర్మం. కానీ, అర్జునుడు యుద్ధం చేయాలా వద్ధా అనే సంశయంతోనే ఇంకా ఉన్నాడు.
ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినవారు కూడా అలాంటి సంశయాలను ఎదుర్కొంటారు. ఒకవైపు, వారు తమ జీవన పరమార్ధాన్ని అర్థం చేసుకోవడానికి ఈ మార్గంలోకి వస్తారు, జీవిత సమస్యలకు ఆధ్యాత్మికతలో పరిష్కారం ఉంటుందని అనుకుంటారు. తద్వారా, వారికి ఆధ్యాత్మిక మార్గముమీద కొంత ఆసక్తి మరియు సాధన మీద బాధ్యతాభావం ఉంటాయి. మరోవైపు, వారి ప్రాపంచిక సంబంధబాంధవ్యాలను విడనాడలేరు. భగవద్గీత మొదటి అధ్యాయములో అర్జునుడు భావించినట్లే వారు కూడా తమ సంబంధబాంధవ్యాలను ధర్మాలుగా పరిగణిస్తారు. మన ప్రాపంచిక సంబంధ భాంధవ్యాలు మన నిర్ణయాత్మక శక్తిని కృంగ దీస్తాయి. మన మనస్సు చంచలిస్తుంది. మనము సంశయాలకు గురిఅవుతాము. ఈ సంశయాలు మన మార్గంలో విజయం సాధించడానికి కావలసిన మన సామర్థ్యంమీద, లక్ష్యాన్ని చేరడానికి నిర్దేశించబడిన సాధన ప్రక్రియమీద, లేదా లక్ష్యంమీదనైనా ఉండచ్చు.
కామానికి లోనవుట
ఎప్పుడైతే మన మనస్సు స్థిరంగా ఉండలేదో, అలాంటప్పుడు మనం యే పనినైనా ఉత్సాహంతో చేయలేము. అందువల్ల మనం సాధనలో ఊగిసలాట ధోరణికి గురిఅవుతాము, మనము చేయాల్సిన దానిపైన ఏకాగ్రత కనపరచలేము. వీటివల్ల మనము “నాకు ఈ మార్గములో ఉండటానికి అసలు అర్హతఉందా? అసలు ఈ మార్గములో ముందుకు వెళ్లగలనా?” అని అనుకుంటూ వుంటాము. ఇటువంటి డోలాయమాన స్థితిలో, కామము మనల్ని పూర్తిగా ఆవహిస్తుంది. కామమనేది సంబంధ భాంధవ్యాలు, సుఖ, భోగాలకు అనుగుణముగా వ్యక్తమయ్యే హేయ స్వభావము. అటువంటి పరిస్థులలో ఆధ్యాత్మికంగా మనము శక్తిని కోల్పోయి, ప్రాపంచిక విషయాలపై దృష్టి మరలుస్తాము. అది తప్పు అని తెలిసినాకూడా బలవంతంగా తప్పుగా ప్రవర్తిస్తాము. అర్జునుడు శ్రీకృష్ణుని ఒకరు బలవంతంగా ప్రకృతికి వ్యతిరేకంగా ఎందుకు ప్రవర్తిస్తారని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు “రాజసిక గుణం వల్ల ఉత్పన్నమైన కర్మ చేత ఈవిధముగా జరుగుతుంది, ఇది క్రోధముగా మారి విచక్షణా జ్ఞానాన్ని హరిస్తుంది, అది అన్ని వేళలా అశుభమైనది, ఆధ్యాత్మిక ప్రగతికి ఇది ముఖ్య అవరోధము”( భగవద్గీత 3.38) అని తెలుపుతాడు. శ్రీకృష్ణుడు అర్జునిని ఇలాంటి శక్తివంతమైన శత్రువుని సంహరించమని ఉపదేశిస్తాడు (భగవద్గీత 3.43). శ్రీకృష్ణుడు అర్జుని కామాన్ని సంహరించమని ఉపదేశించడంవల్ల మనకు కామాన్ని త్యజించటం సంభవమని తెలుస్తుంది. అది అసంభవమైనట్లయితే శ్రీకృష్ణుడు ఆవిధంగా చేయమని అర్జునినికి ఉపదేశించే వాడే కాదు.
కానీ ఇక్కడ తెలుసుకోవలసినది ఏమిటంటే, మనం కేవలం మన శక్తి సామర్ధ్యాలతో క్రోధ, లోభ, భయ, వ్యాకులతలపై విజయం పొందలేము. అందుకు శ్రీకృష్ణుని సహాయము అనివార్యము. అర్జునుడికి ఇది బాగా తెలుసు, అందుకే అతను శ్రీకృష్ణుని శరణు వేడాడు. అర్జునుడు “నా శరీర, ఇంద్రియ మరియు మనస్సులను బలహీనపరుస్తున్న ఈ దుఃఖమునుండి నీవు మాత్రమే నన్ను ఉద్ధరించగలవు.” (భగవద్గీత 2.8) అని శరణు వేడాడు. అర్జునుడు ఏ ప్రాపంచిక శక్తీ తనకు ఉపశమనం కలిగిస్తుందని అనుకోలేదు.
కృష్ణుడే మనకు రక్ష
ఇక్కడ సంతోషకరమైన విషయము ఏమిటంటే శ్రీకృష్ణుడు మనము సహాయము కోరితే చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. కృష్ణుడు నేను అందరి మేలుకోరే వాడినని, సుహృదం సర్వ భూతానాం ( భగవద్గీత 5.29) అని పేర్కొంటాడు. మనం కేవలం ఈ విషయాన్ని ఒప్పుకోవాలి. మన మేలుకోరే వ్యక్తి, నిర్బలుడైతే అటువంటి వారి ఆశీస్సులు మనకు ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చవు. ఇంకా చెప్పాలంటే అటువంటి పరిస్థితి మనల్ని నిర్వేదనకు గురిచేస్తుంది తప్ప ఇంకా ఏమి కాదు. మన సామజిక లావాదేవీలలో దీన్ని మనం తరచుగా చూస్తాము. కానీ, శ్రీకృష్ణుడు అటువంటి నిర్బలుడైన శ్రేయోభిలాషి కాదు. ఆయన సర్వలోక మహేశ్వరుడు- సమస్త జనాధిపతి. అటువంటి బలవంతుడైన శ్రేయోభిలాషి మనకు ఉన్నప్పుడు చింతించనవసరంలేదు.
కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాల రూపంలో ఉన్న ప్రాపంచిక శక్తులు ఆ భగవంతుని శరణు వేడనంతవరకూ మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో(18.58) స్పష్టముగా, నన్ను శరణు వేడినట్లయితే, అన్ని ఇబ్బందులను దాటవచ్చని చెప్పాడు. ఆయన్ని శరణు వేడటంవల్లే, ఈ అసాధ్యమైన మాయను మనం జయించగలము (భగవద్గీత 7. 14). ఇది భక్తి మార్గములో గల సౌలభ్యము, ఇది వేరే యే మార్గాలలోనూ లేనే లేదు. ఈ భక్తి మార్గములో ఆ పరమేశ్వరుడైన శ్రీకృష్ణుని కృపాకటాక్షములు మనకు ఉంటాయి.
కనుక, ఈ మార్గములో విజయముపై మనకు ఎటువంటి సంశయము ఉండజాలదు. శరణాగతుడైన భక్తునికి ఏ ఆటంకములు తన మార్గములో విఘాతము కలిగించలేవు. శ్రీకృష్ణుని భక్తులు అపజయము పొందరు( భగవద్గీత 9.31). శ్రీ వేద వ్యాసుల వారి దయతో కురుక్షేత్ర సంగ్రామమున జరిగినదంతా చూడగల వరమును పొందిన సంజయుడు, భగవద్గీతను విన్న పిదప “ఎచ్చట యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉండునో , ధనుర్ధరుడైన అర్జునుడు ఉండునో అచ్చట, సంపద, విజయము, శాంతి, నైపుణ్యము తథ్యముగా ఉండును” అని నొక్కి ఒక్కాణించెను (భగవద్గీత 18.78). మహాభారత యుద్ధ అంతములో పాండవుల విజయము, సంపంద తిరిగి పొందటంతో ఇది సత్యమని ధృవీకృతమైంది.
మీ లక్ష్యం పట్ల జాగృతతో ఉండండి
అర్జునుడు సాధకులకు ప్రతినిధిలాంటివాడు. అతనిలాగా, శరణాగతుడైన ఏ సాధకుడైనా, అతని వృత్తి ధర్మాన్ని పూర్తిగా నిర్వర్తించినట్లయితే విజయము తథ్యము. దానిలో ఎటువంటి సంశయం లేనేలేదు. సాధకుడనేవాడు అర్జునుడిలా ఉండాలి. అతడు తన సాధనలో ఎల్లప్పుడూ ఉత్సాహము, దృఢత, నిబద్దత కలిగి ఉండాలి. తను సాధించాల్సిన లక్ష్యము పట్ల అర్జునుడు రణరంగములో ఉన్నట్లు ఏమఱకగా ఉండాలి. యుద్ధభూమిలో శతృవునితో పోరాడటం తప్ప వేరొకటి ఆలోచించలేము. ఎందుకంటే అది జీవన్మరణ సమస్య. ఎటువంటి అజాగ్రత్తయినా మన మరణానికి దారి తీస్తుంది. సాధకుడనే వాడుకూడా అలానే ఎల్ల వేళలా జాగ్రత్తతో ఉండాలి. లేకపోతే శత్రువులు మనల్ని ఓడించగలవు. ఒక వేళ మనం శ్రీకృష్ణుని పూర్తిగా శరణాగతులమైతే, ఏదయినా తడబడినట్లయితే, కృష్ణుడే స్వయంగా మనల్ని కాపాడతాడు.
శ్రీ కృష్ణుడు అర్జునునికి చెప్పినట్లు ఒక నిశ్చలుడైన భక్తుడు వేగముగా ధర్మాత్మునిగా మారతాడు: “వేగముగా అతను ధర్మాత్ముడై శాంతిని పొందును” (భగవద్గీత 9.31). భక్తుడనేవాడు తన మార్గములో అవరోధాల్ని ఎదుర్కొనవచ్చు, కాని వాటివల్ల అతడు నిరుత్సాహపడడు. శ్రీకృష్ణుడు అతని అవరోధాలను అతని విజయానికి సోపానాలుగా మలుస్తాడు. ఇది బ్రహ్మతోకూడి ఉన్న దేవతా గణము శ్రీకృష్ణునికి చేసిన ప్రార్థనలలో వ్యక్తమైనది. “ఓ మాధవా! నీవంటే అపారమైన ప్రేమ గల నీ భక్తులు, జ్ఞాన మార్గములో ఉండేవారివలే, తమ భక్తి మార్గము నుండి ఎప్పుడూ దారి తప్పరు. వారు అన్నివిధములా నీచే రక్షించబడి, తమ మార్గములో నిర్భయులై, అవరోధాల్ని అణగ త్రొక్కుకుంటూ ముందుకు వెళతారు” (శ్రీ మద్ భాగవతము 10.2.33).
భక్తిలో విజయానికై పోరాడండి
శ్రీకృష్ణుడు తన భక్తుల హృదయాలలోకి చేరి, వారి మార్గాన ఉన్న అవరోధాలను పటాపంచలు చేస్తాడనటం నిజం. ఇది కరభాజన ముని నిమి మహారాజుతో చెప్పిన “శ్రీ కృష్ణుని చరణములను పూర్తిగా ఆశ్రయించిన ఒక శుద్ధ భక్తుడు ఒకవేళ అనుచిత కార్యములలో పాల్గొంటుంటే, వాటి పర్యవసానాలను అతని హృదయములోని శ్రీకృష్ణుడు పటాపంచలు గావిస్తాడు” మాటల వల్ల స్పష్టమౌతుంది( శ్రీమద్ భాగవతం 11.5.42). కనుక, ఈ మార్గములో విజయం పట్ల భక్తునికి ఎటువంటి అనుమానాలు ఉండజాలవు. ఎవరైనా ఒకసారి నిజమైన గురువు పట్ల శ్రద్ధా పూర్వకముగా శరణాగతులవుతారో, వారు తదనంతరము తన వారిగా శ్రీకృష్ణునిచే గుర్తించపడతారు. అటువంటి వారు ఈ కర్మ ఫలితముల సూత్రముల పరిధిలో ఉండరు. ఆ భక్తులు శ్రీకృష్ణుని దయకు ప్రాప్తులగుతారు. వారికి జరిగేది ఏదైనా ఆయన కృపా కటాక్షాలవల్లే సాధ్యమవుతుంది.
ఇక్కడ మనము ఆధ్యాత్మిక ప్రగతికి అర్జునానిలా పోరాడమంటే అర్థం, భక్తి మార్గములో కామ,క్రోధ,లోభ, మద, మాత్సర్యాలను త్యజించుటకు యుద్ధం చేయాలని అర్ధం. కాని దురదృష్టవశాత్తూ నేను గమనించినంది ఏమిటంటే చాలా చోట్ల భక్తులు కామ,క్రోధ,లోభ, మద, మాత్సర్యాలపై కాకుండా వారు తమ తోటి భక్తులపై అంతస్తు, అధికారము కోసం తప్పుగా యుద్ధము చేస్తూ ఉండటం. శ్రీకృష్ణుడి మన మనస్సులో వ్యక్తమయ్యే నిమ్న ప్రేరేపితాలపై ఎలా యుద్ధం చేయాలో స్పష్టముగా చెప్తాడు. చాలామంది భక్తులకు ఇది తెలిసినప్పటికీ, వారు సాధనలోకి పెట్టరు. అది చేయక పోగా, వారు ఇతర భక్తులను నిందించటం, వారిపైన నీలాపనిందలు మోపటం, వారి శక్తులను కట్టిపడేందుకు ప్రయత్నించడం, వారి సేవకు అవరోధాలు చేయడం చేస్తారు. ఇది ఎలా ఉంటుందంటే మనం అద్దంలోకి చూసినప్పుడు మన ముఖంపై దుమ్ము,ధూళి కనపడితే దాన్ని శుభ్రపరచడానికి మనం ముహాన్ని శుభ్రం చేయాల్సింది పోయి అద్దాన్ని శుభ్రం చేసినట్లు ఉంటుంది. అలానే, కామమనేది మన మనస్సులో ఉంటుంది. కాని మనం ఇతర భక్తులపై బలవంతముగా భక్తి అనే పేరుతో దాన్ని రుద్దేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ నిజానికి మనం మన మనస్సుపై దృష్టి ఉంచి దాన్ని శుభ్రపరిచేందుకు ప్రయత్నం చేయాలి. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ మార్గములో మనకు తప్పక సహాయం చేస్తాడు.
మనుషులను నియంత్రించడానికి రెండు మార్గాలు ఉన్నాయి: ప్రేమ మరియు చట్టం. ప్రేమ లేనప్పుడు, చట్టాలు అవసరం. తక్కువ ప్రేమ ఎక్కువ చట్టాలకు దారితీస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా మరిన్ని చట్టాలు తయారు చేయబడుతున్నాయి.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.